మధ్యప్రదేశ్

19:11 - June 6, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే...10 రోజుల్లోపే  రైతులకు రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మందసౌర్‌లో రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు 10 రోజుల్లోనే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మోది ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని, విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. పారిశ్రామిక వేత్తలకు రెండున్నర లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిందని...రైతులకు మాత్రం మొండి చేయి చూపిందని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

 

13:44 - May 21, 2018

మధ్యప్రదేశ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గునాలో ఓ ట్రక్కు - బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలుకాగా... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

13:22 - May 21, 2018

మధ్యప్రదేశ్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుండి విశాఖ వస్తుండగా గ్వాలియర్ వద్ద బిర్లా నగర్ రైల్వే స్టేషన్ వద్ద బోగీల్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా బోగీ అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటనపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ప్రయాణీకులను వేరే ట్రైన్స్ లో తరలించారు. గాయపడినవారికి రైల్వే ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 

14:52 - April 25, 2018

ఆడవారిని ఆకాశంలో సగం, అవనిలో సగం అంటారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో తమదైన స్థానాన్ని సృష్టించుకుంటున్నారు,నిలుపుకుంటున్నారు. కృషి, పట్టుదల.. కఠోరదీక్షలే మహిళలను శిఖరసమానులను చేస్తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. సమర్థతను చాటిచెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొచ్చినా అదరక, బెదరక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటంతో పాటు తమ ముద్రను చాటిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయు సేన చరిత్రలో అద్భుత ఘట్టంలో తన ప్రతిభను చాటి చెప్పింది పేరులోనే అవనిని ప్రతిబింభించిన అవనీ చతుర్వేది. దేశంలో ‘మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ..
దేశంలో ‘మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ అవనీ చతుర్వేది. అవని మధ్యప్రదేశ్ కు చెందిన షాడోల్ జిల్లాలోని డియోల్యాండ్ అనే చిన్న పట్టణంలో చదువుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ స్క్వాడ్రన్‌లో తొలి మహిళా పైలట్‌ బ్యాచ్‌లో ఎంపికయ్యింది. హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందింది.

బహుముఖ ప్రజ్నాశాలి అవని..
ఎవరికైనా ఒకదానిపై ఆసక్తి వుంటే దానిపైనే దృష్టి పెడతారు. మరి దేనిపైనా ఆసక్తిని పెంచుకోరు. కానీ అవిని అలా కాదు. ఆమె బహుముఖ ప్రజ్నాశాలి. టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌ లాంటివాటిపై ఆసక్తే కాదు, చిత్రలేఖనంలో కూడా తన ప్రతిభను కనబరిచింది. సోదరుడు ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో దానిని స్ఫూర్తిగా తీసుకున్న అవని చిన్నవయసు నుంచీ ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఆశలు పెంచుకుంది. విమానం నడపాలనే ఆసక్తి పెరగటంతో కాలేజీ రోజుల్లో ఫ్లైయింగ్‌ క్లబ్‌లో చేరింది. ఆ అనుభవంతోనే యుద్ధవిమానాలను నడిపితే ఎలా ఉంటుందని అనుకుంది. అలాంటి అవకాశాన్ని అందుకోవాలనుకుంది. అలా శిక్షణ వైపు వెళ్లింది. మహిళలకు ఇటువంటి ఉద్యోగం ఒకవిధంగా సాహసమే అయినా ఓ సవాలుగా తీసుకున్నానని తెలిపింది అవని. కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ..తనను తాను మెరుగుపరచుకోవాలనే ఆసక్తి అవని సొంతం. దేశరక్షణలో తాను కూడా ఒక భాగం కావడం తను గర్వకారణంగా భావిస్తుంది అవని. ఇంతటి సాహసోపేతమైన రంగంలోకి రావాలనుకునే ఎందరో మహిళలకు అవని ఓ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


 

08:18 - April 1, 2018

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ లో నాలుగంతస్తుల పురాతన హోటల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. శిథిలాల కింద చాలా మంది ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను వెలికి తీశారు. శనివారం రాత్రి 9గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రద్దీ ప్రాంతంలో ఈ హోటల్ ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. తమ వారి ఆచూకి తెలియకపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

15:15 - January 23, 2018

భోపాల్ : మధ్యప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా ఆనందీ బెన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హేమంత్‌ గుప్తా ఆనందీ బెన్‌ పటేల్‌ ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన నేతలు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, అధికారులు తదితరులు హాజరయ్యారు. నవంబర్‌ 21, 1941లో జన్మించిన ఆనందీ బెన్‌ పటేల్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. గుజరాత్‌లో మోది తర్వాత ఆనందీ బెన్‌ సిఎంగా ఉన్నారు. పటేల్‌ ఆందోళన నేపథ్యంలో ఆమె సిఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  

14:53 - January 8, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేతకు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ నేతకు స్థానికుడు ఒకరు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 17న జరగనున్న నేపథ్యంలో ఓట్ల కోసం ప్రచారానికి వెళ్లిన దినేష్‌ శర్మకు ఈ అవమానం ఎదురైంది. తమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని...ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇలా నిరసన వ్యక్తం చేశానని దండ వేసిన పెద్దాయన పేర్కొన్నారు. ఆయన చర్య పట్ల తనకు ఎలాంటి కోపం లేదని...వారి అవసరాలు తీర్చేందుకు మరింత పనిచేస్తానని బీజేపీ నేత చెప్పారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

21:35 - November 20, 2017

భోపాల్ : వివాదాస్పద పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్‌పుత్‌ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్‌ సమస్యల నేపథ్యంలో డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పద్మావతి చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన పత్రాలను సమర్పించలేదని సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ ప్రసూన్‌ జోషి పేర్కొన్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్‌సీ నిర్మాతకు తిప్పిపంపింది. 

21:59 - September 13, 2017

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రయోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు హాజరు పలికేటపుడు 'యస్‌ సార్‌, ప్రజెంట్‌ సార్‌' అని చెప్పడం సాధారణం. ఇక మీదట దీనికి బదులు 'జై హింద్‌ సర్‌' అని పలకాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠాశాలలో ఈ విధానం అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని మంత్రి సెలవిచ్చారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ స్కూళ్లకు పెద్దమొత్తంలో విరాళాలిచ్చే కంపెనీలు, వ్యక్తుల పేర్లు పెడతామని విద్యామంత్రి చెప్పారు. 

12:29 - August 1, 2017

దేశంలో ఎన్నో అవమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంబులెన్స్ లు రాకపోవడంతో తమ కుటుంబసభ్యుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడిచిన ఘటనలు ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా అంబులెన్స్ లేకపోవడంతో ఓ గర్భిణీ 20 కిలోమీటర్ల మేర నడిచింది. ఈ ఘటనలో జన్మించిన శిశువు మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కత్ని జిల్లాలో చోటు చేసుకుంది.

బార్మాని గ్రామంలో బీనా అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె గర్భిణీ. బార్హి కమ్యూని హెల్త్ సెంటర్ 20 కి.మీటర్ల దూరంలో ఉంది. నొప్పులు రావడంతో అంబులెన్స్ కావాలని హెల్త్ సెంటర్ కు బీనా కుటుంబసభ్యులు సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ రాకపోవడంతో నడిచివెళ్లేందుకు బీనా సిద్ధమైంది. కొద్దిదూరం నడిచిన అనంతరం బార్హి టౌన్ ప్రాంతంలో నడిరోడ్డుపై ప్రసవించింది. కానీ జన్మించిన శిశువు మృతి చెందింది.

దీనిపై సీఎంహెచ్ వో అధికారి అశోక్ ఓ జాతీయ వారా సంస్థతో మాట్లాడారు. మాసాలు సరిగ్గా నిండకపోవడం..ఏడో నెలలో ప్రసవించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. బార్హీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంబులెన్స్ సదుపాయం లేదని, ఇది తమ కంట్రోల్ లో ఉండదన్నారు.

ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - మధ్యప్రదేశ్