మంత్రి హరీష్ రావు

09:47 - June 29, 2017

హైదరాబాద్ : ఈ సీజన్‌లో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో పత్తి రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. పత్తి విత్తనాలు గుజరాత్‌కు ఎగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి విత్తనాలతో నూనె తీసే మిల్లులకు ప్రరిశ్రమ హోదా కల్పించి, ప్రోత్సహించాలని సూచించారు. పత్తి ఎగుమతిదారులకు ఇస్తున్న ప్రోత్సహకాలను మూడు నుంచి ఐదు శాతానికి పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని హరీశ్‌రావు నిర్ణయించారు. 

 

12:33 - May 14, 2017

ఖమ్మం: సీఎం కేసీఆర్‌ కుటుంబ రాజకీయాల వల్ల మిర్చి రైతులు నలిగిపోతున్నారని విమర్శించారు టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. మిర్చి రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నంపెట్టే రైతులను కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని..గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడిపోతుంటే స్పందించడంలేదని విమర్శించారు. ఇప్పటివరకు మార్కెటింగ్‌శాఖ మంత్రి మిర్చియార్డు సందర్శించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:51 - May 13, 2017

జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు.. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హరీశ్‌రావు, మార్కెట్ యార్డు చైర్మన్‌ పటేల్ విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తరువాత ఆలంపూర్‌ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల సందర్శనకు బయల్దేరారు. ముందుగా చిన్నోనిపల్లి గ్రామం దగ్గర మంత్రి కాన్వాయ్‌ రాగానే.. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనాలలో 42 కిలో మీటర్ల కాలువ వెంట ప్రయాణించారు. అక్కడక్కడా ఆగి కాలువ నాణ్యతను పరిశీలిస్తూ ముందుకు సాగారు. 

20:07 - April 20, 2017

హైదరాబాద్: గొర్రులు మేకల నడుమ బాబుగారి జయంతి...అంగరంగ వైభవంగా అన్న పుట్టినరోజు, కోతకు రాని పంట కోసిన హరీష్ రావు...ఇట్లమ్మినా మద్దతు ధర కూడా రావు, హిందూపురంలో విపరీతమైన నీళ్ల పంచాయతీ...బాలికాక మీద కాక మీదున్న జనాలు, పక్కపొంటే ప్రాజెక్టు ఉన్నా తాగునీళ్లకు కరువు..నిజామాబాద్ దిక్కు పోతున్నది సర్కార్ పొరువు, అర్థకి పావుసేరు ధరకొచ్చిన మిర్చి పంట..పట్టించుకోని ప్రభుత్వాల మీద రైతన్నల మంట, చెరువు కింద బయటపడ్డ మరొక చెరువు..ఇప్పటికన్నా తీరాలే ఏలూరు కరువు ఇలాంటి అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:10 - April 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జలసౌధలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణపై ఈ సమావేశంలో చర్చించారు. చెరువులను కబ్జానుంచి కాపాడేందుకు... సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రావాలని సాగునీటి పారుదల, పురపాలక శాఖ అధికారుల్ని మంత్రులు ఆదేశించారు..

ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువు అభివృద్ధి...

చెరువుల పరిరక్షణలో భాగంగా మొదటిదశలో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును అభివృద్ధి చేయాలని మంత్రులు ఆదేశించారు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు.

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి.....

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణకోసం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖల అధికారులతో బృందం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.. త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు.

హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగా...

హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగా చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడతున్నామని మంత్రులు తెలిపారు.. పురపాలికలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధి కోసం సాగునీటి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హరీశ్‌ రావు స్పష్టం చేయగా.. పట్టణాల్లోని చెరువులను ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ మేయర్.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

07:08 - April 11, 2017

వరంగల్: రాష్ట్రంలో మిర్చి సెగలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది కాంగ్రెస్‌. దీనికోసం ఆ హస్తం నేతలు మార్కెట్‌ యార్డ్‌లనే అడ్డాగా చేసుకుని.. రైతులతో కలసి పోరాటబాట పడుతున్నారు. దీంతో గులాబీ సర్కార్‌కు కాంగ్రెస్‌కు మధ్య మిర్చి ఫైట్‌ సాగుతుంది. 

రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్న మార్కెట్లు

తెలంగాణాలో మార్కెట్లన్నీ మిర్చి రైతుల ఆందోళనతో అట్టుడికిపోతున్నాయి. పంటకు మద్దతు ధర లభించక.. దళారుల బాధ భరించలేక..ఎక్కడికక్కడ మిర్చి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా రైతుల పోరాటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

మార్కెట్‌ యార్డ్‌లను సందర్శిస్తున్న హస్తం నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్‌ యార్డ్‌ల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించి రైతుల గోడు వింటున్నారు. మార్కెట్లలో సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. రైతులకు అండగా కదంతొక్కుతున్నారు. ఈ మేరకు కరీంనగర్‌లో శ్రీధర్‌బాబు.. పొన్నం ప్రభాకర్‌.. జీవన్‌రెడ్డి.. పాలమూరులో డీకే అరుణ.. ఖమ్మంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి... సంగారెడ్డిలో జగ్గారెడ్డి... హైదరాబాద్‌ మార్కెట్‌లో సుధీర్‌రెడ్డి...కోదండరెడ్డిలు.. నల్గొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కోమటి రెడ్డి ఆందోళన చేశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఏకంగా తమ నియోజకవర్గం రైతులతో కలిసి వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించి హల్‌చల్ చేశారు.

వరంగల్ టౌన్ లోని మార్కెట్ ను పరిశీలించిన ఉత్తమ్..

తాజాగా ఈరోజు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమారెడ్డి వరంగల్‌జిల్లా టౌన్‌లోని మార్కెట్‌ను సందర్శించారు. అయితే మిర్చి రైతుల దగ్గరకు ర్యాలీగా వెళ్తున్న ఉత్తం.. శ్రీధర్‌బాబు..గండ్ర వెంకట్‌ రమణారెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌పై ఉత్తం మండిపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని... తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

17:36 - April 6, 2017

సిద్దిపేట : కొమురవెళ్లి మండలంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఐనాపూర్‌, గురువన్నపేట, తపాస్‌పల్లి గ్రామాల్లో వరి పంటలు, మామిడి తోటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని..విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పంటనష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించేలా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  

11:51 - March 10, 2017

హైదరాబాద్ : చర్చించే సత్తా లేకే కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈమేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు స్లోగాన్స్ ఇవ్వడం, నిరసన చేయడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ కు ఎందుకు తత్తర పాటుకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చిలిపి చేష్టలు చేస్తున్నారని పేర్కొన్నారు. రేపు ఏ ఎజెండాపై అయినా, ఎంత సేపైనా మాట్లాడటానికి, చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. సభ హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాపై మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత సమావేశాల్లోనే కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ అయిందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలు ఇష్టం లేకనే కాంగ్రెస్, టీడీపీలు వాకౌట్ చేశాయని ఆరోపించారు. సభ హుందా తనాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తనకు తానే చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:27 - March 7, 2017

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, దీనిపై మరోసారి ఉద్యమించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసేందుకు పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని తలపెట్టింది.

టెండర్లలో అవినీతి, అవకతవకలు...

సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే జలదృశ్యం పేరుతో దృశ్యశ్రవణ రూపకాన్ని ప్రదర్శించారు. పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ల మార్పు, టెండర్లలో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మరోసారి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐతో నేతలతోపాటు, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోని లోపాలను ఎత్తిచూపారు.

గుత్తేదారులకు దోచిపెట్టి, కమీషన్లు దండుకునేందుకే...

గుత్తేదారులకు దోచిపెట్టి, కమీషన్లు దండుకునేందుకే ప్రాజెక్టుల రీడిజైన్‌ చేస్తున్నారని వివిధ పక్షాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ.

రూ. 25 వేల కోట్లతో పాత ప్రాజెక్టులు పూర్తై ఉండేవి ....

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన పాత ప్రాజెక్టులను పక్కనపెట్టి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని నేతలు తప్పుపట్టారు. పాతికవేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాత ప్రాజెక్టులన్నీ పూర్తై ఉండేవన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యక్తం చేశారు. ఇరవై నుంచి ముప్పై శాతం పూర్తైన ప్రాజెక్టులకు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఈ రెండున్నరేళ్లలో వీటిని పూర్తి చేసి ఉంటే ఇప్పటికే లక్షలాది ఎకరాలకు సాగునీరు వచ్చేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తే గత ప్రభుత్వాలకు పేరు వస్తుందన్న దుర్బుద్ధితోనే కొత్త ప్రాజెక్టులు చేపడుతూ కమీషన్లు దండుకుంటున్నారని డీకే అరుణ ఆరోపించారు.

పంటకాల్వలు నిర్మించకుండా ప్రాజెక్టులు చేపడితే ఉపయోగం ఏంటి?

పంటకాల్వలు నిర్మించకుండా ప్రాజెక్టులు చేపడితే ఉపయోగం ఉండదన్న విషయాన్ని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తావించారు. డిజైన్ల మార్పులో వేల కోట్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి జైలుకు వెళ్లక దప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగునీటి పథకాల పునరాకృతి గురించి ప్రస్తావించని కేసీఆర్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్‌ చేయడంలోని ఆంతర్యం అవినీతే ప్రధాన కారణమన్నది తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ. పారదర్శకతలేని పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకం టెంటర్లను రద్దు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం ప్రకటించాలని వివిధ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

19:37 - February 28, 2017

హైదరాబాద్ : పాల‌మూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప‌నుల్లో సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీష్ రావు 12 శాతం క‌మీష‌న్‌లు దండుకుంటున్నార‌ని బిజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాల‌న అంతా కాంట్రాక్టర్ల రాజ్యంగా మారింద‌ని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై కోర్టులో పిల్ వేస్తే కేసీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్రశ్నించారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - మంత్రి హరీష్ రావు