ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

11:26 - August 10, 2018

హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీలు ఆవేదన చెందారు.  
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం 
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ వేశధారణలో అలరించారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు. 
మంచిర్యాలలో 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 
నిర్మల్‌ లో
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఆదివాసీల సమస్యలు పట్టించకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. 
ఖమ్మంలో 
ఖమ్మంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు అలరించారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఆదివాసీలకు పురిటి కష్టాలు తప్పడంలేదు. వర్షం కురిస్తే మల్లన్నవాగు. కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వాగులు దాటలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో గుండాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురంలో ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోని భావితరాలకు అందివ్వాలని కోరుతూ ఆదివాసీ సాంప్రదాయ కొమ్ముబూర, డప్పు వాయిద్యాలతో ఆదివాసీసేన ఆధ్వర్యంలో వేలాదిమంది ఆదివాసీలు ప్రదర్శనగా తరలివచ్చారు.  
శ్రీకాకుళం జిల్లాలో
గిరిజనుల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీతం పేట ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివాసీ తల్లి విగ్రహానికి పూజలు చేసి ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకునేందుకు ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. 
 

 

06:42 - August 9, 2018

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతారు. మరోవైపు బాక్సైట్‌ అంశంతోపాటు గిరిజన యూనివర్సిటీ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ, బోయా వాల్మీకి కులాలను ఎస్టీలను చేర్చే అంశంపై సీఎంకు నిరసన తెలపాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగుతుందా లేక ఆదివాసీలు అడ్డుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.
పాడేరులో పర్యటించనున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన పాడేరులో పర్యటిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేశారు. చంద్రబాబు ప్రత్యేక విమానం ద్వారా విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పాడేరుకు హెలికాప్టర్‌ ద్వారా వెళ్తారు.  పాడేరు మండలం అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శి  కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అడారిమెట్ట, చింతలవీధి పరిధిలోని 8 గ్రామాల ప్రజలతో చంద్రబాబు ముచ్చటిస్తారు. గ్రామదర్శి కార్యక్రమంతోపాటు గ్రామ వికాసం కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ప్రతీవాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటుగా... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఏర్పాట్లను పరిశీలించారు.
చంద్రబాబు పాడేరు టూర్‌కు సమస్యలు స్వాగతం 
చంద్రబాబు పాడేరు టూర్‌కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ గనులకు సంబంధించి జీవో నంబర్‌ 97పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చెయ్యకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాల్కో సంస్థకు బాక్సైట్‌ను అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అందుకే జీవో నంబర్‌ 97ను రద్దు చెయ్యకుండా ఉంచిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో గిరిజన యూనివర్సిటీతోపాటుగా స్పెషల్‌ డీఎస్సీ అంశంపైనా గిరిజన నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలు గురించి కూడా సీఎం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.  ఇక బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని ఇక్కడి గిరిజనులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఆదివాసీ సమస్యలపై చంద్రబాబును నిలదీయాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. మొత్తానికి చంద్రబాబు పాడేరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

 

07:42 - August 9, 2016

హైదరాబాద్ : గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు మెలికలు తిరిగే వాగులు.. గజ్జల సవ్వళ్లు.. మువ్వల సందళ్లు.. హొయలొలికే నృత్యాలు. ఇదీ ఏజెన్సీ అనగానే గుర్తుకు వచ్చే అంశాలు. కాని దేశంలో అభివృద్ధి మాటున ఆదివాసీలను వనానికి దూరం చేస్తున్నారు నేతలు. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలోను వెనకబాటుకు గురవుతున్నారు ఆదివాసీలు.      
అస్థిత్వం కోసం పోరాడుతున్న ఆదివాసీలు 
వనం సల్లగుంటే.. అన్నానికి కొదవేముంది. పంటలు ఇంటికొస్తే పండగే ఇంకేముంది. కొండల నుండి కోనల నుండి ఒంపులు తిరుగుతున్న వాగులువంకల నడుమ జీవిస్తూ.. 461 జాతులు ఉన్న ఆదివాసీలు.. దేశ ఆదాయాన్ని పెంచడంలో తమవంతు కృషిచేస్తున్నా.. వారిని ఇంకా మూఢనమ్మకాలు.. ప్రజాప్రతినిధుల కుటిల రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అడవిబిడ్డలు వారి అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. 
ఆదివాసీల అభివృద్థిపై 2006 లో ముసాయిదా 
1994 లో ఆగస్టు 9 వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచంలోని ఆదివాసీలసంస్కృతి, సాంప్రదాయాలు ,అస్థిత్వం, హక్కుల పరిరక్షణ కోసం నేటికి పోరాడుతూనే ఉన్నారు. ఆవివాసీల  అభివృద్దికి , స్వేచ్ఛ కోసం వచ్చిన చట్టాలు చట్టబండలు అవుతున్నాయి. ఆదివాసీలు బాగా వెనకబడిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆదివాసీల అభివృద్దికి నేటికి ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. 2006 లో దీనిపై ముసాయిదాను రూపొందించినా తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందలేదు. 
వైద్యం అందక నేలకొరుగుతున్న అడవిబిడ్డలు
ఈ ఆధునిక యుగంలోను అభివృద్ది అంటే తెలియని గ్రామాలు కోకొల్లలు. ఏజెన్సీలో సరైన వైద్యం అందక అడవిబిడ్డలు నేలకొరుగుతున్నా.. పట్టించుకునే నాధుడేలేడు. వీటికి తోడునేటికి మూఢనమ్మకాల జాడ్యం ఏజెన్సీలో పడగ విప్పుతోంది.  మన్యంలో రహదార్లు లేక అనేక గ్రామాల ప్రజలు నేటికి వాగులు వంకలు దాటుతూ.. సాహసో పేత ప్రయాణాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు కాపాడుకుంటూ వస్తున్న సనాతన సాంప్రదాయాలు ఆధునిక ఒరవడిలో కనుమరుగవుతున్నాయి. 
నేటికి ఆదివాసీలకు అందని ఐటీడీఏ ఫలాలు 
ప్రస్తుతం 206 ఆదివాసీ గ్రామాలు పోలవరం కారణంగా జలసమాధి అవనున్నాయి.  అభివృద్ది మాటున ప్రభుత్వాలు వారిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. వారి గొంతును లేవకుండా నొక్కేస్తున్నారు.  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఉత్సవాలుగా జరుపుకోవాల్సిన తరుణంలో నిరసన సభలతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ది కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏలు ఫలాలను అందించలేకపోతున్నాయి. ఆదివాసీల సాంప్రదాయాలకు, ఆచారాలకు విలువనివ్వాల్సిన తరుణంలో.. విద్య ఉద్యోగాలకోసం ఆస్థిత్వం పోరాడుతుండడం అత్యంత దారుణం. అభివృద్ధి మాటున అడవిబిడ్డలు బలికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆదివాసీల దినోత్సవం సందర్భంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.     

 

Don't Miss

Subscribe to RSS - ప్రపంచ ఆదివాసీ దినోత్సవం