యూనివర్సిటీ

21:30 - November 14, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలు యూనివర్సిటీ ట్యాగ్‌లైన్‌ను కోల్పోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖకు చెందిన గీతం, గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, తిరుపతికి చెందిన రాష్ట్రీయ సాంస్క్రీట్‌ విద్యాపీఠ్‌, అనంతపురంకు చెందిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరుకు చెందిన విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు. వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఆదేశించింది. 

21:35 - September 25, 2017

ఢిల్లీ : దేశరాజధాని నిరసనలతో హోరెత్తిపోయింది. జంతర్‌ మంతర్‌ దగ్గర విద్యార్థి సంఘాలు, ఐద్వా ర్యాలీ చేపట్టాయి. బెనారస్‌ యూనివర్శిటీ విద్యార్థినిలపై లాఠీచార్జ్‌కు నిరసనగా ఆందోళనకు దిగాయి. ఆదివారం యూనివర్శిటీలోని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన వారితో పాటు... లాఠీచార్జ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

12:29 - August 24, 2017

వరంగల్ : రాష్ట్రంలో యువత బంగారు భవితకు బాటలు వేయాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం పూర్తిగా వట్టిపోతోంది. పరిశోధనలకు ప్రాణం పోయాల్సిన వర్సిటీ నిర్వీర్యమైపోతోంది. సరైన సంఖ్యలో అధ్యాపకుల్లేక, కనీస స్థాయిలో సిబ్బందిలేక, చివరికి నడిపించే సారథులే లేక వాడిపోతున్నాయి.. విజ్ఞాన కేంద్రాలు విలసిల్లాల్సిన చోట అడ్డగోలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.. కనీస మౌలిక సదుపాయాలూ లేక కునారిల్లిపోతున్నాయి. 
కేయూ మనుగడ ప్రశ్నార్థకం 
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కాకతీయ విశ్వవిద్యాలయం మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో ప్రఖ్యాతి గాంచిన కేయూ రానురాను తన ప్రాభవాన్ని కోల్పోతోంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో మంజూరైన పోస్టుల్లో సగం సిబ్బంది కూడా లేరు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 4 బ్రాంచీలు ఉన్నాయి. వాటికి 60 మంది బోధనా సిబ్బంది కావాలి. కానీ ఉన్నది 11 మందే. దీంతో రూ.16 కోట్ల వరకు అందాల్సిన టెక్విప్ నిధులు రాని పరిస్థితి.
మసకబారుతున్న కేయూ ప్రాభవం 
మొన్నటి దాక రెగ్యులర్ వీసీ లేరన్న సాకుతో నెట్టుకొచ్చిన యూనివర్సిటీలో.. ప్రస్తుతం ఆ లోటు భర్తీ చేసినా....  సమస్యలు, ఆందోళనలు, ఘర్షణలు, కుంబకోణాలు నిత్యకృత్యమయ్యాయి. గతేడాది జులై 25వ తేదీన కేయూ 11వ వీసీగా ఓయూ భౌతికశాస్త్రం విశ్రాంత ఆచార్యులు రొడ్డ సాయన్న బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాలనలో సాయన్న యూనివర్సిటీకి చేసేందేమి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ జాడే లేదు. దీంతో విధాన పరమైన నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏటా సమయానికి కౌన్సెలింగ్ జరగాలి. దీనికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంతో తరగతులు చాలా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సమస్యలతో సహవాసం చేస్తున్నారు. 
సెమిస్టర్ విధానంపై విమర్శల వెల్లువ  
2001లో అప్పటి ఉపకులపతి ఆచార్య చంద్రకాంత్‌కోకాటే పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే కొన్నాళ్లకే ఈ విధానం అభాసుపాలైంది. సకాలంలో ప్రవేశాలు నిర్వహించకపోవడం, తరగతులు, బోధన ఆలస్యం కావడం,  పరీక్షల నిర్వహణలో లోపాలు, ఫలితాల వెల్లడిలో జాప్యం సెమిస్టర్ విధానానికి శాపంగా మారాయి. కేయూ అందిస్తున్న 46 కోర్సుల్లో సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్, విద్యా కోర్సుల్లో ఈ విధానం అమల్లో ఉంది. అయితే సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రగతి సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. కేయూలో వీసీలు, పరీక్షల నియంత్రణ అధికారులు మారినా సెమిస్టర్ పరీక్షలు మాత్రం అనుకున్న సమయానికి జరగడంలేదు. ప్రవేశాలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో ఈ నూతన విధానం విద్యార్థులకు భారంగా మారిందనే విమర్శలున్నాయి. 
ప్రైవేట్ కాంట్రాక్టర్, విద్యార్ధులకు మధ్య గొడవలు 
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ వెంకటరత్నం మూడేళ్ల పదవి కాలంలో అనేక వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2012లో యూనివర్సిటీలోని కామన్ మెస్‌ను ప్రైవేట్ పరం చేయడం విద్యార్థుల్లో అగ్గిరాజేసింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు రెండేళ్లుగా పోరు కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్, విద్యార్ధులకు మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. 
వీసీ వెంకటరత్నం పదవికాలంలో వివాదాస్పద నిర్ణయాలు  
కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దుర్వినియోగం కావడంతో..నలుగురు ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా బోధన, బోధనేతర సిబ్బందిని వీసీ ఇష్టారీతిన నియమించారన్న ఆరోపణలున్నాయి. వివిధ విభాగాల్లో సుమారు 200 మందికి పైగా నియామకాలు చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ నియామకాల అంశం కేయూను కుదిపేస్తోంది.

 

12:39 - August 3, 2017

హైదరాబాద్ : నాంపల్లి తెలుగు యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల పేపర్‌ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. 

13:35 - August 2, 2017

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ హార్టీకల్చర్‌ యూనివర్శిటీలో.. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఉదయం అరెస్ట్‌ చేశారు. దీంతో స్టూడెంట్స్ ధర్నా నిర్వహించి.. రోడ్డుపై బైటాయించారు. విద్యార్థులకు మద్దతుగా టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను వెంటనే అరెస్ట్‌ చేశారు. తాము ఇన్ని రోజులుగా ఒక న్యాయమైన డిమాండ్‌ను వినిపిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.

 

14:36 - July 10, 2017

వరంగల్ : జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ను తొలగించాలంటూ గత వారంఓ రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఈ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాన్వకేషన్ నిర్వహించవద్దంటూ ఒకవేళ నిర్వహిస్తే అడ్డుకుంటామని విద్యార్థుఉల హెచ్చరించారు. వీసీ ఛాంబర్ లోకి చోచ్చుకెళ్లి వీసీ ముందు బైఠాయించి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:28 - July 7, 2017

కర్నూలు : రాయలసీమ యూనివర్సిటీలో కుల చిచ్చు రగులుతోంది. యూనివర్సిటీలో దళిత, బీసీ అధ్యాపకులపై వివక్ష చూపుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేనివారిని అంతలమెక్కించారని వారు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ఐదుగురు సభ్యులతో కమిటీ నిబంధనలు పాటించకుండా నియమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ మాత్రం కాంట్రాక్టు అధ్యాపకలనే తొలగించాంటున్నారు. నియామకాల్లో యూజీసీ నిబంధనలు పాటించినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

18:16 - May 9, 2017

హైదరాబాద్ : అది దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న యూనివర్శిటీ. ఎన్నో శక్తులు ఆ యూనివర్శిటీ పేరును దిగజార్చేందుకు ప్రయత్నించాయి. అయినా ఆ విశ్వవిద్యాలయం వన్నె కొంచెం కూడా తగ్గలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత రెండేళ్లుగా ఆందోళనలతో హాట్ టాపిక్‌గా నిలిచిన హెచ్‌సీయూ.. విద్యార్థులు రారు అని జరిగిన ప్రచారాలను పటా పంచలు చేసింది. అడ్మిషన్ల వెల్లువతో యూనివర్శిటీ కళకళలాడుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ వారి వ్యూహాలేవీ ఇక్కడ పని చేయలేదు. యూనివర్శిటీ ఇప్పటికీ అదే చరిష్మాతో ముందుకు సాగుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్య ముందు తరువాత జరిగిన అనేక ఘటనలు విశ్వ విద్యాలయ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. ఇక ఈ యూనివర్శిటీకి విద్యార్థుల రాక తగ్గుతుందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీకి ప్రవేశాల కోసం దరఖాస్తుల వెల్లువ వస్తోంది.

30 శాతం పెరిగిన దరఖాస్తులు..
గత రెండేళ్లుగా హెచ్‌సీయూ.. విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. అనేక పోరాటాలకు కేంద్రబిందువైంది. ఈ క్రమంలో ఆందోళనలతో యూనివర్శిటీ పరువు పోతుందనీ కొందరంటే.. ప్రతిష్ట దిగజారుతుందనీ మరికొందరు మాట్లాడారు. అయితే భారీగా వచ్చిన దరఖాస్తులు వారందరి నోళ్లకు తాళం పడేలా చేశాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మొత్తం 124 కోర్సుల్లో దాదాపు 2 వేల సీట్లున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3 నుంచి మే 5 వరకు యూనివర్శిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల నుంచి 58 వేల 34 దరఖాస్తులు ఈ విద్యా సంవత్సరానికి వచ్చాయి. గతేడాది 44 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా దరఖాస్తులు పెరిగాయి. వీటిలో 37 శాతం మహిళా అభ్యర్థుల నుంచి రావడం విశేషమనే చెప్పాలి.

విద్యార్థి సంఘాల హర్షం..
ఈ దరఖాస్తుల్లో ఓబీసీ అభ్యర్థులవి 35.9 శాతం, ఎస్సీ అభ్యర్థులవి 15.83 శాతం, ఎస్టీ అభ్యర్థులవి 9.60 శాతం ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 19 వేల 9 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో కేరళ 6 వేల 515 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5 వేల 918 దరఖాస్తులు ఉన్నాయి. హెచ్‌సీయూ ప్రవేశపరీక్షలు దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో జూన్ 1 నుంచి 5 వరకు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూనిర్శిటీ అధికారులు చెబుతున్నారు. యూనివర్శిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కో సీటుకు 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. దీని పట్ల యూనివర్సిటీ అధికారులతో పాటు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

12:23 - April 24, 2017

హెన్నా పెట్టుకున్న ఓ యువతి చేతులు కాలిపోయాయి. ఈ ఘటన షార్జాలో చోటు చేసుకుంది. యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ యువతి చేతికి హెన్నా పెట్టించుకుంది. ఈ హెన్నాను ఆర్టిస్టు పెట్టింది. కానీ డిజైన్ పెట్టుకున్న కొద్ది నిమిషాలలోపే చేతులు మంటగా అనిపించాయి. అరగంటలోనే చేతులపై బొబ్బలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే చేతులు కడుక్కొంది. అయినా మంటలు తక్కువ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు చేతులకు వివిధ రకాల ఆయింట్ మెంట్ లు రాశారు. తాను రెడ్ హెన్నా పెడుతున్నానని ఆ ఆర్టిస్టు చెప్పిందని..అది డార్క్ గా ఉండంతో తనకు మొదట్లోనే అనుమానం కలిగిందని సదరు యువతి పేర్కొంటోంది. వారం రోజుల తరువాత ఎలర్జీ ఎక్కువ కావడంతో ఆమెను ఎమర్జెన్సీకి తరలించారు. తనకు టాబ్లెట్లతో పాటు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారని..నొప్పి భరించలేకపోతున్నట్లు వాపోయిందంట. యూనివర్సిటీ వర్గాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

10:58 - April 15, 2017

హైదరాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఎంతో మంది విద్యార్థులను మేధావులు, మహానేతలుగా తీర్చిదిద్ది న ఘనచరిత్ర ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ... ఘన చరిత్రను, కీర్తిని సాధించిన విశ్వవిద్యాలయం ప్రారంభమై వందేళ్లు పూర్తయింది. ఈనెల 26, 27, 28 తేదీల్లో వందేళ్ల సంబురాలు జరుపుకోవడానికి ఈ చదువుల కోవెల సిద్దమైంది. ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీ పై 10టివి స్పెషల్ ఫోకస్.

స్వదేశీ రాజులు పాలిస్తున్న కాలం.....
19వ శతాబ్దిలో దేశంలో అత్యధిక ప్రాంతాలను స్వదేశీ రాజులు పాలిస్తున్న కాలం అది. ఆరోజుల్లోనే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు అప్పటి బ్రిటిష్‌పాలకులు. అదేస్ఫూర్తితో హైదరాబాద్‌ రాజ్యంలోకూడా ఉన్నత విద్యను అందించాలని అప్పటి నిజాం పాలకుడు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ సంకల్పించారు. దాని ఫలితమే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావం. 1917లో ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించారు. అయితే.. దీని వెనక ఎంతో మంది ప్రముఖుల ఆలోచనలు, ప్రతిపాదనలు, దశాబ్దాల నిరీక్షణ ఉన్నాయి. ముఖ్యంగా కైరోలో అల్‌ అజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మౌల్వీ జమాలుద్దీన్ అప్ఘానీ, డబ్ల్యూ ఎస్‌ బ్లంట్ అనే బ్రిటీష్ విద్యావేత్తల పాత్ర మరువలేనిది.

1885 ఏప్రిల్‌ 22న అంకురార్పణ......
ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనకు 1885 ఏప్రిల్‌ 22న అంకురార్పణ జరిగింది. పబ్లిక్‌ గార్డెన్స్‌లో, 6వ నిజాం మీర్‌ మహబూబ్ అలీఖాన్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నప్పుడు కొంతమంది విద్యార్ధులు, ప్రముఖులు.. నిజామీయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు లేవనెత్తారు. ఆ తరువాత 1895లో నిజాం కాలేజీ బహుమతి ప్రధానోత్సవంలో విశ్వవిద్యాలయ అవసరాన్ని గుర్తుచేసారు వక్తలు. అప్పట్లో సంస్థానంలో జరిగిన రాజకీయ మార్పులు, దేశంలో బ్రిటీష్ ప్రభుత్వం తీసుకున్న విద్యాసంస్కరణల నేపథ్యంలో వర్సిటీ ప్రతిపాదనలలకు ప్రాధాన్యం ఏర్పడింది.

సంస్థానాల్లోకూడా వర్సిటీలు ఏర్పాటు......
తర్వాత 1913లో తమ పరిపాలనలో ఉన్న ప్రాంతాలతోపాటు ..సంస్థానాల్లోకూడా వర్సిటీలు ఏర్పాటు చేయాలనిబ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్లోభాగంగా 1916లో మైసూర్‌ విశ్వవిద్యాలయం, వారణాసిలో బెనారస్‌ వర్సిటీలను ప్రారంభించారు. అటు పాట్నాలోకూడా యూనివర్సిటీ స్థాపను సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ..ఇక్కడ నిజాం రాజ్యంలోకూడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. 1917 ఏప్రిల్‌ 22న విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న సర్‌ అక్బర్‌హైదరీ వర్సిటీ తక్షణ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ నిజాంకు మెమోరాండం ఇచ్చారు. అదీ స్వదేశీ భాష అయిన ఉర్దూ మాధ్యమంలో బోధన జరిగేలా యూనివర్సిటీ స్థాపించాలని ప్రతిపాదించారు అక్బర్‌ హైదరీ.

ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్టు ఫర్మానా జారీ.......
ఈ పరిణామక్రమంలో ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్టు ఫర్మానా జారీ చేసారు 7నిజం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌. దీంతో దేశీయ భాషల్లో స్థాపించిన మొట్టమొదటి విశ్వవిద్యాయంగా ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలో పేరుపొందింది. అయితే .. బోధన భాషగా ఉర్దూను ప్రవేశపెట్టడంతో ప్రశంశలతోపాటు వ్యతిరేకత వ్యక్తం అయింది. అప్పటి సంస్థానం జనాభాలో 14శాతం మంది మాట్లాడే ఉర్దూను భోదనా భాషగా ఉండాలా? లేక అత్యధికులు మాట్లాడే తెలుగు, కన్నడ, మరాఠీ భాషాల్లో కూడా భోదించాలా..?అనే ప్రశ్న ముందుకు వచ్చింది. అప్పటి గణాంకాల ప్రకారం సంస్థానంలో కోటి 16లక్షల 34వేల మంది జనాభా వున్నారు. ఇందులో 85శాతం మంది హిందువులు, మిగితా ముస్లీంలు. కాని పాలకుల అభీష్టం మేరకు ఉర్దూకే మొగ్గు చూపారు.

 

తొలిసారిగా ఇంటర్మిడియట్ తరగతులు........
సాధారణంగా ఉస్మానియా యూనివర్శిటీ అంటే ఆర్ట్స్ కాలేజీనే అందరికీ గుర్తుకు వస్తుంది. కాని క్లాసులు ప్రారంభమైంది మాత్రం గన్‌ఫైండ్రీ లోని అప్పటి ప్రధాని మహరాజ ప్రతాప్‌ సింగ్ కు చెందిన భవంతిలో. తొలిసారిగా ఇంటర్మిడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. 1917లో ప్రారంభం అయినప్పటికీ అందుబాటులో పలు భవంతుల్లో 1919 వరకు క్లాసులు బోధించారు. అయితే తొలి ఇంటర్మిడియట్ బ్యాచ్ కి 1921లో పరీక్షలు జరిగాయి. బీఏ పరీక్షలు 1923లో ప్రారంభమయ్యాయి. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పరీక్షలు 1925లో మొదలయ్యాయి. వైద్యశాస్త్ర పుస్తకాలు సైతం ఉర్దూలోకి అనువదించాక తొలి ఎంబీబీఎస్‌ బ్యాచ్ కి జులై 1927లోనూ ఇంజనీరింగ్ విద్యకు 1929లోనూ ప్రారంభించారు. అలా ఆరంభమయినా వర్శిటీ తరువాతి కాలంలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోఖ్యాతిని పొందింది.

వందేళ్ల ప్రస్థానం.....ఎందరో గొప్పవ్యక్తులు.....
వందేళ్ల ప్రస్థానంలో ఉస్మానియా యూనివర్శిటీ ఎంతో మంది విద్యార్థులను గొప్పగొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది.ప్రపంచానికి ఎంతోమంది ఆణిముత్యాలను అందించింది. ప్రారంభంలో కేవలం 500మందితో ప్రారంభమయిన వర్సిటీ వందేళ్ల కాలంలో లక్షలాది మందికి విద్యను అందించింది. తన ప్రస్థానంలో ఎన్నో చారిత్రక పరిణామాలను, సమస్యలను అధిగమించింది.

భారతీయభాషను బోధనా మాద్యమం.......
భారతీయభాషను బోధనా మాద్యమంగా 1917లో ఉస్మానియా వర్సిటీ ఏర్పడింది. 1918లో ఆర్ట్స్, సైన్స్ కాలేజీలు రూపుదిద్దుకున్నాయి. 1923లో ఎల్‌ఎల్‌బీ, ఎంఏ కోర్సులను ప్రవేశపెట్టారు. తర్వాత 1924లోనే యూనివర్సిటీలో తొలిసారిగా మహిళా కళాశాల ఏర్పాటైంది. 1927 లో ఎంబీబీఎస్‌, 1928లో కాలేజ్ ఆఫ్‌ ఎడ్యుకేషన్, 1929లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటయింది. ఆ తరువాత 1942లో కామర్స్ కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. వీటితోపాటు స్వాతంత్ర్యానికి ముందే ఇక్కడ వ్యవసాయ, పశువైద్య కోర్సులను ఇంటర్‌డ్యూస్ చేయడం విశేషం.

సికింద్రాబాద్ లో ఆర్ట్స్ , సైన్స్ కాలేజీలను ప్రారంభం.....
స్వతంత్ర భారతంలో 1947లో సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ , సైన్స్ కాలేజీలను ప్రారంభించారు. తర్వాత 1887లో మద్రాస్ వర్శిటీకి అనుబంధంగా ఏర్పాటైన నిజాం కాలేజీని.. 1948లో ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా మార్చారు. అటు 1950లో దేశంలోనే తొలిసారిగా సాయంకాల కోర్సును ప్రవేశపెట్టి.. విద్యార్థులకు మరింత చేరువయింది యూనివర్సిటీ. మరోవైపు 1962లో జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రిని ప్రారంభించిన తొలి దేశీయ వర్శిటీగా కూడా ఉస్మానియాకు పేరుగాంచింది. అంతేకాదు.. 1963లో ఈశాన్య ఆసియాలో అతిపెద్ద టెలిస్కోప్ .. రంగాపురంలోని అబ్జర్వేటరీలో ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది ఉస్మానియా.

1977లో కరస్సాండెన్స్ కోర్సులను ఆరంభం......
ఇక పెద్దగా చదువుకోలేని యువజనులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో 1977లో కరస్సాండెన్స్ కోర్సులను ఆరంభించింది యూనివర్సిటీ. ప్రస్తుతం దాన్నే ప్రొఫెసర్ జి రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గా పిలుస్తున్నారు. 1982 లో అండర్‌ గ్రాడ్యుయేట్ స్థాయిలో బయో మెడికల్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించిన తొలి వర్శిటీ కూడా ఓయునే కావడం విశేషం. 2004లో సికింద్రాబాద్ పీజి కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ను ప్రవేశపెట్టిన ఓయూ... అంతకు ముందే 2000ల సంవత్సరంలో అడ్మిషన్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈవిధంగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు నెలవుగా ఉన్న ఉస్మానియా.. ఆనాటి వైభవాన్ని కోల్పోతోందనే ఆవేదన వ్యక్తంఅవుతోంది. వందేళ్ల సంబురాలతో అయినా వర్సిటీ పూర్వ వైభవానికి బాటలు పడాలన్న ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

 

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - యూనివర్సిటీ