ప్రధాని నరేంద్రమోడీ
ఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ను రాజకీయం చేయడం సరికాదని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. బసవాచార్య జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.... ముస్లిం మహిళలకు మూడు తలాక్‌ల నుంచి విముక్తి కల్పించేందుకు ముస్లింలే ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో భారతీయ ముస్లింలే ప్రపంచానికి మార్గదర్శకులు కావాలని మోది ఆకాంక్షించారు.
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడారు. మోడీ నినాదాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగదు కొరత దేశ ప్రజలను ఇంకా వెంటాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు అగ్నిపరీక్షగా మారుతున్నాయి. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడంతో పార్టీని గెలిపించే బాధ్యత వీరిద్దరి మీదే పడుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఆధిక్యత ప్రదర్శించిన బిజెపి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శ్రమిస్తోంది.
బిజెపికి యూపీ అత్యంత కీలక రాష్ట్రం
బిజెపికి ఉత్తరప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తర ప్రదేశ్ నుంచే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీకి ఏకంగా 71 లోక్ సభ స్థానాలు లభించాయి. యుపిలో ఇన్ని వచ్చి వుండకపోతే, బిజెపికి సొంతంగామెజార్టీ దక్కేది కాదు. 2019లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో తన బలాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సి వుంటుంది.
నోట్ల రద్దు తర్వాత తొలి ఎన్నికలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 403 అసెంబ్లీ స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఫలితం కోసమే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను నోట్ల రద్దుకు రిఫరెండంగా భావిస్తున్నవారూ లేకపోలేదు.
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 71 స్థానాలు
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా 71 స్థానాలు గెలుచుకోవడానికి నరేంద్ర మోడీ క్రేజ్ తో పాటు అమిత్ షా రచించిన వ్యూహాలు కూడా కారణమయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి ప్రతిష్టకు అదే ఉత్తరప్రదేశ్ లో అగ్నిపరీక్ష తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్ లో బిజెపి దెబ్బతింటే, ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ గ్రాఫ్ మీద కూడా దాని ప్రభావం పడుతుంది.
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన సీఎం అభ్యర్థి లేరు
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. ఒక వైపు ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మరో వైపు మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, వీరిద్దరిలా సొంత కరిస్మా వున్న నాయకుడు ఉత్తరప్రదేశ్ బిజెపిలో లేరు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉత్తరప్రదేశ్ కే చెందినవారే అయినా, రాష్ట్రం మొత్తాన్ని ఊపేయగల కరిస్మా వున్న నాయకుడు కాదు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేనకాగాంధీలదీ అదే పరిస్థితి. కాబట్టి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భుజస్కందాల మీదనే వుంది.
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
2014 లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయాన్నే నమోదు చేసినా 1996 తర్వాత జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. 1996లో బిజెపికి 32.51 శాతం ఓట్లు లభించగా, ఆ తర్వాత 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాని బలం 20.12 శాతానికి పడిపోయింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 17శాతానికి క్షీణించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఓట్లు 15శాతానికే పరిమితమయ్యాయి. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బిజెపి 43 శాతం ఓట్లు సాధించి, సునాయసంగా ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకుంది.
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలు
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలే అయినా, 2014 లోక్ సభ ఎన్నికల ప్రకారం 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో మెజార్టీ సాధించడం విశేషం. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 202 స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. బిజెపి, ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగే ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే, 30శాతం ఓట్లు సాధిస్తే చాలన్నది ఓ అంచనా. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 94 స్థానాల్లో 50శాతానికి పైగా ఓట్లు సాధించింది. 253 స్థానాల్లో 40శాతం ఓట్లు సాధించింది. అయినా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెను సవాలుగా మారుతున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కొల్లగొట్టిన బిజెపి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించలేకపోయింది. 2014 సెప్టెంబర్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు పెడితే, బిజెపి 3 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. 2016లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడింది. ఈ అంశమే బిజెపిని ఎక్కువగా కలవరపెడుతోంది. అయితే, ఎన్నికల ముంగిట్లో ములాయం సింగ్, అఖిలేష్ మధ్య తలెత్తిన విభేదాలు తమకు మేలు చేస్తాయన్న ఆశతో వుంది కమలదళం.
బెంగళూరు : దేశ సామాజికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. హిందీ, ఇంగ్లీషులో ప్రసంగించిన మోడీ.. ఎన్ ఆర్ఐలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రవాస భారతీయులు ఏటా 69 బిలియన్ డాలర్లను దేశానికి పంపుతున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.

ఢిల్లీ : నేటితో పార్లమెంట్ సమవేశాలు ముగియనున్నాయి. బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని కలిశారు. రైతు రుణమాఫీపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
గుజరాత్ : పార్లమెంట్ సమావేశాల్లో తనని మాట్లాడకుండా విపక్షాలే అడ్డుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. అందుకే తాను జనసభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లోని దీసాలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా రైతుల నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడంపై తీవ్ర ఆవేదన చెందిన రాష్ట్రపతి విపక్షాలు తీరును తప్పు పట్టారని గుర్తు చేశారు. తాము చర్చకు సిద్ధమేనని, ప్రధాని కూడా మాట్లాడతారని కేంద్రం సభలో స్పష్టం చేసినా...విపక్షాలే చర్చ నుంచి పారిపోతున్నాయని దుయ్యబట్టారు.
పంజాబ్ : అభివృద్ధే ప్రధాన అంశంగా మనం అడుగులు వేయాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమృత్ సర్ లో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొని, ప్రసంగించారు. అమృత్ సర్.. సిక్కులు నివసించిన ప్రాంతమని చెప్పారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమృత్ సర్ కు చాలామంది పర్యాటకులు వస్తుంటారని తెలిపారు. ఆర్థిక వృద్ధి, శాంతి, స్థిరత్వం అత్యంత ప్రధానాంశాలని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కు ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాప్ ఘని, 40 దేశాల ప్రతనిధులు హాజరయ్యారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించనున్నారు.
దేశప్రయోజనాలకోసమే పెద్దనోట్లను రద్దుచేసినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చేతిలో మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదన్నారు. యూపీలో ఎన్నికల ప్రచారం భాగంగా పరివర్తన్ర్యాలీలో ఆయన మాట్లాడారు. నల్లకుబేరులు మాత్రమే పెద్ద నోట్లు ఉపయోగిస్తున్నారని .. నల్లధనం వెలికి తీయడానికి ఇదే సరైన సమయం అన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో వెనక్కువెళ్లే ప్రశ్నేలేదన్నా మోదీ.. బ్లాక్‌మనీ పనిపట్టడానికి ప్రజల సహకారం అవసరమన్నారు.
హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి బయల్దేరి వెళ్లారు. రాత్రికి అక్కడే బసచేస్తున్న ప్రధానమంత్రి.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులను, రాజకీయ పార్టీల నేతలను కలుస్తారా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాంటి వివరాలేవీ ప్రధాని పర్యటన షెడ్యూల్లో పొందుపర్చలేదు. దినచర్యలో భాగంగా ప్రధాని శనివారం తెల్లవారుజామున గంట సేపు యోగా కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారని, 7 నుంచి 8 గంటల వరకు రిజర్వు సమయమని ప్రధాని షెడ్యూలులో పేర్కొన్నారు. తర్వాత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా డీజీపీలు, ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు.
హైదరాబాద్ : నగరంలో రేపటి నుంచి మూడు రోజులపాటు డీజీపీల సదస్సు జరుగనుంది. సర్దార్ వల్లభాయి పటేల్ జాతీయ అకాడమీలో జరుగనున్న ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
డీజీపీల సదస్సుకు మొట్టమొదటి సారి హైదరాబాద్ ఆథిత్యం ఇస్తోంది. సర్దార్ వల్లభాయిపటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఈ సదస్సు జరుగుంది. ఈ సదస్సును హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు 29 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు, సీఐఎఫ్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్ఎస్జీ, సీబీఐ, కేంద్ర పారామిలటరీ విభాగాల చీఫ్‌లు హారవుతారు.
డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న మోడీ
డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం ఉదయం ఆయన డీజీపీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శుక్రవారం సాయంత్రమే ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. జాతీయ పోలీసు అకాడమీలోని రాజస్థాన్ హౌస్‌ను ప్రధాని బస కోసం కేటాయించారు.
హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జాతీయ పోలీసు అకాడమీ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు చోట్ల ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసనకు దిగే అవకాశముండడంతో దారిపొడవునా... పోలీసులు మోహరించారు.
డీజీపీల సదస్సులో పలు అంశాలపై చర్చ
మూడు రోజులపాటు జరిగే డీజీపీల సదస్సులో పలు అంశాలపై చర్చ జరుగనుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల దాడులు, పాక్‌సైన్యం కాల్పులు, మావోయిస్టుల కార్యకలాపాలు, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశ అంతర్గత భద్రత, మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచడంపైనా ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
Pages
Don't Miss
