బందరు పోర్టు

07:22 - July 29, 2017

కృష్ణా : ఏపీలో మళ్లీ భూసేకరణ చిచ్చు రగులుతోంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న బాబు సర్కార్‌..అదే వ్యూహాన్ని బందర్‌ పోర్టు నిర్మాణానికి అమలు చేయాలని భావిస్తోంది. చాపకింద నీరులా భూసేకరణ ప్రకియను వేగవంతం చేస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ బందర్‌ పోర్టుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. 
భూసేకరణ ప్రక్రియ వేగవంతం 
బందరు పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సుమారు 5,300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఇక ప్రైవేట్ పట్టా భూముల సమీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం 2,282 ఎకరాల పట్టా భూములకు గాను.. ఇప్పటి వరకు 550 ఎకరాలు మాత్రమే ఇచ్చేందుకు రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్‌కు అంగీకార పత్రాలు ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు, వారి అనుచరుల పేరిట వందలాది ఎకరాల భూములున్నాయని.. వాటిని పోర్టుకు ఇవ్వకుండా రైతుల భూములను మాత్రమే తీసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
బందరు పోర్టు అభివృద్ధికి 33,177.78 ఎకరాలు 
బందరు నౌకాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 33177.78 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వీటిలో పోర్టు నిర్మాణానికి 5292.75 ఎకరాలు..ఇండస్ట్రియల్ కారిడార్, మెగాటౌన్ షిప్ కు సంబంధించి 27885.03 ఎకరాలు. వీటిలో ప్రైవేట్ భూములతో పాటు అసైన్డ్ భూములు ఉన్నాయి. పట్టా భూములు 14620.11 ఎకరాలు, అసైన్డ్ భూములు 9117.32 ఎకరాలు, ప్రభుత్వ భూములు 9440.35 ఎకరాలు ఉన్నాయి. పోర్టుకు సంబంధించి రైతుల వివరాలు సమగ్రంగా సేకరించి, వీరందరికీ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 
రైతులు ఆందోళన
ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. 25 నుంచి 30 ఎకరాల భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు 25 ఎకరాల భూమి ఇచ్చినా..1836 రెవెన్యూ చట్టం ప్రకారం మెట్ట భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి రెండున్నర ఎకరాలకు మించి ప్యాకేజీ ఇవ్వకూడదనే నిబంధన ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంపై ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బందర్‌ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ చేపడితే.. పోరాటం తప్పదని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. 

19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

19:58 - October 8, 2016

కృష్ణా : బందరు పోర్టుకు.. భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం.. అన్ని ఎత్తులూ వేస్తోంది. భూసమీకరణ గడువు ముగుస్తున్నా.. రైతులు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈమేరకు తీర్మానాలూ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నయాన్నో, భయాన్నో రైతులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఆ ప్రాంత నేతలు, అధికారులకు ఈ దిశగా సంకేతాలిచ్చారు.

భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో రైతుల తీర్మానాలు
బందరు పోర్టు భూసమీకరణకు ఈ ప్రాంత రైతులు ససేమిరా అంటున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే 28 గ్రామాల్లోని రైతులు భూములిచ్చేది లేదని తీర్మానాలు చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. రైతుల నుంచి వస్తోన్న వ్యతిరేకతతో ప్రభుత్వం అయోమయంలో పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. రైతుల అభ్యంతరాలను, వారి సమస్యలను తెలిపేందుకు ప్రభుత్వం నెలరోజుల వ్యవధి ఇచ్చింది.

చట్టప్రకారం సేకరించేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ
నిజానికి బందరు పోర్టుకు భూమిని చట్టప్రకారం సేకరించేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. రైతులకు ఇష్టం లేకుండా సెంటు భూమి కూడా సేకరించబోమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా హామీ ఇచ్చారు. అమరావతి ప్రాంతానికి తీసుకున్నట్లే సమీకరణ విధానంలో భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ-మడను ఏర్పాటు చేసింది. మడ పేరిట మళ్లీ భూ సమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

1.05 లక్షల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వ నిర్ణయం
బందరు పోర్టు కోసం 1.05 లక్షల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో 33 వేల ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టా, అసైన్డ్‌ భూములు పోను మిగిలిన రైతుల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ససేమిరా అంటున్న రైతులు ఫారమ్‌-2 ద్వారా తమ అభ్యంతరాలను అక్టోబర్‌ లోగా తెలపాలంటూ గడువు విధించింది. ఆ గడువు ఇంకా ముగియక ముందే.. భూముల కోసం గ్రామస్థాయి సమావేశాల నిర్వహణను ముమ్మరం చేసింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఇంకా గడువున్నా.. ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటు చేస్తుండడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. దీన్నిబట్టి బలవంతంగానైనా భూములు లాక్కోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు స్పష్టమవుతోందని స్థానిక రైతులు అనుమానిస్తున్నారు.

ప్రాణాలైనా ఇస్తాం గానీ..భూములివ్వం : రైతులు
రైతులు భూములిచ్చేలా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారితో సామరస్యంగా ఉండాలని చంద్రబాబు సూచన ప్రాయంగా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రైతులు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం సహకరించాలని, పోర్టు వస్తే పరిశ్రమలు వస్తాయని, దీంతో ఉద్యోగావకాశాలు వస్తాయని.. సీఎం పదేపదే చెప్పుకొస్తున్నారు. అయితే.. పోర్టు కోసం వేల ఎకరాలు అవసరమా అన్నది రైతుల ప్రశ్న. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకుంటానంటే చూస్తూ ఊరుకోబోమని రైతులు హెచ్చరిస్తున్నారు.

అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మిస్తే మంచిదంటున్న రైతులు 
ఏదేమైనా..ప్రభుత్వం రైతుల సమస్యలను, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని బందరు పోర్టును అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మిస్తే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

12:01 - September 4, 2016

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూ సమీకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 28 రెవెన్యూ గ్రామాల్లో ఈ భూమిని సమీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్డీవో కార్యాలయ సిబ్బంది భూ సమీకరణపై దృష్టిసారించారు.  
మరో ఏడాది నోటిఫికేషన్ గడువు పొడిగింపు 
బందరు పోర్టు భూ సేకరణ నోటిఫికేషన్ గడువు 2016 ఆగస్టు 29వ తేదీతో ముగియడంతో మరో ఏడాది నోటిఫికేషన్ గడువును పొడిగించారు. మరోవైపు మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ -ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎంఏడీఏ పరిధిలో 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 14 వేల ఎకరాలకుపైగా ప్రైవేట్ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సైతం సమీకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఉన్న మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282.20 ఎకరాల ప్రైవేట్ భూమిని సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేట్ భూమి పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉంటే దానిని సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన 22 గ్రామాల పరిధిలోని ప్రైవేట్, అసైన్డ్ భూమి 27 వేల ఎకరాల వరకు సమీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది.  
తొలుత బందరు పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల్లో భూ సమీకరణ 
తొలుత బందరు పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల్లో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు భావించారు. పోర్టు నిర్మాణం కోసం 4,800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూమి 2,300 ఎకరాలు ఉంది. పోర్టు నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ఒకే విడతలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎంత భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారనేది గోప్యంగానే ఉంచుతున్నారు. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయితే రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తుంది. ఈ ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత ఎంత మంది రైతులు తమ అంగీకార పత్రాలను ఇస్తారనేదానిపై భూసమీకరణ ఆధారపడి ఉంటుంది. తమ భూముల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆక్షేపణీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
భూములను వదులుకునేందుకు సుముఖంగా లేని రైతులు  
అటు రైతులు మాత్రం తమకు జీవనాధారమైన భూములను వదులుకునేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. పచ్చని పంటలు పండించే భూముల్ని ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పోర్టు కడితే బంజరు భూముల్లో కట్టాలని సూచిస్తున్నారు. 
పంట పొలాలను తీసుకునే ప్రయత్నం మానుకోవాలి : రైతులు 
భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ అయితే పరిస్థితులు ఎలా మారుతాయే భవిష్యత్‌ నిర్ణయించాలి. ఓవైపు రైతులు భూములిచ్చేది లేదంటుంటే.. మరోవైపు ప్రభుత్వం భూ సమీకరణకు సన్నద్ధమవుతోంది. అన్నదాతల ఆక్రందనను అర్ధం చేసుకుని ప్రభుత్వం పచ్చని పంట పొలాలను తీసుకునే ప్రయత్నం మానుకోవాలని బందర్‌ పోర్టు సంబంధిత రైతులు కోరుతున్నారు. 

 

12:14 - July 16, 2016

కృష్ణా : బందరు అట్టుడుకుతోంది. పోర్టు పేరిట లక్ష ఎకరాల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రతో ప్రజలు ఊగిపోతున్నారు. పోర్టుకు రెండు వేల ఎకరాలు చాలవా అన్న నోటితోనే.. ఇప్పుడు లక్ష ఎకరాలు కావాలంటుండడం... రైతులోకాన్ని రగిలిస్తోంది. ఇంతకాలం భూ సేకరణ అన్న ప్రభుత్వం.. ఇప్పుడు రాజధాని అమరావతి మాడ్యూల్‌లో భూ సమీకరణ చేస్తామంటోంది. ఈ ప్రకటన ప్రజల కలవరాన్ని రోజురోజుకీ పెంచుతోంది. 
బందరు పోర్టు కోసం లక్షా ఐదువేల ఎకరాల భూ సేకరణ 
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతం అట్టుడుకుతోంది. ప్రతి ఒక్కరిలోనూ తమ భూమి తమకు కాకుండా పోతుందేమోనన్న వేదన కుదిపేస్తోంది. బందరు పోర్టు కోసం లక్షా ఐదువేల ఎకరాల భూమిని సమీకరిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన స్థానికులకు పిడుగుపాటే అయింది. బందరు పోర్టు కోసం 5,324 ఎకరాలు, ఇండస్ట్రియల్ కారిడార్ కు 23,948 ఎకరాలు, ఇండస్ట్రియల్ పార్క్ కు 929 ఎకరాలు, మెగా సిటీల ఏర్పాటుకు 14 వేల ఎకరాలు కలిపి మొత్తం 43,969 ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూములు సేకరించేందుకు కొత్తగా మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ మడను తెరపైకి తెచ్చింది. ఇంతకీ ఈ మడ ఏం చేస్తుంది..?
జీవో నెంబర్ 15 జారీ 
మచిలీపట్నం మున్సిపాల్టీతో పాటు 28 రెవెన్యూ గ్రామాలను మడ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 15ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ప్రభుత్వం రైతుల ఆమోదంతో నిమిత్తం లేకుండానే వారి భూములను లాక్కునే వీలు కలుగుతుంది. లక్ష ఎకరాలను సమీకరించేందుకు గాను.. ప్రభుత్వం మడ పరిధిని.. 426.16 చదరపు కిలోమీటర్లకు ఫిక్స్‌ చేసింది. ఈ విస్తీర్ణంలో.. మొత్తం లక్షా 5 వేల ఎకరాలను రైతుల ఆమోదంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. బందరు పోర్టు, దాని పరిసరాల్లో నిర్మించే పోర్టు ఆధారిత పరిశ్రమల కోసమే ఈ భూసేకరణ అని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ ప్రాంతంలోని భూములన్నీ మెట్ట భూములేనని బుకాయిస్తోంది. 
గ్రౌండ్‌ రిపోర్ట్‌..
ప్రభుత్వం చెబుతున్నట్లుగా మడ పరిధిలోకి వచ్చే పొలాలు నిజంగానే మెట్ట భూములా..? అక్కడ పంటలే పండవా..? మడ పరిధిలోకి వచ్చే గ్రామాల పొలాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఎంత పచ్చిగా అబద్ధం చెబుతుందో అర్థమవుతుంది.  గ్రామపు భూముల గురించి.. అక్కడి రైతుల వేదన గురించి టెన్ టివి గ్రౌండ్‌ రిపోర్ట్‌ అందించింది. ఆ వివరాలు వీడియాలో చూద్దాం.. 
సర్కారు నిర్ణయం వెనుక కుట్ర ఏంటి..?
బంగారు పండే భూముల్ని.. మెట్ట భూములని ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?విపక్షంలో ఉండగా రెండు వేల ఎకరాలు చాలన్న టీడీపీ.. ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలు లాక్కోవాలని ఎందుకు అనుకుంటోంది? నిజానికి బందరు పోర్టుకు ఎంత భూమి అయితే సరిపోతుంది..? సర్కారు నిర్ణయం వెనుక కుట్ర ఏంటి..?
టీడీపీ తడవకొక్క మాట 
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూ సేకరణపై తెలుగుదేశం పార్టీ తడవకొక్క మాట చెబుతోంది. వైఎస్‌ సర్కారు పోర్టు కోసం ఐదున్నర వేల ఎకరాలు సేకరిస్తామంటే.. అప్పటి విపక్ష హోదాలో.. కేవలం రెండువేల ఎకరాలు సరిపోతుందని టీడీపీ వాదించింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే.. మాట మార్చేసింది. వేలు కాదు.. లక్ష ఎకరాలే కావాలంటోంది. 
తెరపైకి పోర్టు అంశం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే.. పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చింది. పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం అప్పట్లో పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి.. రైతుల నుంచి మరో 20వేల ఎకరాల భూముల్ని సమీకరిస్తామని ప్రకటించింది. దీనికోసం నిరుడు ఆగస్టు 31న.. చీకటి నోటిఫికేషన్‌ను వెలువరించింది. అప్పట్లోనే ప్రభుత్వ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
ప్రభుత్వ నోటిఫికేషన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం 
ప్రభుత్వ నోటిఫికేషన్‌పై బందరు పరిసరాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి సర్వేల పేరిట వచ్చే అధికారులను రైతులు అడ్డుకున్నారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.  ప్రభుత్వ భూముల్లోనే పోర్టు నిర్మించాలని స్పష్టం చేశారు. జీవనాధారం కోల్పోతే తమకు చావే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. 
నిరసన జ్వాలలతో..కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం 
ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన జ్వాలలతో.. ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.  భూ సేకరణ ప్రక్రియను వాయిదా వేసింది. అయితే అది తాత్కాలికమేనని.. సర్కారు భూదాహం మరింత పెరిగిందని తాజా క్యాబినెట్‌ తీర్మానంతో వెల్లడైంది. పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసమంటూ.. కొత్తగా మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ మడను ఏర్పాటు చేసింది. అంతేనా భూసేకరణ కాకుండా.. అమరావతి తరహాలో లక్ష ఎకరాలూ భూ సమీకరణ ద్వారానే తీసుకుంటామని ప్రకటించింది. 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపిస్తోందన్న భావన
ప్రభుత్వ చర్య.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక్కడి పేదల పొట్ట కొట్టి.. విదేశీ పెద్దలకు కట్టబెట్టేందుకే ఈ సమీకరణ అన్న భావన ప్రజల్లో స్థిరపడుతోంది. పైగా దేశంలోని ఏ పోర్టు కూడా రెండు వేల ఎకరాలకు మించి లేదు. అలాంటప్పుడు.. ప్రభుత్వం ఇక్కడ లక్ష ఎకరాలకు పైగా ఎందుకు సేకరిస్తోందన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. 
దేశంలోని వివిధ పోర్టుల విస్తీర్ణం వివరాలు
దేశంలోని వివిధ పోర్టుల విస్తీర్ణం వివరాలివి. ఏ పోర్టు కూడా మూడు వేల ఎకరాలను మించి లేదు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం బందరు పోర్టు కోసం లక్షకు పైగా ఎకరాలను సేకరించాలని భావిస్తోంది.. దీని వెనుక కుట్ర తేటతెల్లం.     
ఏపీలోని ఇతర పోర్టుల లావాదేవీలు ఎలా ఉన్నాయి..?
దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనేక పోర్టులు ఉన్నాయి. ప్రధాన పోర్టులైన విశాఖ, కాకినాడల నుంచి తప్ప మిగతా చోట్ల ఆపరేషన్స్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వైఎస్ హయాంలో ఐరన్ ఓర్ చైనా తదితర దేశాలకు రవాణా అయ్యేది. దీని వల్ల కొంత యాక్టివిటీ ఉండేది. ప్రస్తుతం కాకినాడ పోర్టు నుంచి ఎరువులు, కళింగపట్నం నుంచి గ్రానైట్ ఎగుమతి అవుతుండగా, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు  పోర్టుల్లో  పెద్దగా కార్యకలాపాలు లేవంటున్నారు. ఓ మోస్తరు పోర్టుల పరిస్థితే ఇలా ఉంటే.. కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపూర్, నిజాంపట్నం, వాడరేవు, ముత్యాలమ్మపాలెం, నక్కపల్లి, మేఘవరం పోర్టులు ఎలా మనుగడ సాగిస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాంటప్పుడు ప్రభుత్వం లక్ష ఎకరాలు సమీకరించి.. బందరు పోర్టు.. ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామనడం.. ఎంతవరకు వయబుల్‌ అన్న సందేహం వ్యక్తమవుతోంది.  
స్థానికులు మండిపాటు... 
లక్ష ఎకరాలు సమీకరిస్తామంటున్న ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో అన్నీ మెట్ట భూములే అంటూ చేస్తున్న ప్రచారంపై స్థానికులు మండిపడుతున్నారు. రైతు కుటుంబంలో పెద్దకొడుకును అవుతానన్న చంద్రబాబు.. పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుంచి 10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ను వీడియోలో చూద్దాం..
బందరు రైతు రగిలి పోతున్నాడు... 
బందరు రైతు రగిలి పోతున్నాడు. లక్ష ఎకరాల భూమిని లాక్కునేందుకు సర్కారు చేస్తున్న కుట్రలపై మండిపడుతున్నాడు. ఇరుగు పొరుగును సమీకరించుకుంటూ సంఘటితమవుతున్నాడు. దూకుడు మీదున్న సర్కారుకు ముకుతాడు వేసేందుకు.. మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాడు. 
ఏడాదికి మూడు పంటలు సాగయ్యే భూములే 
బందరు పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో.. ఏడాదికి మూడు పంటలు సాగయ్యే భూములే ఉన్నాయి. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు వంటివి ఎక్కువగా పండిస్తున్నారు. తమ దిగుబడులను రైతులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఏటా పుష్కలంగానే సంపాదించుకుంటున్నారు. అయితే వీటన్నింటినీ మెట్ట భూములని ప్రభుత్వం ప్రచారం చేయడాన్ని రైతులు, జిల్లా నేతలూ ఆక్షేపిస్తున్నారు. 
రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం :  భూ పరిరక్షణ పోరాట సమితి 
పోర్టు పేరిట బలవంతపు భూ సమీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వంపై.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మించేందుకు భూ పరిరక్షణ పోరాట సమితి సన్నద్ధమవుతోంది. దీనికి వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌లు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ భూముల్లోనే పోర్టులు నిర్మించాలని తెగేసి చెబుతోంది. పార్టీలకు అతీతంగా స్థానిక గ్రామస్థాయి నాయకులంతా రైతులను సమీకరిస్తూ.. భూ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమానికి.. మద్దతు ప్రకటిస్తున్నారు. 
ఉద్యమ సెగతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..?     
మొత్తానికి పోర్టు కోసం లక్ష ఎకరాలు సమీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బందరు అట్టుడుకుతోంది. పాలక పక్షం నాయకులను గ్రామాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతోన్న ఆందోళన.. ఉద్యమ సెగతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..? లేక మొండిగా ముందుకే వెళుతుందా..? వేచి చూడాలి.

12:46 - November 21, 2015

విజయవాడ : బందర్ పోర్టు నిర్మాణం ఆందోళనలో బీజేపీ పాల్గొంటోంది. ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు పలు విమర్శలు గుప్పించారు. పోర్టు పేరు చెప్పి రైతుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్మాణంపై గ్రామస్తులు..పలు పార్టీల నేతలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈసందర్భంగా ఆ పార్టీ నేత టెన్ టివితో మాట్లాడారు. 30వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నాలుగు వేల ఎకరాలు రాజశేఖరరెడ్డి హాయాంలో, 5200 ఎకరాలు కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో సేకరించడం జరిగిందన్నారు. పోర్టు రావాలని, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. దీనికి సంబంధించిన శిలాఫలకం వేశారని గుర్తు చేశారు. 22 గ్రామాలకు అధికారులు నొటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. పోర్టు కట్టకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు అంటూ నాటకాలడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకున్న భూముల్లో పరిశ్రమలు ఎందుకు కట్టుకోవడం లేదని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆ భూములన్నీ వివాదాస్పదంగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిపారు. గ్రామాల్లో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - బందరు పోర్టు