ప్రభుత్వం

13:55 - February 21, 2018

కృష్ణా : విజయవాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు తర్జనభర్జనల మధ్యే కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్‌ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించలేదు. రెండు దఫాలుగా వంతెనను పొడిగించంతో మరోసారి పొడిగింపు వీలుపడదని తేల్చి చెప్పింది.  తప్పని పరిస్థితిలో ఫ్లైఓవర్‌ను పొడిగించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది.

రెండో వరుసకు గ్రీన్‌సిగ్నల్‌
ఫ్లైఓవర్‌ నిర్మాణంలో రెండో వరుసకు సంబంధించి ఎన్‌హెచ్‌ అధికారులు 110 కోట్లతో సిద్దం చేసిన డీపీఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బెంజ్‌ సర్కిల్‌ నుంచి రమేష్‌ ఆస్పత్రి వరకు తూర్పువైపున 1.47 కిలోమీటర్ల మేర మూడు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది. రమేష్‌ ఆస్పత్రి నుంచి నిడమనూరు వరకు 4కిలోమీటర్ల మేర  ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి ఉంది. 1.47 కిలోమీటర్లకు మూడు వరుసల్లో ఒకవైపు నిర్మించడానికి 110 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. రామవరప్పాడు సెంటర్‌ నుంచి నిడమనూరు వరకు వివిధ దుకాణాలు ఉన్నాయి. వీటిని తొలగించి రోడ్డ విస్తరించాలంటే భూ సేకరణకు మరో 500 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా. ఫ్లైఓవర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్ల ఖర్చు భరించాలి. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన ప్రాజెక్ట్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయింపులు జరుపుతారా లేదా అనేది ఆసక్తికా మారింది.

ట్రాఫిక్‌ చక్రబంధంలో ప్రయాణీకులు
ఫ్లైఓవర్‌ పనులు ఊపందుకోవడంతో ట్రాఫిక్‌ చక్రబంధంలో ప్రయాణీకులు నరకం చవిచూస్తున్నారు. దీంతో పైవంతెనను పొడిగించాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. విజయవాడలో గత మూడేళ్ల కాలంలో వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. ఇంకోవైపు  విజయవాడకు వివిధ జిల్లాల నుంచి వాహనాల తాకిడి కూడా అధికంగా ఉంది. ఈ వాహనాలన్నీ కూడా బెంజ్‌ సర్కిల్‌ దగ్గరే కలవాల్సి ఉంది. దీంతో భారీ సంఖ్యలో చేరుకుంటున్న వాహనాలతో నిత్యం వాహనదారులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు.  త్వరితగతిన ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేసి  అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

16:56 - February 17, 2018

విశాఖ : కార్మికుల ఆందోళనను పట్టించుకోకుండా... ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, డీసీఐలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు నర్సింగారావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ ప్రభుత్వ స్టీరింగ్‌ కమిటీ ఫిబ్రవరి 19న విశాఖలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. జాతీయ ప్రభుత్వరంగ స్టీరింగ్‌ కమిటీ సీనియర్‌ నేతలు తపన్‌సేన్‌, స్వదేశ్‌ దేవ్‌ రాయ్‌, చందన్‌ పెళ్లై వంటి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నర్సింగరావు తెలిపారు. 

22:07 - February 16, 2018

హైదరాబాద్ : ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏ పరీక్షలను నిర్వహించేది లేదని కేజి టు పీజి విద్యాసంస్థల జేఏసి నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించాల్సిన బకాయిలు, స్వరాష్ట్రం వచ్చాక చెల్లించాల్సిన బకాయిలు వేలకోట్లు పెండింగ్‌ వున్నాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏ ఉద్యమానికైనా సిద్ధమని హెచ్చరించింది. వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్‌ చేశారు. జేఏసీ నిర్ణయంతో ఈ నెల 28 నుండి ఇంటర్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

 

07:31 - January 18, 2018

భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీకి కష్టాలు వీడడం లేదు. విభజన హామీలు..ఇతరత్రా వాటిపై కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు కొనసాగిస్తున్నారు. కానీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని, ఢిల్లీకి బాబు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బుద్ధా వెంకన్న (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

08:28 - January 15, 2018

చెన్నై : తమిళుల సంప్రదాయ ఆట జల్లికట్టు జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ప్రత్యేక చట్టం మేరకు నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వమే ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని అనుమతులు,  నిర్వహణ, భద్రత అంతా దగ్గరుండి చూసుకుంటోంది.  అవనీయపురంలో వెయ్యిమంది యువకులు, 400 ఎద్దులతో జల్లికట్టు నిర్వహించారు. ఇక అనంగానల్లూరు, పాలమేడు ప్రాంతాల్లో జల్లికట్టు ఆటకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టను తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. 

 

14:17 - December 30, 2017

విజయవాడ : ట్రాన్స్ జెండర్స్ కు ఏపీ శుభవార్త అందించింది. సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం చేయూత నివ్వాలని చేస్తున్న వారి డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ట్రాన్స్ జెండర్స్ పాలసీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభిన్న ప్రతిభావంతులు - దివ్యాంగులు - సీనియర్స్ సిటిజన్స్ శాఖకు అదనంగా ట్రాన్స్ జెండర్ పేరును పెడుతున్నట్లు పేర్కొంది. 18 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం...అన్ని సంక్షేమ కార్పొరేషన్లలో రుణాలు పొందే హక్కు...అన్ని రకాల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు...లను కల్పించనుంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దరఖాస్తుల్లో థర్డ్ జెండర్ కాలమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు చేసిన మార్గదర్శకాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా ఏపీలో అమలు చేయడం లేదనే సంగతి తెలిసిందే. దీనితో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇందుకు మెడికల్ సర్టిఫికేట్ అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యాలయాల్లో అనుమతి నిరాకరిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకుంటామని, వారిపై ఎలాంటి వివక్ష చూపవద్దని ఆదేశించింది. ఉద్యోగ రంగాల్లో కూడా అవకాశాలు కల్పించడం..వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్ జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

20:27 - December 20, 2017

కర్నూలు : తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వకాలు జరపడంపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారులు తవ్వకాలను పర్యవేక్షించడాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో దొంగలు నిధుల కోసం తవ్వకాలు జరిపేవారని.. ప్రస్తుతం ఎలాంటి ఆర్డర్స్‌ లేకుండా ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిందని ఆయన మండిపడ్డారు. 15వ శతాబ్ధం నాటి కట్టడాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఆర్కియాలజీ విభాగానికి చెప్పినట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

 

07:25 - December 8, 2017

మొదట్లో సహకార ఫ్యాక్టరీ అది. ఆ తర్వాత కాలంలో ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆ ప్రైవేటు యాజమాన్యం ఆ ఫ్యాక్టరీని మూసివేస్తుంది. అర్థాంతరంగా మూసివేయడంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు దానిలో పని చేస్తున్న ఉద్యోగులు, దాన్ని నమ్ముకున్న చెరుకు రైతులు. ఇదీ కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్న డెల్టా చక్కెర కర్మాగారం ఉద్యోగుల, రైతుల పరిస్థితి. గత కొన్నాళ్లుగా వారంతా ఆందోళన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రాజకీయ కారణాలతో సరిగా స్పందించడంలేదని విమర్శలున్నాయి. దీనిపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు క్రిష్ణ సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:43 - December 5, 2017

కృష్ణా : రాష్ట్ర పోలీస్‌ శాఖలో పలు విభాగాలకు అధికారుల కొరత ఏర్పడింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ శాఖలో కీలక విభాగాలు దిక్కులు చూస్తున్నాయి. విజిలెన్స్‌ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్, పీఅండ్ఎల్, తూనికలు-కొలతలు ఇలా కీలకమైన శాఖలను పట్టించుకునే నాథుడే లేరు. ఐజీ స్థాయి అధికారులు ఈ విభాగాల్లో కీలకపాత్ర పోషించాలి. కానీ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. కీలకమైన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి హోంశాఖ కార్యదర్శి అనురాధను ఇన్‌చార్జ్‌గా నియమించిన ప్రభుత్వం ఏడాదిన్నరకు పైగా అక్కడ ఐజీ పోస్టు భర్తీ చేయలేదు. అలాగే పీఅండ్ఎల్ విభాగం ఐజీ మధుసూదనరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఇన్‌చార్జ్ ఆర్గనైజేషన్స్ ఐజీ కుమార విశ్వజీత్‌కు అప్పగించారు.

సీపీ గౌతమ్ సవాంగ్‌ కు పదోన్నతి
అలాగే విజయవాడ కమిషనరేట్‌కు అడిషనల్‌ సీపీ పోస్టు ఏడాదిన్నరకు పైగా ఖాళీగా ఉంది. అడిషనల్‌ డీజీ ర్యాంక్‌ అధికారిని కమిషనర్‌గా నియమించింది. ఏడీజీగా ఉన్న సీపీ గౌతమ్ సవాంగ్‌ పదోన్నతి పొంది డీజీ ర్యాంక్ అధికారి అయినా ఆయనే విధుల్లో కొనసాగుతున్నారు. అటు అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు మాత్రం అడుగులు ముందుకు పడలేదు. దీంతో డీఐజీ స్థాయి అధికారి రమణ కుమార్‌ను విజయవాడ అదనపు జాయింట్ సీపీగా నియమించారు. అలాగే నాలుగు జిల్లాల గుంటూరు రేంజ్‌లో ఉన్న ఐజీ సంజయ్‌ని పోలీస్‌ ట్రైనింగ్‌కి బదిలీ చేసి అక్కడ డీఐజీ స్థాయి అధికారి వీవీ గోపాల్‌రావును ప్రభుత్వం నియమించింది. కోస్తా ఐజీ కుమార విశ్వజీత్‌ను ఆర్గనైజేషన్స్‌కు బదిలీ చేసినా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అలాగే ఏలూరు రేంజ్‌కు డీఐజీ లేరు. మెరైన్ పోలీస్ విభాగానికి ఐజీ పోస్టు కూడా అదే విధంగా అధికారుల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నాన్చుడి ధోరణిని అవలంబిస్తోంది. జూన్ చివరివారంలో ఎస్పీల బదిలీ ప్రక్రియ చేపట్టారు. అయితే ఆ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అలాగే చాలా విభాగాలకు స్టాఫ్ ఆఫీసర్స్ కొరత నెలకొంది. ఫోరెన్సిక్‌కు డైరెక్టర్ లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు గాంధీ ఆ విభాగాన్ని చూసుకుంటున్నారు. లీగల్ విభాగం ఐజీ దామోదర్‌కు అదనంగా హైవే సేఫ్టీ బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖకు కమిషనర్‌గా ఐజీ బాలసుబ్రహ్మణ్యంను నియమించారు.

ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి
సాధారణంగా సీనియర్‌ ఐపీఎస్‌ల అధికారుల బదిలీలు రెండేళ్లకోసారి లేదంటే పనితీరును బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ బదిలీల ప్రక్రియలో స్తబ్దత నెలకొనడంతో.. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కొందరు పోలీస్‌ అధికారులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా కేసులు పేరుకుపోతున్నాయి. కొందరు ఎస్‌ఐలు, సీఐలు ఠాణాల్లో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలుకూడా ఉన్నాయి.ఏదిఏమైనా ప్రభుత్వం వెంటనే ఐపీఎస్‌ల బదిలీలతో పాటు ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులను బదిలీల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

14:06 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ నిర్బంధమే నిదర్శనమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు అనుమతిలో నిర్వహిస్తున్న కొలువులకై కోట్లాట సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చివేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ ఆరోపించారు. 
 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రభుత్వం