పోలవరం

17:16 - July 13, 2018

విశాఖపట్టణం : ఏపీ రాష్ట్రంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన గడ్కరి శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....పోలవరం దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, పోలవరం విషయంలో తాము రాజకీయాలు చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని, రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టడం లేదని పేర్కొన్నారు. పోలవరం సివిల్ కన్ స్ట్రక్షన్ పార్టును ఫిబ్రవరి 8లోపు పూర్తి చేస్తామన్నారు. పోలవరం భూ నిర్వాసితుల విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, వ్యవసాయానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. 

15:39 - July 12, 2018

హైదరాబాద్ : పోలవరం ప్రాజె క్టుపై రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడిందని వైసిపి నేత బోత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని పేర్కొన్నారు. డీపీఆర్ లో మార్పులు..గడ్కరి నిలదీస్తే ముఖ్యమంత్రి, అధికారులు నీళ్లు నమిలారని, ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని నిలదీశారు. 

21:00 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు సివిల్‌ నిర్మాణాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి.. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని పోలవరంను సందర్శించిన గడ్కరీ సూచించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం సివిల్‌ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థలు గడ్కరీ దృష్టికి తెచ్చాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలోగానే సివిల్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని గడ్కరీ ఆదేశించారు. ఇందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు పనుల కోసం అడ్వాన్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినందున.. ఇది సాధ్యంకాదన్నారు. పెరిగిన నిర్మాణ వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి... కేంద్ర అధికారులతో చర్చించి, అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని గడ్కరీ సూచించారు. ఇందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత పెరిగిన నిర్మాణ వ్యయంపై ఎనిమిది రోజుల్లో ఆర్థిక శాఖను వివేదిస్తానని గడ్కరీ చెప్పారు.

పోలవరం నిర్మాణ వ్యయం పెరిగినందున సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టునుపూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. గడ్కరీ ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. కేంద్ర కోరిన అన్ని వివరాలను అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలంలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. 

18:51 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్న అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నాయి. కానీ ఇటీవలే టిడిపి..జిజెపి మధ్య సంబంధాలు తెగిపోవడం...ఇరు పార్టీల మధ్య విమర్శలు..ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలవరం నిధుల విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గడ్కరి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాబు..గడ్కరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

రెండు గంటల ముందే చేరుకున్న బాబు అక్కడున్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గడ్కరి చేరుకున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు కార్యకర్తలు...ఆందోళన చేపట్టారు. తమను అనుమతించాలని..గడ్కరితో మాట్లాడుతామని నేతలు పేర్కొన్నారు. కానీ పాస్ లున్న వ్యక్తులకు మాత్రమే అనుమతినిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీనితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

18:32 - July 11, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని..ఈ విషయంలో రాజకీయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. బుధవారం ఆయన ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం బాబు..మోడీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి నీరు ఎంతో ప్రధానమైందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ సానుకూలంగా ఉన్నారని, ప్రస్తుతం తాను ఇక్కడకు వచ్చి పనులను పరిశీలించడం జరిగిందన్నారు.

 తాను పోలవరానికి రావడం ఇది రెండోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి మోడీ కట్టుబడి ఉన్నారని, ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరడం జరగిందన్నారు. పోలవరం ఏపీకే కాదు..దేశానికి కీలకమైన ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలవరం రైతులకు జీవితాన్ని ఇస్తుందని, కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తామని ప్రకటించారు. 

ప్రతి నెలా ఇక్కడకు వస్తానని హామీనివ్వడం జరిగిందని, కానీ కొన్ని సమస్యల వల్ల ఇక్కడకు రావడం జరగలేదన్నారు. ఈ విషయంలో తాను ఢిల్లీలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్థిక మంత్రితో చర్చించి బాబు కోరినట్లుగా నిధుల అడ్వాన్స్ వచ్చే విధంగా చూస్తానని, డబ్బుల సమస్య లేదన్నారు. గిరిజన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని, ఈ విషయంలో రాజకీయం అవసరం లేదని..కేవలం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. 

18:29 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు 2019 సంవత్సరానికల్లా పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ...గతంలో డయా ఫ్రం వాల్ 553.8 మీటర్ల పని చేయడం జరిగిందని, ప్రస్తుతం 1396.06 మీటర్లు చేయడం జరిగిందన్నారు.

ఫిబ్రవరి నాటికి పోలవరం కాంక్రీట్ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. 2019 డిసెంబర్ నాటికి డెడ్ లైన్ పెట్టుకున్నట్లు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమన్నారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్ల అవసరమని, 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగినట్లు తెలిపారు. మెజార్టీ పనులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

పోలవరం ప్రాజెక్టుకు చరిత్ర ఉందని..1941లో ఈ ప్రాజెక్టు డీపీఆర్ సర్వే చేయడం జరిగిందని, 1983 లో అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. 2010- 11లో రూ. 1.610 కోట్లు ఎస్టిమేట్ చేయడం జరిగిందని..ఇందుకు ప్లానింగ్ కమిషన్ అనుమతినిచ్చిందన్నారు. 2017లో మొత్తం క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. 2013- 2014 ప్రకారం రూ. 57,940 కోట్లు ఎస్టిమేట్ ఇచ్చిందన్నారు. భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని..ఇక్కడ ఖర్చు బాగా పెరిగిందన్నారు. 90 శాతం రైట్ కెనాల్ పనులు పూర్తయ్యాయని, లెఫ్ట్ కెనాల్ పనులు కూడా తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ 2019 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు ప్రతి నెలా జరుగుతున్నాయన్నారు. డీపీఆర్ 2 అనుమతి, కొంత నిధుల అడ్వాన్స్.. విడుదల చేస్తే పనులన్నీ తొందరగా జరుగుతాయని..ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు. 

07:00 - July 9, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ జనజాగృతి కార్యక్రమాన్ని చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమం చేపట్టారు. ముందుగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన నేతలు ప్రజలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులపై పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతల జనజాగృతి కార్యక్రమం చేపట్టారు. నరసాపురం లోక్‌సభ నియోకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్టీ నేతలు ప్రజలతో కలిసి పోలవరం బాట పట్టారు. ముందుగా తాడేపల్లిగూడెంకు చెందిన నాయకులు ప్రాజెక్టును సందర్శించారు. విద్యార్థులు కూడా దీనిలో భాగస్వాములయ్యారు. 86 బస్సులు, 50 కార్లలో రెండువేల మందికిపైగా రైతులతో కలిసి వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. గోదావరికి జలహారతి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులపై టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయడం మానుకుని జరుగుతున్న పనులను పరిశీలించాలని కోరారు.

పోలవరంపై ప్రజల్లో అపోహలు పెంచే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేసే బదులు వాస్తవిక ధృక్పదంతో వ్యవహరించాలని టీడీపీ నాయకులు కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను టీడీపీ నాయకులు తిప్పికొట్టారు. టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ల టీడీపీ నేతలు ప్రజలతో కలిసి ప్రాజెక్టును సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

06:18 - July 7, 2018

విజయవాడ : పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించపోయినా రాష్ట్ర ప్రభుత్వం పనులను స్పీడ్‌గా చేస్తుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే డయాఫ్రాం వాల్‌ నిర్మాణం పూర్తవటంతో పాటు కాఫర్‌ డ్యామ్‌ పనులు పుంజుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరానికి మూలమైన భూ నిర్వాసితులను ప్రభుత్వం మరిచిపోయింది. నిర్వాసితులకు న్యాయం జరగకపోవటంతో వారు ఆందోళన బాట పట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెరిగింది. ప్రతినెల మూడో సోమవారం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. పనులు స్పీడ్‌గా జరిగే విధంగా చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే గేట్ల తయారీ 80 శాతం పూర్తవ్వటంతో పాటు డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తయింది. అలాగే కాఫర్‌ డ్యామ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్ పనులు వేగంగా సాగుతున్నాయి. స్పిల్‌ ఛానల్‌ పనులు రికార్డ్‌ స్థాయిలో జరుగుతుండటంతో ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. 2019 చివరి నాటికి గ్రావిటీతో కూడిన నీటిని అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ స్థానంలో నవయుగకు కంపెనీకి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.

కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేంద్రం నుంచి ఇంకా 2 వేల కోట్లు రావల్సి ఉండగా.. వాటి కోసం ఎదురుచూడకుండా రాష్ట్రం ప్రభుత్వం తన ఖర్చుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. అయితే ఈ ఖర్చును కేంద్రం నుంచి ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విభేదాలు పెరిగిపోవటంతో కేంద్రం నిధులు ఇస్తుందో లేదో అన్న సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం రాజకీయ చట్రంలో ఇరుక్కుని విలవిల్లాడుతుంది.

ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పెరిగిన అంచనాలతో దాదాపు 20 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు ప్రాజెక్ట్ ఎగువున ఉన్న వందల గ్రామాలను ఖాళీ చేయించడానికి, భూ నిర్వాసితులకు దాదాపు 35 కోట్ల రూపాయలు పరిహారం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇంతవరకు భూ నిర్వాసితులకు సంబంధించి ఒక్క రూపాయి కూడ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ ఖర్చు కేంద్రం ప్రభుత్వం చెల్లించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను మర్చిపోయింది. అయితే కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల మధ్య వైరం పెరుగుతుండటంతో ఇన్ని కోట్లు కేంద్రం చెల్లిస్తుందా? అని నిర్వాసితుల్లో ఆందోళన మొదలయింది. దీంతో తమకు నష్టపరిహారంతో పాటు భూమికి భూమి, ఇళ్లు నిర్మించాలని భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌లో నష్టపోతున్న తమకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని భూనిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వసితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాయో వేచి చూడాలి. 

21:11 - June 25, 2018
11:00 - June 25, 2018

విజయవాడ : పోలవరం సందర్శించిన అనంతరం టిడిపి ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పోలవరానికి సంబంధించిన అన్ని విషయాలు ఆన్ లైన్ లో పొందుపర్చడం జరిగిందన్నారు. దేశంలోని 15 జాతీయ ప్రాజెక్టుల్లో వేగంగా నిర్మాణం జరుగుతున్నది కేవలం పోలవరం మాత్రమేనని తెలిపారు. కానీ బీజేపీ నాయకులు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని జాతీయ ప్రాజెక్టు అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోందన్నారు. కేంద్రం ఎప్పుడో నిధులు ఇచ్చేసిందని..రూపాయి కూడా బాకీ లేదని బీజేపీ నేతలు పేర్కొనడం అసత్యమన్నారు. దేశంలోని 15 ప్రాజెక్టుల విషయం ఏమిటో చెప్పాలని..ఇందుకు 15 రోజుల సమయం ఇస్తున్నానని, లేనిపక్షంలో ప్రాజెక్టుల నిర్మాణం..తదితర విషయాలను తానే ప్రజలకు వెల్లడిస్తానని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - పోలవరం