మహాజన పాదయాత్ర

07:10 - March 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాసంఘాల నిరసనలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ధర్నా చేసినా.. ప్రదర్శన నిర్వహించినా.. ప్రభుత్వ అనుమతి లభించడం లేదు. మొన్న ధర్నాచౌక్‌.. నిన్న కొలువుల కొట్లాట.. ఇపుడు మిలియన్‌ మార్చ్‌.. కార్యక్రమం ఏదైనా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది.

తెలంగాణలో ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హక్కుల కోసం రోడ్డెక్కితే నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఎవరైనా తమ సమస్య పరిష్కారం కోసం కార్యక్రమం తలపెడితే వారిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారు. అంతకుమించి ఆలోచిస్తే.. జైళ్లకు పంపుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజాగొంతుకకు వేదికగా నిలిచిన ఇందిరాపార్క్‌ దగ్గరి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ధర్నాచౌక్‌లో జెండాలు ఎగురకుండా చేసి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నిర్బంధాలు, అరెస్ట్‌లతో ప్రజలు నిరసన తెలిపే హక్కునూ యధేచ్చగా కాలరాస్తోంది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. మహాజన పాదయాత్ర ముగింపు సభకు సిటీలో అనుమతివ్వకుండా సరూర్‌నగర్‌ స్టేడియంలో అనుమతించింది. గత ఆరునెలల కిందట టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తలపెట్టిన కొలువుల కొట్లాట కార్యక్రమానికి అనేక అవాంతరాలు అడ్డంకులు, నిర్బంధాలు సృష్టించింది. కోర్టు మెట్లెక్కి అనుమతి తెచ్చుకుంటేతప్ప.. సభకు అనుమతివ్వని దుస్థితి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసి.. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన కార్యక్రమం మిలియన్‌మార్చ్‌. ఈ కార్యక్రమం జరిగి మార్చి 10తో ఏడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పైనున్న ముగ్దూమ్‌ విగ్రహం దగ్గర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కోదండరామ్‌ అధ్యక్షతన మిలియన్‌మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమం తలపెట్టాయి. నాటి ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి నెమరువేసుకుంటూ.. ఆ స్ఫూర్తితో భవిష్యత్‌ ఉద్యమాలకు నాందిపలకాలని నిర్ణయించారు. అయితే ఈ సభకు అనుమతి ఇవ్వలేమంటూ హైదరాబాద్‌ పోలీసులు తేల్చి చెప్పారు. ఎవరైనా మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమానికి వస్తే అరెస్ట్‌లు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అరెస్ట్‌లు, నిర్బంధాలకు తెరతీశారు. ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీలకు చెందిన 500 మందికిపైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ట్యాండ్‌ బండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 5 గంటల నుంచే దారులు మూసేస్తున్నట్టు ప్రకటించారు. నెక్లెస్‌రోడ్డు, లిబర్టీ, బషీర్‌బాగ్‌ల రహదారులను మూసేయనున్నారు. లుంబినీపార్క్‌, ఎన్టీఆర్‌ పార్క్‌లను మూసివేస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న టెన్షన్‌ నెలకొంది.

10:13 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా విమర్శించారు. ఎంబీసీల సమస్యపై ఆయన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకంలో వీరు భాగస్వాములు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష గురవుతున్న ప్రజల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకొచ్చేందుకు 'మహాజన పాదయాత్ర' జరిగిందని..ఈ పాదయాత్ర ఫలింగా ఎంబీసీలపై పలు వరాలు కురిపించిందని గుర్తు చేశారు. ఎంబీసీలకు వెయ్యి కోట్లు కేటాయించారని..ఎంబీసీల జాబితా ప్రకటిస్తామని..ఇటీవలే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ నిధులు ఇంతవరకు కేటాయించలేదని, ఎంబీసీల ప్రాధాన్యత క్రమాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదని విమర్శించారు. ఎంబీసీలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 

15:58 - October 24, 2017

'సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధి'కోసం 'మహాజన పాదయాత్ర'గా తెలంగాణ మొత్తం 4200 కి.మీ నడిచిన ఉక్కు మహిళ ఎస్ రమ. మహిళా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ. కార్మిక సమస్యలపై ప్రజలకోసం కొట్లాడే ధీర వనిత 'రమ'. మహాజన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ 'స్ఫూర్తి' ఆమెను పలకరించింది. మహాజన పాదయాత్ర ముచ్చట్లు.. వాటి ఫలితాలు ప్రజా పోరాటాలపై 'రమ' గారు వెళ్లడించిన ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోలో చూడండి.

09:44 - October 18, 2017

హైదరాబాద్ : లాల్‌... నీల్‌ జెండాల ఐక్యత దేశానికి అవసరమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం ఐక్యంగా ఉద్యమించి సాధించాలని పిలుపునిచ్చారు. హిందమతోన్మాదం,  సామ్రాజ్యవాదం కలయితో ఉద్భవించిన సరళీకరణ విధానాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలని ఆకాంక్షించారు. సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నేతలు... సామాజిక న్యాయం, పాదయాత్ర లక్ష్యాల సాధనకు అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.

సామాజిక న్యాయం - రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తయ్యింది.  దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వార్షికోత్సవ సభ నిర్వహించారు.  ఈ సభలో పాల్గొన్న  పౌరహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌... హిందూమతోన్మాదం, సామ్రాజ్యవాదమనేవి ఇప్పుడు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలని అన్నారు.  ఈ రెండింటి కలయిక వల్ల ఉద్భవించిన సరళీకరణ విధానాలనేవి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయన్నారు.  వీటి ఫలితంగా వ్యక్తిగత జీవితం, వ్యవస్థ చిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను తిప్పికొట్టకుండా దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధ్యంకాదని తేల్చిచెప్పారు.  వీటిని సాధించాలంటే ముందు దేశంలోని వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలని నొక్కి చెప్పారు. 

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై జమిలీ పోరాటాలు నిర్వహించాలని  ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు పిలుపునిచ్చారు.  కుల వివక్ష అనేది మన దేశంలో ఒక క్రూర జంతువులాంటిదని.. దాన్ని అడ్రస్‌ చేయకుండా సామాజిన న్యాయాన్ని సాధించలేమన్నారు.  ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు  ఉద్యమించాలన్నారు. 

తెలంగాణలో సామాజిక న్యాయం సాధించేదాకా పోరాటంలో వెనుదిరగబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు.  ఇందుకోసం ఎన్నాళ్లైనా, ఎన్నేండ్లయినా ఉద్యమిస్తామన్నారు.  సామాజిక న్యాయం సాధించేందుకు  రాబోయే రోజుల్లో విస్తృత ఐక్య కార్యాచరణ అవసరమన్న తమ్మినేని.. ఈ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న ప్రజాయుద్దనౌక గద్దర్‌..  సామాజిక  న్యాయమనేది ఒక రాజకీయ సమస్యని అన్నారు.  పాదయాత్ర ద్వారా సీపీఎం మాస్‌లైన్‌కు దారి వేసిందన్నారు.  దానికి మరో ముందడుగే టీమాస్‌ ఫోరం ఏర్పాటన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  బి. వెంకట్‌ అధ్యక్షత వహించారు. పాదయాత్రలో పాల్గొన్న బృంద సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

20:56 - October 17, 2017
20:41 - October 17, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధించేదాక పట్టుదలతో ముందుకు సాగుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు..సామాజిక తరగతులపై ప్రభావం అంశంపై సదస్సు జరుగుతోంది. తమ్మినేని, గద్దర్, హరగోపాల్, కాకి మాధవరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. మహాజన పాదయాత్ర ఐదు మాసాల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని గుర్తు చేశారు. ఇచ్చినోడు ఎవరైనా..తెచ్చినోడు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని, అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఆవిష్కరించాలని పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి సాధించడం..అందుకు మార్గాలను అన్వేషించడం లక్ష్యమన్నారు. తమ పాదయాత్ర ప్రారంభమయిన అనంతరం ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. పాదయాత్రలో ఎక్కడా సీపీఎం గురించి ప్రచారం చేయలేదని..రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దోపిడీ..పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే వర్గపోరాటాలు అని తెలిపారు.

మొత్తం ప్రత్యామ్నాయ విధానాలు కోరుకున్న వారంతా ఐక్యతలో భాగం కలవాలని సూచించారు. 4200 సంఘాలు ఒక తాటిపైకి రావడం జరిగిందని, ఇందులో కుల..వర్గ..ప్రజా..యువకులు..విద్యార్థులు..మహిళలున్నారని తెలిపారు. రాబోయే కాలంలో విస్తృతమైన ఐక్యత చేయాల్సినవసరం ఉందని, ఇందుకు కృషి చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన విధంగా పనులు జరగడం లేదని, ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభివృద్ధి అంటే ఏమిటీ.. అనే దానిపై పాదయాత్రలో వివరంగా చెప్పడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విషయాలు చెబుతోందన్నారు. పీడన కూడా పోవాలన్నదే తమ లక్ష్యమని అదే సామాజిక న్యాయమన్నారు. కులం..వర్గం పై చర్చ జరుగుతోందని, కంచె ఐలయ్యపై సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్లు..ప్రాతినిధ్యం..సామయాజిక హోదా..రాజకీయ ప్రాతినిధ్యం హక్కుల కోసం పోరాడే విధం ముఖ్యమైన అంశమన్నారు. సామాజిక న్యాయం సాధించేదాక పట్టుదలతో ముందుకు సాగుతామని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనతో పాదయాత్ర చేసిన వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు..పాదయాత్రకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

19:56 - October 17, 2017

హైదరాబాద్ : సరళీకృత ఆర్థిక విధానాలు పెను ప్రభావం చూపెడుతున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర'' ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ''సరళీకృత ఆర్థిక విధానాలు - సామాజిక తరగతులపై ప్రభావం'' అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగాన్ని తిరస్కరించడం..ప్రజాస్వామ్యం పనికి రాదనడం..హిందూ రాష్ట్రం కావాలని ప్రతిపాదించడం..పై పదేళ్ల క్రితం పట్టించుకోలేదన్నారు. వామపక్ష పార్టీలు భావజాలాన్ని అంత సీరియస్ గా అనుకోలేదని, కానీ ఈ రోజు అలా అనుకోవడానికి వీలు లేదన్నారు. బీజేపీ పార్టీ వచ్చిన అనంతరం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని సూచించారు. హిందూ మత భావజాలం ఇంత బలంగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. రాజ్యాంగంపై మార్క్స్ కొన్ని అభిప్రాయాలు తెలియచేశారని, రాజ్యాంగంలో ఉన్న స్పూర్తి..ప్రజాస్వామ్య సంస్కృతి..సమభావన..అసమానతలు తగ్గించడం..సమసమాజం వైపు దేశం వెళ్లాలని ఆలోచించడం లేదన్నారు. కానీ దేశం ఎటు వైపు వెళ్లాలో..ఏం చేయాలో రాజ్యాంగంలో అంబేద్కర్ రాసి పెట్టారని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడి మన దేశానికి ఎందుకు అన్న ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు. రాజకీయాల్లో ఆర్థిక సమస్యలు..అసమానతలు..భద్రత..మనిషి ఎలా జీవించాలనే దానిపై చర్చ జరగడం లేదన్నారు. ప్రస్తుతం ఏమి తినాలో అనే దానిపై చర్చ జరుగుతోందన్నారు. అంబేద్కర్ హిందూ జాతీయవాది అని ఓ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారని, కుల నిర్మూలన..ఫాసిజంపై అంబేద్కర్ ఎంతో రాశారని తెలిపారు. ప్రొ.హరగోపాల్ ప్రసంగం పూర్తిగా వినాలంటే వీడియో క్లిక్ చేయండి...

17:28 - October 17, 2017

హైదరాబాద్ : 'సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి' పేరిట సీపీఎం మహాజన పాదయాత్ర జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 17, 2016న ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన.. ఈ యాత్రకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వం వహించారు. తొమ్మిది మంది నేతలు యాత్రలో పాల్గొన్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్వీకేలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యుడు నైనాన్ రాజు టెన్ టివితో మాట్లాడారు. ఆదివాసీల తరపున తాను పాల్గొనడం జరిగిందని, కానీ చాలా గ్రామాల్లో రోడ్లు లేవన్నారు. అడవిమార్గంలోనే ప్రసవాలు జరుగుతున్నాయని, విద్య ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. హరితహారం పేరిట పోడు భూములను లాక్కొంటోందని..జయశంకర్ జిల్లాలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

వ్యవసాయ కూలీల పరిస్థితి దుర్భంగా మారిపోయిందని తమ పాదయాత్రలో గమనించామని మరో పాదయాత్ర బృంద సభ్యుడు నగేష్ టెన్ టివికి తెలిపారు. లక్షలాది..కోట్లాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని తెలిపారు. సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:16 - October 17, 2017

హైదరాబాద్ : పల్లె... పల్లెకు వెళ్లింది..! ప్రతి వ్యక్తిని కదిలించింది..! కష్టాలను తెలుసుకుంది..! బడుగు, బలహీన వర్గాల గొంతుకై .. ప్రభుత్వాన్ని నిలదీసింది! పాలకుల గుండెల్లో దడ పుట్టించి... సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ప్రజల్లో చైతన్యం నింపింది.. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనతో... ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. చూస్తుండగానే సీపీఎం మహాజన పాదయాత్ర జరిగి ఏడాది దాటిపోయింది. ఈ సందర్భంగా ఎస్వీకేలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతోంది. సెమినార్ తో పాటు వార్షికోత్సవ సభ కాసేపట్లో జరుగనుంది. పలువురు నాయకులు..కార్యకర్తలతో పాటు పాదయాత్ర బృంద నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యులతో టెన్ టివి ముచ్చటించింది. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

18:42 - October 14, 2017

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా  పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పాదయాత్ర ఫలితంగానే 270కి పైగా సంఘాలతో టీమాస్ ఫోరం ఏర్పాటైందని తెలిపారు. జనవరిలో ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. టీప్రభుత్వం హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పలు అంశాలను ఆయన మాటల్లోనే...
'మహాజన పాదయాత్ర లక్ష్యాలు ఒకటి, రెండు సంవత్సరాల్లో నెరవేరే లక్ష్యలు కాదు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దీర్ఘకాలిక లక్ష్యాలు. పాదయాత్రకు స్పందంచిన ప్రభుత్వం ప్రజలపై కొన్ని వరాలు ప్రకటించింది. కానీ అవన్నీ అమలు కాలేదు. రాష్ట్రంలో గొర్రెలు, చేపల పంపణీ జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళిక జరగలేదు. పాదయాత్ర తర్వాత సాధించిన పెద్ద ముందడుగు.... టీమాస్ ఏర్పాటు. టీమాస్ లో అన్ని వామపక్షాలు ఇంకా కలిసి రాలేదు. త్వరలో సీపీఐకి సంబంధించిన సంఘాలు టీమాస్ లోకి వస్తాయి. నేరెళ్ల ఘటనపై ముందుగా స్పందించింది టీమాస్. దీని వెనుక ఉన్న కోణాన్ని వెలికితీసింది టీమాస్. ఇసుక దందాను బయటికి తీసింది. ప్రజల్లోకి వెళ్లకుండా టీమాస్ విజయవంతం కాలేదు. భవిష్యత్ లో ప్రజల్లోకి వెళ్తాం. టీమాస్ నిర్మాణ దశల్లో ఉంది. మండలాలు, గ్రామాల్లో టీమాస్ కమిటీలు ఏర్పాటు కావాల్సివుంది. టీమాస్ ఆమోదించిన ప్రణాళికపై పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయాల్సి ఉంది. సీఎంకు రాసిన లేఖల విషయంలో ప్రతి సమస్యపై సీఎం స్పందించారు. ప్రభుత్వం పెద్ద పెద్ద మోసాలకు పాల్పడుతోంది. ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం అనుసరిస్తలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం, ఉద్యోగాల భర్తీ నెరవేర లేదు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ఇచ్చేనోటిఫికేషన్ల అన్నింటిని కోర్టులు కొట్టివేస్తున్నాయి. ఆ విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దీంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. ప్రజా సమస్యలపై పని చేస్తాం. సమస్యలపై ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తాం. జనవరిలో రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమాలు చేపడతామని' హెచ్చరించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss

Subscribe to RSS - మహాజన పాదయాత్ర