భూసేకరణ

20:59 - October 4, 2017

రాజస్థాన్ : భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైతులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమాధిలో కూర్చుని నిరసన తెలిపారు. హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రైతుల నుంచి భూముల సేకరించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందని రైతులు ఆరోపించారు. తమకు తిండిపెట్టే భూములను వదులుకోమని రైతులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రైతుల గోడును అధికారులు పట్టించుకోవడం లేదు. 

 

 

19:11 - September 1, 2017

విశాఖ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఉద్యమిస్తామని సీఐటీయూ నేతలు అన్నారు. 'సేవ్ పబ్లిక్ సెక్టార్..సేవ్ విశాఖ' పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖలోని గాజువాక సెంటర్‌లో 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడమంటూ సీఐటీయూ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే లక్ష్యంగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని నేతలు మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే లక్ష్యంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్ కె.కె.రావుతో పాటు సీఐటీయూ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

21:35 - August 31, 2017
18:04 - July 29, 2017

విజయవాడ : బందరు పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సుమారు 5,300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఇక ప్రైవేట్ పట్టా భూముల సమీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం 2,282 ఎకరాల పట్టా భూములకు గాను.. ఇప్పటి వరకు 550 ఎకరాలు మాత్రమే ఇచ్చేందుకు రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్‌కు అంగీకార పత్రాలు ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు, వారి అనుచరుల పేరిట వందలాది ఎకరాల భూములున్నాయని.. వాటిని పోర్టుకు ఇవ్వకుండా రైతుల భూములను మాత్రమే తీసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

33177.78 ఎకరాల భూమి
బందరు నౌకాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 33177.78 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వీటిలో పోర్టు నిర్మాణానికి 5292.75 ఎకరాలు..ఇండస్ట్రియల్ కారిడార్, మెగాటౌన్ షిప్ కు సంబంధించి 27885.03 ఎకరాలు. వీటిలో ప్రైవేట్ భూములతో పాటు అసైన్డ్ భూములు ఉన్నాయి. పట్టా భూములు 14620.11 ఎకరాలు, అసైన్డ్ భూములు 9117.32 ఎకరాలు, ప్రభుత్వ భూములు 9440.35 ఎకరాలు ఉన్నాయి. పోర్టుకు సంబంధించి రైతుల వివరాలు సమగ్రంగా సేకరించి, వీరందరికీ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. 25 నుంచి 30 ఎకరాల భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు 25 ఎకరాల భూమి ఇచ్చినా..1836 రెవెన్యూ చట్టం ప్రకారం మెట్ట భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి రెండున్నర ఎకరాలకు మించి ప్యాకేజీ ఇవ్వకూడదనే నిబంధన ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంపై ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బందర్‌ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ చేపడితే.. పోరాటం తప్పదని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.

13:09 - July 11, 2017

నిర్మల్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా  పచ్చని పంట పొలాల నుంచి 15 మీటర్ల లోతున కాల్వ తవ్వుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరించకుండా,  పరిహారం చెల్లించకుండా భూములు లాక్కోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

19:22 - July 5, 2017

విశాఖ : జిల్లాలో ఇటీవల కాలంలో పరిశ్రమల కోసం విస్తృతంగా భూసేకరణ చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అధికారులు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. లేని తోటలను ఉన్నట్టుగా లెక్కలు చూపించి, రికార్డులు సృష్టించి బినామీలకు కోట్ల రూపాయల పరిహారం చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలో అధికారులు కూడా తమ వాటా తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడ్‌ టెక్‌ పరిశ్రమకు సేకరించిన భూమికి చెల్లించిన పరిహారంలో జరిగిన అవకతవకలపై 10 టీవీ  ప్రత్యేక కథనం...
మెడ్‌ టెక్‌ పార్కుకు గతేడాదిలో శంకుస్థాపన 
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ భూమిని కేటాయించింది. మెడ్‌ టెక్‌ పార్కుకు గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపన జరిగింది. 
మెడ్‌ టెక్‌కు 270.7 ఎకరాల భూమి కేటాయింపు
మెడ్‌ టెక్‌ వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు  భారీగా భూమి కేటాయించారు. మొత్తం 270.7 ఎకరాలు ఈ సంస్థకు ఇచ్చారు. 471, 472, 475 నుంచి 477, 480/2, 481/1 సర్వే నంబర్లలో ఉన్న భూములు కేటాయించారు.  దీనిలో ఎక్కువ భాగం ప్రభుత్వానికి చెందినదే.  కొంత మేరకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ భూములు ఉన్నాయి. ప్రైవేటు భూములు తక్కువ. అయితే మొత్తం భూమిలో 196 ఎకరాలను 172 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్టు అధికారులు నివేదికలు రూపొందించారు. మిగిలిన 75 ఎకారాల్లో ఎటువంటి సాగులేదని తేల్చారు. ఎకరానికి 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయల  వంతున మొత్తం 23.52 కోట్ల పరిహారం చెల్లించారు. అధికారులు సృష్టించిన 172 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే పట్టాలు ఉన్నాయి. మిగిలిన అందరూ బినామీలే. ఈ పరిహారం చెల్లింపు వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పరిహారం కాజేసిన అధికారులు : ప్రజా సంఘాలు  
రెవెన్యూ అధికారులు నకిలీ రైతులను సృష్టించి తమకు తెలిసినవారి పేర్లను భూములు కోల్పోతున్న రైతుల జాబితాలో చేర్చి పరిహారం కాజేశారని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. మెడ్‌ టెక్‌ భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం నిజమైన రైతులకే పరిహారం చెల్లించామని చెబుతున్నారు. మెడ్‌ టెక్‌ భూముల పరిహారం చెల్లింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తామంటున్నారు. మెడ్‌ టెక్‌కు కేటాయించిన భూములకు పరిహారం చెల్లింపులో వెలుగుచూసిన అకతవకల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

 

18:30 - May 21, 2017

కాకినాడ: భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా కాకినాడ సెజ్ పరిధిలోని... రమణక్కపేటలో సదస్సు జరిగింది. సీపీఎం, రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో... ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని నేతలు కోరారు. ఓ వైపు నేతలు మాట్లాడుతుండగానే... పోలీసులు సదస్సును అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జి, రైతు సంఘం నేత అప్పారెడ్డిని అరెస్ట్ చేశారు.

09:02 - May 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో భూసేకరణ సవరణ చట్టం -2017 అమలులోకి వచ్చింది. సవరణల అనంతరం అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఇటీవల రాష్ట్రపతి సంతకం చేశారు. అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయి ఆ బిల్లు బుధవారం తిరిగి అసెంబ్లీకి చేరింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన బిల్లును స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం... గెజిట్‌ విడుదల చేసింది. సవరణ బిల్లు ఇప్పుడు 2017 చట్టం 21గా మారింది. గెజిట్‌ విడుదలతో భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం, పారదర్శకమైన హక్కు చట్టం -2017 తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది.

గతంలో జీవో నంబర్‌ 123....
భూసేకరణ కోసం తెలంగాణ సర్కార్‌ గతంలో జీవో నంబర్‌ 123 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం దాదాపు 49వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. దీనిపై బాధితులు కోర్టుల్లో 29 కేసులు వేశారు. 2013 చట్టం ప్రకారమే తమకు పరిహారం ఇవ్వాలని కోరారు. బాధితుల న్యాయమైన డిమాండ్‌ విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. జీవో నంబర్‌ 123 ప్రకారం భూసేకరణ చేపట్టకూడదని, 2013 చట్టం ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ సవరణ బిల్లును రూపొందించింది. 2016 డిసెంబర్‌ 28న ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి ఈ బిల్లును పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ బిల్లుకు కేంద్రం పలు సవరణలు సూచిస్తూ రాష్ట్రానికి తిరిగి పంపించింది. కేంద్రం సూచించిన విధంగా సవరణలు చేస్తూ ఏప్రిల్‌ 30న ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశమై సవరణల బిల్లును ఆమోదించాయి. అనంతరం ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి గత శుక్రవారం రాజముద్ర వేయగా అధికారిక ప్రక్రియలను పూర్తిచేసుకుని రాష్ట్రానికి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ ప్రచురించడంతో నూతన భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

భూసేకరణ సరవణ చట్టం అమలు
రాష్ట్రపతి ఆమోదంతో అమలులోకి వచ్చిన భూసేకరణ సరవణ చట్టం అమలుకు అధికారులు ప్రస్తుతం నిబంధనలు రూపొందించే పనిలో ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా ఈ నిబంధనల జీవోను ఇవాళ విడుదల చేసే అవకాశముంది. ఈ జీవో విడుదల కాగానే రెవెన్యూ అధికారులు ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాల్లో భూసేకరణ ప్రారంభిస్తారని సమాచారం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే భూసేకరణ పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

08:03 - April 30, 2017

హైదరాబాద్ : భూసేకరణ చట్ట సవరణల కోసం.. తెలంగాణ శాసనసభ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. గతంలో తెలంగాణ భూసేకరణ చట్టం బిల్లును.. తమ సవరణలను బేఖాతరు చేస్తూ ఆమోదింపచేసుకున్న కేసీఆర్‌ సర్కారును.. ఈసారి తీవ్రంగా ఎండగట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని విపక్షాలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. భూ సేకరణ బిల్లుకు ఉమ్మడి సభల ఆమోదం పొందాక.. బిల్లు ప్రతిని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. గతంలో కేంద్రానికి పంపిన బిల్లుకు కేంద్ర న్యాయశాఖ కొన్ని సవరణలను సూచించింది. కలెక్టర్లకు అధికారం ఇచ్చినా ...ఫెయిర్ కాంపెన్జేషన్‌ ఇస్తామన్న పదం జోడించాలని,నిర్ధారించేందుకు అనే పదాన్ని రీ విజిట్ అన్న పదంతో మార్పు చేయాలని, (3,10) క్లాజ్‌లను తొలగించాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఈమేరకు కేసీఆర్‌ సర్కారు, సిఎస్ , ఇరిగేషన్ , రెవిన్యూ, న్యాయ శాఖల అధికారులతో సమావేశమై.. కేంద్ర సూచనల మేరకే సవరణలు చేసింది.

వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధం
ఆదివారం నాటి సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. గత సమావేశంలో 2013 భూసేకరణ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని విపక్షాలన్ని పట్టుపట్టినా.. అధికార పార్టీ సంఖ్యా బలంతో బిల్లును పాస్ చేయించి కేంద్రానికి పంపింది. అది కేంద్రం నుంచి తిరుగుటపాలో రావడంతో, దీన్ని అస్త్రంగా మలచుకుని కేసీఆర్‌ సర్కారును నిలదీయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ చట్టం 2013నే అమలు చేయాలని సీపీఎం పట్టుబడుతోంది.

బీఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీల అందని ఆహ్వానం
ఇక సభలో విపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వరాదని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. శనివారం జరిగిన బిఏసీ భేటీకి, టీడీపీ, బీజేపీలను ఆహ్వానించక పోవడం కూడా వ్యూహాత్మకమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్‌ టాపిక్‌గా ఉన్న మిర్చి రైతు సమస్యలపై చర్చకూ... బీఏసీలో కాంగ్రెస్‌ పట్టుబట్టింది. అయితే, భూసేకరణ చట్టం సవరణలకు మాత్రమే సభ పరిమితమని కేసీఆర్‌ సీఎల్పీ నాయకులకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం నాటి అసెంబ్లీ భేటీ.. ఎలా సాగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

07:55 - April 30, 2017

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్దికి కీలకమైన భూసేకరణ బిల్లులో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లులో కేంద్రం సవరణలు కోరింది. భూసేకరణ బిల్లులో విపక్షాలు అనేక సూచనలు చేసినా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సభలో తమ సంఖ్యాబలంతో బిల్లును పాస్‌ చేయించుకుని విపక్షాల సూచనలను తుంగలో తొక్కింది. ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన ఈ బిల్లుకు కేంద్రం ప్రభుత్వం సవరణలు కోరింది. దీంతో భూసేకరణ బిల్లులో సవరణలు చేయడానికి ఇవాళ శాసనసభా సమావేశం నిర్వహిస్తోంది.

2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని
భూసేకరణ చట్టం -2013కు లోబడే తమకంటూ ప్రత్యేక చట్టం ఉండాలని విపక్షాలు, నిపుణులు , ప్రజాసంఘాలు ముందునుండి వాదిస్తున్నాయి. అయితే ఈ మాటలను ప్రభుత్వం మాత్రం పెడచెవినే పెట్టింది. అంతేకాదు విపక్షాలు చేసిన సూచనలను సైతం పట్టించుకోకుండా తనకున్న సంఖ్యాబలంతో అసెంబ్లీలో బిల్లును పాస్‌ చేయించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఈ బిల్లును పరిశీలించిన కేంద్రం పలు సవరణలు చేయాలంటూ వెనక్కి పంపింది. ప్రధానంగా మూడు అంశాలకు కేంద్రం సవరణలను కోరింది. భూసేకరణ చట్టం జనవరి 2014 నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అమలవుతుందని మరోచోట పేర్కొన్నారు. ఇదే అంశాన్ని కేంద్ర న్యాయశాఖ లేవనెత్తింది. ఒకేచట్టం అమలుకు రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దాన్ని మార్చకుంటే న్యాయపరంగా చిక్కులు తలెత్తుతాయని సూచించింది. దీంతో కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందనే సవరణను చట్టంలో చేర్చనున్నారు.

పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది
చట్టంలో తెలంగాణ సర్కార్‌ పేర్కొన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్రం తప్పుపట్టింది. భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్‌ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. దీనిని తప్పుపట్టిన కేంద్రం.... పాత మార్కెట్‌ విలువ కాకుండా భూసేకరణ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించేలా సవరణ చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగానే సేకరణకు ముందు ఆయా నిర్దిష్ట ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువను సవరించి ఈసారి చట్టంలో పొందుపర్చనున్నారు. కేంద్ర చట్టంకంటే మెరుగైన పరిహారం ఇచ్చేదానిపైనా కేంద్రం సవరణ చేయాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడురెట్లు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్రప్రభుత్వం చట్టంలో పేర్కొంది. ఐతే ఇందుకు సంబంధించిన పదజాలంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. ఆ మేరకు సవరణలు చేసి బిల్లులో పొందుపర్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బిల్లును రూపొందించింది. ఈసారి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా రాష్ట్రపతి ఆమోదం పొందాలన్న ఆలోచనలో ఉంది. ముసాయిదా కాపీపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటోంది. విపక్షాలు మాత్రం రైతులకు మేలు చేసే భూసేకరణ చట్టం 2013నే అమలు చేయాలని కోరుతున్నాయి. మొత్తానికి భూసేకరణ చట్టం బిల్లుపై అసెంబ్లీ మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్దమైంది. ఈసారైనా ప్రభుత్వం విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి సర్కార్‌ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - భూసేకరణ