బంద్‌

12:21 - June 29, 2018

కడప : జిల్లాలోని జమ్మలమడుగులో అఖిలపక్షాల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. సి.పి.ఐ, సిపిఎం  వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పాల్గొంటున్నారు. స్థానిక  ఆర్టీసీ బస్టాండ్ వద్ద  బస్సులను అడ్డుకున్నారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బందులో పాల్గొంటున్నారు. పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. ఈ సందర్భంగా  కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు అన్నారు. 

 

18:28 - June 8, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావు పేట మండల వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ ద్వారం, రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో... నూతనంగా ఏర్పడబోయే హైవే కారణంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మారడంతో పాటు.... అశ్వరావు పేట కనుమరుగయ్యే అవకాశం ఉంది. దీంతో తమ గ్రామాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ గ్రామ ప్రజలు నాలుగు రోజుల నుండి ఉద్యమం ప్రారంభించారు. జాతీయ రహదారి అశ్వారావు పేట మీదుగా రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. 

 

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

18:12 - April 16, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా కోరుతూ తలపెట్టిన బంద్‌ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, పలు ప్రజాసంఘాలు బంద్ పాటించి  వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నాయి. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే  పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

17:36 - April 16, 2018

తూ.గో : ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. హోదా కోసం చేపట్టిన బంద్‌ను కాకినాడలో కొనసాగుతోంది. వామపక్షాలు, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని విపక్షాల డిమాండ్‌ చేశాయి. బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

17:00 - April 16, 2018

ప్రకాశం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్‌ ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు  స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలో జరగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

16:56 - April 16, 2018

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో ఏపీ బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాలు, జనసేన, వైసీపీ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేస్తున్నారు. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:59 - March 31, 2018

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అట్రాసిటీ చట్టంలోని నిబంధనలను సవరించడం సరికాదన్నారు. విజయవాడలోని అంబేద్కర్ భవన్‌లో దళిత, గిరిజన ప్రజాసంఘాల నేతలు ఐక్యవేదికగా ఏర్పాటై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

 

06:56 - February 9, 2018

విజయవాడ : రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై.. ప్రజా దండు కదిలింది. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలతో... ఏపీ దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ వామపక్షాలు చేపట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. దీంతో ఏపీలో బంద్‌ విజయవంతమైంది. 
వామపక్షాల బంద్‌  
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కదంతొక్కారు..! ఏపీకి జరిగిన అన్యాయంపై.. ఒక్కటిగా కదిలారు..! రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఆందోళనకు దిగారు..! వామపక్షాల బంద్‌ పిలుపుకు వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో బంద్‌ విజయవంతమైంది. 
ఉత్తరాంధ్రలో 
ఉత్తరాంధ్రలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.  విశాఖపట్నంలో  స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. బస్సుల రాకపోలు నిలిచిపోయాయి. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా బంద్‌లో పాల్గొని.. ధర్నాలు చేపట్టారు. జాతీయ రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. ఆంధ్ర యువత బీచ్‌రోడ్డులోని భగత్‌సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. విజయనగరం జిల్లాలోనూ.. సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీలతో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్‌ల రాకపోకలను అడ్డుకున్నారు. ఎస్ ఎఫ్ఐ నాయకులు పట్టణంలోని.. పాఠశాలలను, కళాశాలలను మూసివేయించారు. 
శ్రీకాకుళం జిల్లాలో 
అటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు.. ధర్నాలు చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. ఐదు ఆర్టీసీ డిపోల వద్ద సుమారు 350 బస్సులు నిలిచిపోయాయి. 
ఉభయ గోదావరి జిల్లాల్లో 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ  బంద్‌ ప్రశాంతంగా సాగింది. సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు  ఆందోళనలు చేపట్టారు.  సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని  శ్యామలా సెంటర్ నుంచి కోటిపల్లి  బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి..  మానవహారం చేశారు. తుని ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సీపీఐ, వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురంలోనూ.. ఆయా పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. అనపర్తిలో ఎమ్మెల్యే  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు.  అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రశాంతంగా బంద్‌ కొనసాగింది. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
పశ్చిమగోదావరి జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఏలూరులో ఆర్టీసీ బస్సులు డిపోలకే  పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.  షాపులన్నీ మూతపడ్డాయి.  పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. 
కృష్ణా జిల్లాలో  
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమల కోసం... కృష్ణా జిల్లాలోనూ బంద్‌ కొనసాగింది.  విజయవాడలో సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు  ఒకే తాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
గుంటూరులో 
గుంటూరు నగరంలోని బస్టాండ్ వద్ద నుంచి శంకర్ విలాస్ వరకు వామపక్షాల  నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  శంకర్ విలాస్ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. నరసరావుపేటో వైసీపీ ఆధ్వర్యంలో  బంద్‌ నిర్వహించగా.. రేపల్లెలో సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. అదే విధంగా.. ఏపీ రాజధాని  అమరావతిలోనూ వామపక్షాల బంద్‌ విజయవంతంగా సాగింది.  స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు మూతబడ్డాయి. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వామపక్షాల నేతలు రోడ్డుపై ర్యాలీతో పాటు.. ధర్నా చేపట్టారు. కాగా బంద్‌ ప్రభావం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడే సచివాలయం సందర్శకులు లేక వెలవెలబోయింది. పలు జిల్లాల్లో బంద్‌లో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

12:12 - February 8, 2018

హైదరాబాద్ : ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. వామపక్షాల బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్‌, జనసేన మద్దతిచ్చాయి. బంద్‌ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అన్ని పక్షాలు నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే భవిష్యత్‌లోఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో జగన్‌ ఈరోజు పాదయాత్రకు వాయిదా వేసుకున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - బంద్‌