మొక్కలు

18:20 - August 10, 2018
11:12 - August 5, 2018

హైదరాబాద్ : నగరంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి దంపతులు చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వారు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చూసిన ఫొటో ఎగ్జిబీషన్ ను సందర్శించారు. 

13:19 - August 1, 2018
10:18 - August 1, 2018

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత హరిత హారం కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు మొక్కలను సిద్ధం చేశారు. ఒకేసారి లక్ష మొక్కల కార్యక్రమం జరుగనుంది. ములుగు మండలంలో మొదటి మొక్కను నాటిన అనంతరం రెండో మొక్కను ప్రజ్ఞాపూర్ లోని కూర నాగరాజు ఇంట్లో సీఎం కేసీఆర్ మొక్కను నాటనున్నారు. అనంతరం గజ్వేల్ లో మూడో మొక్కను నాటనున్నారు. ఈ సందర్భంగా కూర నాగరాజు, స్థానికులతో టెన్ టివి ముచ్చటించింది. తమ నివాసంలో మొక్క నాటేందుకు కేసీఆర్ వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

06:32 - August 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత నేటి నుంచి ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌లో మొక్కనాటి హరితహారం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడత హరితహారం కార్యక్రమం ఇవాళ మొదలు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. లక్షా నూటపదహారు మొక్కలు నాటి కార్యక్రమం మొదలు పెడతారు. గజ్వేల్‌ మున్సిపాలిటి పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లోనూ, అన్నిరకాల రోడ్లపైనా, ఔటర్‌ రింగ్‌రోడ్డుపైనా మొక్కలు నాటుతారు. అంతేకాదు... ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవాళ అన్ని ప్రార్థనా మందిరాల్లో ఒకేసారి సైరన్‌ మోగించాలంటూ వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ప్రజలంతా ఒకేసారి మొక్కలు నాటేలా ఏర్పాటు పూర్తి చేశారు.

మొక్కల రక్షణ కోసం 60వేల ట్రీగార్డులను అధికారులు సిద్ధం చేశారు. వాటికి శుద్ధి చేసిన నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ఇక హరితహారం ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా అందరూ కలిసి పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 

14:17 - July 11, 2018

హైదరాబాద్ : మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొక్కలు పెట్టడం, పెంచడం గవర్నమెంట్ పని అనుకోవడం పొరపాటని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈమేరకు ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలని.. మొక్కలు పెంచడం ఒక ఉద్యమస్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ కావాలన్నారు. అయితే మొక్కలు పెంచడంతోనే పర్యావరణాన్ని కాపాడలేమన్నారు. హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో 40 చెరువులు, జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 చెరువులను శుద్ధీకరించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 

 

06:35 - July 8, 2018

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి..వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం ప్రణాళికను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో హరితహారం కార్యక్రమంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని తెలిపారు. అడవుల పునరుద్ధరణతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు హరితహారంపై దిశనిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మొత్తం భూభాగంలో 24 శాతం అటవీ భూములున్నాయని కానీ అడవులు మాత్రం 12 శాతం లోపు ఉన్నాయని తెలిపారు. కనీసం 33 శాతం గ్రీన్ కవర్ ఉండేలా చెట్ల పెంపకం జరగాలన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నందున.. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వీటితో పాటు నరేగా నిధులు కూడా ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అడవుల్లో పండ్ల చెట్లు ఉంటే కోతులతో పాటు ఇతర జంతువులు అవి తిని బతికేవని.. అడవి పోవటంతో కోతులతో పాటు ఇతర జంతువులు జనావాసాలపై పడ్డాయన్నారు సీఎం కేసీఆర్. ఈ పరిస్థితి పోవాలంటే పండ్ల చెట్లు భారీగా పెంచాలని.. నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేయాలన్నారు. ఈత, తాటి చెట్లు కూడా విరివిగా పెంచాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీల్లో చెట్లు పెంచడానికి స్థలం లేకుండా పోతుందని.. మున్సిపల్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు గుర్తించి.. ఆక్రమణలు తొలగించడానికి వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, వాటిని పెంచడం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా కాకుండా ప్రజా ఉద్యమంగా సాగాలని కేసీఆర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ.. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. హరితహారంపై విద్యా సంస్థల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి.. అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో చెరువుల పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. మురికి కాల్వలు చెరువులో కలవకుండా మళ్లింపు కాల్వలు నిర్మించాలని.. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిషన్ కాకతీయలో చెరువులను శుభ్రం చేయటంతో పాటు చెరువుల చుట్టూ పచ్చగా ఉండే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

13:26 - June 18, 2018

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. మిగులు భూముల జోలికి అధికారులు రాకూడదని 2008లో కాంకూరు గ్రామసభలో తీర్మానం చేశారు. కాని గ్రామసభ నిర్ణయాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు వివాదస్పద భూముల్లో మొక్కలు నాటిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:25 - March 24, 2018

గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవటం..దాంతో పగలు నీరసం, పనిపై ఏకాగ్రత లేకపోవటం వంటి అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణ చల్లగా వుండాలి. మరి చల్లగా వుండేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉపయోగిస్తుంటాం..వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, కరెంట్ చార్జీలు అదనంగా భరించాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారు ఏసీలు, కూలర్లు కొనలేని పరిస్థితి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఖర్చు లేకుండానే.. ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఇల్లు చల్లగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఒకవేళ ఆర్థికంగా స్థోమత కలిగినవారు వాటిని కొన్నా కరెంట్ ఖర్చులు తగ్గించుకోవచ్చు..మరి అవేమిటో తెలుసుకుందామా..?

ఇంటి పైకప్పుకు కోటింగ్..
ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్ మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో వుండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు...అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది.

నార తెర చాపలతో చల్లదనం..

ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతోచేసిన చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా..చాపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని..వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్ లు కూడా మార్కెట్ లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్ షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు.

మొక్కలు పెంచితే అందం, ఆరోగ్యం, రక్షణ..ఎన్నో ప్రయోజనాలు
ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్ మెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి, చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఇండివిడ్యువల్ ఇల్లు అయి ఉండి.. ఇంటి చుట్టూగానీ, ముందు, వెనుకగానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా.. ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేగాకుండా మనకు కావాల్సిన కూరగాయలు, పూలు వంటివీ మనమే పండించుకున్నట్లూ ఉంటుంది. మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్లు, పరిసరాల్లో.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం..
గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అంతేకాదు కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఇంట్లో నేరుగా ఎండ పడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. సాయంత్రం వాతావరణ చల్లబడిన తరువాత కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటికి వెళ్లిపోయి.. చల్లగాలి లోపలికి వస్తుంది.

వంటగదిలో జాగ్రత్తలు..
ఇక ఇంట్లో ఎక్కువ వేడిని ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వంట గదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంట గదిలోని వేడి ఇంట్లో నిండిపోతుంది.

మంచు గడ్డలు, నీటితో మ్యాజిక్..
ఏసీ లేకున్నా.. ఇంట్లోని ఏదైనా గదిలో బాగా చల్లదనం కావాలనుకుంటే మంచు గడ్డలు, చల్లని నీటితో సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్ లను గానీ, చల్లటి నీటినిగానీ ఏదైనా వెడల్పాటి పాత్రలో పెట్టి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా అమర్చాలి. కొద్దిసేపటిలోనే గదిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం గమనించవచ్చు. అయితే ఆ గదిలోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడు చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది. ఐసు లేకున్నా..మామూలు నీటిని వెడల్పాటి పాత్రలో పోసి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా పెట్టినా కూడా ఆ గదిలో రెండు మూడు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.

శరీరాన్నీ చల్లగా ఉంచుకునే పదార్ధాలు తీసుకోవటం ద్వారా..
మనం ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన శరీరం వేడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. అటు ఇంటిని చల్లగా ఉంచుకునే పని చేస్తూనే.. శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లటి నీళ్లు, నిమ్మరసం, జ్యూస్ ల వంటివి తాగడం బెటర్. దీంతోపాటు రుమాలు వంటి దానికి చల్లటి నీటిలో తడిపి.. శరీరంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉండే మణికట్టు, మెడ వంటి ప్రాంతాల్లో పెట్టుకోవడం ద్వారా శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. అంతేగాకుండా వస్త్రాలు కొంచెం వదులుగా కూడా ఉండేలా చూసుకోవాలి. కాటన్ వస్త్రాల వల్ల గాలి బాగా ఆడి, చెమట ఆరిపోతుంది. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు శరీరానికి అందితే.. చెమట కూడా ఎక్కువగా పట్టి శరీరం చల్లగా ఉంటుంది.

పడుకునే ముందు జాగ్రత్తలు..
రాత్రి పడుకునేందుకు కూడా బెడ్ పై కాటన్ దుప్పట్లు, తలగడలకు కాటన్ గలీబులు వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందుగానీ తల స్నానం చేయడంతో శరీరంలోని వేడి తగ్గి ఒకటి రెండు గంటల వరకు హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడడంతోపాటు..హాయిగా వుండి నిద్ర కూడా బాగా పడుతుంది. ఇంట్లో చల్లదనాన్ని కలిగించేలా ఇటీవలే శాస్త్రవేత్తలు కొత్త తరహా పాలిమర్ ను అభివృద్ధి చేశారు. అది సూర్యరశ్మిని చాలా వరకు పరావర్తనం చెందించే ఈ పాలిమర్ ధర కూడా తక్కువే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇళ్లు,కార్యాలయాలు, దుకాణాలు వంటి వాటిలో అన్ని చోట్లా ఈ పాలిమర్ పొరను వినియోగించుకోవచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరి అవి సామాన్యుడికి అందుబాటులో వుంటే వేసవికాలంలో కూడా ప్రశాంతమైన, హాయిగొలిపే జీవితాలను అందరూ ఆస్వాదించవచ్చు..

17:52 - January 10, 2018

సంగారెడ్డి : పయనీర్‌ పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పర్యావరణ హితాన్ని కోరుతూ చేసిన సాంస్కృతిక నృత్యాలు అదర్నీ అలరించాయి. ఏ మాధ్యమంలో చదివిన పిల్లలైనా సంస్కారం ముందుగా నేర్చుకోవాలని సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామని.. కార్గిల్‌ వార్‌ వెటరన్‌ జిజే రావు అన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ..పర్యావరణాన్ని కాపాడాలంటూ మొక్కలను పంపిణీ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - మొక్కలు