ఫెర్రీ ఘాట్

07:56 - November 16, 2017

కృష్ణా : ఈనెల 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద దృశ్యాలను 10 టీవీ సంపాదించింది. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. బోటు బోల్తా పడిన ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 

14:31 - November 15, 2017

పశ్చిమగోదావరి : ఫెర్రీ సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం అనంతరం అధికారులు మేల్కొన్నారు. బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన అనంతరం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారనే విమర్శలున్నాయి.

బుధవారం ఉదయం పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణిస్తున్న బోట్లను అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాపికొండలకు వెళ్లే బోట్లను తహశీల్దార్ తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని బోట్లను తహశీల్దార్ చంద్రశేఖర్ నిలిపివేశారు. దేవీపట్నం మండలం అంగులూరు వద్ద ఈ తనిఖీలు చేశారు. మధ్యలో తనిఖీలు చేస్తుండడంపై పర్యాటకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణం కాకముందే తనిఖీలు చేయాలని..ఇలా చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే అధికారులు..మీడియా సిబ్బందిపై బోట్ల నిర్వాహకులు దాడికి యత్నించారు. బోటు యజమానులు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడం నిరసన వ్యక్తమౌతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు. దీనితో స్పందించిన రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణించే బోట్లు 90 దాక ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ అంచనా వేసిన అనంతరం అనుమతులివ్వాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. 

08:47 - November 15, 2017

కృష్ణా : విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీలో పడవ ప్రమాద ఘటనలో  ప్రభుత్వ శాఖల తప్పిదాలే ఎక్కువగా  కనబడుతున్నాయి. జలవనరుల శాఖతోపాటు టూరిజం శాఖల సమన్వయం లోపం కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జలవిహారం 22 మంది జలసమాధికి అయ్యారు.
బోటు ప్రమాదంతో విషాదం 
కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పవిత్రంగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ బోటు ప్రమాదంతో విషాదంగా మార్చింది. దీనిని భాదిత  కుటుంబాలతోపాటు ఇబ్రహీంపట్నంలోని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బోటు నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండలు 
కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో 22 ప్రాణాలు బలికావడానికి  సూత్రధారులైన వారిపై ఇంతవకు చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వీరికి ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలు ఉన్నాయని భావిస్తున్నారు.   ప్రమాదం అనుకోకుండా జరిగినప్పటికీ,  అనుమతిలేకుండా ప్రయాణికులను చేరవేస్తుంటే అధికారులు మిన్నకుండిపోవడం  చర్చనీయాంశంగా మారింది. బోటును నదిలోకి రానీయకుండా ఉంటే ప్రమాదం జరిగి ఉండేదికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ బోటు నదిలో విహరించడం,  దీని నిర్వాహకులు  కాసులకు కక్కుర్తి పర్యాటకుల ప్రాణాలతో చెలగాటానికి కారణమైంది. రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్   సంస్థపై  కంటితుడుపు చర్యలతో సరిపెట్టినా...  ప్రమాదానికి ఏ ప్రభుత్వ శాఖ  బాధ్యతవహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రభుత్వంలోని పెద్దలు తమపై వేటు పడుతుందన్న ఉద్దేశంతో ప్రమాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుదోవ పట్టించారని వినిపిస్తోంది.  
అనుమతిలేని బోట్లతో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ?
రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ అనుమతి లేకుండా కృష్ణా నదిలో బోటు నడపడం చూస్తుంటే..  పెద్ద ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ప్రమాదానికి కారణమైన బోటు అధికారులకు తెలియకుండానే తిరిగిందా .. అన్న సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అనుమతిలేని బోటుకు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  అధికారుల అవినీతితోనే కృష్ణానదిలో అనుమతి లేకుండా బోట్లు తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను  మంత్రివర్గం  నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు  డిమాండ్ చేస్తున్నారు.  అక్రమంగా తిరుగుతున్న బోట్లకు అడ్డుకట్టవేయడంలో విఫలమైన పర్యాటక, నీటిపారుదల శాఖ అధికారులను సస్పెండ్‌ చేయాలన్న డిమాండూ వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం   రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ నిర్వాహకులను ప్రమాదానికి భాద్యుల్ని చేస్తూ, ప్రభుత్వ అధికారులను తప్పించేందుకు ప్రయత్నిస్తోందన్న  విమర్శలు వస్తున్నాయి.      
విషాదానికి బాధ్యులెవరన్న విషయం బాబుకు తెలియదా..?  
పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రభుత్వ అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ప్రజలల్లో చర్చ జరుగుతోంది. ఇంతటి ఘోర విషాదానికి బాధ్యులెవరన్న విషయం చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పడవ ప్రమాదానికి కారణమైన నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందడంటున్నారు.

 

21:15 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని ఇవాళ రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. మరోవైపు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఏడేళ్ల అశ్విత మృతదేహాన్ని రెస్క్యూటీం వెలికితీసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫెర్రీఘాట్‌ బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని తెలిపారు. సరస్సుల్లో నడిపే బోటు కృష్ణానదిలో తిప్పడానికి అనుమతి లేదని చెప్పారు. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని కలెక్టర్‌ నివేదికలో తెలిపారు. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీనును సస్పెండ్‌ చేసింది. మరో 8 మందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పడవ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని అఖిలప్రియ వివరించారు. మరోవైపు విజయవాడ పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

10:09 - November 13, 2017

ప్రకాశం : ఒంగోలు మంగమూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురు లీలావతి మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. కూతురి మృతదేహం చూసి తల్లి లక్ష్మీకాంతం కుప్పకూలిపోయింది. పడవ ప్రమాదంలో లీలావతి మృతి చెందిన సంగతి తెలిసిందే.

కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.

 

 

06:32 - November 13, 2017

కృష్ణా : నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్‌తో విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చంద్రన్న బీమా పథకం వర్తించే వారికి మరో ఐదు లక్షలు ఇస్తారు. బీమా లేనివారికి ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలకు తోడు మరో మూడు లక్షలు కలిపి ఇస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

విజయవాడ ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించింది. బోల్తా పడ్డ పడవకు అనుమతిలేదిన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చించారు.

విజయవాడలోజరిగిన పడవ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  

Don't Miss

Subscribe to RSS - ఫెర్రీ ఘాట్