ప్రారంభం

17:47 - January 11, 2018

హైదరాబాద్ : ప్రియాంక చోప్రా నటిగా హాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే, నిర్మాతగా ప్రాంతీయ భాషల్లో సినిమాలను నిర్మిస్తూ నూతన ప్రతిభను ప్రోత్సహిస్తోంది. 2016లో నిర్మించిన 'వెంటిలేటర్‌' మరాఠి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అలాగే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలను దక్కించుకుంది. తాజాగా మరో మరాఠి చిత్రాన్ని సొంత సంస్థ పర్పుల్‌ పెబ్బుల్‌ పిక్చర్స్‌పై ప్రియాంక నిర్మిస్తోంది. 
'ఫైర్‌బ్రాండ్‌' టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా మంగళవారం నుంచి షూటింగ్‌ ప్రారంభించుకుంది. ఈ చిత్రానికి అరుణ్‌రాజె దర్శకత్వం వహిస్తున్నారు. 'మరాఠిలో ఈ ఏడాది మరో సినిమాతో విజయ పరంపరను కొనసాగించబోతున్నాం. 'ఫైర్‌బ్రాండ్‌' పేరుతో నూతన సినిమాను నిర్మిస్తున్నాం. అమేజింగ్‌ స్టోరీతో దర్శకుడు అరుణ్‌రాజె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌' అంటూ ప్రియాంక ట్వీట్‌ చేసింది. 

10:13 - January 10, 2018

యాదాద్రి భువనగిరి : కస్టమర్లకు స్వచ్చమైన పాలు అందించడమే లక్ష్యమన్నారు చరక అమృత్‌ సంస్థ మార్కెటింగ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఇందిరమ్మ కాలనీలో.. సహజ సిద్దమైన వాతావరణంలో దేశవాళీ ఆవులతో నిర్వహిస్తున్న డైరీని ప్రారంభించారు. స్వతహాగా కొంతమంది రైతులు కలిసి ఈ డైరీని ఏర్పాటు చేసినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆవుల మేతలో కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా... స్వతహాగా తామే పంటలు పండించి దాణా అందిస్తున్నామన్నారు నిర్వాహకుడు గోలి నరేందర్‌రెడ్డి. ఈ పాలను ప్రజలంతా కొనుగోలు చేసి తమకు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా చరక అమృత్‌ సంస్థ నిర్వాహకులు కోరారు. 

 

08:15 - January 9, 2018

హైదరాబాద్‌ : నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరంలో సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన ఈ సైన్స్‌ఫెయిర్‌ ఈనెల 12 వరకు కొనసాగనుంది.  ఇందులో మన రాష్ట్రంతోపాటు మరో 5 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. సైన్స్‌ ఫెయిర్‌ చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌ లో సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌... సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌కు వేదికైంది. సోమవారం సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌లో ఈ సైన్స్‌ ఫెయిర్‌ ఘనంగా మొదలైంది.  తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటకకు చెందిన పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొంటున్నారు. సౌత్‌ ఇండియా సైన్స్‌ఫెయిర్‌ను తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు.  ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కిషన్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
యువసైంటిస్టులను ప్రోత్సహిస్తాం  : కడియం 
విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత, ఆలోచనాశక్తిని వెలికి తీసేందుకు సైన్స్‌ఫెయిర్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యువసైంటిస్టులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత కృషి జరిపి యువశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.
సైన్స్‌ ఫెయిర్‌లో 300 ప్రదర్శనలు 
సైన్స్‌ ఫెయిర్‌లో ప్రతి రాష్ట్రం నుంచి 50 ప్రదర్శలను ఉంటాయి. అన్ని రాష్ట్రాలు కలిపి దాదాపు 300 ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో ప్రతి రాష్ట్రం నుంచి 15 గ్రూప్‌ ప్రదర్శనలు, 20 వ్యక్తిగత ప్రదర్శనలు, మరో 15 ఉపాధ్యాయ ప్రదర్శనలు ఉంటాయి. విద్యార్థులు ప్రదర్శిస్తోన్న అంశాలను చూసేందుకు హైదరాబాద్‌, దాని చుట్టూరా ఉన్న పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. మన దగ్గర శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉందని... ఈ కొరత పూడ్చాల్సిన బాధ్యత నేటియువతరం మీదనే ఉందని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అభిప్రాయపడ్డారు.
సైన్స్‌ ఎగ్జిబిషన్‌ 
వివిధ అంశాలపై విద్యార్థులు ప్రదర్శిస్తున్న సైన్స్‌ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆలోచింప చేస్తోంది. శాస్త్ర, సాంకేతి రంగాల్లో సాధించిన ప్రగతి వివరిస్తూ ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాయంత్రం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
 

 

07:38 - January 9, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన కాపర్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన చంద్రబాబు.. కాపర్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా... నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తామన్నారు చంద్రబాబు. 
కాంగ్రెస్‌ యాత్రపై చంద్రబాబు ఫైర్‌ 
కాంగ్రెస్‌ నేతల పోలవరం యాత్రపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో భాగంగా పోలవరం వచ్చిన చంద్రబాబు...  కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు చేస్తుందన్నారు.  కాంగ్రెస్‌, వైసీపీ నేతలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.   విభజన జరిగితే సమస్యలు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఆలోచించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన బాబు 
అంతకుముందు చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ముందుగా అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ ప్రారంభ పనులకు పూజలు నిర్వహించారు. స్పిల్‌వే, ఎగువ కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. అధికారంలోకి వచ్చినప్పుడు 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని... అందులో 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ఐదు ఫేజ్‌ల ద్వారా పూర్తి చేసి... రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సాధిస్తామన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన చంద్రబాబు... త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

07:28 - January 9, 2018

హైదరాబాద్ : బడ్జెట్‌ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఇందుకోసం శాఖలవారీగా ప్రతిపాదనలు కోరుతోంది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులపై ఆరా తీస్తోంది. 2018-19 బడ్జెట్‌ ప్రతిపాదనల సమర్పణకు ఈనెల 15ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. 
బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు ప్రారంభం
2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటి నుంచే బడ్జెట్‌ రూపకల్పనకు కసర్తతు ప్రారంభించింది.  ఇప్పటి వరకు  శాఖలవారీగా కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సమాచారం తీసుకుంటోంది. కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలను ఇవ్వాలని శాఖలను ఆదేశించింది. ఈనెల 15లోగా ప్రతిపాదనలు పంపాలని అన్నిశాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. ప్రతిశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగుల వివరాలను సీజీజీ పోర్టల్‌లో ఉంచామని.. వాటిని సరిచూసుకోవాలన్నారు. తేడాలేమైనా ఉంటే తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమచేస్తున్న బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ప్రతిశాఖ సమర్పించాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులపై సీఎస్‌ సమీక్ష
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులపై సీఎస్‌ సమీక్షించారు.  సబ్‌ప్లాన్‌ నిధుల వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక నిధులు పొందేలా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను ఆర్థికశాఖకు సమర్పించాలన్నారు. 15వ ఆర్థిక సంఘానికి సమర్పించాల్సిన నివేదిక, బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిధుల వ్యయంపై ప్రభుత్వం శాఖాధిపతులను సమాచారం కోరింది.  ఫిబ్రవరి 7లోగా వివరాలు సమర్పించాలని ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. 
ఆర్థికశాఖలో ప్రత్యేకటీమ్‌, నోడల్‌ అధికారి నియామకం
స్థానిక సంస్థలకు గ్రాంట్లు, ట్యాక్స్‌ రీవాల్యూయేషన్‌ వివరాలు, జిల్లాల వారీగా అభివృద్ధి, వివిధ అంశాలలో సాధించిన ప్రగతి, ఆదాయవ్యయాలు, పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. ఆర్థికశాఖలో ప్రత్యేక టీమ్‌, నోడల్‌ అధికారిని నియమించింది. కేంద్ర ఆర్థికసంఘం మొదటిసారిగా రాష్ట్రాల పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఇన్సెంటివ్‌ బేస్‌డ్‌ గ్రాంట్స్‌ ఇవ్వనుందని, ఇందుకోసం అన్నిఅంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందనని ఎస్పీ సింగ్‌ అన్నారు.  అందుకే అన్నిశాఖలు ప్రత్యేక నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
 


 

20:44 - January 8, 2018

అనంతపురం : పట్టణంలోని.. పాత ఊరులో.. యశోదమ్మ అనే దాత సాయంతో.. సీడీ ఆస్పత్రిలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన.. అమిలినేని వకీలు కొండప్ప కుమార్తె యశోదమ్మ.. 18 లక్షలు విరాళం ఇవ్వడంతో... సీడీ ఆస్పత్రిలో అసంపూర్ణంగా నిలిచిపోయిన భవనాన్ని నిర్మించడం జరిగింది.. ఈ మేరకు ఆ భవనాన్ని సోమవారం.. దాత యశోదమ్మ, కలెక్టర్‌ వీర పాండ్యన్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన యశోదమ్మను సత్కరించారు. ప్రతి ఒక్కరూ..  వారి జీవితంలో.. ఏదో ఒక మంచి పని చేయాలని.. యశోద సూచించారు. 

 

19:59 - January 7, 2018
17:42 - January 7, 2018

కర్నూలు : జిల్లాలో నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకు ప్రాణనాడిగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి..మావూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి... నదుల అనుసంధానం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌ నాటికి కొత్తగా 11 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పారు. 

 

19:27 - January 5, 2018

కృష్ణా : జిల్లాలోని తిరువూరులో.. ఫస్ట్‌ క్లాస్‌ అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. నూతన భవనాన్ని.. వినూత్న రీతిలో ప్రారంభించారు. హైదరాబాద్‌లోని .. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సందేశం అందగానే.. దానికి అనుసంధానించిన ఎలెక్ట్రానిక్‌ మోటార్.. శిలాఫలకంపై కప్పిన తెరను తొలగించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు, తమ ప్రొఫెసర్‌ల సహకారంతో రూపొందించారు. తొలిసారిగా ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలో కోర్టు భవనాన్ని ప్రారంభించిన జస్టిస్‌ సుబ్రహ్మణియన్‌.. ఈ విధానం ద్వారా, విలువైన సమయం, ధనం వృథా కాకుండా చూడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

 

17:49 - January 5, 2018

హైదరాబాద్ : అంధుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టనుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మలక్‌పేటలో అంధులకోసం నేషనల్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే ఇదే మొదటి పార్క్‌ అని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలోని ఆరు కార్పోరేషన్లలో పార్క్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మలక్‌ పేటలో అంధులకోసం నేషనల్‌ పార్క్‌ను ప్రారంభించడం ఏంతో సంతోషంగా ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్ధిన్‌ ఓవైసీ అన్నారు. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి మహేందర్‌ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి  హాజరయ్యారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రారంభం