ప్రధాని మోదీ

08:04 - December 2, 2017

ఢిల్లీ : భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఒబామాను కలుసుకోవడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవీకాలం పూర్తైన తర్వాత  ఒబామా మన ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి. మోదీని కలుసుకోవడానికి ముందు హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ఒబామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌-అమెరికాలు కలిసిపనిచేస్తే ఎలాంటి సమస్యలపైనా పరిష్కారం అవుతాయన్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో మోదీ కీలక పాత్ర పోషించారని  ఒబామా అభినందించారు. 

 

15:59 - November 29, 2017

హైదరాబాద్ : ఇవాంకా ట్రంప్, ప్రధాని మోదీ టూర్‌కు రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. డీజీపీ కంట్రోల్ రూమ్‌కు నిన్నరాత్రి 9 గంటల 46 నిమిషాలకు కాల్ వచ్చింది. ఫలక్‌నుమా పరిసరాల్లో బాంబు పెట్టినట్టు ఆగంతకులు చెప్పడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయంగా గోప్యంగా ఉంచిన పోలీసులు... రాత్రంతా తనిఖీలు చేపట్టారు. చివరకు ఫేక్‌ కాల్‌గా తేల్చారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్  ద్వారా కాల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:06 - November 28, 2017

హైదరాబాద్ : రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఇందులో ట్రీ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 8:30కి భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌ షో ఉంటుంది. రాత్రి 10:25కు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. 

20:06 - November 28, 2017

రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు...రాహు, కేతువుల్లా తయారయ్యారని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 32 శాతం పనులు పూర్తైతే బాబు పాలనలో ఆర్భాటం తప్ప పనులు ముందుకు సాగడం లేదని ఆయన రాజమండ్రిలో అన్నారు. 49 శాతం పనులను ఏడాదిలోగా ఎలా పూర్తి చేయగలుగుతారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. 

 

19:27 - November 28, 2017

హైదరాబాద్‌ : మహానగరం సిగలో మరో కలికితురాయి చేరింది. నగర ప్రజా రవాణాలో నవశకం మొదలైంది. భాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోకల సాకారమైంది. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. మియాపూర్‌ స్టేషన్‌లో మెట్రో సేవలను ప్రారంభించిన మోదీ... కూకట్‌పల్లి వరకు మెట్రోరైలులో ప్రయాణించారు. 
మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా..అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు పట్టాలెక్కింది. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌ పోర్ట్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హెలికాఫ్టర్‌లో  మియాపూర్ మెట్రో స్టేషన్‌‌ చేరుకున్నారు. గవర్నర్ నరహింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి... .ప్రధాని మెట్రో రైలును ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ముందుగా మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి మియాపూర్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మెట్రో ప్రాజెక్టు, నగర పునఃనిర్మాణంపై చిత్రించిన డాక్యుమెంటరీని తిలకించారు. టీ-సవారీ యాప్‌, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 
మెట్రో రైలులో ప్రయాణించిన మోడీ 
ఆ తర్వాత మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్‌, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ తదితరులు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు నుంచి ప్రధాని హైదరాబాద్ సిటీ అందాలను తిలకించారు. సిటీ విశేషాలను పక్కనే ఉన్న మంత్రి కేటీఆర్ మోడీకి వివరించారు. కూకట్‌పల్లి నుంచి తిరిగి అదే ట్రైన్‌లో మియాపూర్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మియాపూర్ నుంచి బయల్దేరిన మెట్రోరైలు..కూకట్ పల్లి వరకు వెళ్లి రావటానికి 11 నిమిషాలు పట్టింది. మోదీ ప్రయాణించిన మెట్రోరైలును మహిళా లోకోపైలట్‌ నడిపారు.  
హైదరాబాద్‌లోనూ మెట్రో రైలు సౌకర్యం 
కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో మాదిరిగానే హైదరాబాద్‌లోనూ మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మియాపూర్‌ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల పొడవున మెట్రోరైలు సేవలు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలుతో నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతో పాటు.. మానవ వనరుల పనిగంటల ఆదా, రహదారి ప్రమాదాల తగ్గుదల, కాలుష్య నియంత్రణ, ఇంధన ఆదా ప్రయోజనాలు కలగనున్నాయి. మెట్రోరైలుతో అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతి తమకు దక్కనుందని భాగ్యనగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మెట్రో సామాన్యులకు అందుబాటులోకి రానుంది. 
 

 

20:32 - November 10, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కాదని బనియా కులానికి చెందినవారని ఆరోపించారు. అయినా ఆయన శూద్ర బీసీ కాదన్నారు. గుజరాత్‌, బీహార్‌లో బనియాలు బీసీల పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారని చెప్పారు. బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు రిజర్వేషన్లకు వ్యతిరేకులని మండిపడ్డారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన కేరళ వర్సెస్‌ గుజరాత్‌ మోడల్‌ సెమినార్‌కు ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

 

11:26 - November 6, 2017

'వన్ మేన్ షో టు మేన్ ఆర్మీ' పద్ధతులకు బీజేపీ స్వస్తి పలకాలని బిజెపి ఎంపి, నటుడు శత్రఘ్న సిన్హా ఘాటు విమర్శలు చేశారు. తమ సొంతపార్టీ పైనే విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ తమ పార్టీలోని లోపాలను నిష్పక్షపాతంగా ఎత్తిచూపే నేతలలో బీజేపీ ఎంపీ నటుడు శత్రుఘ్న సిన్హా ఒకరు. నోట్ల రద్దు సమయంలో కూడా మోదీని విమర్శించారు. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీలో దురహంకారం పెరుగుతోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాలంటే అధినాయకత్వం ఒంటెత్తుపోకడను విడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల యువకులు రైతులు వ్యాపారులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఆ ప్రభావం త్వరలో జరగనున్న గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై పడుతుందన్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాదని శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికలు అధికార పార్టీకి సవాలు వంటిదన్నారు. ప్రత్యర్థి పార్టీలను తక్కువగా అంచనా వేయడం పొరపాటన్నారు. తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. బీజేపీని వదిలిపెట్టే ఉద్దేశం తనకు లేదని అలా అయితే తాను ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాలను కేవలం ఒకరో ఇద్దరో వ్యక్తులు తీసుకోవడం సరికాదని మోదీ అమిత్ షాలనుద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే విధానం కొనసాగితే రాబోయే సవాళ్లను ఎదుర్కోలేమని సొంతపార్టీ పై సద్విమర్శలు చేసేందుకు తాను వెనుకాడబోనని స్పష్టం చేశారు. పటేళ్ల ఉద్యమాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని అందుకే హార్దిక్ పటేల్ కు బీజేపీ దగ్గరకాలేకపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల చార్టర్డ్ అకౌంటెంట్లకు చేతినిండా పని దొరికిందని సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అధికారులు న్యాయమూర్తులపై ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు జరపకూడదని వారిపై వచ్చే ఆరోపణలపై మీడియా కూడా అనుమతి లేకుండా వార్తలు రాయకూడదంటూ రాజస్థాన్ సర్కార్ బిల్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుపై సిన్హా మండిపడ్డారు. ఆ బిల్లు...రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

10:42 - November 6, 2017

ప్రపంచ దేశాల నల్ల కుబేరులతో పాటు ఇండియాలో పన్ను ఎగ్గొట్టి ఆస్తులు పోగేసుకున్న 714 మంది పేర్లని పారడైజ్ పేపర్స్ బయట పెట్టింది. దీనితో నల్ల కుబేరుల గుండెల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. పనామా పేపర్స్ సృష్టించిన సునామీని మర్చిపోకముందే పారడైజ్ పేపర్స్ వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్ లోని లనల్లకుబేరుల గుండెల్లో పారడైజ్ పేపర్స్ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలకు న్యాయ సేవలు అందించే ‘అప్లెబీ’ నుంచి లీకైన సమాచారం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించి పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీక్ కాగా అందులో 180 దేశాలకు చెందిన కుబేరులు ఉన్నారు. వీరిలో 174 మంది భారత మిలియనీర్లు కూడా ఉండడం గమనార్హం.

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కూడా పది మిలియన్ పౌండ్లను తరలించినట్టు ఆరోపణలు వస్తుండగా, ఈ జాబితాలో కెనడా ప్రధాని పేరు కూడా కనిపించింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ సీనియర్ సలహాదారు అయిన స్టీఫెన్ బ్రాన్ఫ్‌మాన్ పెద్ద ఎత్తున విదేశాలకు నిధులు తరలించినట్టు పారడైజ్ పేపర్స్ వెల్లడించాయి. పన్నులకు స్వర్గధామమైన దేశాలకు కుటుంబ వ్యాపారం ద్వారా ఆ సొమ్మును తరలించినట్టు పేపర్ల ద్వారా వెల్లడైంది.

నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది పూర్తి...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది కాలం పూర్తి కానుంది. ఆ రోజుని యాంటీ బ్లాక్ మని డే గా ప్రభుత్వం జరపనుంది. దీనికి రెండు రోజుల ముందు ఈ వ్యవహారం బట్ట బయలు కావడంతో పారడైజ్ పేపర్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

14:44 - October 2, 2017

హైదరాబాద్: పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని స్పందించకుంటే తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టంచేశారు.

17:54 - September 17, 2017

గుజరాత్ : దేశంలో మరో బృహత్తర ప్రాజెక్టును గుజరాత్‌ కెవాడియాలో ప్రధాని మోదీ ప్రారంభించారు.. 56 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.. 1961లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి దశలవారీగా ప్రాజెక్టు నిర్మాణం సాగింది. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అతిపెద్దది. ఈ ఏడాది జూన్‌ 17న డ్యామ్‌ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్‌ ఎకరపు అడుగులకు పెరిగింది. ఎత్తు పెంచిన డ్యామ్‌నే ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. జలాశయం లోతు 163 మీటర్లుగా ఉంది.. దాదాపు 30 గేట్లున్న సాగర్‌ సరోవర్‌ డ్యామ్‌లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. ఒక గేటు మూయాలంటే గంట పడుతుంది. డ్యామ్‌ ఎత్తు పెంచడంతో నీటినిల్వ సామర్ధ్యం పెరిగి గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు అత్యంత ప్రయోజనం పొందనున్నాయి. తాగునీరు అందడం ద్వారా 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. ఇంతటి ప్రాముఖ్యమైన ప్రాజెక్టును మోదీ తన పుట్టినరోజున ప్రారంభించబోతున్నారు..

 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రధాని మోదీ