బ్యాంకులు

15:08 - April 24, 2017

నల్గొండ : జిల్లాలో మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధుడు చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. బ్యాంకులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. క్లాక్ టవర్ సమీపంలో ఉన్న బ్యాంకుకు నాగేశ్వరరావు వృద్ధుడు వచ్చాడు. క్యూలో నిలుచున్న ఇతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడనే ఉన్న వారు ఓ గోడ వైపుకు కూర్చొబెట్టి సపర్యలు చేశారు. అనంతరం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ వృద్ధుడు పరిస్థితి ఎలా ఉందో ఎవరూ గమనించలేదు..చూడలేదు. చివరకు అతడిని చూసిన కొంతమంది అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని గుర్తించారు. ముందే ఒకవేళ ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలిస్తే బతికి ఉండేవాడోమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

11:52 - April 22, 2017

బ్యాకింగ్ రంగంలో దానికొక ప్రముఖ స్థానం ఉంది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల్లో 'హెచ్ డీ ఎఫ్ సి' ఒకటి. ఈ బ్యాంకు అనతికాలంలోనే వినియోగదారులను ఆకట్టుకుంది. దీనితో దేశ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలను నెలకొల్పింది. వేలాది కొలది జాబ్స్ కల్పించింది. కానీ పరిస్థితి తారుమారైపోయింది. పెద్ద నోట్లు రద్దు..క్యాష్ లెస్ లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో బ్యాంకు పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్వార్టర్స్ లోనూ భారీగా ఉద్యోగాల కోత పెట్టినట్లు వెల్లడైంది. 2016 డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్ లో 90,421గా ఉన్న బ్యాంకు ఉద్యోగులు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్ లో 84,325గా ఉన్నారు. అంటే దాదాపు 6096 మంది ఉద్యోగులను బ్యాంకు సాగనంపిట్లేగా. 2016 డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్ లోనూ బ్యాంకు 4581 మంది ఉద్యోగులను తగ్గించింది. అంతేగాకుండా ఉద్యోగుల ఖర్చులను కూడా బ్యాంకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో 300-400 బ్రాంచీలను ప్రారంభిస్తే ఈ ఏడాది కేవలం 195 బ్రాంచీలను మాత్రమే ప్రారంభించారంటే పరిస్థితిలో ఏంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఉద్యోగుల తగ్గింపు ప్రభావం బ్యాంకు అభివృద్ధిపై పడదని బ్యాంకు యాజమాన్యం పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

20:41 - March 13, 2017

హైదరాబాద్: ఇంకా ఎంత కాలం...ఇంకా ఎన్ని కష్టాలు...ఎప్పటికి తీరేను ఏటీఎం కడగళ్లు, ఎన్నాళ్లకు దరిచేరేను ఈ కరెన్సీ వాగ్ధానాలు. నాలుగు నెలలుగా ప్రజలు పడుతున్న సమస్య ముగింపుకు వస్తున్నాయనే లోగా, మళ్లీ అదే సీను రిపీటౌతోంది. పదిరోజులుగా ఏటీఎంలు పనిచేయక, కరెన్సీ దొరక్క ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:38 - March 9, 2017

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. డబ్బుల కోసం అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత ఆ కష్టాలు నెమ్మదిగా తగ్గినా.. ఆ తర్వాత చాలా ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య మళ్లీ ఆ పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి.

రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా..

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా.. అవి ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ నుంచి క్యాష్‌ అందకపోవడంతో ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని బ్యాంక్‌ అధికారులంటున్నారు. మరోవైపు ఎస్‌బీఐ కొత్త నిబంధనలు విధిస్తున్నాయని వార్తలు రావడంతో.. కస్టమర్లు తమ ఖాతాల నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో క్యాష్‌ వెంట వెంటనే అయిపోవడం కూడా దీనికి కారణమంటున్నారు.

ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో....

ఇక జీతాల సమయంలో ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎంలలో క్యాష్‌ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

20:34 - March 8, 2017

హైదరాబాద్: కథ మొదటికి వచ్చిందా? మళ్లీ నో క్యాష్ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏటీఎంలు, బ్యాంకులు ఎందుకు ఖాళీ అయ్యాయి? సర్కార్ ప్లాన్ బెడిసికొట్టిందా? అవసరాలకు సరిపడినంత క్యాష్ అందుబాటులో లేదా? అంతా సర్ధుమణిగింది అనుకున్నంతలోనే మళ్లీ బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? అసలు ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ లో స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:32 - January 16, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ అందించింది. విత్ డ్రా పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 8వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రూ. 2వేల పెద్ద నోటును చలామణిలోకి తెచ్చింది. విత్ డ్రా పరిమితిపై పలు ఆంక్షలు విధించింది. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఆంక్షలను సడలిస్తూ విత్ డ్రా పరిమితిని రోజుకు రూ. 4500 విధించారు. సోమవారం ఆర్బీఐ ఈ పరిమితిని ఎత్తివేసింది. రూ. 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అంతేగాకుండా ఖాతాదారులకు కూడా పరిమితిని ఎత్తివేసింది. ఇప్పటి వరకు ఉన్న రూ. 50వేల పరిమితి నుండి రూ. లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంది.

09:24 - January 11, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్ల వివరాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. కేవలం 50 రోజుల్లో పన్ను ఎగ్గొట్టిన 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో 16 వేల కోట్లు,.. యాక్టివ్‌గా లేని ఖాతాల్లో 25 వేల కోట్ల నగదు జమ కావడంతో ఐటీ శాఖతో పాటు.. ఈడీ అధికారులు ఆ లావాదేవీలపై దృష్టి సారించారు. 
బ్యాంక్‌ ఖాతాలలో 4 లక్షల కోట్లు జమ  
పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను పరిధిలో చూపని దాదాపు 3-4 లక్షల కోట్ల నగదు.. వివిధ మార్గాల్లో బ్యాంక్‌ ఖాతాలలో జమ అయినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్‌ 8 తర్వాత పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకునేందుకు 50 రోజుల సమయం ఇవ్వడంతో ఈ మొత్తం వివిధ మార్గాల్లో బ్యాంకు ఖాతాల్లోకి చేరిందన్నారు. 
పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు 
ఇక బ్యాంకులలో జమ అయిన నగదు వివరాలన్నింటిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించిన ప్రభుత్వం.. పూర్తి వివరాలను పరిశీలించి పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. పన్ను ఎగవేతదారులను, బ్లాక్‌మనీని గుర్తించేపనిలో పడ్డారు. ఇప్పటికే అనేక వివరాల ఆధారంగా కొంతమంది నల్ల కుబేరులపై దాడులు జరుపుతుండగా.. మిగతావారిపై దృష్టి సారించబోతున్నారు. 
నోట్ల రద్దు తర్వాత.. నిద్రాణమైన ఖాతాల్లో రూ.25వేల కోట్ల డిపాజిట్‌ 
ఇక  పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 లక్షల రూపాయలు.. అంతకంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్‌ అయిన ఖాతాల సంఖ్య దాదాపు 60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా బ్యాంకుల్లో మొత్తం 7.34 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రికార్డ్‌ స్థాయిలో 10,700 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక సహకార బ్యాంకుల్లో కూడా 16 వేల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయ్యాయి. ఈ డిపాజిట్లపై అనేక అనుమానాలు ఉన్నాయని.. డిపాజిట్‌ వెనక రహస్యాలన్నింటిని ఐటీ శాఖ, ఈడీలకు ప్రభుత్వం అందజేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన 13 వేల కోట్ల వివరాలను కూడా ఐటీ శాఖ అధికారులకు సర్కార్‌ అందజేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. నిద్రాణమైన ఖాతాల్లో దాదాపు 25వేల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా నవంబర్‌ 8 తర్వాత 80 వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించారు. 
జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్లపై అధికారులు వివరాల సేకరణ 
ఇక ఉగ్రవాద చాయలు ఉన్న రాష్ట్రాల్లో డిపాజిట్‌ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు అందజేసినట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. రెండు నుంచి రెండున్నర లక్షల మధ్య డిపాజిట్లు జరిగిన ఖాతాల్లోని మొత్తం 42 వేల కోట్లుగా గుర్తించామన్నారు. వీటిలో కామన్‌ పాన్‌ కార్డు, ఒక్కటే మొబైల్‌ నెంబర్‌ మీద డిపాజిట్‌ అయినవి ఎక్కువగా గుర్తించామన్నారు. వీటిపై ఆదాయపు పన్ను శాఖ వివరాలు సేకరిస్తోంది. అదేవిధంగా జన్‌ధన్‌ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్లపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 
బ్యాంకులలో జమ అయిన నగదుపై ప్రభుత్వం దృష్టి 
మొత్తానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో జమ అయిన నగదుపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే వివరాలన్నీ సేకరించి.. డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో బ్లాక్‌మనీ వివరాలన్నీ బట్టబయలు కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

06:38 - January 9, 2017

ఢిల్లీ: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇంధనం పోయించుకుంటే సేవా రుసుము వసూలు చేయాలన్న నిర్ణయంపై బ్యాంకులు వెనక్కి తగ్గాయి. దీంతో ఈనెల 13 వరకు పెట్రోల్‌ బంక్‌లలో కార్డులను అనుమతిస్తామని పెట్రో డీలర్ల సంఘం ప్రకటించింది. కార్డు స్వైపింగ్‌పై బ్యాంకులు విధించే ఒక శాతం సర్‌చార్జీ ఎత్తివేయకపోతే.. ఆ తర్వాత కార్డులపై లావాదేవీలకు ఒప్పుకునేది లేదని ప్రకటించింది.

13వ తేదీ నుంచి పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ నిలిపివేత...

అస‌లే పెద్దనోట్ల ర‌ద్దుతో నానా ఇబ్బందులు ప‌డుతున్న దేశ ప్రజ‌ల‌కు పెట్రోల్ బంకులు మ‌రో షాక్ ఇచ్చాయి. దేశ‌వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణయించింది. కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని బ్యాంకులు నిర్ణయించ‌డ‌మే దీనికి కార‌ణం. నగదు రద్దు తరువాత కార్డుల లావాదేవీలపై సర్ ఛార్జ్ ఎత్తేశారు. అయితే ఇప్పుడు మళ్లీ సర్‌ ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు దేశంలోని ప్రధాన బ్యాంకుల నుంచి పెట్రోలియం డీలర్లకు సమాచారం అందింది. దీంతో ఈ ఆకస్మిక నిర్ణయంపై పెట్రోల్ బంకుల య‌జ‌మానులు మండిప‌డుతున్నారు.

ప్రకటించిన పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్

బ్యాంకులు విధించాల‌నుకున్న ఈ కొత్త చార్జీలు వినియోగ‌దారుల‌పై భారం మోప‌డం లేదని, దీంతో అదంతా త‌మ‌పై ప‌డుతుంద‌ని పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనికి నిర‌స‌న‌గా తొలుత ఈరోజు నుంచి పెట్రోల్‌ బంక్‌లలో ఎలాంటి కార్డులను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గారు. ఈనెల 13వ తేదీ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్డులను అంగీకరించకూడదని నిర్ణయించారు. 13వ తేదీ తర్వాత కేవ‌లం న‌గ‌దు ఇస్తేనే పెట్రోలు, డీజిలు పోస్తామని ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది. ఇది ల‌క్షలాది మంది వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగించే నిర్ణయ‌మే అని చాలామంది తప్పుపడుతున్నారు.

కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై చార్జీ వ‌సూలుకు సిద్ధమైన బ్యాంకులు...

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త‌మ నెట్ ప్రాఫిట్‌ను 0.3 శాతం నుంచి 0.5 శాతంగా నిర్ణయించాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు ఒక శాతం చార్జీ విధిస్తే మా ప‌రిస్థితి ఏంటి అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ స‌మ‌స్యను ప‌రిష్కరించాల్సిన ఓఎంసీలు త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లు వ్యవ‌హ‌రిస్తున్నాయ‌ని, అందుకే అస‌లు కార్డులు తీసుకోకూడ‌ద‌ని నిర్ణయించిన‌ట్లు చెప్పారు. కార్డులపై సర్‌చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. 13వ తేదీ వరకు ఇంకెన్ని బ్యాంకులు ఎత్తివేస్తాయో వేచి చూడాల్సిందే.

16:14 - January 7, 2017

జగిత్యాల : పెద్ద నోట్లు రద్దు చేసిన 60 రోజులు పూర్తైనా బ్యాంకుల్లో డబ్బు అందుబాటులో లేక రైతులు అల్లాడుతున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పనులకు నదగు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు జగిత్యాలలో బ్యాంకుల మందు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులకు అవసరమైన డబ్బును అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ఆర్ బీఐ, కేంద్ర ప్రభుత్వంపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేక ఇబ్బందులు రైతులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు అందుబాటులో ఉంచాలని కోరారు.

12:58 - January 2, 2017

హైదరాబాద్ : కొత్త సంవత్సరంలో కూడా 'కరెన్సీ' కష్టాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 రోజుల అనంతరం పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని, అంతవరకు కష్టాలు తప్పవని స్వయంగా ప్రధాని పేర్కొన్నారు. కానీ 50 రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. సోమవారం ఉదయం బ్యాంకులు..ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విత్ డ్రా పరిమితిని రూ. 2500 నుండి రూ. 4500 కు పెంచిన సంగతి తెలిసిందే. డబ్బులున్న ఏటీఎంలలో రూ. 500, రూ.2000 వస్తుండడంతో చిల్లర దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కష్టాలు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సోమవారం ఉదయం విద్యానగర్ వద్దనున్న బ్యాంకుల వద్దనున్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంది. మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - బ్యాంకులు