బ్యాంకు రుణాలు

18:58 - June 20, 2017

విజయవాడ: ఆటో కార్మికులకు బ్యాంక్‌ రుణాలు ఇప్పించాలని కోరుతూ సిఐటియు ఆటోవర్కర్లు ధర్నా నిర్వహించారు. విజయవాడ లోని ఇండియన్‌ బ్యాంక్‌ కార్యాలయం ఎదుట కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ బాబురావు ధర్నా చేస్తున్న ఆటో కార్మికులకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు రుణాలు అందజేస్తామని .. అధికారంలోకి వచ్చాక కనీసం సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోని అమలు చేయాలని .. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో కార్మిక సంఘాలతో కలిసి బ్యాంకుల కార్యకలాపాలను స్తంభింప చేస్తామని బాబురావు హెచ్చరించారు.

14:48 - May 19, 2017

హైదరాబాద్: గ్రామీణ రహదారులు..నరకానికి నకళ్లు. ఎక్కడ చూసినా గుంతలే. బైక్‌ మీద వెళ్లినా, ఆటోలు, బస్సులో ప్రయాణించినా నడుములు విరిగే పరిస్థితి. ఇటువంటి రోడ్లకు ఇకపై మహర్దశ పట్టనుంది. అన్ని రహదారులను అద్దంలా మెరిసిపోయేలా అందంగా తీర్చి దిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్లు సౌకర్యంలేని పంచాయతీలు 423 ......

తెలంగాణలో ఇంకా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీలకు రహదారులు లేవు. అలాగే 5,534 కాలనీలకు రోడ్డు సౌకర్యంలేదు. కొత్త రోడ్లు మంజూరులో వీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ రోడ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీంతో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడంలేదు. ఇకపై ఈ దుస్థితికి స్వస్తి పలికేందుకు గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఎంజీఎస్‌వై కింద 2001 నుంచి ఇప్పటి వరకు 2,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 10,184 కి.మీ. రోడ్లు నిర్మించారు. మరో 51 రోడ్లు, 26 వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింది 2016-17లో మంజూరైన 205.65 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో చేపడుతున్న 37 రోడ్లు, 117 వంతెనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతతో పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతారు.

రోడ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు .....

కొత్తగా నిర్మించాల్సిన రహదారులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వారం రోజుల్లో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంచనాలు పెంచకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. నిధుల కొరత ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంతలు పడినా కాంట్రాక్టర్లే మరమ్మతులు చేసేలా నిబంధనలను రూపొందించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ప్రస్తుతం ఉన్న రోడ్లకు రిపేర్లు చేయాలని సర్కారు నిర్ణయించింది. 

15:41 - May 2, 2017

గుంటూరు: సీఎం చంద్రబాబు తన రికార్డులను తానే బద్ధలు చేస్తాడని వైసీపీ నేత జగన్ అన్నారు. రైతు సమస్యలపై వైసీపీ అధినేత జగన్ చేపట్టిన రెండు రోజుల 'రైతు దీక్ష'ను విమరించారు. ఓ రైతు జగన్ నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపిన వారంద‌రికీ జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు చెప్పారు. తాను చేస్తోన్న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఎండ‌ల్ని సైతం లెక్క‌చేయ‌కుండా రైతులు వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఈ సందర్భంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర సర్కారు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 13 జిల్లాల్లో సాగు క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు.చంద్రబాబు సీఎం కాకముందు రైతులు సగర్వంగా బ్యాంకులకు వెళ్లి రుణాలు పొందేవారని, ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ రోజు మిర్చి యార్డుకు కావాలనే సెలవు ప్రకటించిన చంద్రబాబును ఏమనాలి అని జగన్ ప్రశ్నించారు. బాబు పాలనలో ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. 

07:38 - September 20, 2016

హైదరాబాద్ : ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు వివిధ బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు అందుతున్నాయి. తాజగా యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా 2 వేల కోట్ల రుపాయాలను అందించేందుకు ముందుకు వచ్చింది. 
మిషన్ భగీరథలో భాగమయ్యేందుకు ముందుకొచ్చిచన యుబిఐ 
కోట్లాది మంది ప్రజల దాహార్తి తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్‌కు 2 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ఒప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆర్ డబ్ల్యుఎస్ ఆండ్ ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డిని కలిసి, తమ అంగీకారాన్ని తెలిపారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు వేగవంతం : జలవనరుల శాఖ  
మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2017 డిసెంబర్ చివరి నాటికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సర్వీస్ రిజర్వాయర్‌లకు శుద్ధి చేసిన నదీ జలాలను సప్లై చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 
యుబిఐకి అధికారులు కృతజ్ఞతలు 
మహబూబ్ నగర్ సెగ్మెంట్ కు 2 వేల కోట్ల రుపాయల రుణం ఇవ్వడానికి ఒప్పుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మిషన్ భగీరథ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 

11:39 - September 7, 2015

హైదరాబాద్ : సాగు కోసం నిత్యం శ్రమిస్తున్నా.. రైతన్నను కష్టాలు వీడడం లేదు. ప్రకృతి ప్రకోపానికి.. పాలకుల నిర్లక్ష్యానికి బలవుతూనే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయాన్ని మాత్రం వీడడం లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా.. ఫలితం ఉండడం లేదు. వివిధ రకాల షరతులతో బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. మొండిచేయి చూపుతూ.. చుక్కలు చూపిస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.

రూ.7 వేల కోట్ల రుణాలు అందించిన బ్యాంకులు......

తెలంగాణ రాష్ర్టంలో రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు వెనకబడ్డాయి. ఈ ఏడాది మొత్తం 25 వేల కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులు టార్గెట్‌ పెట్టుకున్నాయి. అయితే కేవలం 7 వేల కోట్లు మాత్రమే రైతులకు రుణాలు అందించాయి. ఖరీఫ్‌లో 18 వేల కోట్ల రుణాలను రైతులకు అందించాల్సి ఉండగా.. అందులో 30 శాతం కూడా అందించలేదు. మరో 20 రోజుల్లో ఖరీఫ్‌ ముగుస్తున్నందున అసలు రుణ మంజూరులో బ్యాంకులు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాయా..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణ మంజూరు ఆలస్యం వేనక ఉన్న కారణాలను తెలంగాణ ఆర్థికశాఖ గుర్తించేపనిలో పడింది. తద్వారా జాప్యాన్ని అధిగమించేలా చర్యలు చేపట్టబోతోంది.

రుణ మంజూరులో సమస్యలను గుర్తించిన ఆర్థికశాఖ.....

ఆర్థికశాఖ.. రుణ మంజూరులో ప్రధానంగా 5 సమస్యలను గుర్తించింది. వర్షాభావ పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా కరువు నెలకొని ఉంది. వరుణుడి రాకకోసం ఎదురుచూస్తున్న రైతాంగం కొత్త రుణాల కోసం బ్యాంకులను అనుకున్నంత మేర ఆశ్రయించడం లేదు. దాంతో పాటు తెలంగాణలో పత్తిపంట వైపు రైతాంగం మొగ్గుచూపుతోంది. అయితే.. ఖరీఫ్‌లో పత్తి పంట బీమా కోసం అధికంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే రబీలో అయితే తక్కువ ప్రీమియంకే బీమా వర్తిస్తుంది. అందుకే రబీలో సాగుకు పంట రుణాలు తీసుకునేందుకు అధికంగా పత్తి రైతులు మొగ్గుచూపుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే బ్యాంకుల చుట్టు తిరిగే రైతుల సంఖ్య తక్కువగా ఉందంటున్నారు.

బ్యాంకుల షరతులతో రైతులకు కొత్త తలనొప్పులు.....

20 నుంచి 50 వేల వరకు రుణాలు తీసుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా కొత్త రుణాల కోసం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కేవలం 25 శాతం మేర రుణాలు మాఫీ చేస్తుండడం... అంతే మేర కొత్త రుణాలు బ్యాంకులు ఇస్తుండడంతో రైతులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పైగా పాత రుణాలను కొత్త రుణాలుగా మార్చి.. వారి చేతుల్లో పదివేల లోపే పెడుతున్నాయి. దీంతో పదివేల కోసం బ్యాంకుల చుట్టు తిరిగే బదులు.. ప్రైవేటు రుణాల వైపే రైతాంగం మొగ్గుచూపుతోంది. ఇక గత రబీలో తీసుకున్న రుణాలను చెల్లించని రైతాంగం ఈ ఖరీఫ్‌లో రుణ సహాయం కోసం ముందుకు రావడం లేదు. అయితే.. ఖరీఫ్‌ ముగిసేనాటికి తాము నిర్దేశించుకున్న 18 వేల కోట్ల రుణాలను అందించాలని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. రుణ మంజూరు పర్యవేక్షణ కోసం ప్రభుత్వం.. బ్యాంకర్లతో ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మొత్తంగా రుణ మంజూరులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని అధిగమించే దిశలో విజయం సాధించి.. రైతాంగాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం..!

14:35 - July 29, 2015

అనంతపురం: బ్యాంకు పంపిన వేలం పాట నోటీసుకు మరో రైతు గుండె చెదిరింది. అప్పుల బాధలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ రైతు. అనంతపురం జిల్లా యర్రగుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలంలో అప్పు చేసి పది బోర్లు వేశాడు. అప్పులు తీరకపోగా వడ్డి మరింత రెట్టింపయింది. దీనికి తోడు బ్యాంకులో ఉన్న బంగారాన్ని వేలం వేస్తామని అధికారులు నోటీసులు పంపడంతో మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్న రైతు నారాయణరెడ్డికి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సఅందిస్తారు.

18:05 - July 21, 2015

హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నందున...పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇన్‌టెక్‌ వెల్స్ నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం....ఇక పైపులైన్లు వేసేందుకు రంగం సిద్దం చేసింది. అందులో భాగంగా నేడో రేపో టెండర్ల ఖరారుకు రంగం సిద్దం చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కేంద్ర సంస్థల నుంచి నిధుల సమీకరణ...
ఇంటింటికి రక్షిత మంచినీరు పథకం తెలంగాణ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు. వచ్చే ఎన్నికల్లోపూ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించకపోతే ఓట్లు అడగమని ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకున్నప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. భారీ ప్రాజెక్టు కావడంతో సుమారు 40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత బడ్జెట్ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు కేంద్ర సంస్థల నుంచి నిధులను సమీకరిస్తోంది.
26 చోట్ల ఇన్‌ టెక్‌ వెల్స్ నిర్మాణం
ఇప్పటికే రెండు బడ్జెట్లు కలిపి నాలుగు వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఇన్ టెక్ వెల్స్ నిర్మాణాన్ని చేపట్టింది. 26 చోట్ల వెల్స్ ను నిర్మించి....దగ్గర్లో పారుతున్న నదులు, కాల్వల ద్వారా నీటిని నింపేందుకు అనువుగా ఈ ఇన్ టెక్ వెల్స్ నిర్మాణం చేపట్టింది. అయితే ఇన్ టెక్స్ వెల్స్ నుంచి ఇంటింటికీ పైపులైన్లు నిర్మించాలంటే వేల కోట్ల ఖర్చవుతుంది. దీంతో నిధుల లేమితో సతమతమయిన వాటర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆ పనులను వాయిదా వేస్తు వచ్చింది.
రుణాలిచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భ్యాంకులు, కేంద్ర సంస్థల ఆసక్తి.....
వాటర్ గ్రిడ్ కు రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటే భ్యాంకులు, కేంద్ర సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే రుణ సదుపాయంపై వడ్డీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం కోరుతోంది. మిగులు బడ్జెట్ రాష్టం అయినందున సకాలంలో అప్పులు చెల్లించే వెసులుబాటు ఉన్నందున అంతర్జాతీయ సంస్తలు ఇచ్చిన విధంగా 3 నుంచి 4 శాతం వడ్డీలకే రుణాలు అందించాలని కోరుతోంది. ఈ దిశగా ఆయా సంస్థలతో సంప్రదింపులు సాగిస్తున్న తెలంగాణ సర్కారుకు నాబార్డు మూడు వేల కోట్లను ఈ నెలాఖరు లోపు అందించేందుకు అంగీకరించింది. దీంతో పైపు లైన్ల పనులను చేపట్టాలని నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. అందుకోసం 34 వేల 563 కోట్ల పనుల టెండర్లను నేడో రేపో పిలిచేందుకు రంగం సిద్దం చేసింది.
కంపెనీల అర్హతలు అనుభవం, ఇతర సాంకేతిక అంశాలు.....
పది రోజుల్లో టెండర్లను ఖరారు చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించింది ప్రభుత్వం. కంపెనీల అర్హతలు అనుభవం, ఇతర సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని పనులను కట్టబెట్టనుంది. అయితే వేల కోట్ల రూపాయాల ప్రాజెక్టు కావడంతో పైపు లైన్ల నిర్మాణ కంపెనీలకు దశల వారిగా నిధులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టాకును పరిశీలించి...ప్రభుత్వం సంతృప్తి చెందితే మొత్తం అమౌంట్ ను ఒకే సారి కాకుండా విడతల వారిగా చెల్లించాలని భావిస్తోంది.
మొత్తం 26 సెగ్మెంట్లలో వాటర్ గ్రిడ్ పైపు లైన్లు......
మొత్తం 26 సెంగ్మెట్లో వాటర్ గ్రిడ్ పైపు లైన్లను వేసేలా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనుంది ప్రభుత్వం. ఇలా 34 వేల కోట్లకు పైబడ్డ ఖర్చుతో నిర్మిస్తున్న లక్షల కిలోమీటర్ల పైపు లైన్లను వచ్చే ఎన్నికల లోపు పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఎంత మేర ఫలిస్తుందో చూడాలి.

Don't Miss

Subscribe to RSS - బ్యాంకు రుణాలు