ప్రశాంత్ కిషోర్

19:12 - September 3, 2017

విజయవాడ : ప్రశాంత్‌ కిషోర్‌ను తమ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైఎస్‌ జగన్‌. గతంలో కిషోర్‌ ట్రాక్‌ రికార్డును చూసి పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలకు ప్రశాంత్‌ కిషోర్‌ను పరిచయం చేశారు జగన్‌. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మనకి దిశానిర్దేశం చేసి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ప్లీనరీలో చెప్పినట్టుగానే పార్టీలో కీలకమైన అభ్యర్థుల ఎంపికను కిషోర్‌కు అప్పగించారు జగన్‌. ప్లీనరీ అనంతరం రంగంలోకి దిగిన కిషోర్‌ ఎమ్మెల్యేల దగ్గరి నుండి ఇంఛార్జ్‌ల పనితీరును నియోజక వర్గాల వారీగా సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా వచ్చే ఎన్నికల్లో చాలా మందికి టికెట్స్‌ రావనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. అప్పటి నుండి కిషోర్‌పై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పుడు టికెట్‌ కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు కొందరు నేతలు. కిషోర్‌ వచ్చాక పార్టీలో సీనియర్‌ మాటలకు విలువ ఇవ్వడం లేదని సీనియర్‌ నేతలు వాదించారు. కీలక సమయాల్లోనూ జగన్‌ కిషోర్‌నే అనుసరిస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓటమికి కారణం కిషోరే
నంద్యాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం కిషోరే అన్న భావనలో ఉన్నారు పార్టీ నేతలు. నంద్యాల ప్రచారం, జగన్‌ ప్రసంగాలన్నీ కిషోర్‌ అధ్వర్యంలోనే జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయించింది కిషోరే అంటున్నారు పార్టీ నేతలు. లోకల్‌ ఎలక్షన్‌లో కూడా పార్టీ సీనియర్‌ నేతల మాటలు వినకుండా కిషోర్‌ వ్యవహరించారని నేతలంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల మైండ్ సెట్‌, దక్షిణాది ప్రజల మైండ్‌ సెట్‌కి చాలా తేడా ఉంటుందని ఈశాన్య రాష్ట్రాల వ్యూహాలు దక్షిణాదిలో పని చేయవనే వాదనలు పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషోర్‌ టీంలో ఉన్న సభ్యుల పట్ల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ఈ టీంలో ఉన్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ లాంటి పటిష్ఠమైన పార్టీని ఎదుర్కోవాలంటే సీనియర్ల సలహాలు పాటించాలని నేతలు సూచిస్తున్నారు. మొత్తానికి 2019 ఎలక్షన్స్‌కి నంద్యాల ఎలక్షన్స్‌ సెమీ ఫైనల్‌ అంటూ చేసిన ప్రయత్నం విఫలమవడంతో నేతలు నిరుత్సాహంలో ఉన్నారు. నంద్యాల ఓటమికి కిషోరే కారణమంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో అధినేత జగన్‌ ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారో చూడాలి. 

06:39 - August 12, 2017

విజయవాడ : ఏపీలో పొలిటికల్‌వార్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. సోషల్‌మీడియా వేదికగా అధికార, విపక్ష పార్టీలు హీట్‌ పెంచుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. వరుసగా పోస్టింగ్‌లతో అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజర్‌ ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగా నడుస్తున్న సోషల్‌ మీడియా వార్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా టెక్నాలజీలో తనకంటే ఘనులు లేరని చెప్పుకునే చంద్రబాబునే ఉక్కిరిబిక్కిరి చేసేలెవల్లో వైసీపీ అభిమానులు పోస్టింగులు పెడుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌ వ్యూహంలో భాగంగా సోషల్‌ మీడియాలో వార్‌ మొదలు పెట్టినట్టు సమాచరం. దీనికోసం స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగానే వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో ముందుండే చంద్రబాబును అదే టెక్నాలజీతో దెబ్బకొట్టాలన్న ప్లాన్‌ ను వైసీపీ చక్కగా అమలు చేస్తోంది.

జగన్ యాక్టివ్..
మరోవైపు జగన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్లతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాస్తవానికి జగన్‌ 2009నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా మారినా.. సోషల్‌ మీడియాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇదంతా ప్రశాంతకిషోర్‌ వ్యూహంలతో భాగంగానే జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

వేల సంఖ్యలో ఖాతాలు..
వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్లాన్‌లో భాగంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో ఖాతాలు ఓపెన్‌ చేశారు. అయితే ఆ అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతోనే ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ టీం మెంబర్లే ఇలా వైసీపీ కార్యకర్తల్లా పోస్టింగులు పెడుతున్నారని టీడీపీ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌ ఇవే పేర్లతో సోషల్‌మీడియాలో కామెంట్లుపెడుతూ తాము వ్యూహకర్తులుగా ఉన్న పార్టీలకు సహకరించినట్టు తెలుస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నడుస్తున్న వైసీపీ పొలిటికల్‌ ప్రచారం అంతా బూటకమని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. దీని వెనుక ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ ఉందంటున్నారు. టీడీపీని, చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతో ఉండటమే దీనికి రుజువు అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మాటల యుద్ధం రాజకీయ వేడిని పీక్‌స్టేజ్‌కి తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఈ టెక్నికల్‌ వార్‌ ఏపీ పొలిటిక్స్‌ను ఎటు తీసుకెళతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

12:32 - July 28, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ స్పీడ్‌ పెంచారు. పార్టీలో సర్వేలు.. ఇంటర్వూలు.. రివ్యూలు... అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, పార్టీ మఖ్యనేతలతో రాష్ట్ర్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. 
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దూకుడు పెంచారు. ఇప్పటికే నియోజకర్గాల పరిస్తితిపై ఓ సర్వే నిర్వహించడమే కాకుండా రెండు సార్లు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ  ఇంచార్జులకు ఇంటర్వూలు నిర్వహించారు. అంతేకాకుండా వారికున్న బలాబలాలపై ఓ అంచనాకు వచ్చారు. దీనిపై త్వరలోనే అధినేత జగన్‌కు ఓ నివేదిక కూడా ఇవ్వనున్నారు. అయితే ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, పార్టీ నేతలతో  విడివిడిగా సమావేశాలు నిర్వహించిన ఆయన..అందరితో కలిసి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం ఈనెల 31న ముహూర్తం నిర్ణయించారు. ఈ సమావేశంలో జగన్‌తో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకర్గ ఇంచార్జులు, నేతలు హాజరుకానున్నారు...
సర్వేలు, ఇంటర్వూలు, రివ్యూలతో బిజీ బిజీ
ప్రశాంత్ కిషోర్ తొలిసారి నిర్వహిస్తున్నఈ మీటింగ్‌లో పలు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లీనరిలో జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్లాలన్న అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే, ఎమ్మెల్యేలు, ఇంచార్జుల పనితీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది. పనితీరు సరిగాలేని వారు తమను తీర్చిదిద్దుకునేందుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు..
ఎమ్మెల్యేలు, ఇంచార్జుల పనితీరుపై ప్రధానంగా చర్చ!
పలువురు సిట్టింగ్‌ ఎమ్మెలకు టికెట్లు రావని.. నియోజకర్గాల మార్పు తథ్యమని వస్తున్న పుకార్లపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. మొత్తంగా ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. 

 

13:25 - May 19, 2017

గుంటూరు : ప్రశాంత్ కిషోర్.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ... 2014 ఎన్నికల్లో మోదీ విజయానికి కారణమైన ఈ పొలిటికల్‌ మైండ్.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో తన ట్రిక్స్ ప్లే చేయడానికి సిద్ధమైపోయారు.. వైసీపీ, ప్రశాంత్‌ కిశోర్ ను ఈమధ్యే వ్యూహకర్తగా నియమించుకుంది. వైసీపీ అధినాయకత్వం ఆయనతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్‌ నుంచి పని మొదలు పెట్టాల్సి ఉన్నా.. ముందస్తు ఎన్నికల ప్రచారం.. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ నెల రెండో వారం నుంచే తన పని మొదలు పెట్టారంటున్నారు... గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు.. రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రశాంత్ కిశోర్ అండ్ టీం పర్యటించినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రశాంత్ అండ్ టీం ప్రస్తుత ప్రభుత్వ పథకాల అమలు తీరు... ప్రజలు ...ప్రభుత్వంపై ఏఏ విషయాల్లో సంతృప్తిగా ఉన్నారు.. ఏఏ అంశాలపై వ్యతిరేకతతో ఉన్నారో తెలుసుకునే సర్వే చేపట్టినట్టు సమాచారం. అన్ని వర్గాల ప్రజల స్పందన కనుగోనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది... వైసీపీకి జిల్లాల్లో ఎంత బలం ఉందో అనే అంశాలు కాకుండా.. చంద్రబాబు పాలనపై, బీజేపీ పాలన, మోదీ చరిష్మా పై ప్రజల్లో స్పందన ఎలా ఉందో అన్న అంశాలపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ప్రజా స్పందన....
పాలనపై అన్ని జిల్లాల నుంచి ప్రజా స్పందన తీసుకున్న తర్వాత... కులాల వారీగా.. అవి ప్రభావితం చేస్తున్న జిల్లాలు.. కులాల్లో బలమైన నాయకులు.. బూత్ ల వారీగా విశ్లేషణను ప్రశాంత్ టీం చేపట్టనుందంటున్నారు.. దీనిలో భాగంగా కాపు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలు, మైనార్టీ వర్గాల్లో స్పందన .. ఎన్నికలపై ప్రభావం అనే అంశాలపై సర్వే నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత వైసీపీ కి గట్టి పట్టున్న ప్రాంతాలు... పట్టు లేని ప్రాంతాల్లో.. ఏం చేస్తే బలాన్ని పెంచుకోవచ్చు.. జగన్ వ్యకిగత ఇమేజ్, చరిష్మాను ఎలా పెంచడం అనే అంశాలపై దృష్టి పెడతారని చెబుతున్నారు.... ఈ తరహా సర్వేలు కంటిన్యూ గా చేసుకుంటూ ప్రతి నెలలో నాలుగోవారం మొత్తం కేవలం సమీక్షకే కేటాయించి... దాని బట్టి ప్రశాంత్‌ స్ట్రాటజీలో భాగంగా పొత్తులపై ప్రభావాన్ని ఎన్నికలకు ముందు మాత్రమే అంచనా వేస్తారు... కానీ బీజేపీతో చేతులు కలపడానికి తాము సిద్ధమనే సంకేతాలు జగన్ ఇచ్చిన సందర్భంలో ... వైసీపీ, బీజేపీ పొత్తుపై, వైసీపీ ఓటు బ్యాంకుతో పాటు, జనరల్‌ ఓటర్లలో ఎలాంటి ప్రభావం ఉందో కనుగోనే ప్రయత్నాన్ని టీం చేపట్టిదని తెలుస్తోంది.. 2014 ఎన్నికల్లో మోదీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది.. అలాగే బీహార్ లో నితీష్ కోసం కూడా ప్రశాంత్ వ్యూహాలు రచించారు.... అయితే మొన్నటి ఎన్నికల్లో పంజాబ్ తప్పిస్తే యూపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ కాంగ్రెస్ కు వర్కవుట్ కాలేదు.. ఈ దశలో వైసీపీ బలోపేతానికి ప్రశాంత్ స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

11:53 - April 30, 2017

గుంటూరు : రాజకీయ వ్యూహాలు రచించడం.. ప్రజలను ఆకట్టుకునేలా నేతల కార్యక్రమాలను రూపొందించడంలో పేరు పొందిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఇప్పుడు ఇతని పేరు ఏపీలో బాగా బలంగా వినిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా, సలహాదారుగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్ . 2014 ఎన్నికల్లో మోడీకి ప్రధాన ప్రచారకర్తగా.. ఆయన వేసిన ఎత్తులు, పైఎత్తులు బిజెపికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలకు నితీష్ కుమార్ బృందానికీ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు.. ఆ ఎన్నికల్లో నితీష్ టీం విజయం సాధించింది.. మొన్న మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహం పారకపోయినా.. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టడంలో ప్రశాంత్‌ వ్యూహమే ప్రధానమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అట్లాంటి ప్రశాంత్‌కిశోర్‌.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి
నిజానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ గడువు 2019 వరకూ ఉంది. కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలంటూ మోడీ లేవనెత్తిన అంశంపై నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ముందస్తు వచ్చే అవకాశం ఉందన్న భావనతో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టడం మొదలుపెట్టేసాయి. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్, ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడినట్లు సమాచారం. తాజాగా ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి 5రోజులు మకాం వేశారని చెబుతున్నారు. ఇక వచ్చే 5 నెలల్లో ఆయన టీం ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులు, జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుందట. అది పూర్తయ్యేవరకు తనను ఎవరూ సంప్రదించవద్దని నవంబర్ నుంచి తాను పార్టీకి టచ్ లోకి వస్తానని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం.

వైసీపీదే గెలుపని అంచనా వేశాయి
2014లో అన్ని సర్వే సంస్థలు వైసీపీదే గెలుపని అంచనా వేశాయి. కానీ జగన్ వ్యూహ లోపాలు.. చివరి నిమిషంలో చంద్రబాబు రాజకీయ చాణక్యత.. అటు పవన్ బీజేపీతో జతకట్టాలని తీసుకున్న నిర్ణయం వైసీపీ విజయావకాశాలపై నీళ్లు చల్లాయి. 2014 ఫలితాలు రిపీట్‌ కాకూడదని భావిస్తోన్న వైసీపీ అధినేత జగన్‌.. గెలిచేందుకు వీలున్న అన్ని అవకాశాలనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే, ఈసారి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో.. ఎన్నికలు ఎదుర్కోవాలని జగన్‌ భావిస్తున్నట్లు భోగట్టా. మరి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు.. తెలుగు రాష్ట్రంలో ఫలిస్తాయా..? జగన్ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయా? ఏమో కాలమే తేల్చి చెప్పాలి.

 

 

10:16 - April 25, 2017

అమరావతి : 2014 ఎన్నిక‌ల‌లో విజ‌యం త‌మ‌దేనని భావించి నిరాశపడిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. 2019 సాధారణ ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను గ్రామాల్లో, పట్టణాల్లో ప‌రుగులు పెట్టిస్తున్నారు. రాబోయే ఎన్నికలను డుఆర్‌డై మ్యాచ్‌గా భావిస్తున్నాజగన్‌... ప్రముఖ రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్రశాంత్ కిషోర్ సేవ‌ల‌ని ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణయించారు. దీనికోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్ లోని త‌న నివాసంలో ప్రశాంత్ కిషోర్‌తో జగన్‌ భేటీ అయ్యారు. జగన్‌ సరికొత్త పొలిటికల్‌ స్ట్రాటజీపై టెన్‌టీవీ ఫోకస్‌ .. look.

మోదీ, నితీశ్‌కుమార్‌లకు సలహాలు ఇచ్చిన ప్రశాంత్‌కిషోర్‌

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో నరేంద్రమోదీ ప్రచార బాధ్యత‌ల‌ను ప్రశాంత్ కిషోర్ చూసుకున్నారు. ఆ ఎన్నిక‌ల‌లో బీజేపీ తిరుగు లేని విజ‌యం సాధించింది. ఆ త‌రువాత అటు బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నితీష్ కుమార్ త‌రపున ప్రచార బాధ్యత‌లు నిర్వహించారు ప్రశాంత్‌. ఈనేపథ్యంలో ఈ పొలిటికల్‌ వ్యూహకర్త సేవ‌లను వ‌చ్చే ఎన్నికల్లో ఉప‌యోగించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్ నిర్ణయించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని వైసీపీ నేతలకు జగన్‌ సూచనలు

జగన్‌ కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ అండ్‌ టీమ్ ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇకనుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తారని వైసీపీ నేతలకు జగన్‌ చెప్పిట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగానే అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో బూత్‌స్థాయి క‌మిటిలు ఎర్పాటు చేసుకుని.. పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టిపెట్టాలని.. అవి పూర్తయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సూచనలు అందిస్తారని వైసీపీ లీడర్లకు జ‌గ‌న్ చెప్పిట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వహిస్తున్న జ‌గ‌న్ ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చిన్ని చిన్న త‌ప్పులకారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని .. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దన్న ముందస్తు ఆలోచనతోనే జగన్‌ ప్రశాంత్‌కిషోర్‌తో కాంటాక్ట్‌ అయ్యారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వంపై అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్‌ ...

టీడీపీ ప్రభుత్వంపై ఆసంతృప్తిగా వున్న వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సూచ‌న‌లు ఉప‌యోగప‌డ‌తాయ‌ని జ‌గ‌న్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నిక‌ల ప్రచారం ఎలా వుండాలి, ప్రజ‌ల‌ను ప్రసంగాల‌తో ఎలా ఆక‌ట్టుకోవాలి, ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ని ప్రజ‌ల‌కు ఆర్ధం ఆయ్యేలా ఎలా వివ‌రించాలి .. లాంటి విష‌యాల‌పై పార్టీ నేత‌ల‌తో పాటు, అధినేత జగన్‌కు కూడా స‌ల‌హాలు ఇవ్వడానికి ప్రశాంత్‌కిషోర్ అండ్‌ టీమ్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విశ్వశనీయ వర్గాల సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంతకిషోర్ ఇచ్చే సూచ‌న‌లు, సలహాలు ఏపీలో ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Don't Miss

Subscribe to RSS - ప్రశాంత్ కిషోర్