రత్నాచల్ ఎక్స్ ప్రెస్

12:29 - September 2, 2016

చిత్తూరు : తుని రైలు దహనం ఘటన కేసు ఓ కొలిక్కి రావడం లేదు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపుడుతున్న సంగతి తెలిసిందే. రైలు దహనం కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన సీఐడీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. ప్రెస్ క్లబ్ కు వచ్చిన భూమన కిందకు వెళుతుండగా ఒక్కసారిగా అక్కడ సీఐడీ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వెంటనే నోటీసులు అందచేశారు. దీనిపై స్పందించడానికి కరుణాకర్ రెడ్డి నిరాకరించారు. కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను కరుణాకర్ రెడ్డి కలవడం జరిగిందని..ఆ వెంటనే సభకు కూడా వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనమైంది. ఇందులో భూమన హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.

  • జనవరి 31వ తేదీన కాపు రిజర్వేషన్ల సాధన కోసం తూర్పుగోదావరి జిల్లాలో కాపు గర్జన సదస్సు ఏర్పాటైంది.
  • కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైలు పట్టాలపై ఉద్యమాన్ని సాగిద్దామని చెప్పిన వెంటనే వేలాదిగా ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరి రెచ్చిపోయారు.
  • తుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముట్టడించారు.
  • రెచ్చిపోయిన ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో రైలు మొత్తం కాలిపోయింది.
  • డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
  • దీని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసును సీఐడీకి అప్పగించింది.
  • అనంతరం దీనిపై పలువురిని సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టును నిరసిస్తూ ముద్రగడ మరోసారి దీక్ష చేపట్టారు.
  • అమాయకులను అరెస్టు చేస్తున్నారని, వెంటనే వారిని వదిలిపెట్టాలని ఆయన దీక్ష చేశారు.
  • నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టారు.
  • ప్రస్తుతం భూమనకు సీఐడీ నోటీసులు అందచేయడంపై ఎలాంటి స్పందన వ్యక్తమవుతాయో చూడాలి. 
10:54 - February 5, 2016

హైదరాబాద్ : రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 8 నుంచి పట్టాలపైకి రానుంది. 17 బోగీలతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్‌కార్‌ బోగీలు, 8 సెకండ్‌ సిట్టింగ్‌, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అదికారులు వెల్లడించారు.

07:03 - February 1, 2016

తూ.గో :తునిలో ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేయడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ రైలు మొత్తం దహనమైపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే సర్వీసులను సైతం నిలిపేయాల్సొచ్చింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు....

సామాజిక రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగింది ఒకరైతే ఇబ్బందులకు గురైంది మాత్రం వేరొకరు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు సామాజిక వర్గం చేపట్టిన ఐక్య గర్జన క్రమంగా హింసకు దారితీసింది. సభ జరుగుతుండగా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో ఆందోళనకారులంతా ఒక్కసారిగా రైల్‌ ట్రాక్‌పైకి ఎక్కారు. అదేసమయంలో అటుగా వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పుబెట్టారు. క్రమంగా మంటలు అన్ని బోగీలకు అంటుకోవడంతో రైలు గంటలకొలది తగలబడుతూనే ఉంది. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న రైల్వే అధికారులు ఆ మార్గంలో వచ్చిపోయే రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. కొన్నిటిని దారి మళ్లించారు.

గంటల కొలది నిలిచిన రైళ్ళు....

విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, పూరీ-వోఖా, విశాఖ-కాకినాడ, హౌరా చెన్నై మెయిల్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొలది రైళ్లు నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మరింత ఇబ్బందికి గురయ్యారు.

తప్పనిసరి పరిస్థితిలో రైళ్ల నిలిపివేత....

తప్పనిసరి పరిస్థితిలో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేయాల్సొచ్చిందని విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిస్థితి చక్కబడిన తర్వాతే రైళ్లు నడుపుతామన్నారు. ఇలా సుమారు 20 రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి టిక్కెట్‌ డబ్బులను వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు.....

రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడిన దృష్య్టా ప్రయాణికులు బంధువులు ఆందోళనకు గురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమాచారం అందించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. విజయవాడకు సంబంధించి 0866-2575038, తుని స్టేషన్‌ 08854- 252172, రాజమండ్రి స్టేషన్‌ 0883-2420451, 0833-2420543 నెంబర్లకు ఫోన్ చేసి రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు. 

06:53 - February 1, 2016

తూ.గో : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోయి ఏకంగా రైలుకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. తుని పట్టణంలో ఓ పోలీసు స్టేషన్‌పై దాడి చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో తుని, పరిసర ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముద్రగడ రైలు పట్టాలపై ఉద్యమం....

కాపు రిజర్వేషన్ల సాధన కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కాపు గర్జన సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైలు పట్టాలపై ఉద్యమాన్ని సాగిద్దామని చెప్పిన వెంటనే వేలాదిగా ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరి రెచ్చిపోయారు.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ముట్టడించిన ఆందోళన కారులు...

తుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముట్టడించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో 14 రైలు బోగీలతో సహా రైలు మొత్తం దగ్ధమైంది. ఇదిలా ఉంటే ఆందోళనకారుల దాడి ఘటనలో రైలు డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించడంతో భారీ

ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. అలాగే మీడియా సిబ్బందిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి.

తుని రూరల్ పీఎస్ కు నిప్పు......

మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడారు. స్టేషన్‌కు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్ల నుంచి బలగాలను ఘటనా స్థలానికి పంపాయి. పోలీసులు పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించగా, ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు 8 పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.

ఒక్కసారిగా మారిన పరిస్థితి....

ఐక్యగర్జనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠినంగా శిక్షిస్తామని డిజిపి రాముడు హెచ్చరించారు. పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు మాట్లాడారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, మంగళగిరి నుంచి తునికి ఏపీ బెటాలియన్లను పంపించారు.

రాత్రి 10గంటలకు రాస్తారోకో విరమించిన ముద్రగడ....

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం తుని వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకోను ఆదివారం రాత్రి 10గంటల సమయంలో విరమించారు. దీంతో జాతీయ రహదారిపై తునికి ఇరువైపుల రాకపోకలు మొదలయ్యాయి. ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, నేతలు అనుసరించిన తీరుపై ముద్రగడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడు వేలకు పైగా ప్రత్యేక బలగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి.

19:01 - January 31, 2016

తూర్పుగోదావరి : కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని కాపులు చేస్తున్న ఆందోళన తీవ్ర హింసాయుత్మకంగా మారిపోయింది. ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలతో తుని కాపు గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ డిమాండ్ నెరవేర్చే వరకు రైల్ రోకో, రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనితో ఆందోళనకారులు తుని రైల్వేస్టేషన్ కు చేరుకురని..ఆ సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. 8 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆందోళకారులు చేసిన దాడిలో నలుగురు రైల్వే సిబ్బంది గాయాలపాలయ్యారు. మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్ పీఎస్ పై దాడి చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం..లక్షల్లో ఉన్న వీరిని వందల సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించలేకపోయారు. పీఎస్ జరిపిన దాడిలో కానిస్టేబుల్ మృతి చెందాడనే వదంతులు వ్యాపించాయి. 

17:53 - January 31, 2016

తూర్పు గోదావరి : తునిలో నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా హింసాయుతంగా మారిపోయింది. శాంతియుతంగా చేయాల్సిన ఆందోళన అదుపు తప్పింది. కాపు నేత ముద్రగడ పద్మనాభవం ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు గర్జన తీవ్ర ఉద్రిక్తతల చోటు చేసుకుంది. ఈ రోజు నిర్వహించిన కాపు గర్జనలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. ఎనిమిది బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కాపు కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశారు. కానీ లక్షల మంది జనాలు ఉండడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. దీనితో కాపులు రెచ్చిపోయారు. రైలుపై రాళ్లతో దాడి చేశారు. నలుగురు రైలు సిబ్బందికి గాయాలయ్యాయి.

పద్మనాభం పిలుపుతో మారిన పరిస్థితి..
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వే స్టేషన్ లో ఆందోళన చేపట్టారు. ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఆయన సభలో ప్రసంగించారు. తమ హక్కులను సాధించుకోవడానికి రైల్ రోకో..రోడ్లపై కూర్చొవాలని పద్మనాభం పిలుపునివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పద్మనాభం స్టేజిపై నుండి కిందకు దిగుతుండగానే సభ ప్రాంగణం లోపల..బయట ఉన్న వారంతా తుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆ సమయంలోనే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రావడం..దానిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. అక్కడనే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ లక్షల సంఖ్యలో ఉన్న వీరిని అదుపు చేయడం వందల సంఖ్యలో ఉన్న పోలీసులకు కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:46 - July 7, 2015

విశాఖపట్టణం : రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు ముందుకెళుతోంది..కొద్ది సేపటి తరువాత బోగీల్లో కూర్చొన్న వారు రైలు కదలడం లేదని గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు అర్థం కాలేదు.. ఏ అయ్యింది చెప్మా అంటూ కిందకు దిగి చూశారు. రైలు ఇంజిన్ మాత్రం వెళ్లిపోతోంది..ఇలా ఎందుకు అయ్యిందో వారికి అర్థం కాలేదు..ఈ విచిత్ర పరిస్థితి ప్రయాణీకులు మంగళవారం ఎదుర్కొన్నారు.
రెండు గంటల ఆలస్యం..
రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వెళుతోంది. రెండు గంటల ఆలస్యంగా రైలు ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. ఇప్పటికైనా వచ్చింది అని ప్రయాణీకులు ఎక్కారు. కానీ దువ్వాడ - అనాకపల్లి వద్ద రైలు ముందుకు వెళ్లడం లేదని గుర్తించారు. కానీ రైలు ఇంజిన్ మాత్రం ఒక కిలో మీటర్ మేర ముందుకెళ్లిపోయింది. ఆలస్యంగా గుర్తించిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. సాంకేతిక లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు. బోగీలు నిలుచున్నా అధికారులు ఎవరు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - రత్నాచల్ ఎక్స్ ప్రెస్