బీజేపీ

06:35 - September 20, 2017

హైదరాబాద్ : 2014 ఎన్నికల ముందు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆయన అయితేనే దేశానికి మేలు జరుగుతుందని ఒకరు అంటే... అతనిలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు మరొకరు. ఇది అప్పటి మాట. కానీ... తాజాగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. గత సాధారణ ఎన్నిక సమయలో మోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినా... ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ, పవన్‌కల్యాణ్‌ కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అది గతం. కానీ... ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌ల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఆస్తామని అప్పట్లో మోదీ హామీ ఇచ్చారు. అయితే.. మోదీ గెలిస్తే విడిపోయి నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పవన్‌ ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి... ప్రత్యేక సాయం ప్రకటించింది.

దీంతో బీజేపీ తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి పోరాటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీతో పాటు,.. కొంతమంది కేంద్రమంత్రులను సైతం టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ, పవన్‌ మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే.. పవన్‌ కేంద్రమంత్రులను టార్గెట్‌ చేసినా ఎక్కడా మోదీని ఒక్క మాట కూడా అనలేదు. దీంతో పవన్‌, మోదీ సన్నిహితంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ... మోదీ మాత్రం పవన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలకు మరింత బలం పెరిగింది.

తాజాగా మోదీ స్వచ్చ భారత్‌లో తమ వంతు సహకారం అందించాలని కోరుతూ పలువురు ప్రముఖులకు లేఖలు రాశారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, మోహన్‌బాబులకు లేఖలు రాసిన మోదీ... పవన్‌ను మాత్రం అందులో భాగస్వామ్యం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పవన్‌ సహకారం కోరిన మోదీ... ఇప్పుడు ఎందుకు దూరం పెట్టారనేది ఆసక్తిగా మారింది. అయితే... ప్రత్యేక హోదా విషయంలో పవన్‌ కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కారణమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇదేకాకుండా... చిరంజీవిని బీజేపీలోకి తీసుకువచ్చి... 2018లో రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక పవన్‌కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు తమ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా...రాకపోయినా చిరంజీవిని ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని కాషాయి నేతలు ప్లాన్‌ వేస్తున్నారు. మొత్తానికి పవన్‌కల్యాణ్‌, మోదీల మధ్య దూరం వచ్చే ఎన్నికల నాటికి ఇలాగే కొనసాగుతుందా ? లేదంటే వచ్చే ఎన్నికల ముందు మళ్లీ ఒక్కటి అవుతారా ? అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

19:04 - September 17, 2017

నిజామాబాద్ : టీఆర్‌ఎస్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్.. కమలం తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్‌లో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో అరవింద్ బీజేపీలో చేరారు. నిజామాబాద్‌లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. 

 

14:06 - September 16, 2017

హైదరాబాద్ : హోంగార్డుల సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. హోంగార్డులను రెగ్యూలైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హామీని మరించిందని బీజేపీ ఎమ్మెల్యే హోంగార్డులతో కలిసి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

13:10 - September 16, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ వారు టీడీపీ సహారించరంటూ టీడీపీ కార్యకర్తలు అనడంతో దానికి దీటుగా బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తలు దారి తీశాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:43 - September 12, 2017

హైదరాబాద్ : ఆర్యవైశ్యుల వెనుక బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ శక్తులున్నాయని అనుమానం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి కుట్రలో ఆర్యవైశ్యులు పడొద్దని హితవుపలికారు. దాడులు చేయడం ఆర్యవైశ్యుల సంస్కృతి కాదన్నారు. ఆర్యవైశ్యులను తప్పుదోవపటిస్తున్నారని చెప్పారు. ప్రొ.కంచె ఐలయ్యపై బెదిరింపులను టీమాస్, సీపీఎం తరపున పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై చర్చల ద్వారా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. బెదిరింపులు, దాడులకు పాల్పడడం సరికాదని హితవుపలికారు. 'మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా... ఆటవిక రాజ్యంలో ఉన్నామా'... అని ప్రశ్నించారు. అభిప్రాయాలపై చర్చ జరగవచ్చు...కానీ చట్ట విరుద్ధంగా చంపేస్తామని బెదిరింపులు చేయడం సరికాదన్నారు. బెదిరింపుల వెనుక బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ శక్తులు, ఆగ్రకుల శక్తులు ఉన్నాయనే అనుమానం కల్గుతుందన్నారు. భావజాలానికి వ్యతిరేకంగా దాడులు, హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, హిందు భావజాలాన్ని పెంపొందించాలని చూస్తున్నారని చెప్పారు. గౌరీ లంకేశ్ ది యాధృచ్ఛికంగా జరిగిన హత్య కాదన్నారు. సెప్టెంబర్ 17ను విమోచనదినంగా భావించడం లేదన్నారు. నైజాం సర్కార్ నుంచి తెలంగాణ.. ఇండియన్ యూనియన్ లో విలీనం అయిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

07:35 - September 12, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ద్వంద్వ వైఖరిని విడనాడాలని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోడీ కేసీఆర్‌ పాలనను అభినందిస్తున్నారని.. రాష్ట్ర బీజేపీ నేతలేమో కేసీఆర్‌ పాలనను విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర పెద్దలు కేసీఆర్‌ పొగుడుతుంటే.. రాష్ట్ర నాయకులు విమర్శలు గుప్పిస్తూ ద్వంద్వ వైఖరి అవలంభించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ డబుల్‌స్టాండ్‌ను విడనాడితే బాగుంటుందని రేవంత్‌ సూచించారు. 

15:43 - September 11, 2017

నల్లగొండ : కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఈ పేర్లు తెలియనివారుండరు. అంతటి చర్చనీయాంశ రాజకీయనాయకులుగా వీరి పేర్లు నల్గొండ ప్రజల్లో నానుతుంటాయి. కీర్తి శేషులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి చాలా విశ్వాసమైన వ్యక్తిగా కోమటిరెడ్డికి గుర్తింపు ఉంది. ఆ సమయంలోనే తమ్ముడు రాజగోపాల రెడ్డిని భువనగిరి ఎంపీగా పార్లమెంటుకు పంపించారు. అయితే వైఎస్‌ మరణాంతరం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్‌ పడిందనే చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఉత్తమ్‌కు మంత్రి పదవి లభించింది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బ..
మొదటి నుండి ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రి పదవులు మారాయి. దీంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల్లో సైతం ఒకరినొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుండి వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో టీపీసీసీ పగ్గాలు ఉత్తమ్‌కు దక్కడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. నాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఉత్తమ్‌ను విమర్శిస్తూ టీపీసీసీని తాము పరిగణలోకి తీసుకోవడంలేదని బహిరంగంగానే ప్రకటించారీ ఇద్దరు సోదరులు.

సాధారణ ఎన్నికల్లో టీపీసీసీ బాధ్యతల్లో ఉన్న ఉత్తమ్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేశారు. తమకు వీలున్న మార్గాల ద్వారా అధిష్ఠానం వద్దకు పదే పదే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గతంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా ఉండటం వల్లే టీపీసీసీపై విమర్శలు చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉత్తమ్‌ వైఖరితో 2019 ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో పార్టీ మరింత దిగజారిపోతుందని కోమటిరెడ్డి వర్గం ప్రచారం చేస్తూ వస్తోంది. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే కోమటిరెడ్డి లాంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులు పార్టీ పగ్గాలు చేపట్టాలని సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా, తన క్యాడర్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. దీంతో టీపీసీసీ నాయకత్వం మార్పు జరుగుతుందని, బ్రదర్స్‌లో ఒకరికి పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది.

అదే సమయంలో టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి వెళ్తున్నారన్న ప్రచారం జరగడం, అనూహ్యంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి గులాబీ పార్టీకి చేరడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెనక్కి తగ్గారన్న ఆరోపణలున్నాయి. అప్పటివరకు కేసీఆర్‌పై పెద్దగా విమర్శలు చేయని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆ తర్వాత తీవ్రమైన విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుండి ఈ బ్రదర్స్‌ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండలో నాలుగు రోజుల పాటు మకాం వేయడంతో ప్రచారం నిజమవుతుందని భావించారు. అయితే సెప్టెంబర్‌లో టీపీసీసీ పగ్గాలు మారే అవకాశం ఉండటంతో తమకు కొంత సమయం కావాలని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈ ప్రచారాలు సద్దుమనిగినా ఇటీవల మళ్లీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా దిగ్విజయ్‌ స్థానంలో కుంతియా బాధ్యతలు చేపట్టడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మరింత ఇరకాటంలో పెట్టినట్టయింది. కుంతియా ఉత్తమ్‌ వర్గంతో సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఉత్తమ్‌ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ సభలకు కుంతియా హాజరుకావడంతో టీపీసీసీలో మార్పులు జరగవనే ప్రచారం జరిగింది. దీంతో టీపీసీసీ కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశాలు సన్నగిల్లిపోయాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌ సారధ్యంలోనే వచ్చే శాసనసభ ఎన్నికలను ఎదుర్కుంటామని కుంతియా ప్రకటించడం సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది.

బీజేపీలోకి...
కుంతియా ప్రకటనతో కోమటిరెడ్డి డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గం లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కుంతియా వ్యాఖ్యలు తమ క్యాడర్‌ను నైరాశ్యంలోకి నెట్టాయని బ్రదర్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటామనుకున్నా కుంతియా వ్యాఖ్యలలోని అంతరార్థం గురించి బ్రదర్స్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలతో మొదటి నుండి వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీకి వెళ్లడం శ్రేయస్కరమని సోదరులు భావిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రభావిత శక్తిగా ఎదిగే అవకాశం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాలా అన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్‌లో ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. టీపీసీసీ పగ్గాలు రాకపోతే కమలం గూటికి చేరడం ఖాయమని కోమటిరెడ్డి అనుచరులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏదేమయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మార్పు ప్రచారం వారి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న బ్రదర్స్‌ ప్రస్తుతం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది అక్టోబర్‌ మాసంలో తెలియనుంది.

20:18 - September 8, 2017

కొత్తగూడెం : తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో బిజెపి నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా బయలుదేరిన బిజెపి కార్యకర్తలు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు దాటి దూసుకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకరరెడ్డి సహా వందమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

20:16 - September 8, 2017

హైదరాబాద్ : ఉన్న సచివాలయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే.. కొత్తగా ఎలాంటి బిల్డింగ్‌లు అవసరం లేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఖాళీచేసిన సచివాలయం గదులు పిచ్చుక గూళ్లుగా మారుతున్నాయని.. వాటికి కొద్దిపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఉన్న బిల్డింగ్‌లను వాడుకోకుండా..కొత్తవాటిని నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేయొద్దని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు లక్ష్మణ్. 

17:59 - September 6, 2017

నిజామాబాద్ : అర్బన్ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 2 లక్షల 41వేల 562 మంది ఓటర్లున్నారు. బిసిలు, మైనార్టీలు అధికంగా వున్న నియోజకవర్గం. మున్నూరుకాపులు, మైనార్టీలు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తుంటారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చతుర్ముఖ పోటీ జరిగే నియోజకవర్గమిది. 2014 ఎన్నికల్లో చతుర్మఖ పోటీ జరగగా, టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం సాధించారు. అంతకు ముందు 2009లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అప్పటి కాంగ్రెస్ నాయకుడు డి. శ్రీనివాస్ పై సంచలన విజయాలు నమోదు చేయడం విశేషం.

నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్
టిఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వివాద రహితుడన్న పేరుంది. కానీ, ఆయన అనుచరవర్గం వ్యవహార శైలి ద్వితీయ శ్రేణి కేడర్ కి మింగుడుపడడం లేదు. పిఏ వ్యవహార శైలి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ లు అడుగుతున్న తీరు ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెడ్డపేరు తెస్తోంది. నగర మేయర్ కీ, ఎమ్మెల్యే అనుచరవర్గానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చేయిస్తున్న సర్వేలలో గతంలో టాప్ ప్లేస్ లో వున్న గణేష్ గుప్తా లేటెస్ట్ సర్వేలో 15శాతం మార్కులు కోల్పోవడం విశేషం. నిజామాబాద్ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కంటే అర్బన్ లోనే పార్టీ బలహీనంగా వుందన్నది సిఎం సర్వేల సారాంశం.నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నది గణేష్ గుప్తా గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ మార్చడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొన్ని ముఖ్య వాగ్ధానాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నత్తనడకన సాగుతోంది. పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలున్నాయి. గుంతలు తేలిన రోడ్లు నగర ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ కనిపించడం లేదు.

మామూళ్లుగా పుచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు
నిజామాబాద్ టౌన్ లోని ప్రతి డివిజన్ లో ఒక పార్క్ ఏర్పాటు చేస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. రోడ్ల విస్తరణ పనులకు రాజకీయ ఒత్తిడిలు పెద్ద అడ్డంకిగా మారాయి. అధికార పార్టీ నాయకులు ప్రయివేట్ ఆస్పత్రుల నుంచి భారీగా మామూళ్లుగా పుచ్చుకుని, రోడ్ల విస్తరణకు మోకాలడ్డారన్న ఆరోపణలున్నాయి. నగర సుందరీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు. 1974 తర్వాత మాస్టర్ ప్లానే లేదు. రఘునాధ చెరవును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. శంకు:స్థాపనలు చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నది పబ్లిక్ టాక్.అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోతోంది. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు అర్సపల్లి గేటు నుంచే నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహన కాలుష్యమూ పెరుగుతోంది. ఇవన్నీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి. మరోవైపు బిజెపి తన పట్టు నిలుపుకునేందుకు, పార్టీని విస్తరించేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి గణేష్ గుప్తా రెండోసారి గెలవాలంటే, రాబోయే రెండేళ్లు చాలా తీవ్రంగానే శ్రమించాల్సి వుంటుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - బీజేపీ