పెంపు

09:01 - November 10, 2018

ఢిల్లీ: గృహ వినియోగానికి వాడే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.2.08 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచడంతో సిలిండర్ ధరను పెంచాల్సి వచ్చిందని చమురు సంస్ధలు ఓప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ను రాయితీతో  రూ. 505.34 చొప్పున గృహ వినియోగదారులకు అంద చేస్తున్నారు. పెరిగిన ధరతో ఇది 507.42 కు చేరింది.  పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కొద్ది రోజులుగా పెట్రో ధరలు తగ్గుతున్నాయని వినియోగదారుడు ఊరట చెందేలోపు ప్రభుత్వం గ్యాస్ ధర పెంచింది.  ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లుకు, ప్రభుత్వం 14.2 కేజీల సిలిండర్ పై రూ.48.89, 5 కేజీల సిలిండర్ పై 24.20 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. దీన్ని పెంచాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈఆదేశాల ప్రకారం 14.2 కేజీల సిలిండర్ పై రూ.50.58, 5 కేజీల సిలిండర్ పై 25.20 చొప్పున ఇకనుంచి కమీషన్ ఇవ్వాలి. దీంతో వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. గత ఆరునెలల నుంచి వంటగ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో వంటగ్యాస్ ధరలు పెరగటం ఇది 2వ సారి. నవంబర్ 1వ తేదీన సిలిండర్ పై రూ.2.94 పెంచాయి. కాగా గడచిన ఆరు నెలల్లో రూ.16.21 మేర వంటగ్యాస్ ధర పెరిగింది.

18:20 - October 21, 2018

మధ్యప్రదేశ్ : ఓటర్లను చైతన్యం చేసేందుకు, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు వింత ఆలోచన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఝాబువా జిల్లా యంత్రాంగం మద్యం సీసాలపై ఓటర్లను చైతన్యం చేసే నినాదాలతో స్టిక్కర్లను అతికించాలని నిర్ణయించింది. అయితే అది బెడిసికొట్టడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

ఇందుకు సంబంధించి స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు. వాటిపై ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ రాశారు. ఎక్సైజ్‌ శాఖ స్టిక్కర్లను పంపిణీ చేసి మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా? అంటూ పలువురు మండిపడ్డారు. దీంతో ఈ నిర్ణయాన్ని అధికారులు వెనక్కితీసుకున్నారు. ‘ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీన్ని వెనక్కితీసుకుంటున్నాం’ అని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అభిషేక్‌ తివారి వెల్లడించారు. 

 

09:39 - October 17, 2018

హైదరాబాద్ : దసరా పండుగ సందర్బంగా పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ప్రసిద్ధి. దసరా పండుగకు ముందు రోజున సద్దుల బతుకుమ్మ పండుగ చేస్తారు. సద్దుల బతుకుమ్మను వివిధ రకాల పూలతో పేల్చుతారు. చాలా మంది భారీగా పూలను కొనుగోలు చేస్తారు. దీంతో మార్కెట్‌లో అన్ని రకాల పూల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పూల ధరలు పెరిగాయి. పూల ధరలు ఆకాశాన్నంటాయి.  సామాన్యునికి అందని రీతిలో పెరిగాయి. వివిధ జిల్లాల నుంచి పూలను హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇవాళ సద్దుల బతుకుమ్మ పండుగ నేపథ్యంలో పూల ధరలు మండిపోతున్నాయి. నిన్న కిలో చామంతి రూ.100 ఉండగా నేడు 200 రూపాయలు అయింది. కిలో బంతి పూల ధర 80 రూపాయలు అయింది. పూల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు. ధరలను తగ్గించాలని కోరుతున్నారు. 

 

15:31 - October 5, 2018

హైదరాబాద్ : సామాన్యుడికి పెను భారంగా మారుతున్న పెట్రోల్ ధరలను తగ్గించేసామని పెద్ద గొప్పగా చెప్పుకునే కేంద్రప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురుస్తోంది. రోజుకొకవిధంగా ధరలను పెంచి ఉదయం లేని ప్రతీ వ్యక్తి ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా వున్నాయో చూసుకోవటం రోజువారి దిన చర్యలో భాగంగా మారేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరించింది. ధరలు పెరుగుతూ ఉంటే చూస్తుండిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేసుకోమన్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. 
ఆకాశానికి అంటిన పెట్రోలు, డీజిల్ ధరల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కల్పిస్తూ, రూ. 2.50 మేరకు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వస్తున్నాయి. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా, చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. 
పలు దేశాల్లో పెట్రోలును రూ. 35కే విక్రయిస్తున్నారని, ఇండియాలో రూ. 90 వసూలు చేస్తూ, కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలు రాష్టాల్లో ఎన్నికలు రానున్నందునే ఈ రెండున్నరను డిస్కౌంట్ గా ఆఫర్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని మరల్చేందుకే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, కేంద్రం సుంకాలను తగ్గించిన తరువాత, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అంతేమొత్తం సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.
 

14:43 - September 20, 2018

ఢిల్లీ : ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు సామాన్యుడి చుక్కలు చూపిస్తున్నాయి. అసలే పెట్రోలు ధరలు పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో సామాన్యుడి ప్రయాణ సాధనాల్లో ఒకటి అయిన రైల్‌లో కనీసం ఒక్క టీగానీ, కాఫీగానీ తాగాలంటే కూడా అదనపు డబ్బులు చెల్లించుకుంటేనే గానీ గొంతులో టీ నీళ్లు పడే అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాలోని రైళ్లలో టీ, కాఫీల ధరను పెంచుతున్నట్టు ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం రూ. 7గా ఉన్న ధరను రూ. 10కి పెంచుతున్నామని తెలిపింది. డిప్ టీ కాకుండా, మామూలు టీని రూ. 5కే అందిస్తామని రైల్వే బోర్టు పేర్కొంది. 

 

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

09:48 - September 7, 2018

హైదరాబాద్ : రోడ్లు అభివృద్ధి చెందినా, వాహనాల సంఖ్య పెరిగినా ప్రయాణాలంటే ఇంకా జనం మదిలో కదిలేది రైళ్లే. ఇక దూర ప్రాంతాలంటే రైలు అందుబాటులో ఉంటే మరో ప్రత్యామ్నాయమే చూడరు. అలాంటి రైలు కొత్తగా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఆనందానికి అవధులుండవు. కాకినాడ, తిరుపతి, విజయవాడకు వెళ్లే రైళ్లు ఇప్పుడు లింగంపల్లి నుంచే మొదలవుతున్నాయి. ఇప్పటికే కాకినాడ, విజయవాడకు వెళ్లే రైళ్లు లింగంపల్లి నుంచి ప్రారంభమవుతుండగా.. తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఆగుతోంది. తిరుపతి వెళ్లే మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నారాయణాద్రి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ముంబయ్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతున్నాయి. ఇలా లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్రయాణికులకు ఇలా ఊరట లభించినా.. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో వీటిని ఆపితే మరింత మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
42 రైళ్లు... 
లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ఇటీవల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లసంఖ్య పెరుగుతోంది. ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్న గౌతమి, అమరావతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతిరోజు బయలుదేరుతుండగా.. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం కోకనాడ ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడి నుంచి మొదలవుతోంది. ఇండోర్‌ వెళ్లే హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. తిరుపతి నాగర్‌సోల్‌ వెళ్లే ప్రత్యేక రైలు. యశ్వంత్‌పూర్‌ టాటానగర్‌ల మధ్య నడిచే టాటా ఎక్స్‌ప్రెస్‌ ప్రతి శుక్రవారం ఇక్కడ ఆగి వెళుతున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం వెళ్లే పుణె ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా ఇక్కడ ఆగుతున్నాయి. యశ్వంత్‌పూర్‌ వెళ్లే గరీబ్‌రథ్‌ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం యశ్వంత్‌పూర్‌ వెళ్లే గరీబ్‌రథ్‌ ప్రత్యేక రైలు కూడా ఇక్కడ ఆగి వెళుతోంది. మొత్తంగా ప్రతిరోజూ 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ ఆగి ప్రయాణికులను తీసుకుని వెళుతున్నాయి. ఇలా పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కలిపి మొత్తం 42 ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి.

సైబరాబాద్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్‌ ప్రాంతాల్లో కొలువుదీరిన జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థల్లో దాదాపు 5లక్షల మంది పనిచేస్తున్నారు. వీరికి తోడు.. నాలుగు నియోజకవర్గాల ప్రజలకు లింగంపల్లి, హైటెక్‌సిటీ, భరత్‌నగర్‌ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు స్టేషన్లలో హైటెక్‌సిటీ స్టేషన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు గుర్తించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో ఆపితే ఎక్కువమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం 24 బోగీలు ఆగేందుకు అవకాశం లేదు. తర్వాతి స్టేషన్లో బోగీలు మారుతాం.. ఇక్కడ రైలు ఆపితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతి వెళ్లే ఇంటర్‌సిటీ, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ ఆగితే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ షురూ 
దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి రైల్వేస్టేషన్‌నుంచి ఆరంభించారు. సాయంత్రం 5.15 గంటలకు ఈ రైలు మొదలైంది. మొదటిరోజు కావడంతో ప్రయాణికులు స్వల్పసంఖ్యలోనే ఇక్కడ ఎక్కారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌వద్ద మెయింటెన్స్‌ డిపో నిర్మాణం తరువాత ఇక్కడినుంచి ఆరంభమైన రైళ్లలో నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్‌ నాలుగోది. ఇప్పటికే ఇక్కడినుంచి గౌతమి, కొకనాడ, విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఇక్కడినుంచి నడుస్తున్న సంగతి తెలిసిందే. నగరానికి వెళ్లి ప్రయాణించే అవసరం లేకుండా పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచే బయలుదేరి వెళుతున్నారు. ఇదే స్థాయిలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి విశేష స్థాయిలో అదరణ లభిస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

12:41 - August 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియెట్‌లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రేషన్‌ డీలర్ల కమిషన్‌ను 20 పైసల నుండి 70 పైసలకు పెంచుతున్నట్లు భేటీలో పాల్గొన్న మంత్రి ఈటల వెల్లడించారు. ఈ పెంపు సెప్టెంబర్‌ 1 నుండి అమలు చేస్తామన్నారు. అలాగే 2015 అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రేషన్‌ డీలర్ల కమిషన్‌ బకాయిలు చెల్లిస్తామని మంత్రి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డీలర్ల సమస్యలను అధ్యయనం చేయాలని మంత్రి ఈటెల ఆధ్వర్యంలో సబ్ కమిటీ నియమితులైన సంగతి తెలిసిందే. ఆ కమిటీలో సీనియర్ మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, కమిషనర్ అకున్ సబర్వాలున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాంటే వివిధ రాష్ట్రాల్లో సివిల్ సప్లై విధానాన్ని అధ్యయనం చేయాలని ఇందుకు సివిల్ సప్లై అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని కమిటీ సూచించింది. దీనితో సివిల్ సప్లై అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక తయారు చేసిందని, ఈ నివేదికను సీఎం కేసీఆర్ అందచేసిందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కమిషన్ పెంచాలని పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, విడుదల చేస్తే వారి సమస్యలు తీరే అవకాశం ఉందని కమిటీ నిర్ణయించింది. 

20:53 - August 16, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ అంచనాలను విపరీతంగా పెంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరు మార్చి.. కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారన్నారు. ప్రాజెక్ట్‌ పేరు మార్చి పేరు మార్చలేదని మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు.

21:14 - August 2, 2018

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. కీలక వడ్డీరేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. రెపో రేటు పెరగడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతాన్ని పెంచే అవకాశం ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థికరంగ విశ్లేషకులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్ బీఐ అప్పులు ఇవ్వడం.. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్ బీఐకి అప్పులు ఇవ్వడం అని పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధి పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - పెంపు