రంగారెడ్డి

21:40 - November 25, 2018

రంగారెడ్డి : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సోనియా కడుపు తరుక్కుపోతుందంటా? ఎందుకో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. 
తెలంగాణకు నీళ్లు రావొద్దా?
పేదింటి ఆడపిల్లలకు రూ.లక్ష ఇస్తున్నామని.. అందుకు సోనియా బాధపడుతున్నారా? రైతు ఆత్మహత్యలు బంద్ అయినందుకు సోనియాకు బాధనా? రైతు బంధుతో రైతులను ఆదుకున్నందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని.. అంటే తెలంగాణకు నీళ్లు రావొద్దా? అన్నారు. చెరువులను కాంగ్రెస్ వారు నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల్లో తేల్చుకుందామని ఎన్నికలకు వెళ్తే..ఎన్నికలు వద్దని కోర్టుకు వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద పెంచుతున్నాం..పేదలకు పంచుతున్నామని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రోజులో 10 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని..ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 

 

21:10 - November 25, 2018

రంగారెడ్డి : ’ఎన్నికలు వస్తుంటాయి...పోతుంటాయి.. ప్రజలు ఆలోచించి ఓటేయాలి’ అని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ’ఎన్నికల్లో నాయకులు కాదు...ప్రజలు గెలవాలి.. అప్పుడే ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కూటమి, టీఆర్ఎస్.. ఈ రెండింటిలో ఏదీ గెలిస్తే మంచిదో ఆలోచించాలన్నారు. 
విద్యుత్ తలసరి వినియోగంలో రాష్ట్రం నెంబర్ వన్.. 
విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఏపీలోనే కరెంటు లేదని ఎద్దేవా చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. దేశంలోనే జరగని అభివృద్ధి ఇక్కడ జరుగుతోందన్నారు. కేటీఆర్ కిట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. అమ్మవడి పథకం ద్వారా ప్రసవానికి వచ్చిన మహిళలను ఉచితంగా వ్యాన్లలలో ఆస్పత్రికి తీసుకెళ్లి మంచిగా ప్రవసం చేయించి, మంచిగా చూసుకున్నామన్నారు. అమ్మాయి పుడితే 13 వేలు.. అబ్బాయి పుడితే 12 వేల రూపాయాలు ఇచ్చి వారి ఇంటి దగ్గర వదిలి పెడుతున్నామని తెలిపారు. 
43 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు.. 
పెన్షన్, కేసీఆర్ కిట్, ఇతర సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు. ఇండియాలో ఎక్కడా జరగని మంచి పనులు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. 43 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడన్నా ఉందా అని అన్నారు.   

 

10:24 - November 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న గులాబీ బాస్ సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాలను బెంబేలెత్తిస్తున్నారు. ఏకంగా 4- 6 సభలలో పాల్గొంటున్న ఆయన తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన గులాబీ దళపతి..నవంబర్ 24వ తేదీ శనివారం ఒక రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. తిరిగి నవంబర్ 25వ తేదీ ఆదివారం ప్రచారానికి సన్నద్ధమౌతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. తాండూరు ప్రచార సభలో పాల్గొననున్న ఆయన పరిగి, నారాయణపేట్, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం సభలకు హాజరు కానున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించేందుకు కేసీఆర్ డిసెంబర్ 3వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని..సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం.  

17:56 - November 22, 2018

హైదరాబాద్ : నామినేషన్ల ఉపసంహరణ కూడా కంప్లీట్ అయిపోయింది.. ఇక మిగిలింది ప్రచారం మాత్రమే. ప్రజలు ఓట్లు వేయటమే. ఈ సమయంలో రెబల్ అభ్యర్థులను బుజ్జగించటానికి సామ, దాన, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు బరిలోని అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా కె.ఎస్.రత్నం పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా.. టికెట్ ఆశించి భంగపడిన వెంకటస్వామి కూడా పోటీకి సై అన్నారు. వెంకటస్వామికి కొద్దోగొప్పో ప్రజల్లో పలుకుబడి ఉంది. చేవెళ్ల నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు వెంకటస్వామి. దీంతో కాంగ్రెస్ ఓట్ల చీలక ఖాయంగా కనిపించింది. దీన్ని గమనించిన రత్నం.. గెలుపు కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయారు.
వెంకటస్వామితో కాళ్ల బేరం :
రెబల్ అభ్యర్థి వెంకటస్వామితో కాళ్ల బేరానికి రెడీ సిద్ధపడిన రత్నం.. ఏకంగా ఆయన ఇంటికి వెళ్లారు. అందరి ముందు ఆయన కాళ్లు పట్టుకున్నారు. మీరు నాకే సపోర్ట్ చేయాలని వేడుకున్నారు. మీటింగ్ జరుగుతున్న సమయంలో.. చుట్టూ అందరూ ఉన్న సమయంలోనే రత్నం కాళ్లు పట్టుకుని వెంకటస్వామిని వేడుకున్నారు. రత్నం ప్రవర్తనతో అందరూ షాక్ అయ్యారు. వెంకటస్వామి అయితే వారించటానికి ప్రయత్నించారు. అయినా వినకుండా కాళ్లు పట్టుకున్నాడు. మీరు నాకే సపోర్ట్ చేయాలి.. నా గెలుపు మీపైనే ఆధారపడి ఉంది అంటూ ప్రాధేయపడ్డారు రత్నం. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

11:03 - November 5, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉమ్మడి ఎజెండాతో జత కట్టిన మహా కూటమి సీట్ల పంపిణీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు నామినేషన్ల సమయం దగ్గర పడుతుండటంపై కూటమి భాగస్వామి పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయవంలో టీడీపీ కొంత పట్టు విడుపుతో మసలుతోంది. ఇప్పటికే టీడీపీకి 14 సీట్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. మరో నాలుగు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా వుండటంతో మరోనాలుగు ఇవ్వాలని కోరుతోంది. ఈ క్రమంలో సీపీఐ మాత్రం పది సీట్లను అడిగిన ఈ పార్టీ కచ్చితంగా ఐదింటినైనా ఇవ్వాల్సిందేనని గట్టిగా కోరుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు, మునుగోడు, దేవరకొండ, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి. వీటిలో ఏవైనా ఐదు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతోంది. తమపార్టీ బలంగా ఉన్నందున నల్గొండలో ఒకటి, ఖమ్మం జిల్లాలో రెండు కలిపి తప్పనిసరిగా మొత్తం 5 కేటాయించాలనేది డిమాండు. కానీ రెండింటినే ఇస్తామని కాంగ్రెస్‌ సంకేతాలిచ్చింది. అవి బెల్లంపల్లి, వైరా అని తేల్చింది. తమకు 5 సీట్లు ఇవ్వకపోతే మరో ప్రణాళిక ప్రకారం ముందుకెళతామని సీపీఐ పేర్కొంది.
 

 

12:34 - November 4, 2018

రంగారెడ్డి : జిల్లాలోని శేరిలింగంపల్లి టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఆ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. టికెట్ ఖరారు కాకముందే భవ్య ఆనంద్ ప్రసాద్ బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో ఆగ్రహించిన మువ్వ సత్యనారాయణ వర్గీయులు ఆనంద్ ప్రసాద్ బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, మువ్వ సత్యనారాయణ, ఆనంద ప్రసాద్ టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

 

18:28 - October 11, 2018

రంగారెడ్డి : జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రథంపై దాడి జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార రథంపై ప్రజలు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రచార రథం ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి తండాకు వెళ్లింది. తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని టీఆర్ఎస్ ప్రచారం రథంపై గ్రామస్తులు దాడి చేశారు. ప్రచార రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసి, ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

09:43 - October 10, 2018

రంగారెడ్డి : ఎన్నికల్లో మద్యం, మనీ ఓటర్లపై ప్రభావం చూపించటం సర్వసాధారణంగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముందుంటాయి. మనీ, మద్యం, కానుకలు వంటివి ఆశ చూపి ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. రాజకీయ నాయకులు వేసే ఎరలకు ఆశపడి, గుడ్డిగా వారిని అనుసరించకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పలి మండలంలోని ఖల్కోడ గ్రామ ప్రజలు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న నాయకులు మద్యాన్ని ఎరగా వేసి ఓట్లు గుంజేందుకు ప్రయత్నిస్తారని, వారి బారిన పడి మోసపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఇటువంటి గ్రామస్థుల నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శం కావాల్సినఅవుసరం ఎంతైనా వుంది. అంతేకాదు..ఎన్నికల్లో నేతలు ఇచ్చిన కానుకలకు ఆశపడి తమ ఓటును అమ్ముకుని ఓటు వేయటం అంటే తమ భవిష్యత్తును..అభివృద్దిని తామే అంతం చేసుకోవటంతో సమానమని..రాజ్యాంగపరంగా ఓటు వేసే పూర్తి హక్కుని ప్రతీ  ఓటరు వినియోగించుకోవాలని..వినియోగించుకుంటారని  ఆశిద్దాం..

18:35 - October 2, 2018

రంగారెడ్డి  టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్.. జైపాల్ యాదవ్‌ కారు వెనుక భాగంలో ఢీకొట్టంది. కారు వెనుకభాగానికి కొద్దపాటి నష్టం జరిగింది. జైపాల్ యాదవ్‌తోపాటు వాహనంలోని మరికొందరికి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ క్రషర్ మిల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న కడ్తాల్ పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని, విచారించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ డ్రైవర్, యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. 

 

14:33 - September 5, 2018

రంగారెడ్డి : టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలోనూ పెట్టమని అక్కడి ప్రజలు కోరుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. షాద్ నగర్ గడ్డకు ఎంతో ప్రాధాన్యత ఉందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందరూ అంటారని..కానీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని తెలిపారు. 1952 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ఉన్నారని పేర్కొన్నారు. 1956 లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. అత్యంత దగా పడ్డ, మోస పోయిన ప్రాంతం పాలమూరు జిల్లా అని పేర్కొన్నారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టును తలపెట్టిన విధంగా పూర్తి చేసి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కాదన్నారు. మీరిచ్చిన ఆశీర్వాదంతోనే కేసీఆర్ గెలిచి పార్లమెంట్ కు వెళ్లి కొట్లాడి.. తెలంగాణ రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి...తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఇస్తుందని తెలిపారు. పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశ ప్రజలు అంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యంలో సీలింగ్ విధించారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రేషన్ బియ్యంలో ఎలాంటి సీలింగ్ విధించ లేదని... అందరికీ ఇస్తున్నామని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రంగారెడ్డి