ముసాయిదా

09:44 - October 4, 2018

హైదరాబాద్‌ : తెలంగాణలో మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక రూపుదిద్దుకుంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీల ముఖ్యనేతల సుదీర్ఘ చర్చల అనంతరం మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా సిద్ధమైంది. ఈ ముసాయిదా ప్రతులు నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, బాధ్యుల ఆమోదానికి పంపారు. వారి ఆమోదం అనంతరం ప్రజల ముందు పెట్టి సలహాలు, సూచనలు తీసుకుని ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ మల్లు భట్టివిక్రమార్క, తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నేత దిలీప్‌కుమార్‌తోపాటు ఆ పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను ఖరారు చేశారు.

ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఉండాలనే అభిప్రాయం చర్చకు రాగా అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన ఛైర్మన్‌గా ఉండటం వల్ల కూటమికి విశ్వసనీయత పెంచడమే కాకుండా అని వర్గాల ప్రజల విశ్వాసం పొందేందుకు ఉపయోగపడుతుందని భావించారు.
ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక సీట్ల సర్దుబాటుపై దృష్టిసారించనున్నారు. ఏయే పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఎక్కడకెక్కడ పోటీ చేయాలనే అంశాలపై శుక్రవారంగానీ శనివారం గానీ చర్చించనున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పదో తేదీలోపు సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించాలని నాలుగు పార్టీల నాయకులు నిర్ణయించారు.
ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. 
* ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇచ్చే వరకూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3 వేలు పంపిణీ 
* ఒక్కో రైతు కుటుంబానికి ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ 
* తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌. 
* రూ.10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. 
* కౌలు రైతులకు అన్ని రకాల భద్రత. 
* బలవంతపు భూసేకరణ నిలిపివేత. 
* భూనిర్వాసితుల పట్ల మానవీయ కోణం. యోగ్యులైన వారికి ప్రభుత్వ భూమి పంపిణీ. 
* ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో నిధి. 
* నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి. 
* రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం. 
* ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవడం. ప్రాజెక్టులను పునరాకృతి చేసి ప్రాధాన్యక్రమంలో నిర్మించడం. 
* కేజీ నుంచి పీజీ విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు సమగ్ర విధానం. 
* దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఉచితంగా కార్పొరేటు వైద్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే  కల్పించడం. 
* రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. 
* అన్ని పంటలకు బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు. 
* పేదలకు గృహనిర్మాణ పథకం అమలు, అర్హులందరికీ పక్కా ఇళ్లు. 
* ధర్నా చౌక్‌ పునరుద్ధరణ. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు కల్పన. 
* పంచాయతీల వారీగా ప్రణాళికల రూపకల్పన. వాటికి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపు.
* చాకలి ఐలమ్మ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాల నిర్వహణ. 
* ఆచార్య జయశంకర్‌ పేరిట విద్యాభివృద్ధి కార్యక్రమాలు. 
* కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో శిక్షణ కార్యక్రమాలు. 
* అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు. 
* బీసీ ఉప ప్రణాళిక రూపకల్పన. 
* ఒక ఏఎన్‌ఎం ఉన్నచోట మరొకరి నియామకం. 
* విద్యుత్‌, పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపు. 
* అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్‌ పదవుల భర్తీ. 
* కళాకారులు, ఉద్యమ కుటుంబాలకు పింఛన్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు. 
* పౌరసేవల చట్టం బలోపేతం, లోక్‌పాల్‌ ఏర్పాటు.

18:48 - February 13, 2018

ఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి 21 వ తేదీ వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించే రాజకీయ తీర్మానం ముసాయిదాను పార్టీ నాయకలు విడుదల చేశారు. 80 పేజీల తీర్మానంపై డివిజన్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ పోరాటాలు, సీపీఎం రాజకీయ పంథా... తదితర అంశాలను ముసాయిదాలో చేర్చారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:31 - September 28, 2016

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ విద్యా విధానం ముసాయిదాపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కేబినెట్ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ సభ్యులు సమర్పించిన నివేదికలో అనేక వివాదస్పద అంశాలున్నాయి.

1968లో కొఠారి కమిషన్
మన దేశంలో విద్యారంగం నిస్సారంగా వుందన్నది సార్వత్రిక అభిప్రాయం. విద్యారంగంలో వ్యాపార విలువలు, నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం, ఇంజనీరింగ్ విద్య నభ్యసించినా నైపుణ్యాలు పెరగకపోవడం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకపోవడం లాంటి అంశాలు అందరిలోనూ ఆవేదన కలిగిస్తున్నాయి. విద్యావిధానంలో మార్పుల కోసం ఎన్నో ఉద్యమాలూ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా అనేక కమిషన్ లు వేశారు. అవి అనేక సూచనలు చేశాయి. 1948 -49లో రాధాకృష్ణన్ కమిషన్, 1952-53లో మొదలియార్ కమిషన్, 1968లో కొఠారి కమిషన్ అనేక సూచనలిచ్చాయి. 1986 జాతీయ విద్యావిధానంలో విద్యారంగం సాధించాల్సిన రాజ్యాంగ, జాతీయ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధేశించాయి. జాతీయ సమగ్రత, ఆర్థిక సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య విధానం, ఆర్థికాభివృద్ధి వంటివి జాతీయ లక్ష్యాలుగా వుండేవి. రాజ్యాంగ పీఠికలో కూడా ఇవే లక్ష్యాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 2016 జాతీయ విద్యావిధానం ముసాయిదాను విడుదల చేసింది. దీని మీద అభిప్రాయ సేకరణ పూర్తయినతర్వాత జాతీయ విద్యావిధానం ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఆర్థిక సామాజిక న్యాయం,లౌకిక విలువలు ప్రస్తావించలేదన్న విమర్శలు
విద్యారంగంలో నాణ్యత, ఉపాధి కల్పన నైపుణ్యాలు పెంచడానికి పెద్ద పీట వేసిన ముసాయిదా ఆర్థిక సామాజిక న్యాయం, లౌకిక విలువల గురించి ప్రస్తావించలేదన్న విమర్శలున్నాయి. మార్కెట్ ఎకానమీపై మోజు తప్ప అర్ధవంతమైన ప్రతిపాదనలు లేవన్న ఆవేదనలు వ్యక్తమవుతున్నయి. మొత్తానికి నిస్సారంగా వున్న ముసాయిదా మతత్వం, వాణిజ్యీకరణ, కేంద్రీకరణ లాంటి ప్రమాదకర అంశాలను తెర మీదకు తెస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరవ తరగతి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా వున్న స్కూళ్లను, మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయో ఊహకందని విషయమేమీ కాదు. మూడు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఉద్దేశించిన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాధ్యతలను అంగన్ వాడీల మీద పెట్టడం పిల్లలకు ఎంత మేలు చేస్తుందో చెప్పలేం. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లకు దేశమంతా ఒకే సబ్జెక్ట్ వుండాలంటూ ప్రతిపాదించిన ముసాయిదా, ఏ, బి గ్రూప్ కేటగిరీలుగా విభజించాలంటూ మరో వివాదస్పద సూచన చేసింది. ఆ మూడు సబ్జెక్టులు ఇష్టపడేవారిని ఏ కేటగిరిగా, అవి వద్దనుకున్నవారిని బి కేటగిరిలో చేర్చాలన్నది ఈ ముసాయిదాలో మరో కీలకాంశం. టీచర్ల రిక్రూట్ మెంట్ కోసం ఉపాధ్యాయ నియామక కమిషన్ ఏర్పాటు, టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు అప్పగించడం, ప్రతి ఐదేళ్లకోసారి టీచర్లకు పరీక్షలు పెట్టి, వాటి ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లు ఇవ్వడం అన్న ప్రతిపాదనలూ ఈ ముసాయిదాలో వున్నాయి.

07:26 - September 28, 2016

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం ముసాయిదాను చర్చకు పెట్టింది. ఈ ముసాయిదాలో 33 అంశాలపై ప్రశ్నావళి రూపొందించి చర్చకు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఏముంది? ఈ ముసాయిదాలో విద్యారంగ అభివృద్ధికి మేలు చేసే అంశాలేమిటి? కీడు చేసే అంశాలేమిటి? ఈ ముసాయిదాను ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ ముసాయిదాపై ఉపాధ్యాయ సంఘాలేమంటున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ యుటిఎఫ్ నేత ఐ. వెంకటేశ్వరరావు 10టీవీ స్టూడియోకి వచ్చారు. 

06:58 - September 26, 2016
22:04 - August 24, 2016

ఢిల్లీ: అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది. ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ.. సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఇప్పటికే సంతానం ఉన్న వారికీ అద్దె గర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదన్నారు. అద్దె గర్భం ద్వారా జన్మించిన సంతానంపై తల్లిదండ్రులకు చట్టబద్ధమైన అధికారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

21:45 - August 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై పలు ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చాలని కొన్నిచోట్ల.. తమను ఇంకో జిల్లాలో కలపొద్దని మరోచోట ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాల విషయంలో వస్తున్న వ్యతిరేకతలకైతే అంతేలేకుండా ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదలతో నిరసన సెగలు
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై.. పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, రెవిన్యూ డివిజన్‌, మండల స్థాయుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమను మరో ప్రాంతంలో కలపొద్దంటూ కొన్నిచోట్ల.. తమకు జిల్లా స్థాయి, మండల స్థాయి ఎందుకు కల్పించరంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలు రేగుతున్నాయి.

కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఆందోళన
కరీంనగర్ జిల్లాలో కొరుట్లను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలంటూ స్ధానికులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే జిల్లాల ఏర్పాటు ముసాయిదాను విడుదల చేయడంతో ఈ ఆందోళనలు ఉధృతం చేశారు. బుధవారం కోరుట్ల బంద్‌ పాటిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మరోవైపు సిరిసిల్ల ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ ఆందోళనలకు దిగారు అక్కడి ప్రాంతవాసులు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేటలో కలపడానికి అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

జనగామను జిల్లాగా చేయాలని నిరాహారదీక్షలు
జనగామ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు నిరాహార దీక్ష చేస్తున్నారు. వీరి ఆందోళన రోజురోజుకు ఉధృతం కావడంతో పోలీసులు రంగలోకి దిగి వారి దీక్షను భగ్నం చేసారు. ఏరకంగా రెచ్చగొట్టినా తమ పోరాటం ఆగదని జిల్లా ఏర్పాటు వరకు కొనసాగుతుందని ఆప్రాంత వాసులు అంటున్నారు. మరోవైపు చారిత్రక నేపథ్యమున్న వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

నారాయణఖేడ్ మండలం విభజనపై స్థానికుల మండిపాటు
మరోవైపు కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో ప్రస్తుతం నారాయణఖేడ్ మండలంలో కొనసాగుతున్న సంజీవన్ రావు పేటను కల్హేర్ మండలంలోకి మార్చడాన్ని ఆ గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోనలకు దిగుతున్నారు.

పాలమూరు జిల్లాలో రెవిన్యూ డివిజన్‌ మార్పుపై రగడ
వెనుకబడిన పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ.. ఆప్రాంత ప్రజలు గత మాడు రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అఖిలపక్షం ఆధర్యంలో ఆ ప్రాంతవాసులు రెవిన్యూ డివిజన్ కొరుతూ నిరాహారదీక్షలకు దిగారు. ఇలా రోజురోజుకు వివిధ ప్రాంతాల ప్రజలు తమ డిమాండ్లతో నిరసనలకు దిగుతున్నారు. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం తలొగ్గుతుందా..? లేక ఇప్పటికే నిర్దేశించుకున్న విధంగా ముందుకు వెళుతుందా...? వేచి చూడాలి. 

21:52 - August 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రాన్ని మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజించనున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరించి, దసరా నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన చేసేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

27కు పెరిగిన జిల్లాల సంఖ్య..
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ ఇకపై 60 రెవిన్యూ డివిజన్లతో 27 జిల్లాలుగా రూపుదిద్దుకోనుంది. మండలాల సంఖ్య కూడా 505కి చేరుకుంది. కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలతో.. ప్రభుత్వం 194 జీవోను విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముసాయిదాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక వెబ్‌సైట్
ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో కూడా అభ్యంతరాలు తెలుపొచ్చని ముసాయిదాను విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ తెలిపారు. సోమవారం నుంచి నెల రోజుల పాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి, తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. దీనికంటే ముందు మరోసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి రాజకీయపక్షాల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటామని మహమూద్‌ ఆలీ చెప్పారు. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సీఎం కేసీఆర్ సంకల్పించారని మహమూద్‌ అలీ తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు, పరిపాలన సౌలభ్యం కొరకే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

07:46 - August 22, 2016

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటన ఇవాళ అధికారికంగా విడుదల కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 27 జిల్లాల సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. నోటిఫికేషన్‌ విడులైన నాటి నుంచి కొత్త జిల్లాలు, వీటి సరిహద్దులతోపాటు అన్ని అంశాలపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరిస్తారు. రాష్ట్రాల ఖజానాపై కేంద్రం నిఘా పెడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దినకర్ (టిడిపి), తులసీ రెడి (కాంగ్రెస్) వకుళాభరణం కృష్ణమోహన్ (టీఆర్ఎస్), రాకేష్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

06:27 - August 21, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై ఈ నెల 22న పునర్విభజన ముసాయిదా విడుదలచేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. ప్రజాభిప్రాయం ప్రకారమే జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు.. నయీం బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. తప్పు చేసినవారు ఎవ్వరైనా శిక్షించి తీరతామని సీఎం స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.. 27 జిల్లాల ఏర్పాటుకు అఖిలపక్షసమావేశంలో అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రకటించారు.. ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేశాయని తెలిపారు.. ఈ నెల 22న పునర్విభజన ముసాయిదా విడుదల చేస్తామని తెలిపారు.

సెప్టెంబర్ లో శాసనసభా సమావేశాలు..
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు 5 కోట్ల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, వెయ్యి గజాల స్థలం ఇస్తామన్నారు. అలాగే కోచ్‌ గోపీ చంద్‌కు కోటి రూపాయలు, రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున కోటి రూపాయలు ఇస్తామని సీఎం తెలిపారు. సెప్టెంబర్‌ మొదటివారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఉండే అవకాశముందని కేసీఆర్‌ చెప్పారు. ఆ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెల 23న మహారాష్ట్రతో తుదిఒప్పందం చేసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

పలు విమర్శలు...
కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో విషయం లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి రావొద్దంటూ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. లా అండ్ ఆర్డర్‌ విషయంలో వెనక్కితగ్గేదిలేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నయీం బాధితులకు వందశాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేరం ఎవరుచేసినా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎస్‌ఐ రామకృష్ణ ఆత్మహత్య దురదృష్టకరమన్నారు కేసీఆర్‌. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ముసాయిదా