రమణదీక్షితులు

11:31 - October 24, 2018

తిరుమల : కలియుగ దైవం తిరుమల వెంకన్న సన్నిధి రాజకీయాలకు వేదిగా మారిపోతోంది. టీటీడీ బోర్ట్, ప్రభుత్వం, అర్చకుల మధ్య వెంకన్న నలిగిపోతున్నాడు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకన్న దేవాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తులకు, ఆభరణాలకు కొదవేలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారింది. శ్రీనివాసుడు ఆస్తులు, ఆభరణాల విషయంలో ఎంతటి వివాదం రేగిందో తెలిసిన విషయమే. ఈ వివాదంలో ప్రధాన వ్యక్తి  శ్రీ వెంకటేశ్వరుని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.

టీటీడీ చరిత్రలో ఇలా మాజీ ప్రధానార్చకుడిపై పరువు నష్టం కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. దేవస్థానంలో మిరాశీ అర్చకులు, వంశపారంపర్య అర్చకుల పదవీ విరమణ వయసును నిర్దేశిస్తూ, టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తరువాత, పలువురు తమ అర్చకత్వ పదవులకు దూరంకాగా, వారిలో రమణ దీక్షితులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన టీటీడీ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. 
స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నగలను కాజేశారని, ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పరమ పవిత్రమైన ఆలయం పరువు పోయిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రమణదీక్షితులపై టీటీడీ  రూ. 200 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది.  శ్రీవారి ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహించిన వ్యక్తపై పరువు నష్టం దావా వేయటం టీటీడీ చరిత్రలో తొలిసారి కావటం విశేషం. మరి దీనిపై రమణదీక్షితులు ఎలా స్పదిస్తారో వేచి చూడాలి.

06:44 - July 4, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం ఇంకా ముదురుతోంది. టీటీడీలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతోందంటూ.. హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు పిటీషనర్లు. గుడి లోపల తవ్వకాలు, నగల మాయంపై పిటీషన్‌ వేశారు. పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు మూడు రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ ఆదేశించింది. రమణ దీక్షితులు అంశంతో వివాదంలోకెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం హైకోర్టుకు చేరింది. దేవస్థానంలో నగలు మాయం, తవ్వకాలు, హెరిటేజ్‌ ప్రాపర్టీని కాపాడాలని అనిల్‌కుమార్‌, గోస్వామి ఇద్దరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి హైకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

నగలు మాయం అవ్వడం, గుడిలోపల తవ్వకాలు తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్లు. ఇదిలావుంటే... టీటీడీ మాత్రం గుడిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని... కొన్ని మరమ్మతులు మాత్రమే చేశామని కోర్టుకు విన్నవించింది. ఇక తాజాగా నిర్మిస్తున్న గుడిగోపురం బంగారం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించగా... గోపురం బంగారంతోనే నిర్మిస్తున్నట్లు టీటీడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరామని పిటిషనర్‌ తరుపు న్యాయవాది తెలిపారు. మరోవైపు టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోరతున్నారు.

నిత్యం గోవింద నామస్మరణలతో కళకళలాడే టీటీడీ ఇప్పుడు వివాదాస్పదం కావడంతో... శ్రీవారి ఆస్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీని కోర్టు ఆదేశించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

15:45 - June 23, 2018

హైదరాబాద్ : తిరుమల దేవస్థానంలో జరుగుతోన్న అవకతవకలపై రమణదీక్షితులు మీడియాకు సవాల్‌ విసిరారు. అర్చకుల భోజనం పేరిట కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయాన్ని వెలికి తీయాలని మీడియాకు సవాల్ విసిరారు. శ్రీవారి ఆలయ పరిరక్షణకై సాగుతోన్న మహాయజ్ఞంలో భక్తులు తనకు సహకరించాలని కోరారు. ప్రెస్‌ మీట్‌లో తనతో పాటు అన్యమతస్తుడు ఉండటం చాలా చిన్నవిషయం అన్నారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించేలా అనిల్‌ అనే వ్యక్తి గురించి కథనాలు రావడం బాధాకరమన్నారు. 

 

07:49 - June 14, 2018

చిత్తూరు : టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేసిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీవారి ఆభరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారంటూ రమణదీక్షితులు ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై చట్టపరమైన చర్యలకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు 
తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఆరోపణలు చేసిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై  టీటీడీ పాలక మండలి తీవ్రంగా స్పందించింది. శ్రీవారి ఆరభరణాలు దోచుకున్నారని, విలువైన వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని, స్వామికి నిత్యం జరిగే కైంకర్యాల్లో లోపాలున్నాయని విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించిన పాలక మండలి వీరికి నోటీసులు జారీ చేసింది. 
టీటీడీపై రమణదీక్షితులు ఆరోపణలు 
టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు 65 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ కల్పించారు. ఆ తర్వాత నుంచి రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. చెన్నైలో మొదలుపెట్టి తిరుమల, తిరుపతి, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పాలక మండలి సభ్యులతోపాటు అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారని ఆరోపణలు చేశారు. శ్రీవారి సొమ్ములకు  లెక్కలులేవని, మణులు, మాణిక్యాలు, రవ్వలు, రత్నాలు, వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న వాదాన్ని లేవనెత్తారు. వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించారు. దీనిపై టీటీడీ వివరణ  ఇచ్చినా.. తన ఆరోపణల పర్వాన్ని ఆపకపోగా,...మరింత విస్తృతం చేశారు. ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న సమయంలో ఈ అంశాలపై నోరు మెదపని రమణదీక్షితులు.. పదవి నుంచి తొలగించిన తర్వాతే మాట్లాడటంలోని ఔచిత్యాన్ని చాలామంది ప్రశ్నించారు. అయినా రమణదీక్షితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఆ ప్రకారం ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 
దీక్షితులను వెనకేసుకొచ్చిన వైసీపీ 
మరోవైపు కారణాలు ఏవైనా కానీ... రమణదీక్షితులు వివాదాన్ని వైసీపీ అందిపుచ్చుకొంది.  దీక్షితులు తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆయన్న వెనకేసుకు రావాడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు నివాసంలో ఉన్నాయని, కొన్నింటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం, ఢిల్లీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు వెళ్లింది. దీక్షితులు, విజయసాయిరెడ్డి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అశోక్‌ కుమార్‌ సింఘాల్‌తో సమీక్షించి.. దేవస్థానాల పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్యలకు తీర్మానించి... ఇప్పుడు విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు, ప్రతిష్ఠతలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. 
టీటీడీ నుంచి నోటీసులు అందలేదన్న విజయసాయిరెడ్డి 
టీటీడీ జారీ చేసిన నోటీసులపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నోటీసులు ఇంతవరకు  తనకు అందలేదన్నారు. సమాధానం ఇవ్వాలా... లేదా.. అన్న అంశాన్ని నోటీసులు అందిన తర్వాత పరిశీలిస్తానని చెప్పారు. ఏపీ  దేవాదాయ, ధర్మాదాయ చట్టం పరిధిలోకి వచ్చే టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదన్న వాదాన్ని వినిపించారు. సీఆర్‌పీసీ కింది దర్యాప్తు అధికారికే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందున్నారు. శ్రీవారి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయన్న తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. నోటీసులకు విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి ప్రతిపాదించింది. 
 

 

19:23 - June 13, 2018

టీటీడీ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈఅంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. 

12:20 - June 13, 2018

చిత్తూరు : తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది.  టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు కోరింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నోటీసులో పేర్కొంది. గత నెల 15న చెన్నై వేదికగా రమణదీక్షితులు టీటీడీతో పాటు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా, కొద్దిరోజులకే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, నేలమాలిగలను తరలించి సీఎం నివాసంలో దాచారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు గానీ, సీబీఐ గానీ చంద్రబాబు ఇంటిపై దాడులు నిర్వహిస్తే నగలు బయట పడతాయంటూ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

 

18:23 - June 8, 2018

చిత్తూరు : రమణ దీక్షితులకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే తిరుమలకు వచ్చి మాట్లడాలని టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. రమణ దీక్షితులు భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించవద్దని సూచించారు. స్వామివారికి ఇంకా సేవ చేసుకోవాలని ఉంటే తిరుమలకు వచ్చి తమతో మాట్లాడాలన్నారు.  రమణ దీక్షతుల చేష్టలను భక్తులు గమనిస్తున్నారన్నారు. ఓ అర్చకుడిగా రమణ దీక్షితులు అమిత్‌ షా, జగన్‌లను కలవడం మంచిది కాదన్నారు.

 

22:09 - June 7, 2018

హైదరాబాద్ : టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు.. విపక్ష నేత జగన్‌తో భేటీ కావడం కలకలం సృష్టిస్తోంది. లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసిన దీక్షితులు.. తన కడుపు నింపేవారికే తన మద్దతు అని తెలిపారు. వీరి భేటీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు బీజేపీ నేతలతో.. నేడు వైసీపీ నేతలతో దీక్షితులు భేటీ కావడం.. దేనికి సంకేతమో ప్రజలకు తేలిగ్గా అర్థమవుతోందని.. టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. 

తిరుమలేశుని మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు.. విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలలులో ప్రజా సంకల్ప యాత్రను ముగించుకుని.. జగన్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో.. దీక్షితులు.. జగన్‌ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. టీటీడీపై రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్‌కు వివరించానని రమణదీక్షితులు మీడియాకు తెలిపారు. టీటీడీ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  మిరాసీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, తన పొట్టను ఎవరు నింపితే వారికే మద్దతు ఇస్తానని అన్నారు. 

రమణదీక్షితులు, జగన్‌తో భేటీ కావడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. దీక్షితులు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయన్న తమ వాదనకు బలం చేకూరుతోందని, దీనిపై ఒక్కొక్క ముసుగు తొలగుతోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. వారంతా కలిసి ప్రభుత్వంపై మహాకుట్ర చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. మొత్తానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై బహిరంగంగా ధ్వజమెత్తిన రమణ దీక్షితులు.. తాజాగా జగన్‌ను కలవడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. 

20:38 - May 22, 2018

టీటీడీ మాజీ అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సీఎం చంద్రబాబు టీటీడీ పాలకమండలితో సమావేశమయ్యారు. శ్రీవారి ఆభరణలు,అవినీతి, ఆ ప్రాంతంలోజరుగుతున్న అవకతవకలపై చర్చ జరగాల్సిన అవసరముందని రమణదీక్షితుల వాదన..మరోపక్క ఆభరణాలు సురక్షితంగా వున్నాయనీ..అవినీతి ఏమీ జరగటంలేదని పాలకమండలి స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కుమారస్వామి రమణదీక్షితులుకి మద్దతు పలకటం గమన్హాం. ఈ క్రమంలో బీజేపీ ప్రభావంతోను రమణదీక్షితులు టీటీడీ వివాదాంశంగా చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వివాదం ఏం కాబోతోంది? ఎవరిది వాస్తవం? ఎవరిది అవాస్తవం? ప్రముఖ విశ్లేషకులు నగేశ్ విశ్లేషణ..

19:17 - May 22, 2018

తిరుమల కొండపై ఏం జరుగుతోంది? శ్రీవారి ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్న రమణదీక్షితులకు ఎందుకు బలంతంగా పదవీ విరమణ చేయించారు? టీటీడీ అంశంలో సీబీఐ విచారణ చేయించాలనే డిమాండ్ ఎందుకొస్తోంది? ఈనేపథ్యంలో టీటీడీ అర్చకుల భవిష్యత్తు ఏమిటి? ఈ అంశంపై 10టీవీ చర్చ..ఈ చర్చలో బీజేపీ నేత బాబ్జీ, టీటీడీ ఉద్యోక కార్మిక సంఘాల నాయకులు కందారపు మురళి పాల్గొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రమణదీక్షితులు