బల్దియా

13:09 - August 20, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. ఆక్రమణల తొలగింపులతో రికార్డ్‌ సృష్టించింది. గడిచిన ఆరు వారాలుగా పదివేలకు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పాదచారులకు రైట్‌ టు వాక్‌ కల్పించడమే తమ లక్ష్యం అంటోంది బల్దియా. కొన్నేళ్ళుగా ఆక్రమణలతో నిండిపోయిన ఫుట్‌పాత్‌లను క్లియర్‌ చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.ఈ మేరకు కార్పొరేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగాలు రికార్డ్‌ స్థాయిలో పదివేల ఆక్రమణలను తొలగించాయి. దేశంలో ఎక్కడా ఇంత భారీగా ఆక్రమణలు తొలగించలేదని బల్దియా అంటోంది.

శనివారం చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో 412 ఆక్రమణలను తొలగించింది జీహెచ్‌ఎంసీ టీమ్‌. ఖైరతాబాద్‌ క్రాస్ రోడ్‌ నుంచి పంజాగుట్ట క్రాస్‌ రోడ్‌ వరకూ, పంజాగుట్ట క్రాస్‌ రోడ్‌ నుంచి ఎస్సార్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ వరకూ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. ఖైరతాబాద్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ వరకూ 71 శాశ్వత అక్రమ నిర్మాణాలు, 65 తాత్కాలిక ఆక్రమణలను, 18 మూవబుల్‌ అక్రమ నిర్మాణాలను తొలగించారు. మొదటి డ్రైవ్‌లో 4,669, ఆ తర్వాత ప్రతి వారం వెయ్యి నుంచి 1500 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బడాబాబుల ఆక్రమణలతోపాటు.. ప్రభుత్వ ఏజెన్సీల డబ్బాలను సైతం తొలగించింది బల్దియా. 

07:15 - July 19, 2018

హైదరాబాద్ : నగరవాసులకు హోర్డింగ్‌ల గండం తప్పేలా లేదు. ప్రధాన రోడ్లలో ఉన్న హోర్డింగ్‌లు ఎప్పుడు పడిపోతాయో అర్ధం కావడం లేదు. బల్డియా ఆదేశాలను హోర్డింగ్ యాజమానులు లెక్క చేయడం లేదా?.. లేకా అధికారుల తీరులో మార్పు రావడం లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. భారీ ఈదురు గాలులు.. వర్షాల నేపథ్యంలో బల్డియా నెల రోజులపాటు హోర్డింగ్స్ ను బ్యాన్ చేశారు. కాని సిటీలో ఎక్కడ చూసిన భారీ హోర్డింగ్‌లే దర్శనమిస్తున్నాయి. దీంతో రోడ్డుపై ఎప్పుడు ఏ హోర్డింగ్ మీద పడుతుందోనన్న భయంలో ఉన్నారు నగర ప్రజలు.

భారీ ఈదురు గాలులకు,వర్షాలకు రోడ్లపై కూలుతున్న హోర్డింగ్స్‌
హైదరాబాద్‌ మహానగరంలో గాలీ వాన వచ్చిందంటే చాలు నగరవాసులు హడలిపోతున్నారు. గత కొన్నేళ్లుగా సిటీలో కురుస్తున్న వర్షాలు నగరవాసులకు దడ పుట్టిస్తున్నాయి. దీంతో వర్షం వచ్చిందంటే చాలు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తోందోనన్న భయం పట్టుకుంది . భారీ ఈదురు గాలులు,వర్షాలకు నగరంలోని చెట్లు,.. హోర్డింగ్‌లు కూలుతున్నాయి. వర్షం వచ్చిదంటే చాలు వాహనాలపై చెట్లు, హోర్డింగ్ కూలడం సర్వసాధారణం అయ్యింది. గాలీ వీస్తే చాలు హోర్డింగ్స్‌, ఆర్చులు వంగుతున్నాయి. హోర్డింగ్స్‌ నుంచి ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్లపై , విద్యుత్ వైర్లపై పడుతున్నాయి. దీంతో రోడ్లపై ఏ హోర్డింగ్ ఎప్పుడు మీద పడుతుందోనన్న భయం నగరవాసులను వెంటాడుతోంది.
గ్రేటర్ పరిధిలో 2,651 హోర్డింగ్స్ కు అనుమతులు
గ్రేటర్ పరిధిలో దాదాపు 2,651 హోర్డింగ్ కు అనుమతులు ఉన్నాయి. అక్రమంగా ఏర్పాటు చేసిన 333 హోర్డింగ్స్‌ ను తొలిగించామని బల్దియా అధికారులు చెబుతున్నారు. అయితే సిటీలో అనుమతులు పొందిన హోర్డింగ్ లు ప్రతిఏటా స్ట్రక్చరల్ స్టెబిలిటి ధృవ ప్రతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని చాలా హోర్డింగ్స్‌ యాజమానులు ఇప్పటికీ నిర్మాణ పటుత్వ ధృవప్రతాలు బల్డియాకు సమర్పించలేదు. దీంతో నగరంలో భారీ గాలి, వర్షం వస్తే ఎన్ని హోర్డింగ్ లు కూలుతాయో.. ఎన్నింటి వల్ల ప్రమాదం పొంచి ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఈ నెల 13 నుండి ఆగష్టు 14 వరకు హోర్డింగ్ లు, ఆర్చులపై ఫ్లెక్సీలు నిషేధం
వర్షాల కారణంగా గత వారం సిటీలో అన్ని రకాల హోర్డింగ్ లను నిషేధిస్తున్నాట్లు బల్దియా ప్రకటించింది. దీంతో హోర్డింగ్, యూనిపోల్స్, ఆర్చులు, అబ్లీగేటరీ స్పాన్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై ప్రకటనలను నిషేధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సిటిజన్స్ భద్రత దృష్ట్యా ఈ నెల 13 నుండి ఆగష్టు 14 వరకు హోర్డింగ్ లు, ఆర్చులు, యూనిపోల్స్ లతో పాటు అబ్లిగేటరీ స్పాన్, ఎఫ్.ఓ.బి క్యాంటిలీవర్లపై ఉన్న ఫ్లెక్సీలను నిషేధించాలని బల్దియా అధికారులకు ఆదేశించారు. కాని గ్రేటర్ పరిధిలో ఉన్న హోర్డింగ్ లు, ఆర్చులు, యూనిపోల్స్ లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు యాజమానులు.దీంతో చాలా ప్రాంతాల్లో హోర్డింగ్ పై భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.ఈదురు గాలులతో వచ్చిన వర్షాలకు హోర్డింగ్ పై ఉన్న ఫ్లెక్సీలు చిరిగిపోయి..వాహనాదారులపై పడే అవకాశం ఉంది. అయితే బల్దియా అధికారులు ఆదేశాలు జారీ చేసిన ఎందుకు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వాటిని నివారణపై సరైన చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వర్షం పడిందంటే చాలు వణుకుతున్న నగరవాసులు
నగరంలో వర్షం పడిందంటే చాలు రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోతున్నాయి. ఎక్కడ ఏ గుంత ఉందో.. ఎప్పుడు ఏ మ్యాన్ హోల్ ఎవ్వరిని మింగేస్తోందోనన్న భయంలో సిటిజన్స్ ఉన్నారు. ఇప్పుడ నగరవాసులకు కొన్నాళ్లుగా హోర్డింగ్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికైనా బల్దియా అధికారులు సరైన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వమే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

16:15 - July 14, 2018

హైదరాబాద్ : బల్దియాలో భద్రతను గాలికొదిలేశారా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి...30 డిప్యూటి కార్యాలయాలు..జోనల్ కార్యాలయాలు...ప్రధాన కార్యాలయం..వందలాది పార్కులున్నాయి. ప్రధాన పార్కులు కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి..రక్షణకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా సెక్యూర్టీని నియమించింది. కానీ భద్రతను జీహెచ్ఎంసీ గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పార్కుల వద్ద సెక్యూర్టీ గార్డులు కనిపించడం లేదు. గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని చెప్పవచ్చు. కార్మికుల వేతనాలను కొల్లగొడుతున్నారు. సెక్యూర్టీ డ్యూటిల పేరిట అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:32 - July 13, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝులిపించిన బల్దియా.. ఇప్పుడు సెల్లార్లపై గురిపెట్టింది. పెద్ద పెద్ద భ‌వ‌నాలు, షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్ నిర్వహించాల్సిన సెల్లార్లను వ్యాపారాల‌కు అద్దెకిస్తున్నారు. భవన యజమానుల అత్యాశ పలు ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇందులో అవినీతి అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బల్దియా సెల్లార్లను టార్గెట్‌ చేసింది.

సెల్లార్లలో బిజినెస్‌ చేస్తున్న అక్రమార్కులు
ఫుట్‌పాత్‌ ఆక్రణలపై ఉక్కుపాదం మోపిన బల్దియా.. సెల్లార్ల అక్రమాలపై దృష్టి పెట్టింది. పార్కింగ్‌ నిర్వహించాల్సిన స్థలాలను దుకాణాలకు కేటాయిస్తున్న అక్రమార్కుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.గ్రేట‌ర్ ప‌రిధిలో ప్రతి మెయిన్‌ రోడ్డులోనూ.. రోడ్‌సైడ్‌ వ్యాపారాలు మొదలు షాపింగ్‌ మాల్స్‌ వరకూ మంచి టర్నోవర్‌ ఉండడంతో.. ఒక్క అడుగు జాగాను కూడా ఖాలీగా ఉంచ‌కుండా అద్దెకిస్తున్నారు భ‌వ‌న యాజ‌మానులు. ప్రతి నెలా ల‌క్షలాది రూపాయలు అద్దె వ‌స్తుండ‌టంతో... చిన్నపాటి స్థలం ఉన్నా ఏదో ఒక వ్యాపారానికి లీజుకు ఇస్తున్నారు. భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు పొందిన‌ప్పుడు పాటిస్తామ‌న్న నిబంధన‌లు గాలికి వ‌దిలేసి.. అక్రమార్జనే ధ్యేయంగా... పార్కింగ్ ప్రాంతాల‌ను సైతం దుకాణాలుగా మలుస్తున్నారు. క‌నీస జాగ్రత్తలు కూడా తీసుకుకోకుండా హోట‌ల్స్, కిచెన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం ప్రమాదాలు జ‌రుగ‌తూనే ఉన్నాయి.

సెల్లార్లలో వ్యాపారాలు... రోడ్డుపై వాహ‌నాల‌ పార్కింగ్
ఇక ప్రతి వాణిజ్య, నివాస భ‌నానికి త‌ప్పని స‌రిగా పార్కింగ్ ఉండాలి. క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణాల్లో పార్కింగ్‌ను సెల్లార్లలో ఏర్పాటు చేస్తారు. భ‌వ‌న నిర్మాణ ఎత్తును, విస్తీర్ణాన్ని బ‌ట్టి పార్కింగ్ స్థలాన్ని బల్దియా నిర్ణయిస్తుంది. కానీ సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో.. వాహ‌నాల‌ను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఏ రోడ్డులో చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్పడం లేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బల్దియా నిబంధనలను అతిక్రమించిన వారికి నోటిసులు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తొలగించకుంటే.. తామే వాటిని తొలగిస్తాం అంటున్నారు. అవ‌స‌ర‌మైతే భ‌వ‌నాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సెల్లార్ల అక్రమాలను టార్గెట్‌ చేసిన బల్దియా చివరి దాకా నిలబడి కఠిన చర్యలు తీసుకుంటుందా.. మధ్యలోనే ఒత్తిళ్ళకు తలొగ్గుతుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.

18:22 - July 3, 2018

హైదరాబాద్ : గ్రేటర్ లో మురుగునీటి సమస్యకు బల్దియా చెక్ పెట్టనుంది. జీహెచ్ ఎంసీ ఆధునాతన యంత్రాలను సిద్ధం చేసింది. 60కి పైగా సివరేజ్ జెట్టింగ్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మురుగునీటిని, సిల్ట్ ను వేరు చేసే యంత్రాలను కొనుగులు చేసింది. ఈ యంత్రాలను సిటీలోని సివరేజ్ సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తామని బల్దియా చెప్పింది. ఈ సందర్భంగా మేయర్ బొంత రామ్మోహన్ రావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:02 - July 3, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ తొలి విడత స్పెషల్‌ డ్రైవ్‌ ముగిసింది. మూడు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమంలో అనేక ఆక్రమణలను తొలగించారు. అయితే... కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కూల్చివేతల్లో వివక్ష కొనసాగించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిరువ్యాపారాలు తమ జీవనాధారం కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడోరోజు ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోమూడోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని ఆరు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2 వేల మూడు వందల 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మూడోవరోజు కూడా అదే స్థాయిలో తొలగింపులు కొనసాగాయి. మూడోరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు జరిగింది. ముఖ్యంగా ఈరోజు జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి రహదారిలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. జేసీబీల సహాయంతో పనులు సాగుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడవడానికి పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

కూకట్‌పల్లి, కాచిగూడల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు
ఈ ఆక్రమణల తొలగింపులో జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూకట్‌పల్లి, కాచిగూడల్లో అధికారుల అత్యుత్సాహంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాచిగూడలో వికలాంగ మహిళ నిర్వహిస్తున్న టీ స్టాల్‌ బండిని పూర్తిగా ధ్వంసం చేశారు బల్దియా సిబ్బంది. మరోవైపు కూకట్‌పల్లిలోని రెండు అంతస్తుల్లో షాపులకు ఉన్న మెట్లను తొలగించారు అధికారులు. దీంతో షాపుల్లో ఉన్న వినియోగదారులు పైనుంచి కిందికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆక్రమణల తొలగింపుతో ఇబ్బంది పడుతున్న చిరువ్యాపారులు
మూడురోజులుగా సాగుతున్న తొలగింపులపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్నిఆక్రమణలను తొలగించి.. మరికొన్ని కూల్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జీహెచ్‌ఎంసీ చేపట్టిన తొలిదశ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం సక్సెస్‌ అయ్యింది.

 

06:28 - April 13, 2018

హైదరాబాద్ : బల్దియాలో అక్రమార్కులకు అందలం అంటూ 10టీవీ ప్రసారం చేసిన కథనానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి స్పందించారు. అక్రమ బర్త్‌ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిన హెల్త్‌ అసిస్టెంట్లను మళ్లీ అదే కుర్చీలో కూర్చోబెట్టారు. ఉద్యోగుల అరెస్ట్‌ విషయం తమకేమీ తెలియదంటూ అక్రమార్కులకు అడ్డదారిలో పోస్టింగులు ఇచ్చారు. ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో.. ఏడుగురిని విధుల్లోంచి టెర్మినేట్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎలాంటి ఆధారాలు లేకుండా.. అక్రమంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ముఠాను జనవరిలో రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో బల్దియాకు చెందిన పలువురు హెల్త్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో అల్వాల్‌ సర్కిల్‌కు చెందిన కన్నారావు, సికింద్రాబాద్‌ సర్కిల్‌కు చెందిన అడపరెడ్డి రాజు, రామకృష్ణ, బాపునాయుడుతో పాటు కుత్బుల్లాపూర్‌కు చెందిన నాని బాబు ఉన్నారు. వీరికి సహకరించిన భానుప్రకాశ్‌, కిరణ్‌కుమార్‌ అనే హెల్త్‌ అసిస్టెంట్లను కూడా అరెస్ట్‌ చేశారు. వీరిపై 120(బి), 406, 420, 467, 468, 471, 472 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒక్కరిద్దరు మినహా అందరూ దాదాపు రెండు వారాల పాటు జైల్లో ఉండి వచ్చారు. అయితే.. వీరంతా విధులకు గైర్హాజరు అయ్యారని.. ఎక్కడికి వెళ్లారో తెలియదంటూ ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. హెల్త్‌ అసిసెంట్ల బాగోతాన్ని రాచకొండ కమిషనర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా సంబంధిత విభాగం అధికారులకు తెలియకపోవడం విశేషం.

బల్దియాలో జరిగిన అక్రమ నియమాకాలను వివరాలతో సహా మీడియా బయటపెట్టడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ స్పందించారు. అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లినవారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. బర్త్‌ అండ్‌ డెత్‌ విభాగంలోని ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను అక్రమంగా నియమించడమే కాకుండా... అరెస్ట్‌ అయి 53 రోజులు విధులకు హాజరుకాకపోయినా వేతనాలు విడుదల చేశారు. అయితే దీని వెనక ఎవరి పాత్ర ఉన్నా వదిలేది లేదంటున్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.

ఇదిలావుంటే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులనే కాకుండా.. తప్పుచేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే... ప్రస్తుతం ఉన్న సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల నుండి ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇలాంటి అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మెమోలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కార్మికులను సమకూరుస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

10:42 - March 1, 2018

హైదరాబాద్ : భాగ్యనగరంలో అందర్నీ ఆకర్షిస్తూ భారీ హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. తాజాగా వీటి ఏర్పాటు వెనుక భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సిటీలో అక్రమ హోర్డింగ్‌ల ఏర్పాటుతో బల్దియా తీవ్రంగా నష్టపోతోంది. దీనికి తోడు అక్రమ హోర్డింగ్‌లను తొలగించడంలోనూ అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎటు చూసినా వందల సంఖ్యలో హోర్డింగులు దర్శనమిస్తుంటాయి. సిటీలో భారీ వర్షం కురిసిందంటే ఎప్పుడు ఏ హోర్డింగ్ కూలుతుందో తెలియని పరిస్థితి. గత రెండేళ్లుగా వర్షాకాలంలో హోర్డింగ్స్‌ కూలిన ఘటనల్లో ప్రాణ నష్టం జరగనప్పటికీ ..భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. హోర్డింగ్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. తీసుకున్న అనుమతికి మించి హోర్డింగ్‌లు నిర్మించడం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా బల్దియా పరిధిలో 2వేల 684 హోర్డింగ్స్‌కి మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో వాటిపై బల్దియా నిర్వహించిన సర్వేలో 333 అక్రమ హోర్డింగ్‌లు ఉన్నట్లు లెక్క తేలింది.

ఇక అక్రమ హోర్డింగ్స్‌ని పనిపట్టేందుకు బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అక్రమ హోర్డింగ్ తొలగించడం ద్వారా వచ్చే ఇనుముకు ప్రతి కేజీకీ రూ.13 రూపాయల మేర ఆదాయం వస్తుంది. ఈ లెక్క ప్రకారం పెద్ద మొత్తంలో బల్దియాకు ఆదాయం వస్తుంది. అయితే ఇప్పటికే హోర్డింగ్స్‌పై అక్రమార్జనకు అలవాటు పడ్డ వారంతా ఇప్పుడు ఆ హోర్డింగ్స్‌ను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. బ‌ల్దియాలోని హోర్డింగ్స్ విభాగంలో ఇంజ‌నీర్లు, అక్రమ హోర్డింగ్స్ యజమానులు కుమ్మక్కై అవినీతికి తెరలేపారంటూ ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికైనా అక్రమ హోర్డింగ్స్ ద్వారా ఏళ్ల తరబడి ఆదాయం పొందిన వారిని గుర్తించడంతో పాటు.. అక్రమ హోర్డింగ్స్ ద్వారా బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నవారిపై చర్యలు చేపట్టాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు. దీనిపై బల్దియా అధికారులు ఏ మేరకు దృష్టి పెడతారో వేచి చూడాలి. 

07:28 - February 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వ్యూహాత్మక రహదారి పథకం కోసం... వినూత్నంగా బాండ్ల విక్రయంతో నిధుల సేకరణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.. గతంలో పుణే నగరపాలక సంస్థ తొలిసారి మున్సిప‌ల్ బాండ్లు విక్రయించి నిధులు సమకూర్చుకుంది.. దీన్నే బల్దియా ఆదర్శంగా తీసుకుంది. జీహెచ్‌ఎంసీ మొదటిసారే వెయ్యి కోట్ల రూపాయల సేకరణకు బాంబే స్టాక్ ఎక్చేంజ్‌ ద్వారా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు వెళ్లింది. డబుల్‌ ఏ రేటింగ్‌ వల్లే జీహెచ్ఎంసీకి నిధుల సమీకరణ సులభమైంది.

14 ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్
ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ద్వారా జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. దీన్ని బ‌ల్దియా వ‌ర్గాలు ధృవీకరించాయి కూడా. రెండు రోజుల‌ వ్యవధిలోనే 200 కోట్ల నిధులు 8.9 శాతం రేటుకే సమకూరాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాతాలో నగదు కూడా జమ అయ్యింది. ఇలా నిధుల సేకరణలో దేశంలోని ఇతర పురపాలక, నగరపాలక సంస్థలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో జీహెచ్ఎంసీ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు.

స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం
బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో స‌మ‌గ్ర ర‌హ‌దారుల డెవ‌ల‌ప్ మెంట్, స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం వేగవంతం కానున్నాయి.. ప్రస్తుతం సేకరించిన 2 వందల కోట్ల రూపాయలతో ఈ పనులను ముమ్మరం చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మరో 800 కోట్ల రూపాయలు సేకరించాలని బల్దియా నిర్ణయించింది. గత యాభై ఏళ్లలో దేశంలో పురపాలక సంస్థలు, స్థానిక సంస్థలు బాండ్ల రూపంలో 2వేల కోట్ల రూపాయలు సేకరించగా... వీటిలో పదిశాతాన్ని కేవలం జీహెచ్ఎంసీ సేకరించింది. ఇతర పురపాలక సంస్థలకు ఇది ఆదర్శవంతంగా నిలుస్తుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు.జీహెచ్‌ఎంసీ నిధుల సమీకరణతో ఇతర రాష్ర్టాలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది... ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తూ... మరింత మంచి స్టేటస్ సాధించి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తోంది.

06:40 - February 15, 2018

హైదరాబాద్ : బల్దియా అప్పుల వేట వేగం పెంచింది. ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మూడు సార్లు ముంబై చుట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చక్కర్లు కొట్టగా... తాజాగా బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ఇన్వెస్టర్లతో నగర మేయర్‌, కమిషనర్‌ భేటీ అయ్యారు. ఇంతకీ బల్దియా ఆదాయం పెంచుకుంటుందా.. అప్పుల ఊబిలో కూరుకుపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

జీతాలు, మెయింటెనెన్స్‌ వెళ్లదీయడమే కష్టంగా మారింది బల్దియాకు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అమ్మో ఒకటో తారీఖు అంటూ బెంబేలు పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.. ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రాజెక్టులు బల్దియాతో చేయిస్తుండడంతో ఖజానాకు గండిపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం చేస్తామంటూ.. ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందించింది. సమగ్ర రోడ్‌ డెవలప్‌ మెంట్‌ ప్లాన్ కింద నగరంలోని ప్రముఖ జంక్షన్లలో స్కైవేలు, మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్లు, గ్రేడ్‌ సపరేటర్లు వంటి భారీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీనికి 23వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని లెక్కలువేసింది. మరోవైపు ఆర్టీసీ నష్టాలను కూడా భరించాలని ఆదేశించడంతో... 334 కోట్లు చెల్లించింది. ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ... ఖర్చులు బల్దియాపై వేయడమే ఈ కష్టాలకు కారణం అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
మున్సిపల్‌ బాండ్లను విక్రయించి నష్టాలను అధిగమించాలని నిర్ణయించింది బల్దియా. వెయ్యికోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ మొదటి విడతలో 200 కోట్లు రాబట్టనుంది. దీంతో త్వరలోనే బల్దియా ఖజానాకు 200కోట్ల నిధులు చేరనున్నాయి. దీనికి 8.9శాతం వడ్డీరేటు చెల్లించనుంది. ఈ విధంగా నిధులు సేకరించిన 2వ స్థానిక సంస్థగా జీహెచ్‌ఎంసీ నిలవనుంది. గతంలో పూణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇలాగే నిధులు సేకరించింది.

అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌ను చేస్తామన్న ప్రభుత్వం అప్పుల నగరంగా తయారు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాటర్‌ బోర్డు వేలాది కోట్లు అప్పులు చేయగా... ఇప్పుడు బల్దియా అదే దారిలో నడుస్తోంది.. మూసీ కార్పొరేషన్, హైదరాబాద్‌ రోడ్‌ కార్పొరేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిద్వారా కూడా అప్పులు చేసేందుకు స్కెచ్‌ వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ నిండు ఖజానాతో ఉన్న బల్దియా... ఇక నుంచి అప్పుల్లోకి వెళ్లనుంది. ప్రభుత్వం తమ రాజకీయ లబ్దికోసం కార్పరేషన్‌ను ఊబిలోకి దించుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Pages

Don't Miss

Subscribe to RSS - బల్దియా