భద్రాద్రి కొత్తగూడెం

14:20 - October 15, 2018

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం మారుమూల గ్రామాలైన గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేటలలో బడి లేదు.. గుడి లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు.. ఎటుచూసినా తాటికమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలు. ఆ గ్రామాలకు సరైన రోడ్లు లేవు. 30 సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పలు పార్టీల నాయకులు రావడమే కానీ ఊరికి చేసినదేమీ లేదంటున్నారు ఆ గ్రామస్తులు.. నిత్యం మోసపు నాయకుల మాటలతో మోసపోతున్నామని..  ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతమంటున్నారు. రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.  గ్రామస్తులు అంతా ఏ పార్టీకి ఓటు వేసేది లేదని తీర్మానం చేసుకున్నారు.

గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేట గ్రామాలలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. తమ ఊరు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధానంగా తమ ఊరిలో కనీస సౌకర్యాలైన తాగునీరు, సాగునీరు , రోడ్లు, బడి, కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి మోసం చేశారని, మద్యం , చీరలు ఎరగా పెట్టి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఊరి కోసం ఏమీ చేయలేదంటూ, తాగునీరు లేక నానా కష్టాలు పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చారు.. ఈ సారి ఏ నాయకుడు వచ్చిన ఎవరికి ఓటు వేసేదీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో బడి లేక మండలానికి వెళ్లాల్సి వస్తుందని, చిన్న పిల్లలను పది కిలోమీటర్ల దూరంలో బడికి పంపలేక పోతున్నామని, చాలా మంది బడిమానేసి ఇంట్లో ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు ఏ అధికారి తమ గ్రామాలకు రారని కేవలం ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలప్పుడే వీరంతా కనిపిస్తారని.. అందుకే ఈ సారి ఎవరూ వచ్చిన తమ సమస్యల పై స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పడే ఓట్లు వేయడానికి ఆలోచిస్తామంటున్నారు..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకూడదని గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నారు.. ఏ పార్టీ నేతలైనా  సరే తమకు నమ్మకం కల్పించనంత వరకు ఓటు వేసేది లేదంటున్నారు గ్రామస్తులు.. మాయమాటలు చెప్పె వారిని ఊరి పొలిమెరల్లోనే తరిమి కొడతామంటున్నారు. 

13:28 - October 15, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. నారాయణ్ ఖేడ్ టికెట్ ఆశించి భంగ పడ్డ రాములు నాయక్ తన అసమ్మతిని తెలిపినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవటంతో, నిన్న కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర  వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాతో భేటీ అయ్యారు. కుంతియా నుంచి  స్పష్ట మైన హామీ రావటంతో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు  సిధ్దమయ్యారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా, ఇల్లెందు నియోజక వర్గం నుంచి రాములు నాయక్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతించటంతో ఆయన ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలోంచి టికెట్లు రాని నాయకులు ఇతర పార్టీలకు వలసలు వెళుతున్నారు. అధికార పార్టీలో టికెట్లు రాని నాయకులను ఆకర్షించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్  తనకు ఆందోల్  టికెట్ కేటాయించక పోవటంతో టీఆర్ఎస్కు  రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్లోకి చేరుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే  టికెట్ ఆశించి భంగపడ్డ రాములు నాయక్కు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బుజ్జగించింది. ఈ ఎన్నికల్లో కూడా తనకు టికెట్ కేటాయించక పోవటంతో, రాములు నాయక్ కుంతియా హామీతో  సోమవారం మధ్యాహ్నం  కాంగ్రెస్ లో చేరనున్నారు. 

14:43 - October 7, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగూడెంలోని ప్యూన్‌ బస్తీలో ఉన్న సాయిబాబా మందిరంలో గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మెన్‌ను హత్య చేసి హుండీని చోరీ చేశారు. హత్య జరిగిన విషయాన్ని ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. 

 

18:36 - September 14, 2018

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఓ కళాశాల ప్రిన్సిపల్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తరచూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెలవులు కావాలని అడిగితే తనకు లొంగాలని మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడు. మహిళలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతున్నాడు. ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మహిళా అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహిళా అధ్యాపకులకు విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని..లేనిఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ రేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు విన్నవించారు. తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అధ్యాపకురాలు తెలిపారు. డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతారని వాపోయింది. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసేందుకు కలెక్టర్ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.   

 

21:36 - August 30, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా మణుగూరు ఎస్‌ఐ జితేందర్‌ రెచ్చిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పర్వీన్‌ను జితేందర్‌ చితకబాదాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలున్నాయి. వేరే మహిళతో జితేందర్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పర్వీన్‌కు భర్త రాసలీలల వీడియో లభించింది. భర్తతో వేరుగా ఉంటున్న పర్వీన్‌.. ఈ విషయంపై జితేందర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్‌ఐ పర్వీన్‌ను రక్తం కారేటట్లు చితకబాదాడు. చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఎస్‌ఐ... భార్యపైనే అరాచకంగా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 

18:40 - August 21, 2018

భద్రాద్రి కొత్తగూడెం : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందంటు పాలకుల ఢాంబికాల మాటలకు కొదవే లేదు. గత పాలకుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రాంతం భ్రష్టుపట్టిపోయిందంటు పాలకులు కొత్త పదాలతో తిట్లకు, శాపనార్థాలు కొనసాగుతునే వుంటాయి. కానీ ఇప్పటికీ అటవీ ప్రాంతాలలోని అమాయకులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనే లేవనే సంగతి పాలకులు మరచిపోయి మాట్లాడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన దుస్థితి..వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురుస్తున్నాయంటే చాలు అవడిబిడ్డలు అల్లాడిపోతుంటారు. ఎటువంటి రవాణా సౌకర్యాలు గానీ..తమ కష్టాల వంక గానీ చూడని..పట్టించుకోని పాలకుల మాటలు వారికి అలవాటైపోయాయి. కానీ కష్టం కాడెత్తుకు వచ్చి గుండెల్ని నలిపేస్తున్నాగానీ..కన్నీటిని కంటిలోనే అదిమిపెట్టి..ఆవేదనను పంటి బిగువులన ఒడిసిపట్టి తమ బాధలు తామే పడుతుంటారు అడవిబిడ్డలు..కానీ ఉద్దరిస్తాడనుకున్న కుమారుడు కళ్లముందే చనిపోతే..ఆ కట్లెను కాడెకు స్వయంగా కట్టుకుని మైళ్లకొద్ది నడుస్తున్న కన్నతండ్రి ఆవేదన..బాధ వర్ణనాతీతం..అటువంటి దుస్థితి..దుర్భర పరిస్థితికి నిలువుటద్దంలా కనిపిస్తోంది ఈ హృదయవిదారక ఘటన..

జిల్లాలోని గుండాలలో హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కుమారుడి కోసం ఏడవాలో..లేక భారీ వర్షాలకు తమకు దాపురించిన దుర్భర దుస్థితికి ఏడవాలో తెలీక కుమారుడి మృతికి హృదయ విదారకంగా విలపిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా మనసు ద్రవించకమానదు. గుండాలలో పురుగుల మందు తాగి నరేశ్ అనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో దాదాపు పదులకొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి వాహనాలు కూడా తిరిగే పరిస్థితి గానీ..కమ్యూనికేషన్ సౌకర్యం గానీ లేకుండా పోయింది. ఈ క్రమంలో కుమారుడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు దాదాపు 20 కిలో మీటర్ల దూరం కుమారుడి మృతదేహాన్ని కాడెకు కట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చనిపోయిన కుమారుడి కోసం గుండెలవిసేలా ఏడుస్తునే ప్రభుత్వ ఆసుపత్రికి కాడెకు కట్టి తీసుకెళ్లిన ఘటన గుండాలలో చోటుచేసుకుంది. 

06:40 - August 20, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. గుబ్బల మంగమ్మ దేవాలయానికి వెళ్లిన సుమారు 3 వందల పైగా మంది భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. సెలవు రోజు కావటంతో భారీగా భక్తులు దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో అకస్మాత్తుగా వాగులు పొంగాయి. దీంతో భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. కరెంట్‌ సదుపాయం, సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

12:06 - August 12, 2018

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పినపాక మండలం ఐలాపురంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ధాటికి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలి.. కొట్టుకుపోయింది. ఇక భారీ వర్షాలతో కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. సుజాతనగర్‌లోని సింగభూపాలెం చెరువు అలుగు మీద ప్రవహిస్తోంది. ముర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం కారణంగా సింగరేణి గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

 

13:15 - August 11, 2018

భద్రాద్రి కొత్తగూడెం : గుండాల ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని, ఏడు మెలికల మల్లన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆదివాసీ పల్లెలు జలదిగ్భందానికి గురయ్యాయి.  ఇల్లందు, సత్యనారాయణపురం ప్రాంతంలో మూడు వైపుల నుంచి కాలువలు రోడ్ల మీదకి రావడంతో రవాణా వ్యవస్థ స్థంబించిపోయింది. మరిన్ని వీడియోలో చూద్దాం.. 

12:33 - August 11, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రినుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వరావుపేట నియోజకవర్గంలోని లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు వదిలారు. వరిచేలు, నారుమళ్ళకు నష్టం వాటిల్లింది. పత్తి చేలు నీట మునిగాయి. రైతాంగం ఆందోళనలో ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Pages

Don't Miss

Subscribe to RSS - భద్రాద్రి కొత్తగూడెం