మోడీ

13:44 - January 18, 2018
06:32 - January 18, 2018

ఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గుజరాత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో బెంజమిన్ నెతన్యాహు దంపతులకు ప్రధాని మోది స్వాగతం పలికారు. అనంతరం బెంజమిన్‌తో కలిసి మోది సబర్మతి ఆశ్రమం వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమం ప్రత్యేకతలను నెతన్యాహు దంపతులకు ప్రధాని వివరించారు. ఆశ్రమంలో ఉన్న మగ్గంపై బెంజమిన్ దంపతులు నూలు వడికారు. సబర్మతీ ఆశ్రమంలో బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలో సరదాగా పతంగులు ఎగురవేశారు. 

21:23 - January 15, 2018

ఢిల్లీ : భారత్‌-ఇజ్రాయిల్‌ దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య అంతరిక్ష ప్రయోగాలు, పౌర విమానయానం, సైబర్‌ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఇంధన సహకారం తదితర రంగాల్లో 9 ఒప్పందాలు జరిగాయి. ఫిల్మ్‌, స్టార్టప్‌ ఇండియా, రక్షణ రంగంలోనూ పెట్టుబడులపై ఇజ్రాయిల్‌తో అంగీకారం కుదిరిందని...వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్‌ టెక్నాలజీ తీసుకువస్తామని సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌లో తనకు అపూర్వ స్వాగతం లభించిందని, ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని నెతన్యాహు చెప్పారు. అంతకు ముందు ఇజ్రాయిల్‌ ప్రధాని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో భారత్‌ ఆయనను సత్కరించింది.

21:10 - January 12, 2018

విజయవాడ : విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను అమలు చేయకపోతే కోర్డును ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయంలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పడంతో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నానని.. అయితే ఇంతవరకు నిధులు ఇవ్వలేదని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణం, మంజూరైన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన భేటీలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. విభజన చట్టంలోని అపరిష్కృత హామీలపై 17 పేజీల నివేదిక అందజేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు, మోదీ భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో చర్చించిన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. అన్నింటినీ అమలు చేయమని మోదీని కోరామని, లేకపోతే కోర్టుకు వెళ్లడం మినహా మరో గత్యంతరంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరంకు 58 వేల కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. దీని పునరావసం, పునర్నిర్మాణానికే 35 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉండగా ఇంతవరకు చాలా తక్కువ మొత్తమే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిని నేరుగా నగదు రూపంలో ఇవ్వకపోతే పాత రుణాలు చెల్లింపునకు సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 11 కేంద్ర విద్యాసంస్థలకు 2,900 ఎకరాల భూమి ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రధాని దృష్టికి తెచ్చారు. దీని విలువ 16,600 కోట్లని, మరో 133 కోట్లతో వీటన్నింటికీ ప్రహరీగోడలు నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. హిందూపురంలో కేంద్రీయ విశవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వీటికి 11,673 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే ఇంతవరకు కేవలం 420 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధాని దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ పెట్రో రసాయనాల పారిశ్రామిక సముదాయం, కడప స్టీల్‌ ప్లాంట్‌, విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై పారిశ్రామికి నడవాను అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటిని పరిశీలించి, పరిష్కారానికి స్వయంగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చారు. 

14:56 - January 12, 2018

ఢిల్లీ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కొరానన్నరు సీఎం చంద్రబాబు. సేవారంగంలో దక్షిణాదిరాష్ట్రాలకంటే ఏపీ చాలా వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని ప్రదాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రం రెవెన్యూలోటును ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నదని .. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. షెడ్యూల్‌-9, 10 లలో విభజన సరిగా జరగలేదని.. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానకి చొరవచూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు చంద్రబాబు.

రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇచ్చిన 2500 కోట్లు తోడుగా మరో వెయ్యికోట్లు త్వరలో మంజూరు చేస్తామని ప్రధాని చెప్పారన్నారు. విభజన చట్టం 13లో పేర్కొన్న 11 సంస్థల ఏర్పాటుపై చర్చించానన్నారు చంద్రబాబు. ఇప్పటికే 9 సంస్థలను శాక్షన్‌ చేశారన్నారు. ఇంకా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరామన్నారు. దుగరాజు పట్నం పోర్టును త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు.

12:01 - January 6, 2018

ముంబై : గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని మోడీ పై విరుచుకు పడ్డారు. మోడీ అంబేద్కర్ వారసుడని చెప్పుకుంటూ దళితులను వేధిస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర లోని గోరేగావ్ ఘటన వెనక ఉన్న శక్తులను ఎందుకు అరెస్ట్ చేయాలేదని ఆయన ప్రశ్నించారు.

07:24 - January 6, 2018

ఢిల్లీ : పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో... మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసిన ఎంపీలు... అన్ని అంశాలపై మోదీ సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వేజోన్‌, ప్రత్యేక ప్యాకేజి, పోలవరం, అసెంబ్లీ స్థానాల పెంపు అంశాలను ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 16 పేజీల మెమోరాండాన్ని మోదీకి అందజేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కాల పరిమితితో పూర్తి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలు
ఇక 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 7500 కోట్ల రూపాయలపాయలకు గాను 3979 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని మోదీకి తెలిపారు. మిగిలిన బకాయిలు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. EAP ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులివ్వాలని కోరారు. అలాగే... కేంద్రం, నాబార్డ్‌ ఇచ్చిన రుణాలకు చెల్లించాల్సిన వడ్డీల కింద EAP కింద ఇచ్చే నిధులను జమ చేసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ భవన్‌ విభజనను కూడా వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు. అయితే.. త్వరలోనే చంద్రబాబు తనను కలవనున్నట్లు మోదీ తెలిపారన్నారు ఎంపీలు. అన్ని అంశాలను భేటీలో చర్చించనున్నట్లు ప్రధాని తెలిపారన్నారు.మొత్తానికి రాష్ట్ర సమస్యల పట్ల మోదీ సానుకూలంగా స్పందించడంతో నేతలంతా సంతోషం వ్యక్తం చేశారు. 

14:42 - December 30, 2017

గుజరాత్ : కొత్తగా ఏర్పాటైన గుజరాత్‌ కాబినెట్‌లో అప్పుడే విభేదాలు పొడసూపాయి. మొన్నటివరకు మంత్రివర్గంలో నెంబర్‌ టూగా వెలుగొందిన డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌కు కీలక శాఖలు దక్కకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కకపోవడంతో నితిన్‌ ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆర్థిక శాఖను సౌరభ్‌ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్‌ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్‌ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. దీన్ని అవమానంగా భావిస్తున్న నితిన్‌ పటేల్ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాబినెట్‌లో కలహాల నేపథ్యంలో నితిన్‌ పటేల్‌ బిజెపిని వదిలి కాంగ్రెస్‌లో చేరాలని హార్దిక్‌ పటేల్‌ సలహా ఇచ్చారు.

21:11 - December 29, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు CPI జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారాయణ వినతిపత్రం అందించారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఎక్కడ వచ్చిందో పరిశీలించాల్సిందిగా మోడీని కోరినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్‌ కోసం ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపించాలని ప్రధానిని కోరామని అన్నారు.

20:19 - December 25, 2017

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 93వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోది స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విజయ్‌ గోయెల్‌ తదితర నేతలు వాజ్‌పేయి ఇంటికి వెళ్లి వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి డిసెంబర్‌ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మోడీ