ప్రత్యేక హోదా

06:30 - May 26, 2017

కృష్ణా : విజ‌య‌వాడ‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల మ‌హా స‌మ్మేళ‌నంలో..అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వలేని పరిస్థితులు కల్పించింది కాంగ్రెస్సే అని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని..ఇప్పుడు త‌మను ప్రత్యేక హోదా కావాలని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభ‌జ‌న బిల్లులో హోదాకు సంబంధించి స్పష్టమైన అంశాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పుడు త‌మ‌ను విమ‌ర్శించడం తగదన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని..అయినా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదాకు స‌మాన‌మైన ప్రయోజ‌నాలు ఏపీకి అందిస్తున్నామ‌న్నారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చాం...

న‌రేంద్ర మోదీ ఏపీకి ఏం చేశారని కొంద‌రు ప్రశ్నిస్తున్నారని, తాను మోదీ త‌ర‌ఫున జ‌వాబు ఇస్తున్నానంటూ అమిత్‌షా కొన్ని అంకెలు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చామని.. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే భరిస్తోందన్నారు. లక్షా 75వేల కోట్లు రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థిక సాయం అందించిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తరబడి జరగని వృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపామని షా వివరించారు.

25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం పట్ల హర్షం ...

న‌రేంద్ర మోదీ పాల‌న‌లో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంద‌ని షా చెప్పారు. ఏపీలో 25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం సంతోషమ‌ని అన్నారు. 12 కోట్ల స‌భ్యత్వంతో బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిందని అన్నారు. ఈ మ‌హా స‌మ్మేళ‌నం చ‌రిత్రలో నిలిచిపోతుందన్నారు. బూత్ స్థాయి స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేసిన రాష్ట్ర క‌మిటీకి అభినంద‌న‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జులైలో ప్రధాని మోదీ ఏపీకి వస్తారని వెల్లడించారు.

బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా త‌యారుచేయాలని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. మోదీ పాల‌న‌లో అవినీతికి తావులేదని చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా ప‌లువురు చేస్తోన్న త‌ప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు నిర్వహిస్తే బీజేపీకి 360 స్థానాల‌కు పైగా వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఆర్థిక అస‌మాన‌త‌లు త‌గ్గించ‌డం మోదీ ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు.

అమిత్ షా ప్రసంగిస్తుండగా..

అమిత్ షా ప్రసంగిస్తుండగా.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళ‌నకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు. ఇదే సందర్భంగా, కొందరు బీజేపీ కార్యకర్తలు.. టీడీపీని వీడండి, బీజేపీని కాపాడండి అన్న అర్థం వచ్చే స్లోగన్‌లతో ప్లకార్డులు ప్రదర్శించి.. హడావుడి చేశారు.

21:31 - May 23, 2017
18:31 - May 23, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో భీమవరంలో నిర్వహించనున్న ర్యాలీకి రాహుల్‌ గాంధీ వస్తానని చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జూన్‌ రెండో వారంలో భీమవరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని...ఆ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీని ఆహ్వానించామని రఘువీరారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని మరికొంతమంది పెద్దలను కూడా ఆహ్వానిస్తామని అన్నారు.

18:57 - May 21, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ కేంద్రం న్యాయం చేసేంతవరకూ పోరాడతామని... సీపీఎం ఏపీ కార్యదర్శి మధు స్పష్టం చేశారు.. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న హామీ ఇంతవరకూ అమల్లోకి రాలేదని ఆరోపించారు.. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం, ప్రజల ఆకాంక్షలు అంశంపై విశాఖలో ఏర్పాటుచేసిన సదస్సుకు మధుతో పాటు.. లోక్‌సత్తా జాతీయ నేత జయప్రకాశ్ నారాయణ్, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరయ్యారు..

18:58 - May 19, 2017

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడతారా? పార్టీ అధినేత గతంలో చెప్పినట్టుగా రాజీనామాస్త్రం ప్రయోగిస్తారా? తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ఎంపీలు.. రాజీనామాపై వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ యూ టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఆసక్తికరంగా మారిన రాజీనామా అస్త్రం

నవ్యాంధ్ర ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు.. రాజీనామా అంశంపై ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. అంతిమ అస్త్రంగా రాజీనామాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యింది.

రాజీనామాల కోసం ఎంపీలను ప్రిపేర్‌ చేసిన జగన్‌

వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసేందుకు రెడీ కావాలని.. ఎంపీలను జగన్‌ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వ్యూహాలను మార్చినట్టుగా తెలుస్తోంది. అంతిమ అస్త్రంగా ఎంపీలతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలి అనుకున్న జగన్.. ఈ అంశంపై పూర్తిగా వెనక్కి తగ్గారు. హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరు అని జగన్ అంటున్నారు.

ప్రధాని మోదీని కలిసిన జగన్

గతంలో అరు నూరయినా ఎంపీలతో రాజీనామా చేయించి.. కేంద్రప్రభుత్వంపై పోరాడతామన్న జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొత్త ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇద్దరి మధ్య.. రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హోదాపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు జగన్‌కు ప్రధాని వివరించారు. జగన్‌కు సంబంధించిన ఇతర వ్యక్తిగత అంశాలపై ఏనాడు లేని విధంగా పీఎం ప్రాధాన్యత ఇవ్వడంతో.. జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాజీనామాల పై రూట్ మార్చిన జగన్‌ వ్యూహం.. ఏ విధంగా మలుపు తిరుగుతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. 

18:57 - May 12, 2017

విజయనగరం : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నదంతా.. ఉత్తదేనని ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. హోదా విషయంలో కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను రాజీనామా చేయాలనే జగన్‌.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామనడం మోదీకి దగ్గరవ్వడానికేనన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించక ముందే మద్దతిస్తూ ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారని సుజయకృష్ణ రంగారావు అన్నారు.

 

19:39 - May 9, 2017

విజయవాడ : ఏపీ ప్రత్యేక రైల్వే జోన్ పై టిడిపి ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ విషయంలో దేవుడు వరమిచ్చినా పూజారీ కరుణించ లేదన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి హాజరయ్యారు. అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఒకనొక దశలో వాకౌట్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

అధికారుల తీరును తప్పుబట్టిన రాయపాటి..
రైల్వే జోన్ పై ప్రధాన మంత్రి మోడీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా ఉన్నా అధికారులు అడ్డుపడుతున్నారని, అధికారులే పవర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రైల్వే జోన్ రావడం అధికారులకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ - చెన్నై డే ట్రైన్ అధికారులు పట్టించుకోవడం లేదని, వివిధ ప్రాజెక్టులను కూడా స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పది సార్లు ప్రధానిని కలిసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మీటింగ్..విందు భోజనాలు పెడుతున్నారు కానీ పనులు చేయడం లేదని మండిపడినట్లు సమాచారం.

రైల్వే జీఎం స్పందన..
దీనిపై రైల్వే జీఎం వినోద్ కుమార్ స్పందించారు. అధికారులు అందరూ సహకరిస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల పనులు మందగమనంలో ఉండడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆచితూచి స్పందించారు. కేంద్రం ఇవ్వాల్సి ఉంటుందని, ఇందుకు సహాయ సహకారాలు రైల్వే అధికారులు చేస్తారని చెప్పుకొచ్చారు.

10:10 - April 14, 2017

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎంపీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు పలికిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనంద భాస్కర్‌లకు పవన్ కృతజ్ఞలు తెలిపారు. అటు వైసీపీ ఎంపీలు హోదాకోసం పోరాడుతున్న తీరును కూడా పవన్‌ అభినందించారు. ప్రత్యేక హోదా పై టీడీపీ రాజీపడుతోందని.. ఇలా రాజీపడే హక్కు ఆపార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదన్నారు జనసేనాని. హోదా అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మౌనంగా కూర్చోవడం, టీడీపీ ఎంపీలు సభకే రాకపోవడం వంటి దృశ్యాలు తీవ్రంగా బాధించాయని పవన్ ట్వీట్‌ చేశారు. అటు బీజేపీ నేతల వర్ణవివక్ష కామెంట్స్‌ను మరోసారి ట్విటర్‌లో ప్రస్తావించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల విభజన విషయంలో వివక్షచూపుతోందని పవన్‌ ట్విటర్‌లో విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విభజన డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నా.. కేవలం దక్షిణాది రాష్ట్రాలనే ఎందుకు విడదీస్తున్నారని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నలు సంధించారు. అటు ఉత్తరాది నేతల వర్ణ వివక్షపై కూడా జనసేన అధ్యక్షుడు మరో సారి ఘాటుగా ట్వీట్‌చేశారు. దక్షిణ భారతీయులపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. ఒకవేళ తరుణ్‌విజయ్‌, బీజేపీ నేతలు నిజంగా తమ చర్యలకు క్షమాపణ చెప్పాలని భావిస్తే.. వారు ద్రవిడ భాష ఒక్కటైనా నేర్చుకోవాలి..అప్పుడే వారు దక్షిణాదివారిని ఎంతటి వేదనకు గురిచేస్తున్నారో అర్థమవుతుందని కామెంట్‌ పెట్టారు జనసేన అధినేత. వర్ణవివక్ష లాంటి కుట్రలను ఎదుర్కోవాలంటే.. దక్షిణాదిన రాజకీయపార్టీలన్నీ ఒకే తాటిమీదకు రావాలని పవన్‌కళ్యాణ్‌ ట్విటర్‌లో రాశారు.

16:35 - April 12, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తాగునీరుకూడా లేక విలవిల్లాడుతుంటే.. బాబు మాత్రం బీజేపీని పొగడటంలోనే కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేకప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి ఖర్చు కేంద్రమే భరించేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రజలకు చేసిన వాగ్ధానాల్లో ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు జరపలేదని, రైతుల రుణమాఫీ అర్ధాంతరంగా ఆగిపోయిందని విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు చెందిన రుణమాఫీ రూ. 30వేల కోట్లు ఉందని అందులో ఔట్ స్టాడింగ్ బకాయిలు రూ. 15,854 కోట్లు ఉందని తెలిపారు. వీటిని చెల్లిస్తానని ప్రభుత్వం చెప్పి మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రూ. 400 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాయలసీమ..ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని మధు డిమాండ్ చేశారు.

21:15 - April 11, 2017

ఢిల్లీ : ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌, వైసీపీలకు చెందిన రాజ్యసభ సభ్యులు డిమాండ్‌ చేశారు. 14వ ఆర్దిక సంఘం బూచి చూపి ప్రత్యేక హోదా కల్పించకపోవడం దారుణమన్నారు. 14వ ఆర్దిక సంఘం అసలు ఏపీకి హోదా ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి పీఎం మన్మోహన్‌ సభలో ప్రకటించారని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా కోరిన అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ఇప్పుడు అధికారపార్టీలో ఉన్నారని.. ఆ హామీని అమలు చేయాలన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సభ్యుల వాదనలకు.. తెలంగాణకు చెందిన కే. కేశవరావు, రాపోలు ఆనంద్‌భాస్కర్‌ కూడా మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రత్యేక హోదా