భారతదేశం

20:57 - February 23, 2018
06:49 - November 12, 2017

హైదరాబాద్ : కాలుష్యం.. కాలుష్యం..! ఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా ఇదే మాట. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు మేఘం కప్పేయడంతో.. జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఉంది. ఇది ఢిల్లీ ఒక్కదానికే పరిమితం కాలేదు. దేశంలోని చాలా ప్రధాన నగరాలూ.. ఇదే తరహా కాలుష్యపు కాసారాలుగా మారాయి. అయితే.. కాలుష్యానికి కడు దూరంగా నిలిచిన నగరాలూ లేకపోలేదు. వీటిల్లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం అగ్రభాగాన ఉండడం విశేషం. దేశంలోనే అత్యల్ప పీపీఎం నమోదైన రాజధానిగా త్రివేండ్రం నిలిచింది.

భారత దేశాన్ని ఇపుడు వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీలో పొల్యుషన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో అత్యధిక వాయు కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో పొల్యుషన్‌ లెవల్ పిఎం 502 స్థాయికి చేరగా... ఘజియాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో 720 పిఎం నమోదైంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి సరి బేసి విధానాన్ని అమలు చేస్తోంది.

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉంది. ముఖ్యంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో పొల్యుషన్‌లెస్‌ నగరంగా గుర్తింపు పొందింది. పొల్యుషన్‌ లెవల్‌ ఇక్కడ అతితక్కువగా 13 పిఎం మాత్రమే నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌, విజయవాడ నగరాలు ఢిల్లీ స్థాయితో పోలిస్తే.. అసలు కాలుష్యం లేదనే చెప్పాలి. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం 50 పీఎంలలోపు కాలుష్యం ఉంటే.. వాతావరణం చాలా బాగా ఉన్నట్లు. ఈలెక్కన, 36 పీఎంలతో హైదరాబాద్‌, 39 పీఎంలతో విజయవాడ, 34 పీఎంలతో రాజమండ్రి, 28 పీఎంలతో విశాఖ.. కాలుష్య రహిత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో కూడా 22 పిఎంల మేరకే కాలుష్యం ఉంది.

కేరళ ప్రభుత్వం పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడం... అడవుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడం, పర్యావరణం పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహనను కల్పించడం వల్లే తిరువనంతపురం అతి తక్కువ కాలుష్యం నమోదైన్నది నిపుణుల అంచనా. బెంగళూరులో కూడా పచ్చదనానికి పెద్దపీట వేయడంతో వాయు కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంది. హైదరాబాద్‌ కన్నా విజయవాడలో కాలుష్యం 3 పిఎంలు ఎక్కువగా ఉండడం గమనార్హం.  

20:33 - October 20, 2017

ఇది ఆకలి భారతం కథ. స్వతంత్రం వచ్చిఆరు దశాబ్దాలవుతున్నా తీరని వ్యథ.. తినడానికి తిండిలేక నిత్యం నానా అగచాట్లు పడుతున్న కోట్లాది భారతీయుల గాథ.. దేశంలో కుబేరుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కానీ, ఇదే భారత దేశంలో కోట్లాది మంది ఆకలిదప్పులతో అల్లాడుతున్నారంటే నమ్మగలరా? మరి ప్రభుత్వ పథకాలేమవుతున్నాయి? జిడిపి లెక్కలు, సెన్సెక్స్ సూచీల భ్రమల మధ్య కాలాన్ని వెళ్లదీసే ప్రభుత్వాలు హంగర్ ఇండియాగా మార్చేస్తున్నాయా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

పై పై మెరుగుల గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రభుత్వాలకు సరదా.. కానీ, నిజాలు కళ్లెదుట నిలబడి ప్రశ్నిస్తున్నాయి. ఇదీ దేశ అసలు రూపం అని హెచ్చరిస్తున్నాయి.. కోట్లాదిమంది భారతీయులు ఆకలితో అల్లాడుతున్నారని తేల్చి చెప్తున్నాయి.. చిన్నారులు సరైన తిండి లేక ఎదుగుదల లోపాలు పెరుగుతున్నాయని చెప్తున్నాయి. భారతదేశం.. ఇక్కడ మిలియనీర్లు వెలిగిపోతున్నారు. సంతోషం.. కానీ, పక్కనే పేదరికం విలయ తాండవం చేస్తుందని తెలుసా? హంగర్ ఇండెక్స్ ల ఆకలి కేకల లెక్కలు వెక్కిరిస్తున్నాయని తెలుసా? లక్షలాది చిన్నారులు పాలకు గొంతెండి.., పిడికెడు అన్నం లేక కన్నుమూస్తున్నారని తెలుసా?

మనిషి ఎంత పనిచేసినా, ఏం సాధించినా ఐదే వేళ్లూ నోట్లోకి వెళ్లటానికే. జానెడు పొట్ట నిండటానికే. కానీ, ఇంతటి నాగరిక ప్రపంచంలోనూ ఆకలికి సరిపడా తిండి దొరకని వారున్నారు. పౌష్టికాహారం సంగతి తర్వాత ... కడుపు నింపుకునే మార్గం దొరకని వారే ఎందరో ఉన్నారు.. ధనవంతుల జాబితాలో నాలుగో స్థానం … ప్రపంచం బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి 90మంది పైగా, మల్టి మిలియనీర్ల జాబితాలో 15వేల మంది..ఓవరాల్ గా ఇండియా ధనవంతులతో వెలిగిపోతోంది. కానీ అదే సమయంలో సరైన తిండిలేనివాళ్లూ పెరుగుతున్నారు. ఎందుకు?

ఆహార భద్రతా చట్టం వచ్చింది కానీ, పరిస్థితిలో ఇప్పటివరకు పెద్ద మార్పు రాలేదనే చెప్పాలి.. మరో పక్క భూసేకరణ చట్టాలు రైతుల భూములను మింగేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఓ పక్క వ్యవసాయానికి దెబ్బ కొడుతూ మరో పక్క సంక్షేమ పథకాల వెన్ను విరుస్తూ ఉంటే పరిస్థితి ఎప్పటికి మారుతుంది? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మా రిపోతున్నారు. పాలక పక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పుండదు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:26 - October 13, 2017

యాదాద్రి జిల్లాకు ముఖ్యమంత్రి ఢోకా, సీఎం వస్తున్నడంటే విపక్షాలోళ్ల అరెస్టు, భారతదేశం అగ్రగామి ఆకలి రాజ్యం, నెత్తి గొర్గి లంచం దీస్కున్నరని సస్పెండ్, కొండలళ్ల తిర్గుతున్న కలెక్టర్ అమ్రాపాలి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:28 - August 22, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు, బ్యాంకింగ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పదిలక్షల మంది ఎంప్లాయిస్‌ సమ్మెబాట పట్టారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఉద్యోగంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, నష్టాలపేరుతో బ్యాంకుల మూసివేత, నిరర్థక ఆస్తుల రైటాఫ్‌ను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాకింగ్‌ కార్యాకలాపాలు స్తంభించాయి. హైదరాబాద్‌లో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ధర్నాలకు దిగారు. కోటిలోని ఎస్‌బీఐ దగ్గర నిరసనలో పలువురు నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేశారు. విజయవాడలో జరిగిన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చింది.

పబ్లిక్‌సెక్టార్‌ బ్యాంకింగ్‌ రంగాన్ని దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభత్వం కుట్రలు చేస్తోందని కార్మికసంఘాల నేతలు విమర్శించారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. కంబాల చెరువు వద్దనున్న ఎస్.బి.ఐ మెయిన్ బ్రాంచ్ వ్దద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని కుంగదీసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ వద్ద బ్యాంకు ఎంప్లాస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు చేయకుండా ఉండడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్‌పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలన్న డిమాండ్‌లతో సమ్మెకు దిగినట్టు బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు.

అటు కడప, అనంతపురం జిల్లాలో ప్రభుత్వ రంగబ్యాంకులు మూతపడ్డాయి. పలుచోట్ల బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకులను ప్రవేటు పరం చేయడం, పదమూడు లక్షలకోట్ల ప్రవేటు సంస్థల మొండి బకాయిలను వసూలుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. భారీ మొత్తంలో రుణాలు ఎగవేస్తున్న కార్పొరేట్‌ బడాబాబుల ఆస్తులు జప్తు చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రకాశంజిల్లాలో బ్యాంకు ఎంప్లాయిస్‌ పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. విలీనాల పేరుతో బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని యూనియన్‌ నేతలు ఆరోపించారు.

కారుణ్య నియమకాలు వెంటనే చేపట్టాలని బ్యాంకు బొర్డులలో ఉద్యొగ డైరెక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్‌చేస్తూ .. నిజామాబాద్‌ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎస్.బి.ఐ.మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యొగులు ఆందోలన చేపట్టారు ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. తక్కువ వేతనాలతో ప్రవేటు బ్యాంకులు ఉద్యోగుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాయని గుంటూరు జిల్లా బ్యాంకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్ కంపెనీలు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేస్తువుంటే వారిపై చర్యలు తీసుకోకుండా.. నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు.

1969లో బ్యాంకుల జాతీయకరణతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఇపుడు కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడికి బ్యాంకులు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాలనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ రంగానికి నిరర్థక ఆస్తులు కేన్సర్‌లా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కష్టఫలితంగా వచ్చిన ప్రాఫిట్‌ను బడాబాబులకు ధారపోశారని విమర్శించారు. రెండున్నర లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాల రద్దు చేసి..నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిన్నిటకి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీఎత్తున నిరసనకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. 

20:36 - July 27, 2017

అఖండ భారతం..మాదే ప్రజల తీర్పు ఎలా ఉన్నా మాకున్న ఎత్తుగడలు మాకున్నాయి..బీహార్ రాష్ట్ర రాజకీయాల మార్పుతో నరేంద్ర మోడీ పంపిన సందేశమిది..మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి...బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామాచేశారు..మళ్లీ కొద్దిగంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు...24గంటల వ్యవధి లేకుండా జరిగిన పరిణామిలివి...నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలేంటీ ?..కారకులెవరు ? జరిగింది ఏంటీ ? ఈ అంశంపై ప్రత్యేక కథనం..పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

06:55 - July 1, 2017

ఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్లమెంట్‌ వేదికగా జీఎస్టీ అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ ప్రారంభసూచికంగా పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జేగంటను రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ మోగించారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

12:44 - June 21, 2017
11:30 - May 29, 2017

ఢిల్లీ : నేటి నుంచి యూరప్‌, రష్యాల్లో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం అవుతోంది. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేకపోరు లాంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని మోదీ జర్మనీ, స్పెయిన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవ్యతిరేక పోరు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర అంశాల గురించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సదస్సులో మోదీ, మెర్కెల్‌ పాల్గొననున్నారు.

మూడు దశాబ్దాల తరువాత..
జర్మనీ పర్యటన అనంతరం ప్రదాని మోదీ మంగళవారం స్పెయిన్‌ చేరుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా స్పెయిన్‌లో పర్యటిస్తుండటం విశేషం. స్పెయిన్‌ రాజు ఆరవ ఫిలిప్‌, అధ్యక్షుడు మారియానో రోజోయ్‌తో భేటీ అవుతారు. అక్కడ నుంచి మే 31న రష్యాలోని సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. జూన్‌ 2వరకు రష్యాలో పర్యటిస్తారు. 18వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. జూన్‌ 2న జరిగే అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ప్రసంగిస్తారు. జూన్‌ 3న ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రోన్‌తో మోదీ జరుపుతారు. అనంతరం భారత్‌కు తిరుగు పయనం అవుతారు.

18:58 - May 5, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

16 డిసెంబర్‌ 2012 నిర్భయ ఘటన

2012 డిసెంబర్‌ 16వ తేదీ సాయంత్రం నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ.. ఆరుగురు ప్రయాణికులు ఉన్న బస్సును ఎక్కారు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న ఆరుగురు... నిర్భయ స్నేహితుడిని చితకబాది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న బస్సులోనే గంటకుపైగా పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. చివరకు వారిద్దరినీ బస్సులోనుంచి బయటకు తోసివేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వివస్త్రంగా, అచేతనంగా పడిఉన్న నిర్భయను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబర్‌ 26న నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించారు. చివరికి చికిత్స తీసుకుంటూ డిసెంబర్‌ 29న నిర్భయ తుది ప్రాణాలు విడిచింది.

భారతదేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన

నిర్భయ ఘటన యావత్‌ భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపివేసింది. కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ ఘటన అమ్మాయిలు, మహిళలపట్ల జరుగుతున్న లైంగిక దాడిని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మహిళలపై లైంగిక దాడికి పాల్పడే కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై గొంతెత్తి నినదించారు. నిర్భయ నిందితులను ఉరితీయాలంటూ విద్యార్ధి, యువజన, మహిళా , ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. మహిళ చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రజాందోళనలతో నాటి మన్మోహన్‌ సర్కార్‌ నిర్భయ కేసు నిందితుల్లో 6గురిని అరెస్ట్‌ చేసింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ తీహార్‌ జైల్‌లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్‌ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు 2013 సెప్టెంబర్‌ 13న తీర్పు వెలువరించింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయే వరకు ఉరితీయడమే సరైన శిక్షని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇక నాటి యూపీఏ సర్కార్‌ నిర్భయ పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.

ఢిల్లీ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకెళ్లిన దోషులు

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై దోషులైన అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, ముఖేష్‌ సుప్రీంలో అప్పీలు చేశారు. దీనిపై పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ మరణ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధృవీకరించింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను సరైన సాక్ష్యంగా సుప్రీంకోర్టు పరిగణించింది. అమానుషంగా వ్యవహరించిన దోషులకు ఉరే సరైందని... భవిష్యత్‌లోనూ ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. కోర్టు రూమ్‌లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. కేవలం వారే కాదు... యావత్‌ దేశప్రజంతా సుప్రీం తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - భారతదేశం