ముందస్తు

13:22 - July 8, 2018

హైదరాబాద్ : జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లా కమిషన్ రెండో రోజు సమావేశం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల పార్టీల నేతలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎంపీ వినోద్ లా కమిషన్ ఎదుట హాజరై పార్టీ అభిప్రాయాని తెలియచేశారు. జమిలి ఎన్నికలకు మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తలపుంతో ఉన్నామని...దీనివల్ల ప్రజాధానం ఆదా అవుతుందని తెలిపారు. ఇది ముందస్తు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:42 - July 8, 2018

తూర్పుగోదావరి : ముందస్తు ఎన్నికలు రాజకీయ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆరునెలల ముందే ఎన్నికలు వస్తాయన్న వార్తలు.. రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితేంటి ..? ఆశావహుల ఆశల సంగతేంటి..? దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారంతో నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ముక్కోణ పోరు ఖాయమనే వాదన వినిపిస్తోంది. తూర్పుగోదావరి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి...పార్టీలు, నాయకులు ఏడాది తరువాత జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల కథనాలతో క్షేత్రస్థాయిలో సందడి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అధిక నియోజకవర్గాలున్న తూర్పుగోదావరి జిల్లాలో నాయకులకు ముందస్తు ఎన్నికల వార్త పిడుగులామారింది.

తూర్పుగోదావరి జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే హడావుడి చేస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్ష నాయకుడి పర్యటన ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ అడపా తడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని బలపరుస్తోంది. జిల్లాలో కొన్నిరోజుల క్రితం సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేయడం ఎన్నికల వాతావరణాన్ని సృష్టించింది. అటు జనసేన సైతం జిల్లాలో పర్యటించాలనుకోవడం.. పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది.

సీఎం చంద్రబాబు ఏకంగా రైతు, మహిళా, సంక్షేమ అంశాల వారీగా ఆరునెలల కాలంలో 75 బహిరంగ సభలకు సిద్దమవుతున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా బహిరంగ సభలు పెట్టే అవకాశముందని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. అయితే నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి వెళ్లడమే టీడీపీ లక్ష్యమైతే... ప్రతిపక్ష పార్టీ నేతలు పాదయాత్ర చేస్తూనే.. పలు ప్రాంతాల్లో ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాలో ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలుపుకుని టీడీపీలో 16మంది ఉండగా... ఇద్దరు వైసీపీలో...ఒకరు బీజేపీలో ఉన్నారు. అధికార పార్టీ సర్వే చేస్తే... సిట్టింగ్‌లలో కొందరికి సీట్లు దక్కవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిచేరిన రంపచోడవరం ఎమ్మెల్యేతో పాటు.. పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలకు టిక్కెట్లు అనుమానమేనని టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఇక వైసీపీ నుంచి కూడా పలువురు కోఆర్డినేటర్లను చివరి నిమిషంలో పక్కన పెట్టే అవకాశం ఉందని..అలాగే పెద్దాపురం, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు కూడా టిక్కెట్లు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు.

తూర్పున మరోసారి ముక్కోణపు పోరు ఖాయమనే వాదన వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం అనుభవంతో ఈసారి జనసేన ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆపార్టీలోకి పలువురు నేతలు జంప్ కావడానికి సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణ పేరు కూడా వినిపిస్తోంది. టీడీపీ, వైసీపీ నుంచి మరికొందరి చేరిక ఖాయం అని చెప్పవచ్చు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి టిక్కట్ దక్కుతుందోననే చర్చ వాడవాడలా వినిపిస్తోంది. మొత్తంగా ముందస్తు ఎన్నికల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలవుతోంది. ఎవరి నియోజకవర్గాలను వారు సర్ధుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరు మహాశయులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు నాయకులు. మరి ఈసారి తూర్పు గోదావరి జిల్లా ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.

21:21 - June 30, 2018
11:06 - June 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లైంది. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేసింది. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమా ? ముందుకు రావాలని కేసీఆర్ విసిరిన సవాల్ పై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ సోమవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమని, కేసీఆర్ ను త్వరగా ఇంటికి పంపిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఇప్పుడు వచ్చినా..డిసెంబర్ లో వచ్చినా...2019లో వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్..మోడీ భేటీ అయిన అనంతరం ముందస్తు ఎన్నికలు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

07:59 - June 25, 2018
07:11 - January 23, 2018

హైదరాబాద్ : వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతుంది. గ్రౌండ్‌లో క్యాడ‌ర్‌ ను స‌మాయ‌త్తం చేస్తూ.. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జ్‌ల‌కు బాధ్యత‌ల‌ను అప్పగించేందుకు రెఢీ అవుతోంది. అంతేకాదు.. గులాబీ పార్టీకి వ్యతిరేక శ‌క్తుల‌ను ఏకం చేస్తూ.. మ‌రోవైపు బ‌స్సు యాత్రతో తెలంగాణ‌ను చుట్టేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌ వార్తల నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ అల‌ర్ట్‌ అయ్యింది. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇప్పటి నుండే వ్యూహాలను పదును పెడుతోంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లు వచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న హ‌స్తం నేత‌లు.. దీనికోసం పూర్తి స‌మాయ‌త్తంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో నేతల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగా మొద‌ట నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఇంచార్జ్‌ ల‌ను నియ‌మించే ప‌నిలో పడ్డారు. ఇప్పటికే టీఆర్ ఎస్‌ తో ఢీ అంటే ఢీ అంటున్న నేత‌ల‌పై స్పష్టత‌తో ఉన్న పీసీసీ.. వారికి పూర్తి బాధ్యత‌లను అప్పగించాలని నిర్ణయించింది. 65 స్థానాలకు ఇంఛార్జ్‌ల‌ను ప్రక‌టించ‌నుంది. అంతేకాకుండా.. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ల‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్లు ఖాయమ‌ని చెప్పడం ద్వారా..వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు క‌ష్టప‌డి ప‌నిచేస్తార‌ని..పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తార‌ని పీసీసీ బ‌లంగా న‌మ్ముతుంది. ఎన్నిక‌లకు ముందే అభ్యర్ధులను ప్రక‌టించ‌డం కంటే ఇప్పుడే నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ ల‌ను నియమించ‌డ‌మే క‌రెక్టని భావిస్తుంది. అదే స‌మ‌యంలో అసెంబ్లీ నియోజక‌వ‌ర్గ ఇంఛార్జ్‌ల‌ను స‌మ‌న్వయం చేసే బాధ్యత‌ను జిల్లా పార్టీకి కాకుండా పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జ్‌ల‌కు అప్పగించాలని భావిస్తున్నారు. ఎన్నిక‌లు రాక‌ముందే ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే అభ్యర్ధులు స‌మ‌న్వయంతో ప‌నిచేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయ‌మని పీసీసీ ఛీఫ్ భావిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 సీట్లను గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు బ‌లంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ ను ఓడించాలంటే ప్రజ‌లను నేరుగా క‌ల‌వ‌డంతో పాటు ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్ళాల‌ని డిసైడ్‌ అయ్యారు. ఇందుకోసం ఫిబ్రవ‌రి మూడో వారంలో బ‌స్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ బ‌స్సు యాత్రను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ‌మైన జూన్‌ 2న భారీ బహిరంగ సభ‌తో ముగించనుంది. ఈ స‌భ‌లో రాహుల్‌ పాల్గొనేలా చూస్తున్నారు. ఇదే కాకుండా.. ఫిబ్రవ‌రిలో ఇత‌ర పార్టీల‌నుండి నుండి భారీగా నేత‌ల‌ను చేర్చుకుని పార్టీలో మ‌రింత జోష్ తెచ్చేందుకు ప‌క్కా స్కెచ్‌తో హ‌స్తం పార్టీ ఉంది. దీనికి తోడు.. టీఆర్‌ఎస్‌ శ‌క్తుల‌ను ఏకం చేసే ప‌నిలో ఇప్పటికే నిమ‌గ్నన‌మైన హ‌స్తం పార్టీ.. ఎన్నిక‌ల నాటికి ఈ శ‌క్తుల‌న్నంటితో క‌లిసి.. ఫ్రంట్‌ ఏర్పాటు చేసే యోచ‌న కూడా చేస్తుంది. మ‌రి కాంగ్రెస్‌ వ్యూహాలు ఏ మేర‌కు వ‌ర్కౌట్‌ అవుతాయో వేచిచూడాలి.

20:55 - January 15, 2018

హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటసాయంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో బహిర్గతమైన సాగు యోగ్యమైన భూములకు ఈ సాయాన్ని అందించనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా దీన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు ఆయన హితబోధ చేయనున్నారు. పంటసాయంతో పాటు.. నూతన పంచాయతీరాజ్‌ చట్టం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపైనా ఈ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడీ మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రజలను ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి.. అధికారయంత్రాంగంతో అమలు చేసేందుకు సమాయాత్తం అవుతోంది. ఇందులో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అధికారులతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు... ఎలాంటి ఫలితాలు సాధించిపెడుతున్నాయో రేపటి సమావేశంలో చర్చించనున్నారు. మరికొన్ని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టడంపై చర్చిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు అందించనున్న పంటసాయంపై కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా రైతులకు ఆధార్‌ నంబర్‌ ముద్రించి చెక్‌ల ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టేలా అధికారులకు వివరించనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. వాటికి ధరణి అనే పేరుపెట్టి వాటిని పట్టాదారులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశప్రధాని లేదా.. రాష్ట్రపతి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వారిచేత శభాష్‌ అనిపించుకొని విపక్షాల విమర్శలకు చెక్‌పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి సత్తాచాటాలనే ఉత్సాహంలో కేసీఆర్‌ ఉన్నారు. ఇందుకోసం నూతన పంచాయతీ రాజ్‌ చట్టానికి రూపకల్పన చేశారు. దీనిని ఈనెల 22న జరిగే కేబినెట్‌లో ర్యాడిఫికేషన్‌ చేసి ఇదే నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చి..చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన 24గంటల ఉచిత విద్యుత్‌ అమలు తీరుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతుల నుంచి క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోనున్నారు. విద్యుత్‌ అమలులో ఎక్కడా లోపాలు జరుగకుండా చూసేలా అధికారులకు కేసీఆర్‌ వివరించనున్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకకుండా ముందుకెళ్లాలనే సూచనలు చేయనున్నారు. మొత్తానికి మంగళవారం జరిగే కలెక్టర్ల మీటింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని అధికారులు చెప్తున్నారు. 

15:24 - November 21, 2017

హైదరాబాద్ : నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింది గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ముందస్తు రబీకి నీరు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పవ్యవధి చర్చకు సమాధానంగా ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ విషయం చెప్పారు. మూడో విడత రుణమాఫీ కింది రెండు రోజుల్లో వెయ్యి కోట్లు విడుదల చేయనున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. మూడో విడతలో రూ. 3600 కోట్లలో రూ. 1300 కోట్లు ఇచ్చామన్నారు. త్వరలోనే వేయి కోట్లు ఇస్తామని అసెంబ్లీకి తెలిపారు. 

06:31 - October 27, 2017

హైదరాబాద్ : చలోఅసెంబ్లీ పిలుపు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకులతో పీఎస్ లు నిండిపోయాయి. రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.

'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని హస్తంపార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.

ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని సీఎల్పీ అధ్యక్షుడు జానారెడ్డి స్పష్టం చేశారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించబోమని తెలిపారు. రైతులను కాపాడమంటూ ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు జానా చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా.. పోలీసు జులుంతో అణచివేయాలని చూస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జానా హెచ్చరించారు. 'ఛలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

చలో అసెంబ్లీకి సిద్ధమైన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం మండలాలకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. అటు యాదాద్రిజిల్లాలోనూ ముందుస్తు అరెస్టులతో రాజకీయం వేడెక్కింది. సంగారెడ్డిజిల్లా జిన్నారంలో కాంగ్రెస్‌నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటజిల్లాలో చలోఅసెంబ్లీకి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్‌నేతలను పోలీసులు ముందస్తుగా రెస్టుచేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కాంగ్రెస్‌లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను ఖండిస్తూ నాయకులు ఆందోళనకు దిగారు. రైతుల కష్ట నష్టాలపై ప్రభుత్వం స్పందించక పోవడంతోనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 

16:32 - October 22, 2017

జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ముందస్తు