ప్రభుత్వ పాఠశాలలు

18:29 - June 18, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మోది ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యాభివృద్ధి కోసం 33 కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చామని... అందరికి విద్య - నాణ్యమైన విద్య నినాదంతో ముందుకు సాగుతున్నామని మంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజనానికి ఏటా 17 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఏడాదిలో బాలికల కోసం 2 లక్షల మరుగుదొడ్లు నిర్మించామన్నారు. వచ్చే ఏడాది నుంచి 5, 8 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించినట్లు జవదేకర్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపికే ఎక్కువ స్థాయిలో విద్యాలయాలు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

07:29 - June 1, 2018

హైదరాబాద్ : యాభై రోజుల వేసవి సెలవుల తర్వాత తిరిగి స్కూళ్లు ఇవాళ పునః ప్రారంభం కాబోతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి 12 రోజుల ముందే స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. స్కూళ్లు మాత్రం అరకొర సౌకర్యాలతోనే విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం...ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమితో తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. స్కూళ్స్‌ రీ ఓపెనింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిపై ప్రత్యేక కథనం....
పాఠశాలలకు ముగిసిన వేసవి సెలవులు  
పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు తిరిగి పునః ప్రారంభం కాబోతున్నాయి.  అయితే గతానికి భిన్నంగా ఈసారి 12 రోజుల ముందే పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుండే పాఠశాలు ప్రారంభమవుతున్నాయి. నిన్నటి వరకు ఆడి పాడిన పిల్లలు ఇక నుండి బడి బాట పట్టనున్నారు.
అరకొర సౌకర్యాలతోనే పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరకొర సౌకర్యాలతోనే పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో సొంత భవనాలుంటే బెంచీలుండవు...బెంచీలుంటే బ్లాక్‌ బోర్డు ఉండదు. టాయిలెట్స్‌, తాగునీటి సౌకర్యం, మెయింటెనెన్స్‌ లాంటి వసతులు ఏమీ లేకుండానే పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే పాఠశాలల ప్రారంభానికి ఇంకా 12 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 
పైపై మెరుగులు
ఇక సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం పైపై మెరుగులు దిద్ది సరిపెట్టుకుంటోంది. పాఠశాలల్లో సరిపడా సిబ్బందిని కూడా నియమించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వం డిజిటల్‌ విద్యపై పెడుతోన్న దృష్టి మౌలిక సదుపాయాలు కల్పించడంపై పెట్టడంలేదన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం అన్ని పాఠశాలలను డిజిటల్‌ స్కూళ్లుగా మారుస్తామన్న ప్రభుత్వం చాలా పాఠశాలల్లో కనీసం కంప్యూటర్లు కూడా అమర్చలేకపోయింది.  
వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు 
ఇక ప్రైవేటు స్కూళ్ల విషయానికి వస్తే తల్లిదండ్రులకు ఫీజులుం మాత్రం తప్పడంలేదు. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు స్కూల్స్‌ దండుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలనే అభివృద్ధి చేస్తే ప్రైవేటును ఆశ్రయించాల్సిన అవసరంలేదంటున్నారు  నిపుణులు. ఇక విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు సిద్ధమయ్యాయి. ఈ సారి ముందుగానే వీటిని అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

 

21:59 - September 13, 2017

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రయోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు హాజరు పలికేటపుడు 'యస్‌ సార్‌, ప్రజెంట్‌ సార్‌' అని చెప్పడం సాధారణం. ఇక మీదట దీనికి బదులు 'జై హింద్‌ సర్‌' అని పలకాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠాశాలలో ఈ విధానం అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని మంత్రి సెలవిచ్చారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ స్కూళ్లకు పెద్దమొత్తంలో విరాళాలిచ్చే కంపెనీలు, వ్యక్తుల పేర్లు పెడతామని విద్యామంత్రి చెప్పారు. 

11:38 - December 20, 2016

హైదరబాద్ : డీఎస్సీ నియామకాలు ఎప్పుడు చేపడతారో తెలిపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రశ్నించారు. 23వేల తరగతి గదులు అదృశ్యమైనపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని ఆమె తెలిపారు. విద్యావవస్థను మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలిపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతిని గుర్తు చేశారు. దీనికి మంత్రి కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ పై చర్చించేందుకు సిద్ధంగా వుందన్నారు.  

19:49 - November 22, 2016

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. పాఠశాలల మూసివేత, స్కూళ్లలో  ఉపాధ్యాయులు నియామకాలపై పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...ఈ అంశాలపై ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:32 - October 29, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణకు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్‌ క్లాసులు ప్రారంభించబోతుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 1500 పాఠశాలలను ఎంపిక చేయబోతున్నారు. డిజిటల్‌ తరగతుల అమలులో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తోంది.

నవంబర్‌ 14 నుంచి 1500 స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు
ప్రభుత్వ పాఠశాలల సంస్కరణల్లో భాగంగా విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14న రాష్ట్రంలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన
రాష్ట్రంలో డిజిటల్‌ తరగతులు ప్రారంభించి.. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని కడియం అన్నారు. డిజిటల్‌ తరగతులు ప్రారంభించే పాఠశాలల వివరాలను జిల్లాలవారీగా తయారుచేయాలని, వసతులు, మరమ్మతులకు సంబంధించిన వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ తరగతులు నిర్వహించే పాఠశాలల్లోని టీచర్లకు అవసరమైన శిక్షణను నవంబర్‌ 10లోగా పూర్తి చేయాలన్నారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులను ఎన్ సీఈఆర్టీ రూపొందించిన సబ్జెక్ట్‌ కంటెంట్‌ను విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల ద్వారా బోధించనున్నారు. ఎంపిక చేసిన 1500 పాఠశాలల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, మన టీవీ ద్వారా డిజిటల్‌ తరగతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు కడియం తెలిపారు. మొత్తానికి మారుతున్న కాలానుగుణంగా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లలోనూ డిజిటల్‌ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. మరి డిజిటల్‌ తరగతుల అమలులో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చదిద్దాలనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యం ఎంతమేరకు సఫలీకృతమవుతుందో చూడాలి. 

12:40 - June 15, 2016

పశ్చిమగోదావరి : ప్రాథమిక విద్యకు పెద్డపీఠ వేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్ధులు భయపడుతున్నారు. ఏ క్షణాన భవనం కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి నిలపలేకపోతున్నారు. స్కూలుకెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. 
బడికి వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని చూసి విద్యార్థులు స్కూల్‌కు రావడానికి భయపడుతున్నారు. దీంతో పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. ఈ మండలంలోని 5 గ్రామాలలో 67 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 49 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాఠశాలకు వెళ్దామంటేనే భయపడే స్థితిలో విద్యార్థులు ఉన్నారు. 
రేకుల షెడ్డుల్లోనే పాఠశాలల నిర్వహణ
మండలంలోని వేంపాడు, గోపాలపురం, కొత్తపల్లి మొదలైన గ్రామాలలో చాలా పాఠశాలలు రేకులషెడ్‌లలోనే కొనసాగుతున్నాయి. వేసవి కాలం ఎండకు తట్టుకోలేక విద్యార్ధులు స్కూలుకు రావడం మానేశారు. మరికొన్ని పాఠశాలలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధులు వ్యవసాయ కూలీలుగాను మారుతున్నారు. 
ఫీజలు చెల్లించలేక అనేక ఇబ్బందులు 
ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా లేక, అటు ప్రైవేటు స్కూల్స్ కు ఫీజలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్కారు బడులను మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

19:33 - April 12, 2016

హైదరాబాద్ సర్కార్‌ స్కూళ్లపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. తెలంగాణలోని 390 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో మౌళికసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది.                                                           

398 స్కూళ్లలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాలేదు....

తెలంగాణలో 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాకపోవడంపై సుప్రీంకోర్టు న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేకుండా జీవించడంలాంటిదేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానిదేనని తేల్చి చెప్పింది.

ఒక్క ప్రవేశం కూడా ఎందుకు నమోదు కాలేదు ....

తెలంగాణ రాష్ట్రంలోని 390 పాఠశాలల్లో ఒక్క ప్రవేశం కూడా ఎందుకు నమోదు కాలేదో కోర్టుకు తెలియచేయాలని న్యాయమూర్తి అన్నారు. అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రంలో పర్యటించి... నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమికస్‌ క్యూరీ నేతృత్వంలోని కమిటీలో తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ న్యాయవాదిని కూడా ఓ సభ్యునిగా చేర్చుతూ తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది కోర్టు.

స్కూళ్లను మూసివేసే ఉద్దేశ్యం లేదు-టీ సర్కార్....

అయితే కేసు విచారణ సందర్భంగా పాఠశాలలను మూసివేసే ఉద్దేశ్యం తమకు లేదని తెలంగాణ తరఫు న్యాయవాది విశ్వనాథశెట్టి వాదనలు వినిపించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..జూన్ 30 కల్లా భర్తీ చేస్తామని కోర్టుకు తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా విభేదిస్తూ..తన గ్రామంలో ఒక్క పాఠశాల మూతపడలేదని వ్యాఖ్యానించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే విధంగా యంత్రాంగం ప్రోత్సహించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గ్రామాల్లోనూ పాఠశాలలు కచ్చితంగా ఉండాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

11:19 - January 23, 2016

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలలు ఎన్జీవో సంస్థల చేతికి వెళ్లనున్నాయా.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్రమక్రమంగా తప్పుకుంటుందా... ఏపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగంలో ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ఇటువంటి అనుమానాలనే కలిగిస్తున్నాయి..

మూసివేసి ప్రక్రియ మరింత వేగవంతం.....

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల మూసివేసి ప్రక్రియ మరింత వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే సక్సెస్‌ స్కూల్స్‌ పేరుతో పదిహేడు వందల స్కూళ్లను మూసివేసిన ఏపీ ప్రభుత్వం మరో మూడువేల ప్రాథమిక పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో మూసేసింది. తాజాగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జీవో సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలో ఉంది ఏపీ ప్రభుత్వం..

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ....

ఇటీవల లండన్‌లో జరిగిన వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొనటానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లారు. ఆయనతో పాటుగా ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ అధికారులు లండన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో స్కూళ్లను ఎన్జీవోలు అభివృద్ధి చేసిన విధానం ఆకర్షించింది.

ప్రభుత్వ పాఠశాలలను అప్పగించే ప్రతిపాదన తెర మీదకు....

దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్జీవో సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలను అప్పగించే ప్రతిపాదన తెర మీదకు తీసుకువస్తుంది. ఇదే గనుక జరిగితే ఇక సాధారణ విద్యను పూర్తిగా కొనుక్కునే పరిస్థితి కలుగుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - ప్రభుత్వ పాఠశాలలు