రచయిత్రి

21:25 - November 3, 2017
15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:33 - June 11, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలకు దిశానిర్దేశం చేస్తుంది. వ్యక్తులను మహోన్నత శక్తులుగా మారుస్తుంది. మానవ సమాజ వికాసానికి తోడ్పడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న ఎందరో రచయితలు కవులు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ కవయిత్రి పాతూరి అన్నపూర్ణ ఒకరు. కంటినుండి జారే భాష్పాన్ని కవిత్వం స్పర్శిస్తుంది. చలమలో ఊరే నీటిలా నిండిన హృదయవేదననీ స్పర్శిస్తుంది కవిత్వం...అంటూ హృదయాలను కదిలించే కవిత్వాలు రాశారు. గత మూడు దశాబ్దాలుగా కవితలు, కథలు రాస్తున్నారామె. అడవి ఉరేసుకుంది, నిశ్శబ్దాన్ని వెతక్కు, మనసు తడిలాంటి కవితా సంకలనాలు వెలువరించిన ప్రముఖ కవయిత్రి కథన శిల్పి పాతూరి అన్నపూర్ణ గురించి మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

17:32 - March 15, 2017
13:37 - January 23, 2017

ఢిల్లీ : వామపక్ష ప్రభుత్వం కంటే మమత బెనర్జీ మరింత కఠినాత్మురాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎంగా మమత బెనర్జీ అధికారంలోకి వస్తే అంతా బాగుంటుందని అనుకున్నానని, కానీ తన అంచనాలు తలకిందులయ్యాయని విమర్శించారు. అధికారంలోకి ఎవరు వచ్చినా పరిస్థితి మారడం లేదని అర్థమైందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను బలైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ లో ప్రభుత్వం మారితే అంతా బావుటుందని, అప్పుడు తాను రావచ్చని అనుకుంటున్నట్లు తస్లీమా పేర్కొనడం గమనార్హం.

12:46 - June 12, 2016

గోదావరి నదీపరీవాహక ప్రాంతంలో అనాదిగా ఆదివాసీలు నివసిస్తున్నారు. వారి కళలు సంస్కృతి, జీవన విధానం అన్నీ నదిపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంపై పరిశోధనలు చేసి 'వెన్ గోదావరీ కమ్స్' అన్న పుస్తకాన్ని వెలువరించారు ఉమామహేశ్వరి. ఆదివాసీల హృదయలయల అలల గలగలలు వినిపించే గోదావరినది చరిత్రకు అక్షరరూపమిచ్చారామె. ప్రముఖ రచయిత్రి పరిశోధకురాలు ఉమామహేశ్వరి ఎంతో శ్రమించి రాసిన వెన్ గోదావరి కమ్స్ పుస్తకం పై ప్రత్యేక కథనం. ఆదివాసీల జీవనవేదం వినిపిస్తోన్న గోదావరినది చరిత్రను గ్రంథస్థం చేసిన ఉమామహేశ్వరి ప్రత్యేక కథనం చూడాలన్నా..వినాలన్నా వీడియో క్లిక్ చేయండి. 

20:19 - May 30, 2016

నేను ఆకాశం నీవు భూమి

నేను లేని నీవు అసంపూర్ణం

నాలో జ్వలిస్తున్న జ్వాలకు

వారసత్వం కోసం అన్వేషణ నాప్రేమ

ప్రేమించడం ప్రేమింపబడటం మిథ్య

అన్ని అనుబంధాలు అబద్దాలు,అవి అవసరాలు...

అంటూ స్త్రీపురుషుల సంబంధాలలోని డొల్లతనాన్ని కవిత్వంలో ఎండగట్టిన ప్రగతిశీల భావాల కవయిత్రి జ్వలిత.సమాజంలోని ప్రతి సంఘటనకు స్పందిస్తూ కవిత్వమై జ్వలించే కవన జ్వాల ఆమె.వస్తువైవిధ్యం శిల్పశోయగంతో ఆమె` కాలాన్ని జయిస్తూ నేను` అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు.ఇందులో 51 కవితలున్నాయి. సబ్బన్న జాతులఆడది,కార్పొరేట్ దాంపత్యం,వడిసెల రాళ్లు,మరణంలో జీవించు, ఆమె ఆకాశం,గాజుల హేళన,మనోరాగం,కాలాన్ని జయిస్తూ నేను మెుదలైన కవితలు భావస్ఫోరకంగాఉంటూ మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

కాలాన్ని జయిస్తూ నేను

ఒక ఉనికిలా విస్తరించాల్సిన నేను

నేను లేని తనం శూన్యమయిన నేను

ఒక సామాజిక సజీవ సమాధిని

నా చుట్టూ నావాళ్లు నా మనుషులు నాకుగోడలు

ఖాళీ గ్లాసులా,ఖాళీ కుర్చీలా నేను

అంటూ అందరూ ఉన్నా మనిషి ఎలా ఒంటరిజీవితంలో ఒక శూన్య పాత్రికలా మిగిలిపోతారో అద్భుతంగా కవిత్వీకరించారు.అంతేకాదు బొన్సాయి మెుక్కను చేయబడిన నేను...వటవృక్షంలా ఊడలతో శాఖలతో విజృంభించాలి అంటూ ఆశావహదృక్పథాన్ని తన కవిత్వంలో అంతర్లీనంగా ధ్వనింపజేస్తారు కవయిత్రి.స్త్రీలకు జరిగిన అన్యాయాలను తలచుకుంటే జ్వలితలో ఒక హహోగ్రకవితావిరాట్ స్వరూపం దర్శనమిస్తుంది.తరతరాల దోపిడీకి గురయిన స్త్రీలు భార్యపాత్రల్లో ఎలా బలిపశువులుగా మిగిలి పోతున్నారో అందమైన అబద్దం కవితలో అద్బుతంగా విష్కరించారు..

 

పతి అన్నా అర్థాంగి అన్నా

సహవాసి అన్నా సహచరి అన్నా

ఏదయినా దోపిడీకి అణచివేతకు

కొలమానం భార్య

అంటూ స్త్రీలోకానికి కనువిప్పు కలిగిస్తారు.అంతేకాదు మానవ మృగాలదాడుల్లో అన్యాయానికి గురయిన అబలలకు చట్టాలు శాసనాలు నేతి బీరకాయలో నెయ్యిలా న్యాయం చేస్తాయని ఘాటుగా స్పందిస్తారు.ఆమె కలంతో గాక హృదయంతో కవిత్వం రాసినట్టనిపిస్తుంది..కొన్ని కవితల్లో భావావేశం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. భాషలో ఆమె హృదయఘోష వినిపిస్తుంది.జ్వలిత కేవలం కవిత్వమే కాదు ఆమె ఎన్నో కథలు రాశరు.వాటిని ఆత్మాన్వేషణ అన్న పేరుతో కథా సంపుటిగా వెలువరించారు.ఇందులో 12 కథలున్నాయి.ఆత్మాన్వేషణ,పడిగాపుల పండుగ,మాయమవుతున్న మనసు,సిబ్బి,మానవ సరోవరం,రాజుగారు కప్పల చెరువు,నాన్నా వాడెవ్వడు,సహస్ర ధార,మెుదలైన కథలు సరికొత్త కథనశైలిలో సాగిపోతాయి ,పాత్రచిత్రణ ,వాతావరణ కల్పన,కథను ఆసక్తిగా నడిపించే శైలీ విన్యాసం జ్వలిత కథల్లో కనిపిస్తాయి.ఇక ఆమె జీవిత విశేషాల్లోకి వెళితే ఆమె 1959 లో ఈశ్వరమ్మ రాఘవయ్య దంపతులకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాళెంలో జన్మించారు.నాలుగు పోస్టుగ్రడ్యుయేట్ డిగ్రీలు సంపాదించుకున్నారు.ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.ఆమె ఎన్నో కవితలు కథలు వ్యాసాలు రాశారు.కాలాన్ని జయిస్తూ నేను,సుదీర్ఘ హత్య,ఆత్మాన్వేషణ,మర్డర్ ప్రొలాంగేర్,అగ్నిలిపి, మెుదలైన రచనలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఖమ్మజిల్లా కథల పేరుతో తనే సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూ 672 పేజీల ఒక బృహత్ గ్రంథాన్ని వెలురించారు.రుంజ,గాయాలే గేయాలై పరివ్యాప్త,మెుదలైన కథా కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.జీవన జ్వలిత చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి సమాజసేవ చేస్తున్నారు.ఆమె సాహితీ సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.రంజని నందివాడ శ్యామల స్మారక పురస్కారం,భూమిక ఉత్తమకథా పురస్కారం, మధర్ థెర్రిస్సా సేవాసంస్థ ఆణిముత్యం పురస్కారం,రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం ,శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం,విశ్వభారతి ఉగాది పురస్కారం..ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.జ్వలిత కేవలం రచయిత్రిగానే కాకుండా అఖిల భారత రచయిత్రుల కమిటీలో మెంబర్ గా ఉంటూ క్రియాశీలక పాత్రపోషిస్తున్నారు.వివిధ రచయితల,ప్రజాసంఘాలలో నాయకురాలిగా ఉంటూ దళిత బహుజన సాహిత్యప్రచారానికి విశేష కృషి చేస్తున్నారు.జ్వలిత అన్నది కలంపేరు. అసలు పేరు విజయ కుమారి దెంచనాల.అయితే కవయిత్రిగా ,కథన శిల్పిగా ఆమె జ్వలిత పేరుతోనే సాహితీ లోకంలో తనదైన ముద్రను వేసింది.ఆమె కలం నుండి భవిష్యత్తులో మరెన్నో రచనలు వెలువడాలని ఆశిద్దాం.

20:13 - May 30, 2016

ఆధునికి తెలుగు కథాసాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది.ఎందరో యువతీ యువకులు అద్భుతమైన కథలు రాస్తున్నారు.వయసుకు మించిన పరిణతి, ప్రతిభ,సామాజిక సమస్యల విశ్లేషణ వీరి కథల్లో కనిపిస్తుంది.అలాంటి వారిలో ఎండ్లూరి మానస ఒకరు.పిన్నవయసులోనే ఆమె అద్భుతమైన కథలు రాసి తెలుగు కథాప్రియులను అబ్బుర పరిచింది.మానస రాసింది కేవలం పది కథలే అయినప్పటికి ఒక్కో కథ ఒక్కో ఆణి ముత్యంలా మెరుస్తూ అందరి దృష్టిని అకర్షించాయి.ప్రముఖ పత్రికలతో పాటు వెబ్ మ్యాగ్జయిన్ లలో ముద్రితమైన మానస కథలు పాఠకుల మానసాలను కదిలించాయి.కంటతడి పెట్టించాయి.సరికొత్త ఆలోచనలు రేకెత్తించాయి..ఆమెరాసిన కథల్లో మైదానంలో నేను, అబద్ధం, బొట్టుకుక్క, దొంగ బొట్టు,కరెక్టివ్ రేప్,మెర్సీ పరిశుద్ధ పరిణయం,అవిటి సెవిటి, అర్థజీవి,అంతిమం, గౌతమి మెుదలైన కథలు వేటికవే వస్తువైవిధ్యంతో పాఠకుల మానసాలను చూరగొన్నాయి.మానస కథల్లో ప్రధానంగా దళితుల సమస్యలు, జండర్ వివక్షత,స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు,పురుషాధిఖ్యసమాజపు పోకడలు, సున్నితమైన మానవసంబంధాల హృదయగత రాగబంధాల మానవీయ పరిమళాలు,నిష్కల్మష ప్రేమలు,స్నేహాలు,మానవమనస్తత్వాల చిత్రణలు ఆర్ద్రంగా కనిపిస్తాయి.మూగగుండెల రోదనలు వినిపిస్తాయి.అగ్రకుల దురహంకారాల దర్పాలు ధ్వనిస్తాయి.వర్ణసమాజపు దాస్యభావాల బానిసత్వాలనుండి ఇంకా ఆధునిక దళితులు బయటపడని వైనాలపై ప్రశ్నల శరపరంపరలు ఎక్కుపెట్టబడ్డాయి. అంతేకాదు సమాజం ఆధునికి మయ్యే కొలది కులం తన వికృతరూపాన్ని ఎన్ని పార్శ్వాల్లో ప్రదర్శిస్తుందో మానస కథలు అందంగా నిరూపిస్తాయి.దొంగ బొట్టు కథలో కథలు చెప్పే మాస్టారు ఒక దళితుడు రాసిన కథలో వాస్తవం లేదని తన సహచరులను కించపరచడాన్ని అద్భుతంగా చిత్రించారు.దళితులు ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ ఇంకా బ్రహ్మణీయ భావజాల మాయాజాలం నుండి బయటపడక పూజలు చేసే విధానాలను రచయిత్రి తన కథల్లో వ్యంగ్యంగా చిత్రించారు.అలాగే బొట్టుకుక్క కథలో తప్పిపోయి కనిపించిన మూడేళ్ళ చిన్నారి తన కులంగురించి చెప్పుకోనే సన్నివేశం ద్వారా.... కులం మనిషిపై ఎంతలా ముద్రవేస్తుందో ఆ కథలో ధ్వనింపజేశారు.అంతేకాదు ఆమె తల్లి అగ్రకుల మనస్తత్వం ఎలా ఉంటుంటుందో ఆమె పాత్రోచిత ప్రవర్తనలో చూపించారు. కింది కులాల వారు ప్రేమతో ప్రవర్తించినా వారి ప్రేమను గుర్తించక పోగా ఈసడించుకునే కురుచ మనస్తత్వాన్ని చక్కని సన్నివేశాల ద్వారా బొట్టుకుక్క కథలో కళ్లకు కట్టినట్టు చిత్రించారు.తరతరాలుగా పురుషాధిఖ్య సమాజంలో లింగ వివక్షత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.... అయితే నేటికీ చాలా కుటుంబాల్లో ఆడపిల్లలు మగపిల్లల మధ్య వివక్షతను చూపడం పరిపాటే..అయితే మానస ఈ అంశాన్నితీసుకుని `అబద్ధం` కథను శిల్పశోభితంగా ,సందేశాత్మకంగా మలిచారు.అబద్ధం కథలో సురేష్ తనకు ఆడపిల్లలే పుడుతున్నారన్న బాధతో తన భార్యకు మగపిల్లాడు పుట్టి చనిపోయాడని ఎలా అందరికీ అబద్ధం చెబుతాడో చిత్రించారు.సురేష్ కు పెళ్లాం పిల్లలపై ప్రేమ ఉన్నప్పటికీ అతనిలో మగపిల్లాడు పుట్టాలన్న కాంక్ష,నపుత్రస్య గతిర్నాస్తి అన్న పురుషాధిఖ్య సమాజపు భావజాలం అంతర్గతంగా మనసులో దాగిన సత్యాన్ని రచయిత్రి ఆ పాత్రద్వారా బహిర్గతం చేసినవైనం అబ్బుర మనిపిస్తుంది.అలాగే మానస రాసిన `మెర్సీ పరిశుద్ధ పరిణయం` కథలో రచయిత్రిలో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది.బైబిల్ కథల ఆధారంగా కథను నడిపిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.బైబిల్ లోని భాషను కథాకథనంలో చొప్పించి శైలీ రమ్యతను సాధించడం అద్భుత మనిపిస్తుంది.ఈ కథలో ఒక దళిత పేద క్రిష్టియన్ అమ్మాయి రేప్ కు గురికావడమనే సంఘటన ఆధారంగా కథచివరలో దళిత స్త్రీలపై జరిగే హత్యాచారాల గురించి రచయిత్రి ప్రస్తావించిన అంశాలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. అలాగే అత్యాచారానికి గురయిన అమ్మాయిని చేరదీసి పెళ్లిచేసుకునే యువకుని పాత్రచిత్రణకూడా హృదయాలను ద్రవింపజేస్తుంది.మానస రాసిన మెుదటి కథ గౌతమిలో రచయిత్రి కాకినాడ హైదరాబాద్ లలో నివసించే కుటుంబాల ప్రేమ బంధాలను చక్కగా చిత్రించారు.అంతేకాదు ఈ కథలో పాత్రోచితంగా తెలంగాణా భాషను ,యాసచెడకుండా ప్రయోగించడం కనిపిస్తుంది.ఈకథలోని భాషాప్రయోగం ఆమె నిశిత పరిశీలనకు ,అనుకరణ శక్తికి నిదర్శనం.ఇలా ప్రతి కథలో ఏదో ఒక సందేశాన్నో,సామాజిక సమస్యనో లేక మానసిక సంఘర్షణనో,కులవ్యవస్థ వికృత రూపాన్నో, స్త్రీల స్వేచ్ఛనో ,వారి మానసిక కాంక్షాప్రపంచాలనో బలంగా చిత్రిస్తూ వచ్చారు.చాలమంది యువ కథకులు కథల్లో సమస్యలను మాత్రమే చిత్రిస్తారు. పరిష్కారాలను పాఠకులకే వదిలేస్తారు.కాని ఈ రచయిత్రి చాలా కథల్లో పరిష్కార మార్గాలను సూచించారు.దళితులు వాస్తవాలను తెలుసుకుని చివరలో తిరుగుబాటు బావుటాలు ఎగరేసిన దృశ్యాలను చిత్రించారు.అలాగే అబద్ధంలాంటి కథల్లో సురేష్ లాంటి పాత్రలు మానసిక పరివర్తన చెందినట్లు కథాగతం చేశారు.ఇలా కథావస్తువు ఎంపికలో నవ్యతను,కథ ఎత్తుగడలో కొత్తదన్నాన్ని,కథాకథనరీతిలో ఉత్కంఠతను,కథను ముగించడంలో ఒక పరిష్కారాన్ని,పాత్రచిత్రణలో ,వాతావరణ కల్పణలో సహజత్వాన్ని తన శైలీవిన్యాసంగా,కల్పనా చాతుర్యంగా మలచుకుని మానస చక్కని కథలు రాశారు. ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కూతురిగా తండ్రి సాహితీ వారసత్వాన్ని కొనసాగిస్తూ...తెలుగు కథాకేదారంలో ఎండ్లూరి మానస మరెన్నో కథాసుమాలు పూయించాలని ,తెలుగు పాఠకుల మానసాలను పరిమళభరితం చేయాలని ఆశిద్దాం.

12:49 - May 29, 2016

హైదరాబాద్:  రవీంద్రభారతిలో ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి జిలానీ బోనోకు అందించారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడం తనకు లభించిన గొప్ప గౌరవమని రచయిత్రి జిలానీ బానో అన్నారు. తనకు అవార్డు ఇచ్చిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

13:07 - March 6, 2016

కథ కంచికి అనే కాలం పోయింది. ఇవాళ కథలు ఇంటిల్లిపాది చదవాల్సిన అవసరం వచ్చింది. పిల్లలు పెద్దలు విధిగా కథలు చదివి తీరాలంటుంది కన్నెగంటి అనసూయ. సున్నితమైన భావాలను, అంతులేని అనుభూతులను తన కథల్లో పలికించే కన్నెగంటి అనసూయ... మనసులను కదిలించే కథలు రాస్తున్నారు. పాఠకుల మనసులు చూరగొంటున్నారు. మానవ సమూహాల మానసిక కల్లోలాలను, అనుభవాలను, ఆవేదనలను, అనుభూతులను అక్షరాల్లోకి వొంపి తెలుగు కథా పూతోటలో అద్భుత కథా సుమాలు పూయిస్తున్న ప్రముఖ కథా రచయిత్రి కన్నెగంటి అనసూయపై ప్రత్యేక కథనం. ఆమె గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - రచయిత్రి