మతతత్వం

06:56 - April 14, 2018

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి గుండెల్లో కొలువుదీరాడు. మనువు రాసినట్లుగా భావించే చాతుర్వర్ణ వ్యవస్ధ భారతదేశాన్ని శాసిస్తుండేది. వేదాలు ఘోషించిన కట్టుబాట్లు మంచేదో, చెడు ఏదో తెలుసుకోగల్గిన మనుషుల మధ్యే అంతరాల దొంతరలు సృష్టించాయి. వర్ణవ్యవస్ధను, మనుధర్మాలను తూచ తప్పకుండా పాటించే రోజుల్లో 1891 ఏప్రిల్‌ 14వ తేదిన మహారాష్ట్రలో రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా అంబేద్కర్‌ మహర్‌ కులంలో జన్మించారు. సైనిక కుటుంబంలో పుట్టినప్పటికి అంబేద్కర్‌... మహర్‌ కులానికి చెందిన వాడు కావటంతో చిన్ననాటి నుంచే ఎన్నో అవమానాలకు గురయ్యాడు. ఎంతో ప్రతిభావంతుడైనప్పటికి అంటరాని వాడనే కారణంగా ఛీత్కారాలు చవిచూశాడు.

అంబేద్కర్‌ చిన్నతనంలో ఓ సారి మండు వేసవిలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. స్టేషన్‌ నుంచి కిలోమీటర్ల దూరం ఉన్న ఆయన మామయ్య ఇంటికి చేరుకోవాలంటే ఏదో వాహనం తప్పనిసరి. కాని అంబేద్కర్‌ అంటరానివాడని తెల్సిన వాళ్లెవరు బండి ఎక్కించుకునేందుకు ఒప్పుకోలేదు. చివరకు మండుటెండలో గొంతు తడారిపోతున్నా గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేదు. ఇక చదువుకునే రోజుల్లో బహుమతులు, ప్రశంసాపత్రాలు అన్నీ అంబేద్కర్‌కే దక్కేవి. ఇదేకోవలో బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఓ నేత అంబేద్కర్‌కు ప్రశంసాపత్రాన్ని ఇచ్చేందుకూ ససేమిరా అన్నాడు. అంటరానితనపు కత్తి చేసిన ఇలాంటి ఎన్నో గాయాలకు కుమిలిపోయాడు.

ఎన్నో అవమానాలు దిగమింగిన అంబేద్కర్‌ కులవ్యవస్థ రక్కసి కోరలకు బలవుతూనే ఉన్నత చదువులు చదివాడు. బరోడా మహారాజు ఇచ్చిన వేతనంతో 1912లో బి.ఏ. పాసయ్యాడు. పట్టభద్రుడైనప్పటికి చదువుకోవాలనే కోరికతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమైంది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశానికి వచ్చినా ఇక్కడి అంటరానితనపు జాడ్యం ఆయన్ను మరింతగా వేధించింది.

21:12 - February 12, 2018

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్‌ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. విజయ్‌ శంకర్‌సింగ్‌ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.

దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్‌ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

12:28 - March 3, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కదం తొక్కారు. విద్యారంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళన చేపట్టింది. మండి హౌస్ నుండి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న దాడులను ఖండించింది. మోడీ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తోందని విమర్శించారు. బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎఉస్ఎస్ ఏజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని, పలు రకాలుగా తాము ఆందోళనలు చేయడం జరిగిందన్నారు. విద్యారంగాన్ని కాపాడడమే కాకుండా బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎజెండా మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.

12:28 - August 16, 2016

హైదరాబాద్ : దేశంలో గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతోన్మాద ఘర్షణలు పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీయడం దారుణమన్నారు. తెలంగాణలో పార్టీ ప్లీనం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవ పరిస్థితులు ప్రస్తావించని మోడీ..
మరోవైపు మోదీ స్వాతంత్ర్య సందేశంలో వాస్తవ పరిస్థితులను ప్రస్తావించలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రెండేళ్లుగా చెప్పిన విషయాలే పదే పదే చెబుతున్నారని విమర్శించారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే..దేశంలో ఆర్థికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని గొప్పలు చెప్పుకోవడం విచారకరమన్నారు.

కేంద్రం కుట్రలు..
మతతత్వాన్ని విద్యారంగంలో చొప్పించే విధంగా మోదీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని సీతారాం ఏచూరి ఆరోపించారు. జాతీయత పేరుతో మతతత్వాన్ని పెంచి పోషించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. 

06:33 - April 22, 2016

హైదరాబాద్ : యూనివర్సిటీలను కేంద్రం కాషాయమయం చేస్తోందని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ విమర్శించారు. ఏనాడూ స్వాంతంత్ర్య సంగ్రామంలో పాల్గొనని సంఘ్‌ శక్తులు తమకు అనుకూలంగా చరిత్రను రాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ సుందర్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న మతతత్వ విధానాలపై దేశవ్యాప్తంగా మేథావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి సర్కార్‌ దేశంలో ఉన్న సమస్యలను మరుగు పర్చేందుకు కుహానా జాతీయ వాదాన్ని తెరపైకి తెస్తోందని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో హైదరాబాద్‌ కలెక్టివ్స్ పేర జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్‌ సాయినాధ్, జేఎన్యూ ప్రొఫెసర్ గోపాల్‌గురు ప్రసంగించారు. విద్యా కాషాయీకరణతో దేశంలో మతతత్వం పెరిగిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

నిరక్షరాస్యులు రాజకీయాలకు దూరం..
తాము పాలిస్తున్న రాజస్థాన్, హర్యానాలో పాఠశాల సిలబస్‌ను బిజెపి పూర్తిగా మార్చివేసిందని సాయినాథ్‌ ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యార్హతలు తీసుకొచ్చారని తద్వారా దళితులు, ఆదివాసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. నిరక్షరాస్యతను నిర్మూలించాల్సిందిపోయి నిరక్షరాస్యులను రాజకీయాల నుంచి దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇంకా అంటరానితనం కొనసాగింపు..
యూనివర్సిటీల్లో విద్యార్థులపై జరుగుతున్న దాడులను సాయినాథ్, గోపాల్ గురు ఖండించారు. ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రశ్నించినందుకే రోహిత్ వేముల, కల్బూరి వంటి హేతువాదులను హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కులాలవారీగా ఉన్న సరిహద్దులను చెరపకుండా...దేశ సరిహద్దుల గురించి మాట్లాడడం ద్వారా ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని ప్రొఫెసర్ గోపాల్ గురు కేంద్రానికి సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు దాటినా ఇంకా అంటరానితనం కొనసాడడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రజా జీవనంపై జరుగున్న మతతత్వ, పెట్టుబడి దారి దాడులను తిప్పికొట్టాలని మేథావులు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలన్నారు. 

19:30 - February 15, 2016

ఢిల్లీ : జెఎన్‌యూ ఘటనకు సంబంధించి మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలు...తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీని పొడిగించింది. కోర్టు వద్ద బిజెపి ఎమ్మెల్యే సాక్షిగా లాయర్లు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. విద్యార్థుల అరెస్ట్‌కు నిరసనగా రేపు ఒకరోజు ఆందోళనకు జెఎన్‌యు అధ్యాపక బృందం పిలుపునిచ్చింది. భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న కారణంతో శుక్రవారం నాడు అరెస్ట్ అయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ను పోలీసులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారులైన లాయర్లు జెఎన్‌యు విద్యార్థులపై దాడి చేయడంతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. న్యాయవాదుల దాడిలో పలువురు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. పాటియాల కోర్టు కారు పార్కింగ్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే శర్మ రెచ్చిపోయాడు. విద్యార్థులను కిందపడేసి కొట్టాడు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరు నినాదాలు చేసినా తాను ఇలాగే చేస్తానన్నాడు. బిజెపి కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారని విద్యార్థులు మండిపడ్డారు.

బెదిరింపు కాల్స్..
ఆదివారం ఢిల్లీలోని సిపిఎం కార్యాలయంపై దాడి చేసిన దుండగులు-తాజాగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి అర్ధరాత్రి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. సిపిఎం కార్యాలయం ల్యాండ్‌ లైన్‌ ఫోన్లో ఏచూరిని చంపేస్తామని దుండగులు బెదిరించారు. ఈ ఘటనపై విచారణ జరుపనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జెఎన్‌యు వివాదానికి సంబంధించి పోలీసులు సోషల్‌ మీడియాలో వచ్చిన ట్వీట్స్‌పై దృష్టి పెట్టారు. జెఎన్‌యు విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ఆందోళన కొనసాగుతోంది. కన్నయ్య అరెస్ట్ ను నిరసిస్తూ 8 వేల మంది విద్యార్థులు క్లాసులకు హాజరు కాలేదు. కన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల అరెస్టుకు నిరసనగా 5 వందల మంది అధ్యాపకులు మంగళవారం ఒకరోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. జెఎన్‌యు క్యాంపస్‌లో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారేమోనన్న భయం నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జెఎన్‌యు వీసి జగదీష్‌ కుమార్‌ జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ఫిబ్రవరి 25 విచారణ పూర్తి..
జెఎన్‌యు ఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేసినట్టు విసి జగదీష్ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై పోలీసులతో పాటు, యూనివర్సిటీ కమిటీ కూడా విచారణ జరుపుతోందన్నారు. అప్జల్‌ గురూ కార్యక్రమంపై విచారణ ఫిబ్రవరి 25న పూర్తవుతుందని, విద్యార్థులు క్లాసులకు హాజరు కావాలని విసి విజ్ఞప్తి చేశారు. అఫ్జల్‌ గురు కార్యక్రమానికి ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ మద్దతిచ్చారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆధారాలు చూపాలని వామపక్ష నేతలు ఏచూరి, రాజా కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంతో వెనక్కి తగ్గిన హోంమంత్రి పోలీసులు పొరపాటున హఫీజ్‌ సయీద్‌ ట్వీట్‌గా భావించారని సర్ది చెప్పారు. హఫీజ్‌ సయీద్‌ ట్విట్టర్‌ను ఎపుడో బ్లాక్‌ చేశారని పాక్‌ దినపత్రిక డాన్‌ స్పష్టం చేసింది. జేఎన్‌యూలో ఆందోళనలకు, హఫీజ్‌ సయీద్‌కు లింకు ఉందన్న ఎలాంటి సమాచారాన్ని తాము హోంశాఖకు ఇవ్వలేదని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్ బస్సీ స్పష్టం చేశారు.

నినాదాలు చేసింది ఏబివిపి వారే..
పార్లమెంట్‌పై దాడి చేసి ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురుకు సంబంధించి జెఎన్‌యు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో పుటేజీ ఆధారంగా జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌తో పాటు మరో ఏడుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారు ఏబివిపికి సంబంధించినవారేనని సోషల్‌ మీడియాలో మరో వీడియో విడుదల కావడంతో, ఈ ఘటన వెనక బిజెపి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంలో భాగంగానే విద్యార్థులపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని వామపక్షాలు మండిపడ్డాయి.

15:37 - January 27, 2016

హైదరాబాద్ : నగరంలో సామరస్య వాతావరణానికి భంగం కలిగించే విధంగా మజ్లిస్‌, బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కులం..మతం పేరిట రాజకీయాల అవసరాల కోసం మార్చుకుని తరువాత లబ్ధి చేజిక్కించుకుని అధికారం కోసం పీఠమెక్కుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వి అవకాశ వాద, దుష్ట రాజకీయాలు అని విమర్శించారు. 18 నెలల్లో టీఆర్ఎస్ చేసింది శూన్యమని, సీమాంధ్ర నేతల పేరు పలకడానికే అసహ్యించుకున్న కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం ప్రేమ కురిపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి నీళ్లు నెత్తిన జల్లుకుని మేమే తెచ్చామని టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి హైదరాబాద్ ను కాపాడుకుందామన్నారు. 

21:23 - December 6, 2015

విజయవాడ : అలుపెరగని పోరాటం చేస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలన్న ఆయన మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో వివిధ ప్రజా సంఘాలు నేతలు పాల్గొన్నారు.  

21:19 - December 6, 2015

హైదరాబాద్ : దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. దేశంలో లౌకిక వాదాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో పెచ్చుమీరుతున్న మతతత్వం, కాషాయీకరణ అంశాలపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో వామపక్ష పార్టీలు సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్, చాడా వెంకటరెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశం మతతత్వ ప్రమాదంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మతమూ ఇతర మతాలపై దాడి చేయాలని కోరుకోదని, కొందరు మతపిపాసులు గాంధీని చంపిన వాణ్ని మహాత్మున్ని చేయజూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధికి విధానాలు విఘాతం..
బిజెపి అవలంబిస్తున్న విధానాలు దేశాభివృద్ధికి విఘాతంగా మారాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మోడీ గుప్పించిన ఇబ్బడి ముబ్బడి వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఓట్లేశారే తప్ప బిజేపినో లేక హిందుత్వాన్నో చూసి కాదని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో ప్రమాదకరమైన మతోన్మాదాన్ని ప్రవేశపెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రమాదకరమైన ఈ తరహా విధానాలకు వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

ముదురుపాకాన పడుతున్న మతపిచ్చి..
భారతదేశంలో మతపిచ్చి ముదురు పాకాన పడుతోందని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. బిజెపి ఎంపిలు, మంత్రులు ఇష్టానుసారంగా స్టేట్‌మెంట్లు ఇస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. మతతత్వం మూలంగా దేశ ప్రగతి కుంటుబడుతుందని, దేశానికి రావాల్సిన పెట్టుబడులు సైతం నిలిచిపోతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రమాదకరంగా మారిన బిజెపి కాషాయీకరణ విధానాన్ని సంయుక్తంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

08:41 - November 27, 2015

హైదరాబాద్ : ప్రజా జీవితాల నుండి మతాన్ని వేరు చేయాలి... దేశ సమగ్రత కోసం లౌకితత్వం ఉండాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలో భారత రాజకీయాల్లో సెక్యులర్‌ పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హోంమంత్రి విపక్షాలపై ధ్వజమెత్తారు. అస్సలు సెక్యులర్ అంటే ఏమిటి? భారత దేశంలో సెక్యులర్ ఆవశ్యకత ఏమిటి? దేశంలో ప్రైవేటు యూనివర్శిటీ లను తీసుకు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీని వల్ల జరిగే నష్టాలు, లాభాల గురించి నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఈ అంశాలపై పూర్తి విశ్లేషణను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Pages

Don't Miss

Subscribe to RSS - మతతత్వం