రజనీకాంత్

14:54 - July 20, 2017

'ధనుష్' కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'వేలలై యిల్ల పట్టధారి'. ఈ సినిమాకు సీక్వెల్ గా 'వీఐపీ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మాతగా సౌందర్య రజనీకాంత్‌ రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు టాక్. 'ధనుష్‌' పుట్టినరోజు అంటే జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించగా ఇందులో మార్పు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ధనుష్ నటించిన చివరి చిత్రం 'తొడరి' బాక్సాపీస్ వద్ద పరాజయం మూటగట్టుకుంది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ హీరో ప్రయత్నిస్తున్నాడు. ‘వీఐపీ 2’ ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగినట్లుగానే కథ..కథనాలతో భారీగా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అందులో 'ధనుష్' నటన..డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రోస్టు ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న 'వీఐపీ 2’లో 'అమలాపాల్' హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి 'కాజల్' ముఖ్యపాత్ర పోషించారు. దాదాపు 20 ఏళ్ల తరువాత తమిళ సినిమాలో 'కాజల్' నటిస్తుండడం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ‘ధనుష్' అభిమానుల ఓపిక..సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ప్రకటించారు.

10:28 - July 6, 2017

వినోదపు పన్ను పై కూడా పన్ను వేస్తారా ? అంటూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన థియేటర్ల యజమానులు కేంద్రంపై కన్నెర చేశారు. ఇటీవలే కేంద్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లో రూ. 100 కన్నా తక్కువ ఉన్న టికెట్ ధరలపై 18 శాతం, రూ. 100 కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలపై 28 శాతం పన్నును జీఎస్టీ నిర్ధారించిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి అక్కడి థియేటర్లు మూత పడ్డాయి.

పలు సినిమాల పరాజయం..
కోలీవుడ్...ప్రముఖ హీరోల భారీ సినిమాలు..చిన్న హీరోల చిన్న సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది కోలీవుడ్ కు కలిసి రాలేదని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తా పడడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగానే వస్తు సేవల పన్ను అమల్లోకి రావడంతో సినిమా కష్టాలు మరింత పెరిగాయి. పన్నును తగ్గించాలంటూ థియేటర్ల యజమానులు గళమెత్తాయి. రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు కొనసాగించాఇ. వెయ్యికి పైగా థియేటర్లు మూసి ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం కోలీవుడ్ పరిశ్రమకు కోలుకొని దెబ్బ తగులుతుందని సినీ పండితుల అంచనా. ఈ వారంలో నాలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకోవడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ పై పలువురు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. పన్నును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ లో సర్కార్ ను కోరారు. ఈ ట్వీట్ కు మరో నటుడు కమల్ హాసన్ స్వాగతించారు.

సమ్మె ముగుస్తుందా ?
గురువారానికి సమ్మె ముగుస్తుందని భావిస్తున్నట్లు అక్కడి థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. ప్రభుత్వం ఎదుట తాము రెండు ప్రధాన డిమాండ్లను పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. టికెట్ల ధరలు పెంచడం..స్థానిక పన్నును తగ్గించాలని కోరడం జరుగుతోందన్నారు. పదేళ్ల నుండి సరైన విధంగా టికెట్ల ధరలు పెంచలేదని, అందులో భాగంగానే ధరలు పెంచాలని కోరుతున్నట్లు తెలిపారు. మరి ఈ సమ్మెకు తెరపడుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తెలియనుంది.

16:18 - June 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మళ్లీ అమెరికాకు పయనం కానున్నారా ? ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తమిళ రాజకీయాల్లోకి 'రజనీ' ఎంట్రీ ఉంటుందని...అభిమానులతో కూడా 'రజనీ' భేటీ కావడం రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన 'రోబో 2.0'..'కాలా' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. 'కబాలి' చిత్ర సమయంలో 'రజనీ' అమెరికాలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ 'రజనీ' అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 'కాలా' సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న 'రజనీ' అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిజాలు ఏంటో 'రజనీ' స్వయంగా..లేదా ఆయన కుటుంబసభ్యులు నోరు మెదిపితే కాని తెలియదు.

11:10 - June 30, 2017

తమ చిత్రాలను వినూత్నంగా ప్రచారం చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తుంటారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుంటారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో..హీరోయిన్లు..చిత్ర యూనిట్ పాల్గొంటూ ఉంటుంది. కానీ ఇండియాలో కాకుండా హాలీవుడ్ లో ప్రచారం నిర్వహించిన ఘనత దర్శకుడు 'శంకర్' కు దక్కుతుంది. రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో 'రోబో 2.0' నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఇది 'రోబో' కు సీక్వెల్. ఈ చిత్రంలో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నాడు. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచారం ప్రారంభమైంది.
హాలీవుడ్ లోని లేక్ పార్కులో '2.0' చిత్రాలను ముద్రించిన 100 అడుగుల హాట్ బెలూన్ ను ఆవిష్కరించారు. ఇలాంటి బెలూన్లు ప్రపంచంలోని పలు దేశాల్లో ఎగురవేయాలని 'శంకర్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రూ. 400 కోట్లతో తెరకెక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రచారానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు...చిత్ర ఆడియో దుబాయిలో కనీవినీఎరుగని రీతిలో నిర్వహించాలని చిత్ర యూనిట్ యోచిస్తోందని తెలుస్తోంది. మరి 'శంకర్' దర్శకత్వం..రజనీ..అక్షయ్..మిగతా నటీ నటుల ప్రతిభపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పునివ్వనున్నారో చూడాలి.

12:32 - June 22, 2017

ఒక్క ఆడియో ఫంక్షన్ కు రూ. 25 కోట్లా ? అని ఆశ్చర్యపోతున్నారా ? తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్'..'శంకర్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో 2.0’ షూటింగ్ పూర్తయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోటంది. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్..డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకు ఏకంగా రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో తీయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయిలో ఆడియో వేడుక జరుపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో వేడుక గురించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. రజనీ సరసన అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా అక్షయ్ కుమార్‌ విలన్ నటిస్తున్నారు.

21:33 - June 19, 2017

చెన్నై : వరుస సమావేశాలతో హీరో రజనీకాంత్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రైతు సంఘాలతో సమావేశమైన రజనీ...ఇవాళ హిందూ మక్కల్ కట్చి నేతలతో సమావేశమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారని హిందూ సంస్థలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు తదుపరి సీఎం రజనీ అంటూ చెన్నైలో పోస్టర్లు వెలుస్తున్నాయి. భాషాతో సమావేశం అయ్యేందుకు పలు పార్టీల నేతలు పోటీపడుతున్నారు.. పాట్టాలి మక్కల్‌ కట్చి నేతలు, హిందు మక్కల్‌ కట్చి నేతలు రజనీతో భేటీ అయ్యారు.. సూపర్‌స్టార్‌ రాజకీయ ప్రవేశంపై చర్చించారు.. అటు రజనీ అభిమానులు, వివిధ పార్టీల నేతలు, తమిళ, రైతు, హిందుత్వ సంఘాల రాకతో రజనీ నివాసం ముందు సందడి ఏర్పడింది..

 

09:10 - June 19, 2017

చెన్నై : తమిళనాడు రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్‌ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని... ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానం కోసం.. కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజనీ తీరు చూస్తుంటే.. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

14:43 - June 9, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మరోసారి అభిమానులతో భేటీ కానున్నారు. ఇటీవలే ఆయన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 'రజనీ' రాజకీయ ప్రవేశం గ్యారంటీ అని పుకార్లు షికారు చేశాయి. దీనంతటికీ 'రజనీ' తెరదించారు. దేవుడు ఏది శాసిస్తే అదే..చేస్తానని కుంబద్ధలు కొట్టాడు. అనంతరం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'కాలా' సినిమాలో 'రజనీ' నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేగాకుండా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' లో కూడా 'రజనీ' నటిస్తున్నాడు. ముంబైలో 'కాలా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి అభిమానులతో 'రజనీ' భేటీ అవుతారని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కానీ భేటీకి సంబంధించిన తేదీలు ఖరారు కాలేదు. 

08:55 - June 1, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కాలా' సినిమా షూటింగ్ హల్ చల్ చేస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈసినిమా ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. ‘కబాలి' సినిమా విజయం అనంతరం 'రజనీ'..’రోబో 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' సినిమాకు దర్శకత్వం వహించిన పా.రంజిత్ తోనే మరో చిత్రానికి 'రజనీ' గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కాలా' పేరిట రూపొందుతున్న సినిమాలో 'రజనీ' మాఫియా డాన్ గా కనిపించనున్నాడని టాక్. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దీనితో 'రజనీ' చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తుతున్నారు. దీనితో షూటింగ్ కు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూర్టీని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసుకొంటోంది. షూటింగ్ అనంతరం 'రజనీ'తో ఫొటోలు తీసుకొనేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ముస్లింలు సంప్రదాయబద్దంగా ధరించే టోపితో రజనీకాంత్ నడిచే వెళ్లే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడ చిత్రీకరణ పూర్తయిన అనంతరం రెండో షెడ్యూల్ ను చెన్నై పూందమల్లి సమీపంలోని ఓ పార్కులో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన అనంతరం 'కాలా' ఎలా అలరిస్తాడో చూడాలి.

07:58 - May 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ‘కబాలి' సినిమా విజయవంతమైన అనంతరం 'రోబో 2.0’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేస్తున్నాడు. ‘కాలా' పేరిట సినిమా నిర్మితమౌతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో కథ కొనసాగుతోందని ప్రచారం జరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాకుండా 'రజనీ' లుక్స్ కూడా మాస్ నేపథ్యంలో ఉంటుండడంతో మరోసారి 'భాషా' ను తెరపైకి చూస్తామని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు 'నానా పటేకర్' చిత్రంలో నటించనున్నారు. ఒక కీలకమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళ నటుడు సముద్రఖనిని .. హుమా ఖురేషిని తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రజనీకాంత్