భూ పంపిణీ పథకం
హైదరాబాద్ : దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం నత్తకు నడక నేర్పుతోంది. కార్యక్రమం ప్రారంభం నుంచి మూడు అడుగుల ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్లలో కేవలం 3741 మందికే భూ పంపిణీ జరిగిందంటే... ఈ పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో నత్తనడకన సాగుతున్న భూ పంపిణీ పథకంపై 10 టీవీ ప్రత్యేక కథనం...
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ పథకాన్ని టీఆర్ఎస్ అమల్లోకి తెచ్చింది. కానీ ఆరంభించిననాటి నుంచి కూడా ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఉద్యమంలో భూ పంపిణీ పథకంపై టీఆర్ఎస్ చేసిన హడావుడికి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తీరుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రభుత్వ భూమిలేకపోతే కొనైనా ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత విషయాన్ని విస్మరించారన్న విమర్శలున్నాయి. మూడేళ్లలో కేవలం 3,741 మందికే భూమి ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 807మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి 50 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఎస్సీ ఆర్థిక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నా... ఇంతవరకు 93.80 కోట్ల రూపాయల వ్యయంతో 2005 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. జగిత్యాల, జనగాం, మహబూబ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనరిగి జిల్లాల్లో ఒక ఎకరా భూమి కూడా పంపిణీ చేయలేదు. ఖమ్మంలో 9మందికి, కుమ్రం భీం జిల్లాల్లో నలుగురికి మాత్రమే భూ పంపిణీ చేశారు. ఆదిలాబాద్లో 199 మందికి, జోగులాంబ-గద్వాల జిల్లాలో 77, సిద్దిపేట జిల్లాలో 71, వనపర్తిలో 75 మందికి పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
ఈ పథకం సక్రమంగా అమలు జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎకరం భూమి కొనుగోలుకు 7 లక్షల రూపాయలకు మించరాదన్న నిబంధన విధించారు. ఈ ధరకు భూమి లభించే అవకాశాలున్నా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలున్నాయి. ప్రజా ప్రతినిధులు చూపించిన భూమినే కొనుగోలు చేయాలన్న నిబంధనతో నిధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. వీరి జోక్యంతో నాలుగైదు లక్షల రూపాయలకు లభించే భూమిని 7 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా చాలా మంది ఎమ్మెల్యేలు భూ పంపిణీ పథకంపై ఆసక్తి చూపకపోవడం కూడా నత్తనడకన సాగడానికి కారణమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగున్నర నెలలే మిగిలివుంది. ఈ కొద్ది వ్యవధిలో 8వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి, పంపణీ చేయడం సాధ్యమయ్యే పనేనా.... అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Don't Miss
