మేడ్చల్

18:27 - June 16, 2018

మేడ్చల్‌ : జిల్లా యువతకు టీఎన్‌ఆర్‌ సైనిక్‌ అకాడమీ బహదూర్‌పల్లి నందు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ టీఎన్‌ రావు తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత కల్గిన అభ్యర్థులు ఆదివారం వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజనం.. స్పోర్ట్స్‌ కిట్‌ ఇవ్వనున్నామని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

16:59 - June 11, 2018

మేడ్చల్ : ఆర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. డబుల్ బెడ్‌రూంలలో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేల కోటాలో పంచుకుంటున్నారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వారు హెచ్చరించారు. మేడ్చల్ కలెక్టరేట్ వద్ద వామపక్షాల మహాధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ నేత పెద్దిరెడ్డి తదితురులు పాల్గొన్నారు.

14:55 - May 21, 2018
09:55 - May 4, 2018

మేడ్చల్ : అతివేగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గంగరాజు కతార్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు అతని భార్య సత్తవ్వ (35), ఇద్దరు పిల్లలు శ్రవణ్ (12), శాలిని (12) కలిసి కారులో వెళ్తున్నారు. మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద ఆగి వున్న లారీని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోపాటు కారు డ్రైవర్ రాజు (24)  మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

 

13:33 - May 1, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని జవహర్‌ నగర్‌ డపింగ్‌ యార్డ్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో "మే" డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నరసింహరావు హాజరయ్యారు.  అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. హక్కుల సాధనకు కార్మికులను ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

13:22 - May 1, 2018

మేడ్చల్‌ : రాష్ట్రంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జిల్లాలోని కండ్లకోయ దగ్గర ఔటర్‌ రింగ్‌రోడ్డు ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు స్కైవేలు నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. అందుకు వంద ఎకరాల రక్షణ శాఖ స్థలం కావాలని 
కేంద్రాన్ని అడిగితే వాటికి తగిన భూమి ఇవ్వాలని కోరగా ఆరు వందల ఎకరాలు ఇస్తామని చెప్పామన్నారు. అయినా స్థలం ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డుతుందన్నారు. ఔటర్ రింగు రోడ్డులోపల ఉండే గ్రామాలు మున్సిపాలిటీగా మారాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. కేశవాపురం వద్ద పది టీఎంసీల వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ ఆర్ డీపీ పేరిట
ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. 

21:41 - April 27, 2018

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం, ఇంటింటికి సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం' లాంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి.

ఆరు తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఆరు తీర్మానాలను ఆమోదించింది. ఉదయం స్వాగతోపన్యాసం తర్వాత తొలి తీర్మానాన్ని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రవేశపెట్టారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేకే.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్‌ నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. కేంద్ర నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని... రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. దేశంలో భాగమైన రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని.. అందుకే కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన చేస్తున్నారని దానికి అందరూ మద్దతివ్వాలన్నారు కేకే.

తృప్తినిస్తున్న సంక్షేమ పథకాలు : బాలకిషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల బతుకుల్లో సంతృప్తిని ఇస్తున్నాయన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఇంటింటికి సంక్షేమం - ప్రతీ ముఖంలో సంతోషం అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే రసమయి ప్రతిపాదించగా.. టీఆర్‌ఎస్ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు.

మైనార్టీల సంక్షేమం తీర్మానం ఆమోదం..
అనంతరం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌.. సమానాభివృద్ధే ధ్యేయంగా మైనార్టీల సంక్షేమం అనే తీర్మానాన్ని ప్రతిపాదించగా... ఇంతియాజ్‌ అహ్మద్‌ బలపరిచారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కేసీఆర్‌ చేస్తున్న కృషిని అభినందించారు.

రైతులకు ఎకరాకు 8 వేల రూపాయలు
వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేసీఆర్‌ నడుం బిగించారన్నారు. రైతులకు పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమని... ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరాకు 8 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు.

మౌలిక సదుపాయాల తీర్మానం ఆమోదం..
సుస్థిర అభివృద్ధి కోసం విస్తృతంగా మౌలిక సదుపాయాల కల్పన అనే తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రతిపాదించగా... ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ బలపరిచారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ముఖ్యమని... పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ..అవినీతికి తావులేకుండా కొత్త పరిశ్రమలను నెలకొల్పుతున్నామన్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లోకి ప్రవేశంపై దృష్టి సారించడమే కాకుండా... ప్లీనరీలో కూడా దీనికి సంబంధించిన తీర్మానం చేయడంతో... కేసీఆర్‌ ఇకపై దీనిపైనే ఫుల్‌ ఫోకస్‌ పెడతారన్న భావన వ్యక్తమవుతోంది. 

21:35 - April 27, 2018

మేడ్చల్ : దేశ రాజకీయాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు గులాబీ దళపతి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు.

ఘనంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ.. నివాళులు అర్పించారు.

దేశ రాజకీయాలపై స్పష్టతనిచ్చిన కేసీఆర్‌
దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పోషించే పాత్రపై ప్లీనరీలో స్పష్టతనిచ్చారు సీఎం కేసీఆర్‌. దేశాన్ని ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన పనులు చేయకుండా.. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నాయని విమర్శించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ ఉద్ఘాటించారు. తాను ఫెడరల్ ఫ్రంట్ గురించి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. మోదీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటుంటే.. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు.. మరీ టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశం కోసం ఎంతకైనా పోరాడుతా : కేసీఆర్‌
దేశం బాగు కోసం తాను ఎంతకైనా పోరాడుతానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించానో.. దేశం మంచి కోసం ఆ విధంగా పని చేస్తానన్నారు. దేశానికి ఎంతో కొంత తెలంగాణ నుంచే మేలు జరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్నారు. జాతీయ స్థాయిలో 'హర్‌ ఎకర్‌ కో పానీ.. హర్‌ కిసాన్‌కో పానీ' నినాదంతో ముందుకెళ్తామని గులాబీ బాస్‌ స్పష్టం చేశారు.

ఉత్తమ్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌
70 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశానికి చేసిందేమీ లేదన్నారు కేసీఆర్‌. దేశంలో ఎన్నో వనరులున్నా సద్వినియోగం చేసుకోలేదన్నారు. చైనాలాంటి దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో దేశం వెనకబడే ఉందన్నారు.

టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌...
టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నామని.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా అభినందించారన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని నీతిఆయోగ్‌ చెప్పిందన్నారు.

సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్న కేసీఆర్..
తెలంగాణలో సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్నారు కేసీఆర్‌. కొన్ని పనులు చేయాలంటే సాహసం.. ధైర్యం కావాలి. తండాలను పంచాయతీలుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేస్తే.. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 4 వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు
ఇక టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే అడగడుగునా అడ్డుకునే పనులు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయన్న ఉత్తమ్‌ నిరూపిస్తే.. ముక్కుకు నేలకు రాస్తానని... సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. లేకపోతే ఉత్తమ్‌ ప్రగతి భవన్‌ ముందు ముక్కుకు నేలకు రాస్తాడా అని కేసీఆర్‌ సవాల్‌ విసిరాడు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు : కేసీఆర్‌
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు కేసీఆర్‌. అన్ని వర్గల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు. ఇక త్వరలోనే మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. తాము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

19:45 - April 27, 2018

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఉత్తమ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని చెప్పుకొచ్చిన ఉత్తమ్‌కు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ గదులు ఉంటే తాను ముక్కు నేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్‌. 

19:43 - April 27, 2018

మేడ్చల్ : కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్యందరికీ టికెట్లు ఇస్తానని ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు కేసీఆర్‌. హైదరాబాద్‌ కేంద్రంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు సీఎం కేసీఆర్‌. గులాబీ పరిమలాలు భారతదేశ మారుమూల ప్రాంతాలలో వెదజల్లుతామన్నారు. దేశాన్ని కాంగ్రెస్‌ నేతల కబంద హస్తాల నుండి విముక్తి కలిపించి అద్భుతమైన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు కేసీఆర్‌. 

Pages

Don't Miss

Subscribe to RSS - మేడ్చల్