మారుతి

12:11 - October 7, 2018

ఈ వారం నోటాతో పాటు రిలీజ్ అయిన మరో సినిమా.. భలేమంచి చౌక బేరమ్.. దర్శకుడు మారుతి కథ అందించాడు.. ఇంతకుముందు మారుతి కథలిచ్చిన రోజులుమారాయి, బ్రాండ్ బాబు సినిమాలు పరాజయం పాలయ్యాయి... రోజులుమారాయిని డైరెక్ట్ చేసిన మురళీకృష్ణ దర్శకత్వంలో, కేరింత నూకరాజు, నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా,  తెరకెక్కిన భలే మంచి చౌక బేరమ్ ఎలా ఉందో చూద్దాం..

కథ :      

దుబాయివెళ్ళి డబ్బు సంపాదించి, తమకుటుంబాలని బాగా చూసుకోవాలనుకునే ఇద్దరు కుర్రాళ్ళు, సలీమ్(నూకరాజు), పార్ధు(నవీద్)..
ఒక బ్రోకర్ మోసం చెయ్యడంతో, హైదరాబాద్‌లో ఒకేరూమ్‌లో ఉంటూ.. ఒకరు వ్యాన్ డ్రైవర్‌గా, ఇంకొకరు కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటారు.. ఒకానొక రోజు ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ వ్రాసిన దేశ రహస్యాలు అనే ఫైల్ కొరియర్ బాయ్ అయిన సలీమ్ చేతికొస్తుంది.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని, లైఫ్‌లో సెట్ అయిపోదామనుకుంటారు.. వాళ్ళ ప్లాన్ ఫలించిందా, లేదా, చివరకి ఆ ఫైల్ ఎవరి చేతికి చేరింది అనేదే  భలే మంచి చౌక బేరమ్ కథ..
నటీనటులు :

కేరింత, నాన్న..నేను..నా బాయ్ ఫ్రెండ్ లాంటి సినిమాల్లో  చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న నూకరాజు ఈ సినిమాలోనూ తనస్టైల్ కామెడీతో అలరించే ప్రయత్నం చేసాడు.. నవీద్ కటౌట్ బాగుంది కానీ నటన పరంగా ఏమంత ఆకట్టుకోలేక పోయాడు..
హీరోయిన్ యామిని భాస్కర్ ఉన్నంతలో ఓకే అనిపిస్తే, రాజారవీంద్ర ఫుల్ లెంగ్త్ రోల్‌లో తన క్యారెక్టర్‌తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు..  ఉగ్రవాదిగా చేసిన ముజ్ తబా అలీఖాన్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు..
సాంకేతిక వర్గం :

హరి గౌర పాటలు ధియేటర్‌లోనే మర్చిపోతాం.. ఆర్ఆర్ పర్వాలేదు.. తక్కువ బడ్జెట్ సినిమా అయినా, తన కెమెరా వర్క్తో క్వాలిటీ చూపించాడు కెమెరా మెన్ బాల్ రెడ్డి.. మారుతి కాన్సెప్ట్ కామెడీ పరంగా వర్కవుటయ్యేదే కానీ, టేకింగ్ విషయంలో డైరెక్టర్ తడబడడంతో భలే మంచి చౌక బేరమ్ ఆకట్టుకోలేక పోయింది...


తారాగణం :  పార్వతీశం (కేరింత నూకరాజు), నవీద్, రాజారవీంద్ర, యామిని భాస్కర్..

కెమెరా     :  బాల్ రెడ్డి

సంగీతం   :  హరి గౌర

కథ         మారుతి

నిర్మాత     ఆరోళ్ళ సతీష్ రెడ్డి

స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ : మురళీకృష్ణ
 

రేటింగ్ 2/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

12:55 - July 25, 2016

టాలీవుడ్..ఏ వుడ్ అయినా వారసుల ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. అంటు తండ్రి..ఇటు తనయులు నటిస్తూ అభిమానులను రంజింప చేస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో వెంకటేష్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తన తనయుడు 'అర్జున్' వచ్చేదాక నటిస్తూనే ఉంటానని స్వయంగా వెంకీ పేర్కొన్నాడు. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా అని వెల్లడించాడు.
వెంకటేష్ తాజా చిత్రం 'బాబు బంగారం' ఆడియో కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడారు. 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియలేదని, ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ బాబు బంగారం ట్రైలర్ చూసిన తర్వాత 'మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్ పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా' అని మారుతిని అడిగినట్లు తెలిపారు. మారుతి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

 

07:46 - December 17, 2015

వెంకటేష్‌ హీరోగా, నయనతార హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ టెంపుల్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి షాట్‌కు వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందే సినిమాను నిర్మించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. 'ఉత్తమ విలన్‌', 'చీకటి రాజ్యం' వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన జిబ్రాన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మూడు అద్భుతమైన బాణీలు రెడీ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభి 2016 ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

09:56 - November 28, 2015

వెంకటేష్‌, నయనతార ముచ్చటగా మూడవసారి కలిసి నటించబోతున్నారు. 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో జంటగా నటించిన ఈ ఇద్దరూ తాజాగా మారుతి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో నటిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం 2గా సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వెంకటేష్‌, నయనతార జంటగా కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవలే 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 16న సినిమాను ప్రారంభించి అదే రోజు నుంచి షూటింగ్‌ జరుపనున్నాం. 'రన్‌ రాజా రన్‌', 'జిల్‌', 'ఉత్తమ విలన్‌', 'చీకటి రాజ్యం' వంటి చిత్రాలకు సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం' అని అన్నారు.

Don't Miss

Subscribe to RSS - మారుతి