ప్రధాన మంత్రి

16:25 - July 16, 2018

పశ్చిమబెంగాల్ : భారత ప్రధాన మంత్రి మోడీ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మోడీ ప్రసంగిస్తుండగా టెంట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. సోమవారం ప్రధాని మోడీ మిడ్నాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కృషి వికాస్ పేరిట ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తున్నారు. ఒక్కసారిగా టెంట్ కూలింది. గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరికి కాళ్లు..చేతులు విరిగాయి. వీరిని మోడీ పరామర్శించారు. 

19:32 - January 27, 2018

కామారెడ్డి : బిచ్కుంద మండల్‌ వాజిదనగర్‌లో ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా డబ్బులు కోసం రైతులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 2016 మార్చ్‌లో వచ్చిన వడగండ్ల వాన వల్ల నేలకొరిగిన పంటకు తాము ముందుగానే ప్రీమియం చెల్లించినా.. ఇప్పటికీ తమకు బీమా రాలేదని రైతులు వాపోయారు. తమ బాధను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పంట నష్టాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

20:26 - January 12, 2018

మొత్తానికి కలిశారు.. కలిశారు. సరే.. దీనివల్ల ప్రయోజనమేంటి? ఏపీకి ఏం ఒరుగుతోంది? మూడున్నరేళ్లుగా విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిందేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని రాష్ట్ర ప్రభుత్వం.., పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు నొక్కే రాష్ట్ర ప్రభుత్వం... ఏపీలో కనిపిస్తున్న తరుణం. ఇప్పుడు ఏడాది తర్వాత మోడీని కలిసిన చంద్రబాబు ఏపీకేమైనా ప్రయోజనాలు సాధించారా? లేక రాజకీయ ప్రయోజనాలకోసమే కలిశారా? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కథనం..

ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ..పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందనే విమర్శలు. మరోపక్క ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి వినిపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్ గా చోద్యం చూస్తున్న తీరు స్పష్టం. ఈ క్రమంలో జరిగిన తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. పోలవరానికి నిధులు ప్రవహిస్తాయా? రైల్వేజోన్ శాంక్షన్ అవుతుందా? రాజధానికి నిధులొస్తాయా? విద్యాసంస్థలు వచ్చేస్తాయా? చంద్రబాబు, మోడీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మోడీపై నమ్మకం, ఏపీ ప్రయోజనాలే ముఖ్యం అంటున్న చంద్రబాబు, ఏపీకి ఆశించిన ప్రయోజనం లేకుంటే బీజేపీతో తెగతెంపులకు సిద్ధమౌతారా? మోడీ అపాయింట్మెంట్ చంద్రబాబుకు కష్టంగా దొరికిందా? ఏపీకి న్యాయంగా రావలసిన వాటిని గట్టిగా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా?కేంద్రంలో చక్రం తిప్పే నేతగా ప్రొజెక్ట్ అయిన చంద్రబాబు వాయిస్ ఎందుకు తగ్గింది? అసలీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమా? లేక రాష్ట్ర హితం కోసమా? సమస్యలు స్పష్టంగా ఉన్నాయి..పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు..న్యాయంగా రావలసింది ఆశిస్తున్నారు.. కానీ, మొండి చేయి.. చెంబుడు మట్టి కాసిన్ని నీళ్ళు ఇచ్చి వాటితో ఎడ్జస్ట్ కావాలన్న కేంద్రం మూడున్నరేళ్లు గడుస్తున్నా ఏపీకి ఒరగబెట్టింది ఏం లేదు.. మరి ఈ భేటీ తర్వాతేమైనా పరిస్థితి మారుతుందా? ఏపీకి కాస్తైనా ఉపయోగం ఉంటుందా?

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు నిర్వచించబడే ఉంటాయి. అందులోనూ కొత్తగా ఏర్పడే రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కేంద్రం చూపెట్టాల్సిందే. కానీ, విభజన తర్వాత ఏళ్లు గడుస్తున్నా ఏపీని పట్టించుకోని కేంద్రాన్ని నిలదీసి తమ హక్కుగా రావలసింది సాధించుకోవాలి. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంలో ఏ మాత్రం ముందుకు వెళ్లటం లేదు. ఇప్పుడు ఈ నామ్ కే వాస్తే మీటింగ్ తో ఒరిగేది అంతకంటే ఏ మాత్రం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:37 - January 11, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధానికి పయనం కానున్నారు. ఈ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే పోలవరం..విభజన సమస్యలపై విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రధాన మంత్రితో ఇటీవలే భేటీ అయ్యారు. ప్రధాన మంత్రితో త్వరలో బాబు భేటీ కానున్నారని ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అపాయింట్ కేటాయించినట్లు గురువారం పీఎంవో కార్యాలయం నుండి సమాచారం అందించింది.

ఉదయం 10.40గంటలకు ప్రధానితో బాబు భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో విభజన హామీలు, పోలవరం హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక సాయం..నియోజకవర్గాల పెంపు అంశాలపై ప్రధానితో మాట్లాడనున్నారు. మరి ఈ భేటీలో ప్రధాన మంత్రి ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి. 

15:49 - November 22, 2017
21:20 - April 23, 2017

ఢిల్లీ : దేశంలో ఒకేసారి ఎన్నికలపై విస్తృత చర్చసాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి 3వ భేటీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోదీ, నవభారత్‌ అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలన్నారు. జీఎస్టీపై ఏకాభిప్రాయ సాధన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒకే దేశం, ఒకే ఆశయం, ఒకే నిర్ణయమే జీఎస్టీ లక్ష్యమన్నారు. దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు అన్న నినాదాన్ని మోదీ ప్రతిపాదించారు. పదిహేనేళ్ల విజన్‌ డాక్యుమెంట్‌పైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 15 సంవత్సరాల ముందస్తు ప్రణాళికకు సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్‌ ఆపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా సమర్పించారు. 15ఏళ్ల విజన్‌ డాక్యుమెంట్‌తోపాటు 7 సంవత్సరాల వ్యూహం - 3సంవత్సరాల అమలు పేరుతో జాతీయ అభివృద్ధి అజెండాను ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముసాయిదా అజెండాను వివరించారు. అన్ని రంగాల్లోని దాదాపు మూడు వందల ప్రత్యేక అంశాలతో పనగరియా నివేదిక తయారు చేశారు.

హాజరు కాని కేజ్రీ..మమత..
ఇక నీతిఆయోగ్‌ పనితీరుపై ఆ సంస్థ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాల సహకారంతో నీతి ఆయోగ్‌ పనిచేస్తుందని, దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని అమితాబ్‌కాంత్ తెలిపారు. మరోవైపు, జీఎస్టీపై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అస్ముకి అదియా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జీఎస్టీతో భారత ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న ప్రయోజాలను సమావేశంలో వివరించారు. అన్ని రాష్ట్రాలూ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలని అస్ముకి అదియా ఈ సందర్భంగా ముఖ్యమంత్రులను కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నీటిపారుదల, వ్యవసాయానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలని, రైతులకు టెక్నాలజీపై అవగాహన పెంచాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చవచ్చో చౌహాన్‌ ముఖ్యమంత్రులకు వివరించారు. డిజిటలైజేషన్‌, ఎనర్జీ , ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల పెంపుదల పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీకి ఢిల్లీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ హాజరుకాలేదు.

07:34 - November 23, 2016

పెద్ద నోట్ల రద్దుపై ఇది అంతం కాదు...ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వెంకటేశ్వర్లు (బీజేపీ), నర్సింహరెడ్డి (సీపీఎం), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చర్చ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:37 - November 23, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై ఇది అంతం కాదు...ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బిజెపి పార్లమెంటరీ సమావేశంలో మోది భావోద్వేగానికి లోనయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయానికి మద్దతు పలుకుతూ బిజెపి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

లక్షల కోట్లు జమ..
పెద్దనోట్ల రద్దు అంశంపై బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి, నల్లధనంపై పోరాటంలో ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనన్నారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, పెద్దనోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోది విమర్శించారు. పెద్దనోట్ల రద్దుకు గల కారణాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదేనని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దును విపక్షాలు తప్ప దేశ ప్రజలందరూ స్వాగతించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్థికమంత్రి కూడా తెలియకుండా చేశారని కొందరంటున్నారని... అలాంటప్పుడు తమ పార్టీ నేతలకు ఎలా తెలుస్తుందని విపక్షాలను ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లో లక్షల కోట్లు జమ అవుతున్నాయని, దీంతో సామాన్య ప్రజలకు లాభం చేకూరనుందని జైట్లీ చెప్పారు.

తప్పుదోవ పటిస్తున్న విపక్షాలు...
5 వందలు, వెయ్యి నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోది చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, దీని వల్ల పేదలు, రైతులు, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడతాయా...లేక నల్ల కుబేరులకు అండగా నిలబడతాయా అన్నది తేల్చుకోవాలని వెంకయ్యనాయుడు సవాల్‌ విసిరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై www.narendramodi.in ఓ యాప్‌ రూపొందించారు. దీనిపై తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని మోది భావిస్తున్నారు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఎన్‌బిటి-సి వోటర్‌ నిర్వహించిన సర్వేలో ప్రధానికి మోదికి మద్దతు లభించింది. అయితే ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని చాలామంది తప్పు పట్టారు.

13:12 - August 5, 2016

ఢిల్లీ : కష్టాల్లో ఉన్నామని ఆదుకోవాలని కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన హామీలు అమలు చేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్రంపై వత్తిడి పెంచేందుకు టిడిపి సిద్ధమైంది. హామీలు అమలు చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఎలాంటి స్పష్టమైన హామీనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని బాబు కోరినట్లు సమాచారం. ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని బాబు కోరినట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.
టిడిపి ఎంపీలతో...
అనంతరం టిడిపి ఎంపీలతో ప్రధాన మంత్రి మోడీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధాన మంత్రి మోడీ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. మీ సమస్యే..తమ సమస్య అని పేర్కొనట్లు తెలుస్తోంది. సమస్యను ఎలా పరిష్కరిస్తానే దానిపై క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.  దీనితో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు..కేంద్రం ఎలా స్పందించిందనే దానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. 

15:09 - May 15, 2016

విజయవాడ : ఈనెల 17వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలువనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న మంత్రులు..ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కరవు, హోదా, విభజన హామీలకు సంబంధించిన అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా లేదని..ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని..ఇప్పటికే పలు నిధులు విడుదల చేసామని బీజేపీ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రధానితో జరిగే భేటీలో బాబు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు పొందపర్చాలని బాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తారని పేర్కొన్నారు. కరవు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రధానికి బాబు వివరిస్తారని తెలిపారు. సోమవారం మరోసారి మంత్రులు..అధికారులతో మరోసారి భేటీ అవుతామన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రధాన మంత్రి