బిజెపి

12:27 - August 17, 2018
06:29 - August 16, 2018

ఢిల్లీ : బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ప్రదాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ, వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయ ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీసహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో పరామర్శించారు. నేటి అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో ఉన్న 93 ఏళ్ల వాజపేయి.. తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ...ఎయిమ్స్‌లో మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడంలాంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌లో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు.

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మంగళవారం నుంచి దిగజారింది. బుధవారం మరింత క్షీణించడంతో ఆయనను ఎయిమ్స్‌ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాజ్‌పేయిది గట్టి మనోబలం. ఇంతకాలం ఆయన అనారోగ్యంతో పోరాడుతున్న తీరుకు మేమే ఆశ్చర్యపోతున్నామని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుడు ఒకరు చెప్పారు.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంతకుముందు.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మోదీని కలుసుకుని వాజపేయి పరిస్థితి గురించి వివరించారు. దీంతో వాజపేయిని చూసేందుకు ప్రధాని ప్రోటోకాల్‌ నిబంధనల్నీ పక్కనబెట్టారు. పీయూష్‌ గోయల్‌, స్మృతి ఇరానీతోపాటు మరికొంత మంది కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వాజ్‌పేయ్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాజపేయి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో బీజేపీ ముఖ్యనేతలంతా నేటి తమ అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. విజయవాడలో నేడు జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం కూడా వాయిదా పడింది.

వాజ్‌పేయి 2005 డిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ముందే చెప్పారు. అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన లక్నో నుంచి ఆ ఎన్నికల్లోపోటీ చేసిన లాల్‌జీ టాండన్‌ను బలపరుస్తూ నియోజక ప్రజలకు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి కూడా రాలేకపోతున్నానని తెలిపారు. అనంతరం 2009 ఫిబ్రవరి 6న వాజ్‌పేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి కొంతకాలానికి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన గుండెపోటు , పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆ తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయారు. క్రమంగా మధుమేహం తీవ్రతరమైంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒక దానిని గతంలోనే తొలగించారు. మూత్ర పిండాలు దెబ్బతినడంతోనే జూన్‌ 11న ఆయన మళ్లీ ఎయిమ్స్‌లో చేరారు. 

18:13 - August 10, 2018

పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో టిడిపిని..బాబును ఎన్నుకొంటే ద్రోహం జరుగుతుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నరసాపురంకు చేరుకున్నారు. సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కులాలు విడగొట్టే పద్ధతి ఆగిపోవాలని పిలుపునిచ్చారు.

15 సీట్లు ఇచ్చిన జిల్లాలో ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని బీసీలకు..కాపులకు..ద్రోహం చేశారని విమర్శించారు. జగన్ కూడా మాట మార్చేశారని..తాను మాట తప్పనన్నారు. అందర్నీ కులాలకు న్యాయం చేస్తానన్నారు. అందరీకి అండగా నిలబడేది జనసేన పార్టీ అని...తాను అందరి కన్నీళ్లు తుడవడానికే వచ్చానన్నారు. ప్రతొక్కరినీ అర్థం చేసుకోవాలని..తదితర కారణాలతో 2014లో పోటీ చేయలేనని..ప్రస్తుతం అందర్నీ అర్థం చేసుకున్నానన్నారు. మత్స్యకారుల సమస్య తనకు బాధిస్తోందని...కోల్డ్ స్టోరేజ్ ..తదితర సమస్యలను టిడిపి పట్టించుకోలేదన్నారు. 

17:45 - August 10, 2018

ఢిల్లీ : విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీకి 2019 ఎన్నికల్లో శృంగభంగం తప్పదని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు ఏ గతిపట్టిందో.. బీజేపీకి కూడా అదేగతి పడుతుందని వారించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందని టీడీపీ ఎంపీలు తోట నరసింహం, సుజనా చౌదరి విమర్శించారు. 

17:11 - July 15, 2018

గుంటూరు : వైసీపీ, బిజెపి కుట్ర రాజకీయాలు..లోపాయికారీ ఒప్పందాలు మరోసారి బయటపడ్డాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఇటీవలే కేంద్ర మంత్రి చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని, వైసీపీతో లాలూచీ పడి ఏపీకి నష్టం కలిగించే విధంగా బీజేపీ ప్రయత్నిస్తోందని..పోలవరాన్ని కేంద్ర మంత్రి గడ్కరి అభినందించారన్నారు. 

21:09 - July 14, 2018

విజయవాడ : ఎన్డీయేలో చేరాలంటూ.. వైసీపీ అధినేత జగన్‌ను కేంద్రమంత్రి రాందాస్‌ ఆహ్వానించారు. తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామనీ హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. బీజేపీతో చేరేందుకు వైసీపీ తహతహలాడుతోందంటూ వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజల్లో ఎండగడతామని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాందాస్‌ అథవాలే.. ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన రాందాస్‌.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఎన్డీయే కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తమతో కలిస్తే.. జగన్‌ సీఎం అయ్యేందుకు సహకరిస్తామనీ భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని కూడా రాందాస్‌ అథవాలే చెప్పారు.

ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారని రాందాస్‌ అథవాలే వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే.. హోదాపై ప్రధాని మోదీ అనుకూలంగా వ్యవవహరించి ఉండేవారన్నారు. జగన్‌ గురించి అథవాలే చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతోందని, అథవాలే మాటల్లో కొత్తదనమేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమనీ, విపక్షాల కుట్రలను తిప్పికొట్టి, టీడీపీని అధికారంలోకి తెస్తేనే అందరికీ మంచి జరుగుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

14:48 - July 12, 2018

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. పోలవరం పనులను పరిశీలించి చంద్రబాబు సంకల్పం గొప్పదని కేంద్రమంత్రి గడ్కరీ మాటలు వైసీపీ, బీజేపీలకు వినబడలేదా అని ఎద్దేవా చేశారు. పదే పదే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్న కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదో చెప్పాలన్నారు బుద్ధా వెంకన్న.

 

06:58 - July 9, 2018

విజయవాడ : ఓటమి భయంతోనే చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ రావడం బాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. బాబుకు ధన, భూ దాహం పట్టుకుందని అందుకే డాట్‌ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. బురదలో కూరుకు పోయిన బాబు మాకు బురద అంటించే ప్రయాత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

13:00 - July 4, 2018

విజయవాడ : బీజేపీతో సంబంధాలపై సీఎం చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. కమళనాథులతో తెగదెంపులు చేసుకున్నట్లు బయటకు చెబుతూ లోపాయికారి ఒప్పందాలు చేసుకొంటోందని పేర్కొన్నారు. ప్రజలు శాశ్వతంగా బాబును ఇంటికి పంపిస్తారని, బాబు మోసాలకు...దాష్టీకాలకు చరమగీతం పాడాల్సిన రోజు వచ్చిందన్నారు.

 

07:51 - June 1, 2018


ఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి భంగపాటు ఎదురైంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు విపక్షాల ఐక్యతను చాటి చెప్పాయి. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా... మూడు సిట్టింగ్‌ ఎంపీ స్థానాలకు గాను ఒక్క స్థానాన్ని మాత్రమే బిజెపి నిలుపుకోగలిగింది. 11 అసెంబ్లీ స్థానాలకు గాను  బిజెపి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచిందని...దేశాన్ని విభజించాలనుకునేవారికి ఇది చెంప పెట్టని విపక్షాలు అభివర్ణించాయి.

దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి వీచింది. మూడు ఎంపీ సిట్టింగ్‌ స్థానాలకు గానూ ఒక్క స్థానాన్ని మాత్రమే బిజెపి దక్కించుకుంది. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని భండారా గోండియా స్థానాలను బిజెపి కోల్పోగా... పాల్‌ఘర్‌ స్థానాన్ని మాత్రం బిజెపి దక్కించుకుంది. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ విజయం సాధించింది. 

యూపీ, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయలో11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. కాంగ్రెస్‌ 4, ఇతర విపక్ష పార్టీలు 6 స్థానాలను దక్కించుకున్నాయి. కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీకి చెందిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 55 వేల ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. యూపీలోని నూర్‌పుర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ 6,211 ఓట్ల తేడాతో బిజెపిని ఓడించింది. ఇది కూడా బిజెపి సిట్టింగ్‌ స్థానమే. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచిందని...ఇది దేశాన్ని విభజించాలనుకునేవారి ఓటమని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొంది.

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో బిజెపి 29 వేల ఓట్ల తేడాతో శివసేనను ఓడించింది. భండారా గోండియా స్థానాన్ని ఎన్సీపీ దక్కించుకుంది. పాల్‌ఘర్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇక్కడ మళ్లీ రీపోలింగ్‌ జరపాలని శివసేన డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంఘంలోనూ అవినీతి కనిపిస్తోందని ఆరోపించింది.

బిహార్‌లోనూ బిజెపితో జతకట్టిన నితీష్‌కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోకిహాట్‌ శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో ఆర్జేడీ 41 వేల ఓట్ల తేడాతో జెడియుపై భారీ విజయం సాధించింది. ఇక్కడ అవకాశ వాదం ఓడిందని...లాలూ వాదమే గెలిచిందని నితీష్‌, బిజెపిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ధ్వజమెత్తారు.
బైట్‌ తేజస్వీయాదవ్, మాజీ ఉపముఖ్యమంత్రి

కర్ణాటకలోని ఆర్‌ఆర్‌ నగర్‌, మహారాష్ట్రలోని పాలస్‌ కడేగావ్‌-, మేఘాలయలోని అంపతి, పంజాబ్‌లోని షాకోట్‌ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. తాజా గెలుపుతో మేఘాలయలో  అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌- బిజెపి అధికారానికి చెక్‌ పెట్టే యోచనలో ఉంది. కేరళలోని చెంగన్నూర్‌ అసెంబ్లీ స్థానాన్ని సిపిఎం తిరిగి నిలబెట్టుకుంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 21 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియాల అసెంబ్లీ స్థానాల్లో జెఎంఎం గెలుపొందింది. బెంగాల్‌లోని మహేప్తలా అసెంబ్లీ స్థానాన్ని టిఎంసి దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లోని థరాలీ అసెంబ్లీ స్థానంలో మాత్రమే బిజెపి విజయం సాధించింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఉపఎన్నికల ఫలితాలు విపక్షాల్లో ఉత్సాహాన్ని నింపగా...బిజెపి శ్రేణులను నిరాశ పరిచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - బిజెపి