యూపీ

16:13 - January 18, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో హర్యానా రెయాన్‌ స్కూలు లాంటి కేసు ఒకటి వెలుగు చూసింది. లక్నో త్రివేణినగర్‌లో ఉన్న బ్రైట్‌ల్యాండ్‌ స్కూల్లో ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్న విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. సిసిటివి ఫుటేజి ఆధారంగా ఈ దాడికి పాల్పడింది ఓ బాలికగా గుర్తించారు. సిసిటివి వీడియోలో చిన్న జుట్టుతో కనిపించిన ఆ అక్కే నాపై దాడి చేసిందని గాయపడ్డ విద్యార్థి రుతిక్‌ పోలీసులకు చెప్పాడు. ఉదయం పదిన్నరకు ప్రార్థన అనంతరం ఆ అమ్మాయి తనని క్లాస్‌ రూమ్‌ నుంచి తీసుకెళ్లి వాష్‌ రూంలో బంధించిందని రుతిక్‌ తెలిపాడు. రెండు చేతులను చున్నీతో కట్టేసి కత్తితో దాడి చేసినట్లు బాలుడు పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై బాలుడి పేరెంట్స్‌ స్కూలు ముందు ఆందోళన చేపట్టారు. సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడి చేసిన విద్యార్థిని 6 నుంచి 8 వ క్లాస్‌కు చెందినదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

16:05 - January 17, 2018

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని ఓ ఇంటిపై అధికారులు దాడి చేసి భారీ ఎత్తున రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం -పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో 97 కోట్ల పాత నోట్లు దొరికాయి. 500, 1000 నోట్లను బెడ్‌లాగా పరచి ఉన్న నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. కాన్పూర్‌లోని స్వరూప్‌ నగర్‌ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఈ డబ్బును గుర్తించారు. డబ్బు మార్పిడి చేస్తామని చెప్పిన 16 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంటి యజమానిని వ్యాపారి అశోక్‌ ఖత్రీగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొత్తంపై పూర్తి వివరాలను రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం తెలియజేస్తుందని పోలీసులు తెలిపారు. 

12:02 - January 6, 2018

లక్నో : యూపీ అసెంబ్లీ ఎదుట రైతులు వినూత్న ఆందోళనకు దిగారు. రైతులు అసెంబ్లీ ముందు అలుగడ్డలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అలుగడ్డ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూపీ కిలో అలు కు రూ.4 పలుకుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:53 - December 13, 2017

అగ్రా : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొనే ప్రసక్తే లేదని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే సామాజిక ఉద్యమాల్లో కేజ్రీవాల్‌ను కలుపుకోవడం జరగదని అన్నాహజారే ప్రకటించారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు తేవడంపై బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. యూపీలోని ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నాహజారే ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతికంగా అన్నాహజారే 2011 చేపట్టిన ఉద్యమంలో కేజ్రీవాల్‌ కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. 2018 మార్చి 23న ఢిల్లీలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అన్నాహజారే తెలిపారు.

21:45 - December 1, 2017

ఉత్తర్ ప్రదేశ్ : స్థానిక ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 16 నగర పాలక సంస్థలకు గాను 14 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. బిఎస్‌పి 2 నగర పాలక స్థానాలను గెలుచుకుంది. వారణాసి, గోరఖ్‌పూర్‌, ఘజియాబాద్‌, రాయ్‌బరేలి, ఆగ్రా,ఫిరోజాబాద్‌, అయోధ్య, మధుర, లక్నో, కాన్పూర్‌, సహరాన్‌పూర్‌, మొరదాబాద్‌, ఝాన్సీ, బరేలీల్లో బీజేపీ మేయర్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అలీఘర్‌, మీరట్‌లో బీఎస్‌పీ మేయర్‌ అభ్యర్థులు గెలుపొందారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అన్నారు. స్థానిక ఎన్నికల్లో రెండో స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ నిలిచింది. మూడో, నాలుగో స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ యూపీలో బోణి కొట్టింది. ఆప్‌కు 3 నగర పంచాయితీలు, నగర పాలిక పరిషత్‌లో ఒక చోట గెలుపొందింది. 652 పురపాలక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 16 నగర నిగమ్‌లు, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఉత్తరప్రదేశ్ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్‌ ఇచ్చాయి. రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బిజెపి విజయం సాధించింది. అమేథి నగర్‌ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలోనూ బీజేపీ విజయం సాధించింది. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్‌ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది.

13:57 - November 5, 2017

యూపీ : భారత్‌లో మరో విదేశీ పర్యాటకుడిపై దాడి సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని రాబర్ట్స్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. జర్మనీకి చెందిన హాల్గర్‌ ఎరిక్‌.. రాబర్ట్స్‌గంజ్‌ స్టేషన్‌లో ఉన్నప్పుడు.. సహాయం సాకుతో అమన్‌ కుమార్‌ అనే వ్యక్తి వేధింపులు మొదలుపెట్టాడు. ఒక దశలో ఎరిక్‌ను కొట్టి, కిందపడేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇటీవలే ఆగ్రాలో తమతో సెల్ఫీ దిగలేదన్న సాకుతో కొందరు యువకులు స్విట్జర్లాండ్‌కు చెందిన జంటను చితక్కొట్టిన ఉదంతం ఇంకా చల్లారకముందే.... మరో టూరిస్టుపై దాడి జరిగింది.

12:20 - November 4, 2017

స్పోర్ట్స్ : ఓ అపరిచిత వ్యక్తి రంజీ క్రికెట్ మ్యాచ్ జరుతుండగా గౌండ్ లోకి కారుతో వచ్చి పిచ్ పై అటు ఇటు తిప్పుతుంటే కొంత సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో ఆటగాళ్ల తెలియలేదు. యూపీలోని పాలెం ఎయిర్ ఫోర్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఢిల్లీ, యూపీ మధ్య జట్ల రంజీ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ మూడవ రోజు ఇంక 20 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తోందనగా గిరిశ్ శర్మ అనే యువకుడు వెగనర్ కారుతో గ్రౌండ్ లోకి వచ్చాడు. అలా రావడమే కాకుండా ఏకంగా పిచ్ పై కారును నడిపాడు. అతికష్టం మీద కారును ఆపిన భద్రత సిబ్బంది ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మ్యాచ్ లో భారత్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్ ఉన్నారు.

21:25 - November 1, 2017

లక్నో : బాలీవుడ్‌ క్వీన్‌, రాజ్యసభ సభ్యురాలు రేఖ రాయబరేలీలో అభివృద్ధి పనుల కోసం తన ఎంపీ ఫండ్‌ నుంచి రెండున్నర కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో సోలార్‌ లైట్లు, ఇంటర్‌ లింకింగ్‌ రోడ్లు, హ్యాండ్‌ పంప్‌లు, సిసిరోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. రాయబరేలీకి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అనంతరం రేఖ ఈ ఏడాది జనవరిలో కోటి 44 లక్షల నిధులు కేటాయించారు. అక్టోబర్‌ 2017 మరో కోటి 42 లక్షలు రెండో విడతగా నిధులు మంజూరు చేశారు. రాయబరేలీలో ఇప్పటికే కోటి రూపాయల పనులు పూర్తయ్యాయి.

19:40 - November 1, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది.బాయిలర్‌ పైపు పేలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:47 - October 26, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. క్లీన్‌ ఇండియా ప్రచారంలో భాగంగా తాజ్‌మహల్‌ వెస్ట్రన్‌ గేటు వద్ద రోడ్డు ఊడ్చారు. యూపీలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి తాజ్‌మహల్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. తాజ్‌మహల్‌ ఆవరణలోని అన్ని ప్రాంతాలను సీఎం యోగి సందర్శించారు. ఆగ్రాలో టూరిజం అభివృద్ధి కోసం ప్రభుత్వం 370 కోట్లు మంజూరు చేసింది. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధుల వద్ద సీఎం యోగి సుమారు అరగంట పాటు గడిపారు..తాజ్‌మహల్ నుంచి ఆగ్రా వరకు వేయనున్న టూరిస్టు రోడ్డు కోసం యోగి శంకుస్థాపన చేయనున్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - యూపీ