మోదీ

21:57 - March 16, 2018

గుంటూరు : శాసన మండలిలో  సీఎం చంద్రబాబు.. మోదీ, పవన్‌ కల్యాణ్‌, జగన్‌లపై నిప్పులు చెరిగారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోడానికి జగన్‌ కేంద్రంతో లాలూచి పడుతుంటే.. బీజేపీతో కుమ్మక్కైన  పవన్‌ కల్యాణ్‌ .. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్నారని బాబు  దుయ్యబట్టారు. తమిళనాడు తరహాలో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడ్డారు.  విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు.  దీనికి సంబంధించిన తీర్మానాన్ని శాసనమండలి మూజువాణి ఓటుతో  ఆమోదించింది.  
విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం 
చట్టసభ సాక్షిగా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి మొరపెట్టుకున్నా.. మోదీ ప్రభుత్వం కరగలేదన్నారు. అమరావతి శంకుస్థాపనకోసం పవిత్ర జలాలను, మట్టిని తీసుకొచ్చిన మోదీ.. డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోయారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంకాని.. పదవులు కాదన్నారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 
ప్రత్యేక హోదాను జగన్‌ తాకట్టు పెట్టారు  
రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల తీరునూ చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదాను వైసీపీ అధినేత జగన్‌, మోదీ దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. 2017లో మోదీని కలిసిన జగన్‌ ..రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోనని చెప్పివచ్చారని బాబు ఆరోపించారు. దాంతోపాటు రాష్ట్ర పతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్రకటించగానే బీహార్‌కు వెళ్లిన జగన్‌, విజయ్‌సాయి.. ఆయన కాళ్లమీద పడ్డారని చంద్రబాబు అన్నారు. మోదీ, రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఫోటోలు దిగి.. తమకు కేంద్రంలో పెద్దలతో పరిచయం ఉందని.. సీబీఐ,ఈడీలకు మెసేజ్‌ వెళ్లేలా ప్రయత్నించారని విమర్శించారు.  
పవన్‌ తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు 
ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరును కూడా సభలో కడిగిపారేశారు చంద్రబాబు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి పవన్‌కు ఇపుడే కనిపించిందా అని ప్రశ్నించారు.  ఎవరో  ఆడిస్తుంటే పవన్‌ ఆడుతున్నారని విమర్శించారు. గుంటూరు సభలో పవన్‌ సంధించిన ప్రశ్నలకు మండలిలో సీఎం క్లారిటీ ఇచ్చారు. అసలు ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ చేయడానికి వీరెవరు.. వీళ్లు అడిగితే సమాధానం చెప్పాలా.. అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా .. కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు అందించామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 75వేల కోట్లు రావాల్సి ఉందని తన సొంత కమిటీ తేల్చినా.. పవన్‌ ఎందుకు సైలెంట్‌ అయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు.  అన్యాయం చేసిన మోదీని నిలదీయదీయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఏంటన్నారు ముఖ్యమంత్రి. 
పోలవరం, అమరావతి నిర్మాణాలను కేంద్రమే పూర్తిచేయాలి 
పోలవరం ప్రాజెక్టుతోపాటు.. రాజధాని అమరావతి నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.  పోలవరం నిర్మాణంలో అవినీతి అంటూ.. నిధులను అడ్డకుంటూ సృష్టిస్తున్న కేంద్రం.. రాజధాని విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వేలకోట్ల రూపాయలతో పూర్తికావాల్సిన ప్రాజెక్టులకు అరకొరగా నిధులు విదిల్చారని  సభకు వివరించారు. పోలవరం ముంపు మండలాలు ఏపీ కలవడానికి తన పోరాటమే కారణం అన్నారు. అటు దుగరాజపట్నం పోర్టు విషయంలో  కూడా మోదీ ప్రభుత్వ తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. నాలుగేళ్ల తర్వాత దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యంకాదని చెబుతున్నారని... ఒకవేళ ఇపుడు ప్రత్యామ్నాయం చూపెట్టినా పోర్టును నిర్మిస్తారన్న నమ్మకం ఏంటని కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. 
విభజన హామీలు నెరవేర్చాలని తీర్మానం 
తన ప్రసంగం ఆసాంతం.. మోదీ, జగన్‌, పవన్‌కల్యాణ్‌పై నిప్పలు చెరిగిన చంద్రబాబు.. ఇప్పటికైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్‌తోపాటు.. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో తన మోదం తెలిపింది. 

 

17:51 - March 12, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌లు కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోనే అతి పెద్ద సౌర విద్యుత్‌ ప్లాంట్‌ కావడం విషేషం. ఇక్కడ 75 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఫ్రాన్స్‌కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్‌కు కింద చేపట్టారు. నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన మాక్రన్ వారణాసిలో పర్యటిస్తున్నారు.

15:16 - March 12, 2018

ఢిల్లీ : ఏపీ టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఎంపీ శివప్రసాద్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. నాదస్వరం ఊదుతూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ప్రధాని మోదీది రాతి గుండె అని...సంగీతంతోనైనా ఆయన గుండె కరుగుతుందోమోనన్నారు శివప్రసాద్‌. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోదీ భవిష్యత్‌ శూన్యమే అన్నారు శివప్రసాద్‌.

17:14 - March 8, 2018

ఢిల్లీ : ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 10 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఋ క్రమంలో నే కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు తమ రాజీనామా లేఖలను సిద్ధపరుచుకున్నారు. ప్రధాని మోదీని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. కాగా ప్రధాని రాజస్థాన్ పర్యటనలో వున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ చేరుకున్న మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే నేరుగా రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా వున్నారు. 

19:13 - March 5, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మోసం చేశారని ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పీఎస్‌లో ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ న్యాయం చేస్తామని చట్టసభల్లో హామీలిచ్చి తుంగలో తొక్కారన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం టీడీపీ రాజీ పడుతోందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నామని... కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. 

 

20:13 - November 8, 2017

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్ద నోట్లు రద్దయి ఏడాది అయినందున కాంగ్రెస్‌ బ్లాక్‌డేను నిర్వహించింది. పెద్దనోట్ల రద్దుతో రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 

12:34 - September 9, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మరోసారి వివాదాస్పదమయ్యారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మోదీని ఉద్దేశించి.. 'నేను సాధించిన విజయాలు రెండు... ఒకటి మూర్ఖులను భక్తులను చేయడం, రెండు.. భక్తులను మూర్ఖులను చేయడం' అని మోదీ బొమ్మతో ఉన్న చిత్రాన్ని డిగ్గీ పోస్ట్‌ చేశారు. దిగ్విజయ్‌ వాడిన పదాలు అత్యంత అశ్లీలమైనవి కావడంతో... బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్గీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే... దిగ్విజయ్‌ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. నాపై మోదీ భక్తులు చేస్తున్న విమర్శలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.. ఎందుకంటే వారిని మోదీ వెర్రివాళ్లను చేస్తున్నాడని మరో ట్వీట్‌ చేయడం గమనార్హం. 

 

19:27 - July 20, 2017

ఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై.. 65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈనెల 17న ఓటింగ్‌ జరగగా.. ఈరోజు ఉదయం నుంచి ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. 7 లక్షల 2 వేల 44 ఓట్లతో రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపొందినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈనెల 24తో ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీన రామ్‌నాథ్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా గెలిచిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భ‌వ‌న్‌లో తాను అడుగుపెట్టడం భార‌త ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శమన్నారు భార‌త 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్. ఇది త‌న‌కు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్షణమన్నారు. త‌న విజ‌యాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు కోవింద్ కృత‌జ్ఞతలు తెలిపారు.
కోవింద్‌కు మీరాకుమార్‌ శుభాకాంక్షలు 
రాష్ట్రపతిగా విజయం సాధించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో తనకు సహకరించిన వారికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

 

16:40 - June 1, 2017

హైదరాబాద్ : మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్టవిప్పిచూడ పురుగులుండు. ఇదీ మనం చిన్నప్పుడు చదువుతున్న పద్యం. ఇప్పుడు భారత్‌ వృద్ధిరేటుకూడా సరిగ్గా ఇలాగే ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ అధికారం చేపట్టాక భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతోందని మోదీ బృందం ఊదరగొట్టింది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా వృద్ధిరేటు పెరిగిందని నేతలు పదేపదే చెప్తూ వచ్చారు. మోదీ నిర్ణయాలతో స్టాక్‌మార్కెట్లు గతంకంటే భారీగా గరిష్ట సూచీలను తాకాయని... ఇదంతా మోదీ తీసుకుంటోన్న నిర్ణయాల ప్రభావమనే ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. పైపై మెరుపులనే అభివృద్ధంటూ మోదీ సర్కార్‌ ప్రజలను భ్రమింపచేస్తున్న తరుణంలో... భారత ఆర్దిక వ్యవస్థ అసలు రూపు బయటపడింది.

ఒక్కసారిగా కుదుపునకు
ప్రపంచ వృద్ధికి చోదకశక్తిగా చెప్పుకునే భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధికాభివృద్ధిరేటు గణనీయంగా క్షీణించింది. 7.1శాతానికి ఆర్ధికవృద్ధిరేటు పడిపోయింది. దీంతో భారత్‌ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి దిగివచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని మనకున్న ఖ్యాతిని కోల్పోయినట్లయ్యింది. అంటే మోదీ సర్కార్‌ చెప్పుకున్నవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. అవన్నీ పైపై మెరుగులేనని సీఎస్‌వో గణాంకాలతో తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ కాషాయ నేతలంతా పటించిన అభివృద్ధిజపం.. బోగస్‌ అని అర్ధమైపోయింది.

గొప్పలు పోయిన సర్కార్
పెద్దనోట్ల రద్దు ఓ సాహసోపేతమైన నిర్ణయమంటూ మోదీ సర్కార్‌ గొప్పలు పోయింది. నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్ల రద్దంటూ కలరింగ్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం భారత అభివృద్ధికి దోహదపడుతుందని కూడా కాషాయ నేతలు చెప్పుకొచ్చారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. పెద్దనోట్ల రద్దు కారణంగా జనవరి - మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.1 శాతానికి క్షీణించింది. ఆర్ధిక సంవత్సరం వృద్ధిరేటునూ నోట్లరద్దు నిర్ణయం ప్రభావితం చేసింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఆర్ధికవ్యవస్థలో 87శాతం నగదు చలామణి యోగ్యత కోల్పోయింది. దీని ప్రభావం మూడు, నాలుగు త్రైమాసికాలు రెండింటిపైనా పడింది. డీమానిటైజేషన్‌ ప్రభావంతో స్థూల విలువ జోడింపు క్యూత్రీలో 6.7శాతానికి, క్యూఫోర్‌లో 5.6శాతానికి దిగజారాయి. నిర్మాణ రంగంపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపింది. జనవరి - మార్చిలో ఈ రంగం గతంకంటే 3.7 వృద్ధితగ్గింది. తయారీరంగంలో జీవీఏ 12.7శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. ఒక్క వ్యవసాయరంగం తప్పితే అన్ని రంగాలపైనా డీమానిటైజేషన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్ధిక వ్యవస్థపై పెద్దనోట్ల రద్దు ప్రభావం లేదని పదేపదే చెప్పిన పాలకులు పునరాలోచనలో పడేలా నోట్లరద్దు ఎకానమీపై విస్పష్ట ప్రభావం చూపింది.భారత్‌ ఆర్ధిక వ్యవస్థ మోదీ పాలనలో మూడేళ్ల కనిష్టానికి పడిపోయినా... వ్యవసాయరంగం మాత్రం కాస్తంత నిలదొక్కుకుంది. ఈఏడాది వ్యవసాయరంగం 4.9శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మంచి వర్షపాతం నమోదు కావడంతో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా పెరగడం మూలంగా ఈ రంగంలో వృద్ధి సాధ్యమైంది. ఇక 2016-17 ఆర్ధిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది. మార్చి చివరినాటికి ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యమైన జీడీపీలో 3.51గా నమోదైంది దేశ ప్రజల సంపన్నతకు గీటురాయి అయిన తలసరి ఆదాయం ప్రస్తుత రేట్ల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 9.7 శాతం పెరిగింది. దీంతో జాతీయ తలసరి ఆదాయం 1,03,219 రూపాయలుగా అంచనావేశారు. మొత్తానికి మోదీ పాలనలో భారత్‌ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది.పెద్దనోట్ల రద్దు ప్రతికూలతల ప్రభావానికితోడు తయారీ, సేవా రంగాలు డీలాపడటం ఇందుకు కారణమైంది.ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిన ఈదశలో.. వృద్ధిరేటును పెంచేందుకు మోదీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

21:26 - May 19, 2017

హైదరాబాద్: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతువ్యతిరేక విధానాలు అవవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యపూరింతంగా వ్యవహరించడం వల్లే .. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మిర్చిరైతులు, ఉపాధిహామీ కూలీల సమస్యలపై బృందాకరత్‌ గళమెత్తారు. ఉపాధి హామీకూలీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్దయగా ప్రవర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తెలంగాణలో 36శాతం మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులివ్వలేదని బృందాకరత్‌ అన్నారు. ఓవైపు తమ రాష్ట్రంలో 98శాతం ఆధార్‌కార్డులు ఇచ్చేశామని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని.. కేవలం ఆధార్‌కార్డు లేదన్న సాకుతో నిరుపేదల కడుపులు కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మోదీ