మధుయాష్కీకి తప్పిన ప్రమాదం

22:16 - December 6, 2018

జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లాలో మధుయాష్కీ కారుపై దాడి జరిగింది. కొమ్మిరెడ్డి రాములుకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఆయన వర్గీయులు మధుయాష్కీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మధుయాష్కీ కారు ధ్వంసమైంది. కోరుట్లలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. మెట్‌పల్లి ప్రాంతంలో మాజీ ఎంపీ కారు మధుయాష్కీపై దాడి జరిగింది. ఈ దాడిలో మధుయాష్కీకి చెందిన రెండు కార్లు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అసలేం జరుగుతోందో అర్థం కాక షాక్ తిన్న మధుయాష్కీ వెంటనే ఓ బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డికి కోరుట్ల టికెట్ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని, జువ్వాని నర్సింగరావుకి టికెట్ రావడం వెనుక మధుయాష్కీ హస్తం ఉందని కొమ్మిరెడ్డి వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వారు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
మెట్‌పల్లికి ఎందుకొచ్చారు?
అసలు మధుయాష్కీ మెట్‌పల్లి ఎందుకు వచ్చారు? అని పోలీసులు ఆరాతీస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, స్థానికేతరుడైన మధుయాష్కీ కోరుట్ల ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం చేశారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల కోడ్ ప్రకారం స్థానికేతరులు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదు. అయినా మధుయాష్కీ మెట్‌పల్లి రావడం చర్చనీయాంశంగా మారింది.

Don't Miss

Subscribe to RSS - మధుయాష్కీకి తప్పిన ప్రమాదం