రాజకీయం

13:40 - July 23, 2017

విజయవాడ : రెండేళ్ల తర్వాత రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది ప్రతిపక్ష వైసీపీ. టీడీపీ, జనసేనకు సినీ గ్లామర్‌ భారీగానే ఉంది. ఎటొచ్చి వైసీపీ సినీ గ్లామర్‌ పెద్దగా లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో పార్టీకి సినీగ్లామర్‌ అద్దాలని చూస్తోంది. సినీ, రాజకీయ కుటుంబాలతో సంబంధమున్న ఇద్దరు ముఖ్య నటులను ఎన్నికల్లో దింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీని విజయతీరాలకు చేర్చేందుకంటూ జగన్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ముగిసేలోపు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని ఆయన భావిస్తున్నారు. వైసీపీ బలంగాలేని కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి నందమూరి, ఘంటమనేని కుటుంబాలకు చెందిన నటులతో పోటీ చేయించాలని స్కెచ్‌ వేశారు.

సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ
ఇందులో భాగంగానే... విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణను పోటీకి దింపాలని జగన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన ద్వారా కృష్ణ ఎంపీగా పోటీకి దిగేలా ఒప్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణ ఎంపీగా పోటీచేస్తే మహేష్‌బాబు వైసీపీ తరపున ప్రచారం చేస్తారని జగన్‌ భావిస్తున్నారు. మహేష్‌ ప్రచారం పార్టీకి కలిసివస్తుందన్న యోచనలో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టి అధికారపగ్గాలు చేపట్టాలని చూస్తున్న జగన్‌... నందమూరి కుటుంబ సభ్యులనూ వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నందమూరి హరికృష్ణ
ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణని వైసీపీలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకు గుడివాడ ఎమ్మెల్యే నానిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. హరికృష్ణను వైసీపీ తరపున పోటీచేయించి.... ఆయన తరపున జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయాలని స్కెచ్‌ వేస్తున్నట్టు సమాచారం. మరి జగన్‌ ప్రయత్నాలకు వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

 

15:57 - July 14, 2017

కర్నూలు : కులం, మతం ప్రాంతం అడ్డుపెట్టుకొని చేయొద్దన్నారు.. మంత్రి లోకేశ్‌ నాయుడు.. కర్నూలు జిల్లాలో లోకేశ్ పర్యటిస్తున్నారు.. ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజల వినతులు స్వీకరించారు.. అక్కడి సమస్యలపై ఆరాతీశారు.. అయితే రాయలసీమలో పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపించడంలేదంటూ సీమ ఉద్యమకారులు ఆరోపించారు.. సీమపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని లోకేశ్‌ను ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన మంత్రి... సీఎం చంద్రబాబు రాయలసీమకుచెందిన వ్యక్తిఅని.. సీమను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని ఉద్యమకారులకు తెలిపారు.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

13:05 - July 12, 2017

నల్లగొండ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి... రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ... నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటిస్తూ తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ... కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రెండు పర్యాయాలు కోదాడ ఎమ్మెల్యేగా సేవలందించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడగానే.. కోదాడలో తన భార్యను రంగంలోకి దించి.. ఆయన హుజూర్ నగర్‌కు షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఉత్తమ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి పద్మావతి... ఉత్తమ్ స్థానంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. అలాగే పద్మావతి ఉన్నప్పటికీ హుజూర్ నగర్‌తో పాటు కోదాడ నియోజకవర్గం బాధ్యతలను ఉత్తమ్ పరోక్షంగా మోస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు.. కార్యక్రమాలను ఉత్తమ్‌ నిర్ణయిస్తున్నారు. ఉత్తమ్‌ వారానికి ఒకసారైనా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో గర్జన సభతో పాటు.. కార్యకర్తల వ్యక్తిగత వేడుకలకు సమయం కేటాయిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఉత్తమ్ వెంట ఆయన సతీమణి పద్మావతిని కూడా తీసుకెళ్తున్నారు. దీంతో దీని వెనక ఉత్తమ్ వ్యూహం ఏదో ఉందంటూ పలువురు అనుకుంటున్నారు.

నల్గొండ పార్లమెంటు సీటు కన్నేసిప ఉత్తమ్
మొత్తానికి ఇటు హుజూర్‌నగర్‌, అటు కోదాడ నియోజకవర్గాల్లోనూ తమ పట్టును కోల్పోకుండా.. ఉత్తమ్‌ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోది. దీంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన క్యాడర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నల్గొండ పార్లమెంటు సీటుపై ఉత్తమ్ కన్నేసినట్టు ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి తన సతీమణి పద్మావతిని పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. హిందీలోనూ, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఉన్న పద్మావతి ఎంపీ అయితే క్షేత్రస్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ పార్టీతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవచ్చని ఉత్తమ్ ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా.. పార్టీ అధిష్ఠానానికి మరింత చేరువ కావచ్చన్న ఎత్తుగడ ఇందులో ఉందని పార్టీలో కొంతమంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వ్యూహాత్మాక ఎత్తుగడలతో ఎన్నికల ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఉత్తమ్ రూటే సెపరేట్. దానికి తోడు ఈసారి ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతున్న ఉత్తమ్‌ను చూసి సొంత నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

15:08 - June 29, 2017

’దిల్‘ రాజు నిర్మాతగా మారి మంచి సక్సెలను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లోని ప్రముఖుల చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నిర్మాణంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్’ కాసులు కురిపిస్తోంది. దీనితో ‘దిల్’ రాజు ఫుల్ హ్యపీగా ఉన్నాడంట. అయితే ఇదిలా ఉంటే ‘పవన్ కళ్యాణ్’ తో ‘దిల్’ రాజు ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. పవన్ కూడా కథ సిద్ధం చేసుకోవాలని చెప్పాడని టాక్.

2019 ఎన్నికలు..
2019 ఎన్నికల్లో పవన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ రంగంతో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో...సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రాల్లో నటించనున్నాడు. ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా 2018 సంవత్సరంలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ‘దిల్’ రాజు నిర్మాణంలో ‘పవన్’ చిత్రం ఉంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

07:19 - June 24, 2017

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో రైతుల్ని అడ్డంగా పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరీఫ్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని పోచారం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

11:27 - May 19, 2017

చెన్నై : నేడు రజనీ అభిమానులతో చివరి సమావేశం నర్వహించనున్నారు. చివరి రోజు భేటీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సంద్భరంగా రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నా వ్యవస్థలో మార్పు రాలేదని, ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాక్షించారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నా, తమిళనాడులో 43ఏళ్ల నుంచి ఉంటున్నానని తెలిపారు. కర్ణాటక వాడినైనా తమిళనాడు ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

22:04 - April 29, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ను రాజకీయం చేయడం సరికాదని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. బసవాచార్య జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.... ముస్లిం మహిళలకు మూడు తలాక్‌ల నుంచి విముక్తి కల్పించేందుకు ముస్లింలే ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో భారతీయ ముస్లింలే ప్రపంచానికి మార్గదర్శకులు కావాలని మోది ఆకాంక్షించారు.

 

18:57 - April 26, 2017

నెల్లూరు :  జిల్లా రాజకీయాల్లో కీలకమైన ఆనం సోదరులు తమ రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో పడ్డారా ? ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి...ఆనం బ్రదర్స్‌గా గుర్తింపు పొందారు. రాజకీయ విలక్షణతకు వీరు మారు పేరు. తమ రాజకీయ చతురతతో ప్రత్యర్థులతోపాటు, సొంతపార్టీ నేతలను ఢీ కొట్టి, అన్ని వేళలా ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకునే నాయకులు. కాంగ్రెస్‌లో ఉండగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఆనం సోదరులు. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన వీరు ఇప్పుడు పసుపుదళంలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నట్టు కనిపిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ధేశించుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

కొంత కాలం రాజకీయాలకు దూరం
2014 ఎన్నికల తర్వాత ఆనం సోదరులు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్‌ నిర్ధేశించుకునే ఆలోచనల్లో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మున్సిపల్‌ మంత్రి నారాయణ ద్వారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబుతో భేటీ దరిమిలా ఆనం వివేకానందకు ఎమ్మెల్సీ, రామనారాయణరెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తామన్న కొన్ని స్పష్టమైన హామీలతో టీడీపీలో చేరిన వీరికి, కొద్ది రోజుల్లో సీను అర్థమైంది. ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఉన్న ఒకేఒక్క మార్గం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులే. మంత్రివర్గ విస్తరణకు ముందు రోజు వీటిలో ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే పొన్నాల రామసుబ్బారెడ్డికి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డిని శాంతపరిచేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో రెండో ఎమ్మెల్సీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారన్న బాధతో ఉన్న ఆనం సోదరలు పార్టీ మారే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉండగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ, స్వతంత్రంగా వ్యవహరించిన ఆనం సోదరులకు... క్రమశిక్షణకు మారు పేరైన టీడీపీలో చేరిన తర్వాత నోరు కట్టేసినట్టు అయ్యింది. పార్టీ విషయాల్లో కొన్నిసార్లు స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాల్లో టీడీపీ అధినాయకత్వం నుంచి వార్నింగ్‌లు తప్పలేదు. ఆనం సోదరులు దీనిని అవమానంగా భావిస్తున్నట్టు వినిపిస్తోంది. టీడీపీలో గుర్తింపు లేక, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయమన్న భావంతో వీరు ఉన్నారు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తర్వాత తమ అంచనాలు తలకిందులయ్యాన్న బాధ ఆనం సోదరుల్లో కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.

పట్టించుకోని అధికార పార్టీ నాయకులు
ఇక పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆనం సోదరులకు పిలుపురాని పరిస్థితి. పార్టీ నేతలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆనం సోదరులను పట్టించుకోవడంలేదన్న బాధ వీరిలో గూడుకట్టుకుని ఉంది. నెల్లూరు మేయర్‌ ఆజీజ్‌ కూడా ఆనం సోదరులపై ఆధిపత్యం చెలాయించే స్థాయి రావడంతో టీడీపీలో తమ పరిస్థితి అగమ్యగోచరమన్న ఆలోచనకు ఆనం సోదరులు వచ్చారు. మంత్రి నారా లోకేశ్‌ కూడా మేయర్‌ అజీజ్‌ను సమర్థించడం.. ఆనం బ్రదర్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. మున్సిపల్ మంత్రి నారాయణ ఒక్కరే వీరికి కొద్దో గొప్పో గుర్తింపు ఇస్తున్నా.. చిన్నా చితక పనులను కూడా ఈయన దృష్టికి తీసుకెళ్లి సిఫారసు చేయించుకోవాల్సి వస్తోందన్న బాధతో ఉన్నారని వినిపిస్తోంది. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రైన తర్వాత ఆనం సోదరులకు అసలు గుర్తింపే లేకుండా పోయిందని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వస్థీకరణకు ఆనం సోదరులకు ఆహ్వానం అందినా ఉద్దేశపూర్వంగా డుమ్మాకొట్టి, టీడీపీ నాయకత్వానికి తమ అసంతృప్తి వ్యక్తం చేశారాని ప్రచారం జరుగుతోంది. టీడీపీ విధానాలతో విసిగిపోయిన ఆనం సోదరులు కొత్త దారులు వెతుకుంటున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరితేనే రాజకీయంగా భవిష్యత్‌ ఉంటుందని వీరు భావిస్తున్నాట్టు సమాచారం. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న భూమన కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఆనం వివేకానందరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. వైపీసీలో చేరితే పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని భూమన హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడా తన సోదరుడు వివేకానందరెడ్డి బాటలోనే నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

19:30 - April 14, 2017

కడప : ప్రొద్దుటూరులో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక టీడీపీ నేతలకు కత్తి మీద సాములా తయారైంది. స్థానిక టీడీపీ నేతల వర్గపోరుతో ప్రొద్దుటూరు రాజకీయం రచ్చకెక్కింది. మున్సిపల్‌ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని రెండు వర్గాల నేతలు చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహాలు లేవు.
సొంత పార్టీ నేతను ఓడించేందుకు వైసీపీతో చేతులు 
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రధానమైన వాణిజ్య కేంద్రం. రాజకీయంగా కూడా ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా జట్టు కడతారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఇదే జరుగుతోంది. ఒకే పార్టీలో ఉంటూ... సొంత పార్టీ నేతను ఓడించేందుకు వైసీపీతో చేతులు కలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఆవిష్కృతమైంది. 
నంద్యాల వరదరాజులరెడ్డిది ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థులు ఏకం 
ప్రొద్దుటూరు రాజకీయాల్లో నంద్యాల వరదరాజులరెడ్డిది చెరగని ముద్ర. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేతలంతా ఆయనను పెద్దాయన అని పిలుచుకుంటారు. ఆ పెద్దాయన ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థులు ఏకమయ్యి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. అనంతరం పెద్దాయన వ్యతిరేక కూటమి బలపడుతూ వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కూడ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వరదరాజుల రెడ్డి ఓటమే లక్ష్యంగా అటు సొంత పార్టీ నేతలు.. ఇటు ప్రత్యర్థి పార్టీ నేతలు పని చేస్తున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యర్థుల వ్యూహాలు 
ఇప్పుడు పెద్దాయన వరదరాజుల రెడ్డి అనుచరుల ఓటమే లక్ష్యంగా ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత లింగారెడ్డి ఏకమవుతున్నారు. వరదరాజులరెడ్డి  ప్రొద్దుటూరు మున్సిపాల్ చైర్మన్‌ పదవికి ఆసం రఘురామిరెడ్డిని పోటీలోకి దింపుతున్నారు.
ఆసం రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా ముక్తియార్ 
ఆసం రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా లింగారెడ్డి... ముక్తియార్ ను దింపుతున్నారు. ముక్తియార్ ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే.. ముక్తియార్ కు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆశీస్సులు కూడ పుష్కలంగా ఉన్నాయి. దీంతో వరదరాజుల రెడ్డి అనుచరుడు ఆసం రఘురామిరెడ్డి ఓటమి లక్ష్యంగా లింగారెడ్డి, ప్రసాద్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ప్రొద్దుటూరులో 31 వార్డులు
మొత్తం 31 వార్డులున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో.. లింగారెడ్డి మద్దతుదారుడు ముక్తియార్‌కు 16 మంది సభ్యుల మద్దతుందని చెబుతున్నారు. వీరి ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు కూడ ఉన్నారు.  మరోవైపు ఆసం రఘరామిరెడ్డి కూడ తనకు అవసరమైన మద్దతు ఉందని చెబుతున్నారు. కానీ... లింగారెడ్డి వర్గం డిమాండ్‌లు వేరే ఉన్నాయి. ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌ చైర్మన్ జబీవుల్లా, టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా  చేస్తే.. తాము పోటీ నుంచి తప్పుకుంటామని లింగారెడ్డి వర్గం చెబుతోంది. 
పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా టీడీపీ నేతల పోరు  
మొత్తానికి ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోరు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. గురివిరెడ్డి తర్వాత ఆసం రఘురామిరెడ్డే చైర్మన్ అని.. ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించినా... లింగారెడ్డి తన వర్గం అభ్యర్థిని బరిలోకి దింపారు. దీంతో టీడీపీ నేతలు ఇరువురికి సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

 

06:46 - April 2, 2017

హైదరాబాద్ : పొలిటికల్‌ కరప్షన్‌ను రూపుమాపుతామన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఆచరణలో మాత్రం అమలుకు దూరంగా ఉన్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కంపెనీలు తమకు నచ్చిన పార్టీకి ఎంతైనా విరాళాలు ఇచ్చేలా చట్టాలు రూపొందిస్తున్నారని చెప్పారు. దీనివల్ల రాజకీయ అవినీతి మరింత పెరుగుతుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకులను వేధించేలా ఇన్‌కం టాక్స్‌ సవరణలు చేశారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడుతామని ఏచూరి హెచ్చరించారు. రాజకీయ అవినీతిని అంతం చేస్తామని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఆవిధంగా చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఏచూరి.. కేంద్రం- కంపెనీల యాక్ట్‌ను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. కంపెనీలు తమకు నచ్చిన పార్టీకి ఎంతైనా విరాళాలు ఇచ్చేలా చట్టాలు రూపొందిస్తున్నారని అన్నారు. గతంలో కంపెనీలు 7.5 శాతం విరాళాలు మాత్రమే ఇచ్చేలా సీలింగ్‌ ఉండేదని.. ఇప్పుడు దాన్ని మార్చారన్నారు. దీనివల్ల రాజకీయ అవినీతి మరింత ఎక్కువవుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించేలా ఇన్‌కం టాక్స్‌ సవరణలు చేశారని ఏచూరి ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా సంఘాలతో కలిసి పార్లమెంట్‌ ముందు ఆందోళన చేపడుతామని ఏచూరి హెచ్చరించారు. రైతు రుణాలను మాఫీ చేయని కేంద్రం.. కార్పొరేట్ల నిరర్థక ఆస్తులను రద్దు చేయడాన్ని ఏచూరి తప్పుపట్టారు. మైనార్టీలను పూర్తిగా పక్కనపెట్టి, హిందూత్వ అజెండానే అభివృద్ధిగా చూపిస్తున్నారని ఏచూరి ఆరోపించారు. డీమానిటైజేషన్ వల్ల యూపీలో గెలిచామంటున్న బీజేపీ పంజాబ్‌లో ఎందుకు ఓడింపోయిందని ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక న్యాయం చేకూరే వరకు మేధావులు, ప్రజలను సంప్రదించి రాజకీయ ఉద్యమం నిర్మిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఈ సంవత్సరమే ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

మహాజన పాదయాత్రను సీపీఎం కేంద్రకమిటీ అభినందించడం పట్ల తమ్మినేని వీరభద్రం ధన్యవాదాలు తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రాజకీయం