బస్ స్టేషన్లు

06:53 - January 16, 2017

హైదరాబాద్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. ముందస్తుగా రైల్వే రిజర్వేషన్లు, బస్సు రిజర్వేషన్లు ఉన్నవారు మినహా, మిగిలిన వారంతా ప్రయాణం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రయాణికుల చేరవేతకు అనుగుణంగా రైలు, బస్సు సర్వీసులు లేవు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

అరకొర తనిఖీలతో సరిపెడుతున్న రవాణ శాఖ ....

స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టిక్కెట్‌ రేటుపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వీరిపై నియంత్రణ లేదు. అరకొర తనిఖీలతో సరిపెడుతున్నరవాణ శాఖ, ప్రైవేటు బస్సుల నిర్వాహకులను అదుపు చేయడంలో విఫలమైంది. తిరుగు ప్రయాణం మొదలైన రోజు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దోపిడీ మరింత పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.400గా ఉన్నటికెట్‌కు వెయ్యికిపైగా వసూలు చేస్తున్నారు. మరికొందరు రూ.1300 నుంచి 1500 వరకు దండుకుంటున్నారు. ఏసీ, స్లీపర్‌ బస్సుల్లో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉంది. స్లీపర్‌ బస్సుల్లో రెండువేల రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో పండుగ ఆనందం తిరుగుప్రయాణంతో ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో యాభైశాతం అదనపు చార్జీలు....

:దోపిడీ విషయంలో ఆర్టీసీ ఏమీ తక్కువ తినలేదు. రోజువారీ సర్వీసులకు ముందుగా రిజర్వేషన్‌ బుక్‌ చేసుకున్నవారికి మినహా, ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు రేట్లు వసూలు చేస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నా తలుపులు, కిటికీలు సరిగాలేని బస్సులను నడుపుతున్నారు. దీంతో రాత్రివేళల్లో చలికితట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇష్టముంటే ఎక్కండి, లేకపోతే దిగిపోండని ఆర్టీసీ సిబ్బంది చీత్కరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆడిందే ఆట, పాడిండే పాటగా మారింది. పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ రెండు వేలకుపైగా నడిపింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులు దీనికి అదనం. తిరుగుప్రయాణంలో ఆర్టీసీకి సరైన అంచనాలు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీంగా ఉన్నాయి. ప్రతిఏటా సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ ఉంటుంది అటు ఆర్టీసీ, ఇటు రైల్వే అధికారులకు తెలియని విషయం కాదు. అయినా అరకొరగానే రైళ్లు, బస్సులు నడుతుపుతున్నారు. రైల్వే శాఖ ప్లాట్‌ఫారం టికెట్‌ను 20 రూపాయలకు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తున్నారు.

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss

Subscribe to RSS - బస్ స్టేషన్లు