ప్రజలు

20:51 - July 20, 2018

ఢిల్లీ : దేశంలో ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. 4 సంవత్సరాల నుంచి ప్రత్యేకహోదా, విభజన హామీలు, రైల్వేజోన్‌, స్టీల్‌ ప్లాంట్‌ అడుగుతుంటే కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. విభజనతో తెలంగాణకు మాత్రమే న్యాయం జరిగిందని.. ఏపీ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీ ప్రభుత్వానికే ప్రజలే బుద్ధి చెబుతారని గల్లా జయదేవ్‌ తెలిపారు. 

 

10:33 - July 12, 2018

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షం పడుతోంది. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:32 - July 1, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల మోడీ పాలనలో కార్పొరేర్లకు, సంపన్నులకు మాత్రమే మేలు జరిగిందిని మండిపడ్డారు సీఐటీయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి హేమలత. దేశంలో ఉపాధి సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు కార్మికులతో పాటు అన్ని తరగతుల ప్రజలను కలుపుకొని ఐక్యపోరాటాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. .

11:56 - June 15, 2018

ఢిల్లీ : హస్తినను దట్టమైన దుమ్ము పొరలు కమ్ముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాను  దేశ రాజధానిపై తీవ్ర ప్రభావం చూపింది.  రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకరరీతిలో పిఎం స్థాయిలు ఉన్నాయని కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. మరికొన్ని రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ గాలిని పీల్చడం వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజలు ముక్కుకు మాస్కులు ధరించాలని, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దుమ్ము కాలుష్యం కారణంగా ఢిల్లీ భవన నిర్మాణపు పనులను నిలిపివేశారు. వాతావరణ కాలుష్యం, వెలుతురు లేని కారణంగా ఛండీగర్‌ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు.

 

08:49 - June 14, 2018

సంగారెడ్డి : పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. రాత్రిపూట అపార్ట్ మెంట్లలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిద్రహారాలుమాని ప్రజలు కాపలా కాస్తున్నారు. కర్రలు పట్టుకుని కాలనీల్లో గస్తీ తిరుగుతున్నారు.  

13:03 - June 13, 2018

హైదరాబాద్ : అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి. అందుకే  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నాం. మీరున్న స్థలాలు ఖాళీ చెయండి. 14 నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం సమయంలో ప్రభుత్వం పెద్దలు అధికారులు చెప్పిన మాటలు. కానీ ఇళ్ల నిర్మాణ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. గ్రేటర్‌ పరిధిలో స్లమ్స్‌ను తొలగించి, ఇళ్లు నిర్మిస్తామన్నా పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

హైదరాబాద్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటు మురికి వాడలు... బస్తీల్లో కూడా రెండు పడక గదులను నిర్మిస్తామన్నారు. అయితే మురికి వాడల్లో ఇళ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. అక్కడున్న కుటుంబాలను ఒప్పించి, భూవివాదాలను చక్కబెట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరో వైపు లబ్ధిదారులు ఒప్పుకున్న ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇక కార్వాన్‌ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్‌ బోజగుట్ట వద్ద ఉన్న మురికివాడలో 1800 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ స్లమ్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేస్తామని, అప్పటి వరకు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకోవచ్చంటూ అంధికారులు సెలవిచ్చారు. దీంతో కొంతమంది అక్కడే గుడిసెలు వేసుకోగా మరి కొందరు... ఇతర ప్రాంతాల్లోకి వెళ్లారు. ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పనుల్లో తీవ్రజాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

మొత్తం 68బ్లాకుల్లో  1800 కుపైగా ఇళ్లు నిర్మించాల్సి ఉంటే 5,6 బ్లాకులకు మించి పనులు కాలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యి 7 నెలలు అయినా.. పనుల్లో మాత్రం వేగం లేదని బోజగుట్ట వాసులు అంటున్నారు. పక్కనే చిన్న అవాసాలు ఏర్పాటు చేసుకొని  అనేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

జిహెచ్‌ఎంసీ సీటీ పరిధిలోని మురికి వాడల్లో 10వేల ఇళ్ల వరకు నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కోర్టు కేసులు, భూవివాదాలు వెంటాడుతున్నాయి. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసిప్పుడు మాత్రమే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని లేదంటే సామన్యూలకు కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు.  

07:31 - June 12, 2018

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. కృష్ణానది చెంతనేగల వైకుంఠపురం దగ్గర..  బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు రాబోయే రోజుల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మున్ముందు అక్కడ నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా.. కృష్ణానదిపై నూతన బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఇందుకోసం 2,169 కోట్ల మేర అనుమతులు కూడా జారీ చేసింది. రవాణాపరంగా ఈ ప్రాంతం కీలకం కావడం.. బ్యారేజ్‌ నిర్మాణానికి సహజసిద్ధంగా అనుకూలంగా ఉండడంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బ్యారేజీ ఆకృతులు రూపొందించి... పనులకు టెండర్లు పిలవడానికి జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణమైతే... దాదాపు 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మిస్తే కొన్ని కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గని ఆత్కూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణం
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈప్రాంతంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్‌ ఏర్పడింది.  ప్రస్తుతం రాజధానిలో నీటి అవసరాలు ఆశించినంతగా లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీకి మరో బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతోపాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10 టీఎంసీల నీటినిల్వ, 50 లక్షలమందికి తాగునీరు, రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఈ బ్యారేజీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది.
బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,169 కోట్లు ఖర్చు
బ్యారేజీ నిర్మాణానికి  దాదాపు 2,169 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూసేకరణకు 771 కోట్లు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు 1088 కోట్లు, నావిగేషన్‌ పనులకు 88 కోట్లు, భవనాల నిర్మాణానికి మరో 11 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.  నూతన బ్యారేజీ నిర్మాణం జరిగిన వెంటనే 10 టీఎంసీల నీటిని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు.

 

11:23 - June 4, 2018

కడప : ఓవైపు నిఫా వైరస్‌ భయంతో జనం ఆందోళన పడుతుంటే..  వారేమో ఏకంగా గబ్బిలాలతోనే సహజీవనం చేస్తున్నారు. కబోది పక్షులను దేవతలకు ప్రతిరూపంగా నమ్ముతున్నారు. గబ్బిలాల మలంతో చిన్న పిల్లలకు స్నానం  చేయించి... మెడలో గబ్బిలాల కళేబరాలు, ఎముకలు  వేస్తున్నారు. కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఈ  వింత ఆచారం పాటిస్తున్నారు. 

గబ్బిలం పేరెత్తితేనే ఇపుడు ఇండియా జనం వణికిపోతున్నారు. గబ్బిలం నుంచి నిఫావైరస్‌ వ్యాపిస్తోందని ప్రచారం హోరెత్తుతోంది. అలాంటింది ఈ గ్రామంలో మాత్రం ఇలా గబ్బిలాలను దేవతా పక్షులుగా కొలుస్తున్నారు. అంతేకాదు.. గబ్బిలాలమలాన్ని  చిన్నపిల్లల ఒంటికి పూస్తే రోగాలు నయం అవుతాయని ఈ గ్రామస్తులు నమ్ముతున్నారు. 

కడప జిల్లాలోని రైల్వేకోడూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవరంపోడు గ్రామం. 35 ఏళ్ల క్రితం కక్షలతో, కొట్లాటలతో ఈ గ్రామంలో అట్టుడికేది. నిత్యం ఘర్షణలతో  ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి అనుకోని అతిథుల్లా వచ్చి చేరాయి ఈ గబ్బిలాలు. ఊరి చివర ఉన్న అమ్మదేవత చెట్టుపైకి గబ్బిలాలు వచ్చి చేరాయి. క్రమేణా ఊర్లోని చింత, కొబ్బరి, రావి, తదితర చెట్లపై కీ చేరి అక్కడే నివాసం ఏర్పురచుకున్నాయి.  ఏమయిందో ఏమోగాని గబ్బిలాలు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి ఊరిలో కక్షలు  తొలిగిపోయి శాంతి ఏర్పడిందని మధవరంపోడు గ్రామస్తులు అంటున్నారు. 

అనారోగ్యానికి గురైన పిల్లలను ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకు తీసుకొచ్చి గబ్బిలాల మలంను ఒళ్లంతా పూసి అక్కడే స్నానాలు చేయించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అంతేకాదు  బలహీనంగా ఉన్న చిన్నారులకు  ఇలా గబ్బిలాల కళేబరాలను , ఎముకలను   మెడలో తగిలిస్తున్నారు. అలా చేస్తే పిల్లల రోగాలు నయం అవుతున్నాయని మాధవరంపోడు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా నమ్ముతున్నారు.

నిపా వైరస్ కారణంగా కేరళలో 15 వరకు మృతి చేందడంతో గబ్బిలం అన్న పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ ఈ మాధవరంపోడు గ్రామస్తుల్లో మాత్రం నిపా వైరస్ గురించి ఆందోళన కనిపించడం లేదు. అయితే నిపుణులు మాత్రం నిపా వైరస్ వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం  నిఫావైరస్‌ వ్యాప్తిపై అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.   


 

15:31 - June 2, 2018

విశాఖపట్టణం : రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. పన్నుల పేరిట ప్రజలపై భారాలు ప్రభుత్వాలు మోపుతున్నాయని, జీఎస్టీతో పన్నులు వేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలిస్తున్నారని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 

14:48 - June 1, 2018

ఢిల్లీ : ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సతమతమవుతున్న జనం నెత్తిన మరో భారం పడింది. సబ్సిడీ వంటగ్యాస్‌పై 2 రూపాయల 34 పైసలు పెరిగింది. సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌పై 48 రూపాయలు పెరిగింది. తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 493.55 పై...సబ్సీడీయేతర సిలిండర్‌ ధర రూ. 698.50కి చేరుకుంది. ఇక సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ. 496.65, ముంబయిలో రూ. 491.31, చెన్నైలో రూ. 481.84గా ఉంది. సబ్సీడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ. 723.50, ముంబయిలో రూ. 671.50, చెన్నైలో రూ. 712.50 పైసలకు చేరుకుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రజలు