పోలీసులు

11:35 - April 23, 2017

చిత్తూరు : ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..కడప నుంచి రేణిగుంట వరకు లారీని క్లీనర్‌ నడిపినట్లు తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ గురవయ్య మద్యం సేవించినట్లు ఇప్పటికే పరీక్షల్లో తేలింది. రేణిగుంట నుంచి ఏర్పేడు వరకు మద్యం మత్తులో లారీని డ్రైవర్‌ గురవయ్య నడిపినట్లు గుర్తించారు. కడప సమీపంలో లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలను కడప టోల్‌గేట్‌ దగ్గర సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత క్లీనర్‌ మాయం కావడంతో ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:29 - April 23, 2017

పెద్దపల్లి : జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుల్తానాబాద్‌ సీఐ అడ్లూరి రాములు, ఎస్ ఐ దేవేందర్‌ జీవన్‌ల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమంలో సరైన ధ్రువప్రత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు ఆటోలు, కారుతోపాటు 150 గుడుంబా ప్యాకెట్లను పట్టుకున్నారు. కిలో స్పటిక, ఐదు కిలోల జీడి గింజలను స్వాధీనం చేసుకున్నారు.

08:53 - April 23, 2017

ఢిల్లీ : ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ జరిపారు. లంచం వ్యవహారం, మధ్యవర్తి సుకేశ్‌తో సంబంధాలు తదితర అంశాలపై దినకరన్‌ను పోలీసులు ప్రశ్నించారు.
క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు దినకరన్ హాజరు 
ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐఏడిఎంకే నేత టిటివి దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. చాణక్యపురి ఇంటర్‌ స్టేట్‌ సెల్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ద్వారా ఈసీకి 50 కోట్లు లంచం ఇచ్చేందుకు  డీల్‌ కుదుర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై  పోలీసులు ఆయనను ప్రశ్నించారు. దినకరన్‌ మధ్యవర్తితో కలిసి ఈసీ అధికారులను కలిశారా...లేదా అన్నదానిపై ఆరా తీసినట్లు అధికారవర్గాల సమాచారం. క్రైం బ్రాంచ్‌ పోలీసుల విచారణలో భాగంగా దినకరన్‌ తరపు లాయర్లకు అనుమతించలేదు. విచారణ సందర్భంగా దినకర్‌ ఫోన్‌ కాల్స్‌ను, వాట్సప్‌ మెసేజీలు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా అధికారులు పరిశీలించారు.
బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు 
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు సమన్లు జారీ చేశారు. దినకరన్‌ దేశం విడిచి వెళ్లకుండా ముందస్తుగానే లుకౌట్‌ నోటీసు పంపారు. ఈ కేసులో దినకరన్‌ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్‌ చంద్రశేఖరన్‌ను ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి కోటి 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తనకు ఎన్నికల కమిషన్‌తో మంచి సంబంధాలున్నాయని, అన్నాడిఎంకే శశికళ వర్గానికి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానని సుకేశ్‌- దినకరన్‌ను నమ్మించాడు. ఈ వ్యవహారం వెనక దినకరన్‌ ఉన్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. 

 

14:38 - April 22, 2017

హైదరాబాద్: సోషల్ మీడియాలో అసెంబ్లీపై అనుచిత వాఖ్యలు చేసిన కేసులో అదుపులో తీసుకున్న రవికిరణ్ ను గుంటూరు పోలీసులు ఇంటిదగ్గర వదిలిపెట్టి వెళ్లారు. నిన్న తెల్లవారుజామున రవికిరణ్ ని అదుపులోకి తీసుకున్న తరువాత నేరుగా విజయవాడ కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. అసెంబ్లీని కించపరిచే విధంగా వాఖ్యలు పై ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై మరోసారి పోలీస్‌ స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాల్సి వుంటుందని పోలీసులు చెప్పి తనని ఇంటి దగ్గర వదిలిపెట్టారని రవికిరణ్ తెలిపారు.

15:41 - April 20, 2017

హైదరాబాద్ : విమానం హైజాక్‌ అంటూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన వంశీకృష్ణను వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. విమానం హైజాక్‌ చేసేందుకు ఒక ముఠా హోటల్‌ బుక్‌ చేసుకుందని వంశీకృష్ణ ముంబై పోలీసు కమిషనర్‌కు తప్పుడు మెయిల్‌ పంపాడు. ఒక మహిళ పేరిట పంపిన ఈ మెయిల్‌లో విమానం హైజాక్‌ కు కుట్ర పన్నిన ముఠాను అరెస్టు చేయాల కోరాడు. ఇదంతా నిజమనుకుని పోలీసులు నానా హైరానా పడ్డారు. చివరకు ఆరా తీస్తే తప్పుడు సమాచారమని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఒక మహిళ కోసం వంశీకృష్ణ ఈ నాటకం ఆడినట్టు తేల్చిన పోలీసులు, ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ అడ్రస్‌ ఆధారంగా వంశీకృష్ణను అరెస్టు చేశారు. 

18:39 - April 19, 2017

అనంతపురం : హిందూపురంలో తాగునీటి సమస్యపై చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఉన్న సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ సాగించారు. కాగా ఎద్దులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు రాసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జ్‌ చేసి... నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజా సమస్యలను గాలికొదిలేశాడంటూ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ విమర్శించారు. 

11:34 - April 18, 2017

హైదరాబాద్ : ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రథమ కర్తవ్యం. కొన్ని సందర్భాలలో తమ విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలను కోల్పోవడం చూస్తుంటాం. దుండగులు, ముష్కరులు అవసరమైతే పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడుతూ కాల్చిచంపిన ఘటనలు చూశాం. ఇక ఇలాంటి దాడులన్నింటికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు.

స్వీయ రక్షణ అవసరం...
ప్రజల భద్రతతోపాటు స్వీయ రక్షణపై దృష్టి సారించారు సైబరాబాద్ పోలీస్‌ ఉన్నతాధికారులు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాంటి స్క్వాడ్‌కి తోడు ట్యాక్టికల్ ట్రైనింగ్ శిక్షణ తరుగతులను పోలీసులకు అందింస్తున్నారు. యాంటిస్క్వాడ్‌కు విభిన్నంగా ట్యాక్టికల్ ట్రైనింగ్‌ పూర్తి చేస్తున్నారు. పోలీసు కమీషనరేట్ లో 9వ బ్యాచ్ పోలీసులు ట్యాక్టికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పటివరకు 9 టీంలు శిక్షణపై పూర్తిచేసుకున్నాయి. గతంలో పోలీసులపై జరిగిన మెరుపు దాడులు, దుండగుల ఎదురుకాల్పులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇచ్చారు.

భద్రత అంశాలు...
ట్యాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా వాహనాలు తనిఖీలు చేయడం, అనుమానితులను ప్రశ్నించడం, వెహికిల్ ఇంటర్ సెప్షన్ రౌండింగ్స్, షార్ప్ షూటర్స్ టీమ్స్, నేరస్తులపై నిఘా పెట్టడం, తదితర అంశాలపై పోలీసులు మెలకువలు తెలుసుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 9వ బ్యాచ్ టీమ్‌కు జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం సర్టిఫికేట్లను అందజేశారు. దుండగులు, ముష్కరుల ఆటకట్టించడంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

13:40 - April 17, 2017

చెన్నై : అన్నాడీంఎకే ప్రధాన కార్యదర్శి దినకరన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఈసీకి లంచం ఇవ్వజూపిన విషయంలో ఆయన అడ్డంగా దొరకడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 126 కింద ఆయనపై నాన్ బెలబుల్ కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన చంద్రశేఖర్ చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు రేపు దినకరన్ ను ఢిల్లీ పిలిపించి విచారణ చేయనున్నారు. ఒకవేళ దినకరన్ దోషిగా నిరూపణ అయితే శిక్ష పడడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హడు అవుతాడు. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో శశికళ వర్గం తరపున పోటీ చేస్తోన్న ఆమె మేనల్లుడు దినకరన్‌ ఏఐఏడీఎంకే పార్టీ అధికారిక గుర్తు అయిన రెండాకుల గుర్తు కోసం అధికారులకు లంచం ఇచ్చినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు.

 

20:37 - April 15, 2017

వ‌రంగ‌ల్ : పండ్ల మార్కెట్‌లో నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్న దుకాణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ యార్డులోని ప‌లు దుకాణ‌ల్లో తనిఖీలు నిర్వహించి... సుమారు 15 కిలోల నిషేధిత చైనా పౌడ‌ర్  వాడుతున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. మార్కెట్ యార్డులో ఇథిలిన్ ఛాంబ‌ర్లు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో... వినియోగంలోకి రాలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా... వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుందన్న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

09:18 - April 12, 2017

హైదరాబాద్: బాలాపూర్ లో వరకట్న దాహానికి మరో ఇల్లాలు బలైపోయింది. మినార్ కాలనీకి చెందిన అంజుం పైజాన్, యాకత్ పురాకు చెందిన ఇర్ఫాన్ తో ఈ ఏడాది జనవరి 13న పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుండి అంజుం ను అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అంజుంఅత్తింటి వారి వేధింపులు వివరిస్తూ తన సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేసింది. తరువాత బాత్రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాలాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - పోలీసులు