బోటు

20:26 - February 17, 2018

విశాఖ : ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బోటు పూర్తిగా దగ్ధం అయింది. బోటులోపల వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగినట్టు మత్స్యకారులు తెలిపారు. దాదాపు రూ. 35 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందంటున్న మత్సకారులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.  బోటు కాలిపోవడంతో తాము జీవనాధారం కోల్పోయాయమని , ప్రభుత్వమే ఆదుకోవాలని 15 మత్సకార కుటుంబాలు కోరుతున్నాయి. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:26 - December 9, 2017

గుంటూరు : ఫెర్రీ పడవ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు..అనంతరం జరిగిన పరిణామాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జనసేన అధినేత ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అయినవారిని కోల్పోయి దుఖంలో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస సానుభూతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

16:39 - November 18, 2017

తూర్పుగోదావరి : విజయవాడ ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాద ఘటన తరువాత అధికారుల్లో చలనం వచ్చింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ బోట్లను నడుపుతున్న వారిపై ఆంక్షలను కఠినతరం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫలితంగా పాపికొండల బోటు విహారానికి బ్రేక్ పడింది. మూడురోజుల పాటు ఎలాంటి విహార యాత్రకు అనుమతులు లేవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటన తరువాత పాపికొండల విహారం కోసం నడుపుతున్న బోట్లలో నిర్లక్ష్యం ఒక్కసారిగా బయటపడింది. మొత్తం బోట్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఫెర్రీ ఘాట్ ప్రమాద ఘటన జరిగిన మరుసటిరోజే అధికారులు హుటాహుటీన బోట్ల నిర్వహణపై ఆరాతీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం అంగళూరు నుంచి పాపి కొండల విహారం కోసం వెళ్లే బోట్లను  సీతానగరం, దేవీపట్నం ఎమ్మార్వోలు తనిఖీలు చేశారు. నాలుగు బోట్లు మినహా మిగిలిన బోట్లన్నీ నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నట్టు తేలింది. అంతే అధికారులు సమావేశమై బోటు ఓనర్లపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఉపక్రమించారు. అందులో భాగంగా పర్యాటక శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ సమావేశమయ్యారు. 

బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించినట్టు అధికారుల తనిఖీల్లో తేలితే శాశ్వతంగా బోటు లైసెన్స్‌ను రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ బోటు నిర్వాహకులకు ఆదేశించారు. ప్రతీ బోటులో సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతీ బోటులోనూ నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక మేటలను గుర్తించగలిగేలా ఉండకపోతే పర్యాటకుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందనీ, అనుభవం కలిగిన డ్రైవర్ మాత్రమే బోట్లను నడపాలని ఆదేశించారు. 

భద్రత విషయంలోనే కాకుండా పర్యాటకులనుంచి దోచుకుంటున్న బోటు నిర్వాహకులను కట్టడి చేయడంలో అధికారులు దృష్టి పెట్టారు. కలెక్టర్ పెట్టిన టిక్కెట్ ధర ప్రకారం మాత్రమే పర్యాటకుల వద్ద డబ్బులు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. విహారం మార్గంలో అధికారులు నిర్దేశించిన నాలుగు చోట్ల ఖచ్చితంగా తనిఖీ చేయించుకుని తీరాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అధికారులు ఏదో చర్యలు చేపట్టాం .. చేతులు దులుపుకున్నాం.. అన్న చందంగా కాకుండా అవి అమలయ్యే తీరుపై మరింత దృష్టి పెట్టాలని అందరూ కోరుతున్నారు. 

19:08 - November 15, 2017

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో 22 మంది మృతికి కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ప్రధాన నిందితుడు కొండల్ రావుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి విచారించారు. కొండలరావు, నీలం శేషగిరి రావు, మాచవరపు మనోజ్ కుమార్, యంజమూరి విజయ సారథి, గేదెల శ్రీను, బోటు నడిపిన భైరవ స్వామి, గేదెల లక్ష్మీలను అరెస్టు చేశారు. విహార యాత్రకు పనికొచ్చిన బోటు కాదని..చేపలు పట్టడానికి ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేపట్టి నదిలో ఉపయోగిస్తున్నారు.

అనధికారికంగా బోటును తిప్పేందుకు..ఇతరత్రా వ్యవహారాల్లో ముగ్గురు మంత్రులు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ..జలవనరుల శాఖ అధికారులు..కొంత మంది పెద్దల కనుసన్నలలో బోట్లు నడుస్తున్నాయని సీఎం బాబుకు సమాచారం అందిందని తెలుస్తోంది. 

21:15 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని ఇవాళ రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. మరోవైపు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఏడేళ్ల అశ్విత మృతదేహాన్ని రెస్క్యూటీం వెలికితీసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫెర్రీఘాట్‌ బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని తెలిపారు. సరస్సుల్లో నడిపే బోటు కృష్ణానదిలో తిప్పడానికి అనుమతి లేదని చెప్పారు. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని కలెక్టర్‌ నివేదికలో తెలిపారు. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీనును సస్పెండ్‌ చేసింది. మరో 8 మందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పడవ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని అఖిలప్రియ వివరించారు. మరోవైపు విజయవాడ పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

19:27 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద పడవ ప్రమాదం ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పడవ యాజమాన్యం రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ పార్టనర్స్ సంస్థపై ఇబ్రహీంపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా బోటును నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను జలవిహారానికి తీసుకెళ్లడాన్ని పోలీసులు నేరంగా పేర్కొన్నారు. లైఫ్ జాకెట్లు వంటి రక్షణాత్మక సామాగ్రి పరిమితంగా ఉండటం, సామర్థ్యానికి మించి పర్యాటకులను పడవలోకి ఎక్కించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండల రావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. 

 

19:25 - November 13, 2017

కృష్ణా : జిల్లాలోని ఫెర్రీఘాట్‌ వద్ద పడవ ప్రమాద ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. నిన్న 16 మంది మరణించగా, ఇవాళ మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ భూలక్ష్మి అనే మహిళ చనిపోయింది. 17 మంది డిశ్చార్జ్‌ కాగా..మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు నిన్న చనిపోయిన 16 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు అధికారులు తరలించారు. మృతుల్లో డీజీపీ బంధువు పసుపులేటి సీతారామయ్య,.. ఇంటెలిజెన్స్‌ అధికారి రామారావు మేనకోడలు లీలావతి మృతి చెందారు. అలాగే సీపీఐ నేత నారాయణ బంధువులైన ముగ్గురు... ఈ ప్రమాదంలో మృతి చెందారు. గల్లంతైన మరో ఇద్దరు మహిళల కోసం కృష్ణానదిలో అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన పరిసరాల్లో ప్రత్యేక బోట్లతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు రెస్కూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 

16:42 - November 13, 2017

కృష్ణా : బోటు ఓవర్ లోడ్ తో వెళ్లి ప్రమాదానికి గురైంది. పున్నమి ఘాట్ లో బోటు బయలుదేరి ప్రమాదానికి గురైంది. అధికారులు బోటును అడ్డుకుంటున్న వీడియోపై అనుమానాలు కల్గుతున్నాయి. వైరల్ అవుతోన్న వీడియో దుర్గ ఘాట్ లో చిత్రించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో పట్ల పర్యాటక అధికారులు నోరు మెదపలేదు. ప్రయాణికులు అధికంగా ఉండడంతో బోటు నిర్వాహకులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. అక్కడ మరో బోటు నిర్వాహకులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య తగవు తీర్చే క్రమంలో అదికారులు దుర్గ ఘాట్ కు వెళ్లారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే క్రమంలో వీడియో రికార్డ్ చేసినట్లు అనుమానం కల్గుతుంది. ప్రైవేట్ బోటింగ్ కంపెనీల మధ్య పంచాయతీ చేసేందుకే అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. రూ.300 తీసుకుని అధికారులే బోటు ఎక్కించారని బాధితులు చెబుతున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:15 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఆరుగురికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. టూరిజం శాఖకు చెందిన వారే అనధికారికంగా పలువురు బోట్లు నడుపుతున్నారని ప్రాథమికంగా తెలిసిందని సమాచారం. బోటు ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

మృతుల వివరాలు...
రాయపాటి సుబ్రహ్మణ్యం (60)  
వెన్నెల సుజాత (40)
గుర్నాధరావు  
పసుపులేటి సీతారామయ్య (64)
కె.ఆంజనేయులు (58)  
కోవూరి లలిత (35)  
అంజమ్మ (55)  
సాయిన వెంకాయమ్మ  
వెంకటేశ్వరరావు (48)
దాచర్ల భారతి (60)  
కోటిరెడ్డి (45)
రాజేశ్‌ (49)  
హేమలత (49)  
ప్రభాకర్‌రెడ్డి (50)  
కోవూరి వెంకటేశ్వరరావు(40)  
సాయిన కోటేశ్వరరావు

08:20 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను గజ ఈతగాళ్లు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లలో మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తున్నారు. పది మృతదేహాలు ఒంగోలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలిని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.

బోటులో మొత్తం 41 మంది పర్యాటకులున్నారు. 32 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు..8 మంది నెల్లూరు జిల్లా వాసులున్నారు. మృతుల్లో 15 మంది ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులుగా గుర్తించారు. వీరంతా కృష్ణా నదిలో విహార యాత్రకు వెళ్లారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - బోటు