భారత్‌

20:54 - October 15, 2017

ఢిల్లీ : ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ దుమ్ములేపింది. పూల్‌ ఏ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 3..1తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్‌ 9 పాయింట్లతో పూల్‌-ఏలో అగ్రస్థానంతో ముగించింది. చింగల్‌సేన 13 నిమిషంలో, రమణ్‌దీప్‌ సింగ్‌ 44 నిమిషంలో, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 45వ నిమిషంలో గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌ ఒక్కడే గోల్‌ చేయగలిగాడు. టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5..1, రెండో మ్యాచ్‌లో బంగ్లాను 7...0తో చిత్తుచిత్తుగా ఓడించింది.

 

21:38 - October 13, 2017

హైదరాబాద్ : ఉప్పల్ టీ-20 మ్యాచ్‌ వర్షార్పణమైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఔట్‌ ఫీల్డ్‌ తడిసిపోవడంతో... అనేకసార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు... ఆడేందుకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌-ఆసీస్‌ చెరొక టీ-20 మ్యాచ్‌ గెలిచి సమానంగా నిలిచాయి. అయితే... హైదరాబాద్‌లో టీ-20 మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులకు వర్షం దెబ్బతో నిరాశే మిగిలింది. 

 

21:54 - October 12, 2017

హైదరాబాద్ : ఉప్పల్‌లో జరిగే భారత్‌, ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 18 వందల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 56 అధునాతన సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని విజిలెన్స్, అక్టోపస్‌, షీ టీమ్స్‌, మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో ప్రేక్షకులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్‌సీఎ కార్యదర్శి శంకర్‌ నారాయణ తెలిపారు. 

 

20:07 - October 5, 2017

 

ముంబై : భారత్‌లో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యంత ధనికుల జాబితాలో ముకేష్‌ అంబానీ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 2.5 లక్షల కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. గత పదేళ్లుగా ముకేష్‌ అంబానీయే టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అంబానీ తర్వాత ఆయన సంపదలో సగం 1.25 లక్షల కోట్లతో రెండో స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. హిందూజా బ్రదర్స్‌ 1.20 లక్షల కోట్లతో మూడో స్థానం, 1.7 లక్షల కోట్లతో లక్ష్మి మిట్టల్ నాలుగవ స్థానం, 1.4 లక్షల కోట్లతో పల్లోంజి మిస్త్రీ ఐదో స్థానంలో నిలిచారు. వందమంది మంది కుబేరులతో కూడిన ఇండియా రిచ్‌ లిస్ట్‌-2017ను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని...వంద మంది కుబేరుల సంపద 26 శాతం పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గత ఏడాది రెండోస్థానంలో ఉన్న సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ ఈసారి 9వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పతంజలి చీఫ్ బాలకృష్ణ 43 వేల కోట్లతో 19 వ స్థానానికి చేరుకున్నారు. పతంజలి గత ఏడాది 48వ స్థానంలో నిలిచింది. ముకేష్ తమ్ముడు అనిల్‌ అంబానీ 20 వేల 5 వందల కోట్లతో 45వ స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణలు సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి గానీ.. కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగినట్లు ఫోర్బ్స్ తెలిపింది. 

21:25 - September 27, 2017

ఢిల్లీ : ఇండియన్ ఆర్మీ మయన్మార్‌ సరిహద్దులో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో నాగా ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ దాడుల్లో నాగా ఉగ్రవాదులు చాలా మంది  చనిపోయినట్లు భావిస్తున్నారు. తొలుత సర్జికల్‌ స్ట్రయిక్స్‌గా భావించినప్పటికీ...తాము సరిహద్దు దాటలేదని ఆర్మీ పేర్కొంది.

మయన్మార్‌ సరిహద్దులో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. మయన్మార్‌ సరిహద్దు వద్ద లెంఖు గ్రామంలో ఉదయం 4.45 గంటల సమయంలో నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు జరిపినట్లు ఈస్ట్‌ కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

సరిహద్దులో భారత జవాన్లపై అజ్ఞాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి.ఈ దాడుల్లో నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (కె)కు చెందిన ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగింది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు పారిపోగా... చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. దాదాపు 70 మంది భారత పారా కమాండోలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. 

భారత ఆర్మీ జరిపిన దాడులను సర్జికల్‌ స్ట్రయిక్స్‌గా భావించారు. ఈసారి సరిహద్దు దాటకుండానే దాడులు జరిపినట్లు ఆర్మీ ఈస్టర్న్‌ కమాండ్‌ స్పష్టం చేసింది. ఇంతకుముందు 2015లో భారత ఆర్మీ మయన్మార్‌ సరిహద్దు దాటి 15 మంది ఉగ్రవాదులను హతమార్చింది. మణిపూర్‌లోని చందేల్‌లో ఉగ్రవాదులు 18 మంది సైనికులను చంపడంతో ఆర్మీ ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎన్ ఎస్ సీఎన్ (కె) కెవైకెఎల్) ఉగ్రవాద సంస్థలకు భారీ నష్టం సంభవించింది.

2016లో భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. పివోకేలోని 4 ఉగ్ర స్థావరాలను ఆర్మీ ధ్వంసం చేసింది. కేవలం గంట వ్యవధిలో నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

09:50 - September 22, 2017

ప.బెంగాల్ : కోల్‌కతా వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి  ఆస్ట్రేలియా 202 పరుగలకే ఆలౌట్‌ అయ్యింది. ఆసీస్‌ను తొలుత భువనేశ్వర్‌ దెబ్బతీయగా.. తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ దెబ్బకొట్టాడు. కుల్దీప్‌ వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించాడు. వరుస బంతుల్లో వేడ్‌, అగర్‌, కమిన్స్‌ అవుట్‌ చేశాడు. భారత్‌ తరపున మూడో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్మిత్‌, స్టోయినిస్‌ ఆఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత ఆటగాళ్లలో కోహ్లి 92 పరుగులు చేయగా.. రహానే 56 పరుగులు సాదించాడు. 5 వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వచ్చింది.

 

20:36 - September 5, 2017

విజయవాడ : ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కు ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు. గరువులందరికీ మార్గదర్శి సర్వేపల్లి రాధాకృష్ణను విద్యార్ధులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఉపాధ్యాయుల ద్వారానే విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. రాష్ట్రాభివృద్ధి గురువుల ద్వారానే సాధ్యమన్నారు చంద్రబాబు. 

08:46 - September 4, 2017

ఢిల్లీ : శ్రీలంకపై ఐదో వన్డేల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న విరాట్‌సేన.. వన్డేల్లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. చివరి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. సిరీస్‌లో ఒక్కమ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంశ ఆశలు నెరవేరలేదు. 
 
శ్రీలంకతో జరిగిన 5 వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆరువికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో 5-0తో వన్డే సిరీస్‌ను కోహ్లీ సేన దక్కించుకుంది.

శ్రీలంక ఉంచిన 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. 17 పరుగుల దగ్గర రహానే, 29 రన్స్‌ దగ్గర రోహిత్‌శర్మ పెవిలియన్‌ చేరారు.  అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడాడు. 116 బంతుల్లో 110పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మనీశ్‌పాండేతో కలిసి మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టుస్కోరు 128 పరుగుల దగ్గర పాండే ఔటైనా.. కోహ్లీ ఆగలేదు. తనదైన శైలిలో దూకుడు కొనసాగించాడు. కేదార్‌ జాదవ్‌తో కలిసి వీరవిహారం చేశాడు.  చక్కని కవర్‌డ్రైవ్‌లతో సొగసైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు.  ఈ క్రమంలోనే వన్డేల్లో 30వశతకం బాదాడు.  194 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘతన సాధించడం ఓ అరుదైన రికార్డు.  46.3 ఓవర్లలో  భారత్‌ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 5వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌కుమార్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా... మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ బుమ్రాకు లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ వీర విజృంభణ చేసి కీలకమైన 5వికెట్లు తీశాడు.  బుమ్రా 2, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ చెరో వికెట్‌ నేలకూల్చారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ, లాహిరు తరిన్నె, మాథ్యూస్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వారెవ్వరూ పట్టుమని పదిపరుగులు కూడా చేయలేకపోయారు.

ఇదే వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ సైతం ఓ రికార్డను నమోదు చేశాడు.  100 మందిని స్టంపింగ్స్‌ చేసిన ఒకే ఒక వ్యక్తిగా ధోనీ అవతరించాడు.  గత మ్యాచ్‌లో గణతిలకను స్టంపౌట్‌ చేయడంతో 99 వద్ద నిలిచిన ధోనీ.. చివరి వన్డేలో అఖిల ధనంజయను పెవిలియన్‌కు పంపి 100 స్టంపింగ్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 301 మ్యాచుల్లోనే ధోనీ ఈ ఘనత సాధించాడు. 

 

11:24 - August 24, 2017

ఢిల్లీ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య సెకండ్‌ వన్డేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.క్యాండీలోని పల్లెకల్లె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండో వన్డే సమరానికి రంగం సిద్ధమైంది.తొలి వన్డేలో తిరుగులేని టీమిండియా రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని పట్టుదలతో ఉంది. ట్రాక్‌ రికార్డ్‌తో పాటు, ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉన్న భారత్‌...పల్లకల్లె వన్డేలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

శ్రీలంకతో సెకండ్‌ వన్డేకు కొహ్లీ అండ్‌ కో పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.తొలి వన్డేలో తిరుగులేని భారత్‌ జట్టు జోరు మీదుండగా.... రెండో వన్డేలోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. భారత్‌-శ్రీలంక 5 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో వన్డేకు  క్యాండీలోని పల్లెకల్లె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా 3వ ర్యాంక్‌లో ఉండగా ... శ్రీలంక 8వ స్థానంలో ఉంది. 

తొలి వన్డేలో ఎదురులేని విరాట్‌ ఆర్మీ...ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉంది.టాప్ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, మిడిలార్డర్‌లో  రాహుల్‌,ధోనీతో పాటు  లోయర్‌ ఆర్డర్‌లో ,కేదార్‌ జాదవ్‌,హార్డిక్‌ పాండ్య  వంటి హార్డ్‌ హిట్టర్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఎప్పటిలానే పటిష్టంగా ఉంది. శిఖర్‌ ధావన్‌, విరాట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత జట్టు పెద్ద ప్లస్‌ పాయింట్‌. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, చహాల్‌,అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లతో భారత బౌలింగ్‌ ఎటాక్‌ సైతం పదునుగా ఉంది. 

మరోవైపు వరుస వైఫల్యాలతో ఢీలా పడిన శ్రీలంక...ప్రస్తుతం డైలమాలో ఉంది. ఉపుల్‌ తరంగ నాయకత్వంలోని శ్రీలంక జట్టు....ఏంజెలో మాథ్యూస్‌,తిసెరా పెరీరా, లసిత్‌ మలింగా వంటి సీనియర్‌ ఆటగాళ్ల మీదే భారం వేసింది. 

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో శ్రీలంకతోనే ఆడినన్నీ వన్డేలు భారత్‌ మరే జట్టుతోనూ ఆడలేదు. వన్డే ఫార్మాట్‌లో ఓవరాల్‌ ఫేస్ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ లంకపై భారత్‌దే  పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 151 వన్డేల్లో పోటీపడగా....84 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 55 మ్యాచ్‌ల్లో మాత్రమే శ్రీలంక నెగ్గింది.

సెకండ్‌ వన్డేలోనూ విరాట్ ఆర్మీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండో వన్డేలో అయినా శ్రీలంక కొహ్లీసేనకు కనీస పోటీ అయినా ఇవ్వగలదో లేదో చూడాలి. 

21:42 - August 20, 2017

ఢిల్లీ : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధవన్ అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ కోహ్లీ దూకుడుతో భారత్ సునాయాస విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి భారత్ రోహిత్ శర్మ వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 132 పరుగులు, కెప్టెన్‌ కోహ్లీ 82 పరుగులతో  నాటౌట్‌గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.

Pages

Don't Miss

Subscribe to RSS - భారత్‌