రసకందాయం

09:53 - June 12, 2018

చిత్తూరు : జిల్లాలో అధికార టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలో ఆపార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న గల్లా అరుణకుమారి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉండడంతో... అటు పార్టీలోనూ... ఇటు క్యాడర్‌లోనూ అయోమయం నెలకొంది. ఇంతకీ చంద్రగిరి టీడీపీలో ఏం జరుగుతోంది? గల్లా అరుణకుమారి టీడీపీలో కొనసాగుతారా? లేక ఇతర పార్టీలో చేరుతారా? చంద్రగిరి రాజకీయంపై 10టీవీ కథనం....
రోజుకో మలుపుతు తిరుగుతున్న పాలిటిక్స్‌
చిత్తూరు అంటేనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అందులోనూ చంద్రగిరి అంటే చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె కొలువైన నియోజకవర్గం. అలాంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 
టీడీపీ దూరంగా ఉంటోన్న గల్లా అరుణ
గడిచిన మూడు ఎన్నికల్లోనూ చంద్రగిరిలో టీడీపీ ఓటమినే చవి చూసింది. చంద్రగిరిపై పసుపు జెండా ఎగిరి పదిహేనేళ్లు కావొస్తోంది. కాంగ్రెస్‌ నుంచి గల్లా అరుణకుమారి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దెబ్బతినడంతో... గల్లా అరుణకుమారి టీడీపీ కండువా కప్పుకున్నారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... ఆమె వైసీపీ చేతిలో ఓడిపోయారు. తన రాకను జీర్ణించుకోలేని టీడీపీలోని ఓ వర్గం తన ఓటమికి కృషి చేసిందని ఆమె మనస్తాపం చెందారు. అంతేకాదు.. కనీసం తనకు ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని కొంతకాలంగా ఆమె ఎదురు చూశారు. కానీ అదికూడా దక్కదని తేలడంతో ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పైకి ఆమె చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నా... పార్టీ కార్యక్రమాలకు అంతంత మాత్రంగానే హాజరయ్యేవారు. ఈ పరిణామాలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి.
రాజకీయాలకే గుడ్‌బై చెప్తానన్న గల్లా
అసలే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న గల్లా అరుణకుమారికి.. పార్టీ వదిలిన ఓ లీక్‌ మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. గల్లా అరుణ ఈ దఫా చంద్రగిరి నుంచి కాకుండా పలమనేరు నుంచి పోటీ చేస్తారన్నది ఆ లీక్‌ సారాంశం.  పలమనేరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని పుంగనూరుకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ పరిణామాలు అరుణకు స్వతహాగానే కోపం తెప్పించాయి. దీంతో చంద్రగిరి స్థానానికే కాదు... అసలు రాజకీయాలకే గుడ్‌పై బెప్పాలని ఆమె ఆ మధ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చంద్రబాబుకు కూడా చెప్పి... అదేరోజు అమెరికాకు వెళ్లారు. అయితే ఈ సమస్య అంతటితో ముగియలేదు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ తమకే కావాలంటూ ఆమె.. నియోజకవర్గం అంతటా సమావేశాలు పెట్టారు.  అరుణకుమారే ఈ మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.  ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆమె... పార్టీ కేడర్‌తో సమావేశమయ్యారు. పార్టీలో కొంతమంది తనకు ద్రోహం చేస్తున్నారని చెప్తూనే... టీడీపీని వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీగా కూడా తనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. 
గల్లా అరుణపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
చంద్రగిరి నియోజకవర్గంలోని మరోవర్గం ఆమె నిర్ణయంపై గుర్రుగా ఉంది. పార్టీ కోసం పనిచేయరుకానీ... పార్టీ టికెట్‌ తనకే కావాలంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఊహించని పరిణామాలతో చంద్రబాబు అయోమయంలోపడ్డారు. చంద్రగిరి రాజకీయాలు ఆయనకు తలనొప్పి వ్యవహారంగా మారింది. అయితే 2019 ఎన్నికల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... అంతిమంగా అక్కడ నుంచి పోటీ చేసేది ఎవరన్నది చివరకు ఎలా ముగుస్తుందోన్న ఆసక్తి జిల్లా అంతగా నెలకొంది. 

 

09:36 - September 11, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్షకు మొగ్గు చూపకపోడతంతో, ఈ అంశంపై కోర్టును ఆశ్రయించాలని ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలన్న విపక్షాల విజ్ఞప్తిపై  ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు స్టాలిన్‌...  ఇన్‌చార్జ్‌ గవర్నర్‌  విద్యాసాగర్‌రావును రెండు సార్లు కలిసి... పళనిస్వామి ప్రభుత్వ  బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. దీనికి విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడంతో ఇకపై హైకోర్టును ఆశ్రయించాలని డీఎంకే నిర్ణయించింది. 
మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న సీఎం పళనిస్వామి   
ముఖ్యమంత్రి పళనిస్వామి మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్నారు. అన్నా డీఎంకేకి అసెంబ్లీలో తనిగన సంఖ్యాబలం లేకపోవడంతోనే బలనిరూపణకు పళనిస్వామి భయపడుతున్నారన్నది విపక్ష డీఎంకే వాదన. తమిళనాడు అసెంబ్లీలో 238 మంది సభ్యులు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. డీఎంకేకి 89 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు, ఐయూఎంఎల్‌కు ఒక సభ్యుడు ఉన్నారు.  అన్నా డీఎంకే చీలికవర్గం దినకరన్‌కు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం కూడా పళనిస్వామి మంత్రివర్గం బలపరీక్ష కోరుతోంది. గవర్నర్‌ను రెండుసార్లు కలిసి తన వాదాన్ని వినిపించారు. బలపరీక్ష కోరుతున్న డీఎంకే, అన్నా డీఎంకే చీలికవర్గం ఎమ్మెల్యేల సంఖ్య 119 ఉందని చెబుతున్నారు. పళనిస్వామి మంత్రివర్గాన్ని పడగొట్టే ఉద్దేశం తమకులేదని దినకరన్‌ చెబుతున్నా... ప్రభుత్వ బలపరీక్షకు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అంగీకరించకపోవడంతో... దినకరన్‌ కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి తకు 124 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమవైపు తిరిగిరావడంతో తమ బలం 124కు పెరిగిందని, ఈ పరిస్థితుల్లో మెజారిటీ తమకే ఉందని పళనిస్వామి  వర్గం వాదిస్తోంది. తమిళనాడు రాజకీయాలు ఏ  మలుపు తిరుగుతా చూడాలి. 

20:46 - August 11, 2017

ఓ పక్క కాలా షూటింగ్ జరుగుతోంది.. మరోపక్క వాడి వేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఊహాగానాలు పెరుగుతున్నాయి.. వీటన్నిటిని చూస్తే తమిళనాట రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా? సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? రజనీ ఏ సంకేతాలిస్తున్నారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి? అదే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి కనిపించటం తమిళనాట కొత్త చర్చకు దారితీస్తోందా? ఇదే ఈ రోజు .దశాబ్దాల నుండి ఆ పీఠంపై సినీ తారలను, సినీరంగ ప్రముఖులను కూర్చోబెడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? ఆయన దారి రహదారి. ఇది సినిమాల్లోనేనా లేక పాలిటిక్స్ లో కూడానా. ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఉన్న దారిలోనే దూసుకొస్తారా? లేక కొత్త బాట వేసుకుంటారా? రజనీతో పాటు తెరపైకి వచ్చి వేడెక్కిస్తున్న కమల్ హసన్ దారెటు?రజనీ హడావుడి ఓ పక్క నడుస్తుండగానే కమల్ హాసన్ తెరపైకివచ్చారు.. కొద్ది నెలలుగా ట్వీట్లు స్టేట్ మెంట్లతో తమిళ రాజకీయరంగాన్ని వేడెక్కిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే పార్టీ కార్యక్రమానికి హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. తనకు గతంలోనే డీఎంకే నుంచి పిలుపు వచ్చిందంటున్న కమల్ ఇప్పుడు దాన్ని అంగీకరిస్తారా?సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని గాంధేయ మక్కల్‌ ఇయక్కం చెప్తోంది. రజనీ ఎంట్రీ ఇస్తే, కొత్త పార్టీతో తమిళ ప్రజల్లోకి ఆయన వస్తారా? ఇందుకు ఢిల్లీ వేదికగా కసరత్తులు సాగుతున్నాయా? సైలెంట్ గా న్యాయ నిపుణుల కమిటీలతో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో బిజీగా ఉన్నారా?

08:39 - February 10, 2017

చెన్నై : తమిళనాడులో అధికార అన్నా డీఎంకేలో సంక్షోభం తీవ్రమవుతోంది. శశికళ వర్గం నుంచి కొందరు ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వం వైపు వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఇద్దరు నేతలూ ముందుకు వస్తున్న నేపథ్యంలో అధికారం ఎవరికి దక్కుతుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఎవరికి అవకాశం ఇస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రసకందాయంలో తమిళ రాజకీయాలు
తమిళనాడులో అన్నా డీఎంకే రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. శశికళ, పన్నీరు సెల్వం వేర్వేరుగా ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో  గవర్నర్‌ తీసుకునే  నిర్ణయం కీలకంగా మారనుంది. పరిపాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నది గవర్నర్‌ చేతుల్లో ఉంది. 
గవర్నర్‌ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు 
ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ, పన్నీరు సెల్వం పోటీ పడుతున్న తరుణంలో గవర్నర్‌ ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై ఆసక్తి  నెలకొంది. గవర్నర్‌ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణలు సూచిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెలవడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలు ఉన్నందున చిన్నమ్మను వేచిచూడమని చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నరని శశికళ చెబుతున్న తరుణంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించి, ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమని కోరే చాన్స్‌ ఉంది. 
శశికళ సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో ఫోర్జరీ సంతకాలు 
అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తనకే మద్దతు ఇస్తున్నారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెబుతున్నారు. శశికళ గవర్నర్‌కు అందజేసిన ఎమ్మెల్యేల జాబితాలోని సంతకాల్లో చాలా వరకు ఫోర్జరీవేని  వాదాన్ని సెల్వం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని సెల్వం ప్రకటించిన నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చి, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమని కోరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అన్నా డీఎంకేలో సంక్షోభం సమసిపోయే మార్గాలు కనిపించకపోతే రాష్ట్రపతి పాలనను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ నాలుగు మార్గాల్లో గవర్నర్‌ దేన్ని ఎంచుకుంటారన్న అంశంపై ఉత్కంఠత నెలకొంది. 

 

07:38 - December 31, 2016

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో అసమ్మతి అనే అగ్నిపర్వతం పేలింది. ఎస్పీ అధినేత ములాయంసింగ్‌.. తన కుమారుడు, సీఎం అయిన అఖిలేష్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌పైనా వేటువేశారు.  ఇద్దరినీ ఆరేళ్లపాటు.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు  ప్రకటించారు.  దీంతో ఎవరి సమీకరణాల్లో వారు మునిగిపోయారు. ఇవాళ  పార్టీ నేతలతో  ములాయంసింగ్‌ సమావేశం అవుతుండగా...  అటు అఖిలేష్‌ కూడా మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. దీంతో యూపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
సమాజ్‌వాదీ పార్టీలో ముసలం 
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో ముసలం పుట్టింది.  రాజకీయ సమీకరణాలు గంటగంటకూ శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు చిన్నపాటి విభేదాలతో ఉన్న ములాయం, అఖిలేష్‌ల గొడవ చినికి చినికి గాలివానైనట్టు చివరికి కన్నకొడుకునే పార్టీ నుంచి బహిష్కరించే వరకు పరిస్థితులు దారితీశాయి. అఖిలేష్‌ యాదవ్‌ సీఎం సీటులో ఉండగానే బహిష్కరణకు గురయ్యారు.  సీఎం అఖిలేష్‌యాదవ్‌తోపాటు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ములాయంసింగ్‌ బహిష్కరించారు. ఆరేళ్లపాటు ఇద్దరిపై వేటు వేశారు.
ములాయం ఆగ్రహం 
రాంగోపాల్‌ యాదవ్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీని అఖిలేష్‌ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామని ములాయం స్పష్టం చేశారు.
వివాదానికి ఆజ్యంపోసిన అభ్యర్ధుల జాబితా
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి, కొడుకుల మధ్య వార్‌ గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం సింగ్‌ రెండు రోజుల క్రితం విడుదల చేశారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేశ్‌ సొంతంగా గురువారం రాత్రి మరో 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం షోకాజు నోటీసులు పంపించారు. మీడియా ఎదుట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌కు షోకాజ్‌ నోటీసులు పంపించారు.  ఆ వెంటనే ఇద్దరినీ  సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 
అఖిలేష్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్ధతు
బహిష్కరణ వేటువేయగానే ఆగ్రహానికిలోనైన అఖిలేష్‌ అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారులు ములాయంకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.  పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అఖిలేష్‌ ఇంటికి క్యూ కట్టారు.  మరోవైపు అఖిలేష్‌ మద్దతుదారులంతా రాజీనామాల బాట పడుతున్నారు.  ఇప్పటికే ఎస్పీ అధికార ప్రతినిధి సిద్దిఖీ రాజీనామా చేశారు. 100 మంది ఎమ్మెల్యేలు అఖిలేష్‌ ఇంటికెళ్లి నేరుగా కలిశారు. పార్టీకి రాజీనామా చేయవద్దని వారు అఖిలేష్‌ను కోరారు.  సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని, సైకిల్‌ గుర్తు మనదేనంటూ అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. జనవరి 1న భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు రాంగోపాల్‌ ప్రకటించారు.
అఖిలేష్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెడతారా?
జనవరి 1న నిర్వహించే సభ వెనుక ఉద్దేశ్యమేంటి, ఎందుకు సడన్‌గా సభ నిర్వహించాల్సి వస్తోందన్న విషయం ఎందుకున్నది మాత్రం  ఇప్పటికి సస్పెన్స్‌గానే ఉంది. బహిరంగసభలో కొత్తపార్టీ పెడుతున్నట్టు ప్రకటిస్తారా, లేక సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగాలా అన్నది సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.  కొత్తపార్టీ పెడితే పరిస్థితి ఏంటీ,  మళ్లీ అధికారంలోకి వస్తామా అన్నదానిపై అనుచరులతో అఖిలేష్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. శనివారం కూడా మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవుతున్నారు. అయితే బహిష్కరణ వేటు తర్వాత అఖిలేష్‌ భవితవ్యం ఏమిటి, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు శనివారం లక్నోలో పార్టీ సభ్యులతో సమావేశం ఏర్పాటుకు ములాయం సింగ్‌ పిలుపునిచ్చారు. ఇందులో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

14:17 - November 6, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. వరుస సర్వేల్లో విజయావకాశాలు ఇద్దరి మధ్యా దోబూచులాడుతున్నాయి. మొన్నటి మొన్న హిల్లరీ కన్నా ఓ శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్న ట్రంప్ మళ్లీ వెనుకబడ్డాడు. తాజా సర్వేల్లో హిల్లరీ క్లింటన్.. ట్రంప్ కన్నా ఓ ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. 
మరో రెండు రోజుల్లో పోలింగ్  
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. పోలింగ్ కు మరో రెండు రోజులే మిగిలింది. దీంతో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచారాన్ని తారాస్థాయిలో చేస్తున్నారు. అమెరికా 45వ అధ్యక్షులుగా ఎన్నికయ్యేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు. అటు మీడియా సంస్థలు కూడా ఎవరు గెలుస్తారు..? అన్న అంశంపై సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. 
స్వల్ప ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్ 
చివరి రెండు రోజుల్లో విజయావకాశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయన్న అంశంపై వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లారు. హిల్లరీకి 48 శాతం ఓటర్లు మద్దతు పలుకగా.. ట్రంప్ ను 44 శాతం మంది ఓటర్లు బలపరిచారు. 
వివిధ సంస్థలు సర్వేలు
వాషింగ్టన్ పోస్ట్ఏబీసీ వెలువరించిన సర్వేలో.. ఇద్దరు అభ్యర్థులకు మద్దతివ్వడానికి కారణమేంటి అన్న ప్రశ్నకు లభించిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హిల్లరీని సమర్థిస్తున్నాము కాబట్టి ఆమెకు మద్దతిస్తున్నట్లు.. హిల్లరీ సపోర్టర్స్ చెబితే.. హిల్లరీని వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ట్రంప్ ను సమర్థిస్తున్నామని మిగిలిన వారు చెప్పారు. దీన్నిబట్టి.. ఇక్కడి ఓటర్లు హిల్లరీ అనుకూల, వ్యతిరేకులగా మారారన్న భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ ఈరోజు వెలువరించిన తాజా సర్వే మాత్రం డెమొక్రాట్లలో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు.     

 

Don't Miss

Subscribe to RSS - రసకందాయం