రాజకీయాలు

13:20 - March 16, 2018
18:41 - March 10, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ప్రధానంగా పండించే పంట ఎర్రజొన్న. ఇప్పుడిదే పంట అక్కడి రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు వణుకుపుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో... నేతల భవితవ్యాన్ని సైతం ఈ పంటే తేల్చనుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
ఎర్రజొన్నకు ప్రసిద్ధి చెందిన ఆర్మూర్‌
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఎర్రజొన్నకు ఎంతో ప్రసిద్ధి. విత్తన పంటగా పేరొందిన ఎర్రజొన్నకు ఉత్తర భారతదేశంలో ఎంతో డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా ఉత్తరాది వ్యాపారులు స్థానిక రైతులకు విత్తనాలు సరఫరా చేసి పంట చేతికొచ్చాక వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తారు. కేవలం వంద రోజుల్లో చేతికొచ్చే ఈ ఎర్రజొన్నను కొందరు స్థానిక వ్యాపారులు కూడా దళారులుగా వ్యవహరిస్తూ కొనుగోళ్లు చేస్తారు. 
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వివాదం
ఇంత డిమాండ్‌ ఉన్న ఎర్రజొన్నను కొనుగోలు చేసి డబ్బులు సమయానికి చెల్లించకపోవడంతో 2008లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు రైతులు. ఆగ్రహంతో ఆ వ్యాపారి ఇంటితో పాటు పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఎర్రజొన్న కొనుగోళ్లు ఏదో రకంగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అదే పరిస్థితి కొనసాగుతోంది. 
2009 ఎన్నికలపై ప్రభావం చూపిన ఎర్రజొన్న
అయితే ఇప్పుడు ఎర్రజొన్నల అంశం కేవలం పంట కొనుగోళ్లకు, మార్కెటింగ్‌కి మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయంగా ఎంతో ప్రభావం చూపుతోంది. 2008లో కాల్పుల అనంతరం జరిగిన 2009 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని చుట్టుప్రక్కల నియోజకవర్గాలపై కూడా ఎర్రజొన్న ప్రభావం పడింది. కాంగ్రెస్‌ హయాంలో ఈ కాల్పుల ఘటన జరగడంతో జిల్లాలో ఆ పార్టీ ఓటమికి పరోక్షంగా ఎర్రజొన్న ప్రభావం కూడా కారణమైంది. 
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీట్లు తీసుకొచ్చిన ఎర్రజొన్న
2014 సాధారణ ఎన్నికల్లో సైతం ఎర్రజొన్న పంటే టీఆర్‌ఎస్‌ నేతలకు సీట్లు వచ్చేలా చేసింది. ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామన్న హామీతో గులాబీ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. అయితే ప్రస్తుతం అదే అంశం అధికార పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మద్దతు ధర కోసం రైతులు ఉద్యమ బాట పట్టారు. రోజు రోజుకీ ఉద్యమం ఉధృతం అవడంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక నేతలు తలలు పట్టుకుంటున్నారు. రైతుల ఆందోళనతో  ప్రభుత్వం 2వేల 300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే తమకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఎంతకు సరిపోదంటూ రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. 
మళ్లీ రాజకీయ అస్త్రంగా ఎర్రజొన్న
రైతుల ఆందోళనలు ఇలా ఉంటే ఓ వైపు ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో ఎర్రజొన్న అంశం మళ్లీ రాజకీయ అస్త్రంగా మారనుంది. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గంలో రైతు సదస్సు నిర్వహించి మద్దతు ధరలపై ఎన్నికల డిక్లరేషన్‌ ప్రకటించింది. అంతే కాకుండా ఎర్రజొన్న రైతులకు మద్దతుగా మోర్తాడ్‌లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించింది. దీంతో ఎర్రజొన్న అంశం రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయాల పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

15:56 - March 9, 2018

అమరావతి : వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అడుగులేస్తున్నారు. ఇన్నాళ్ళూ ఇతర పార్టీలకు మద్దతిచ్చిన జనసేనాని.. ఇక నేరుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్నారు. మార్చి 14న బహిరంగ సభలో జనసేనాని ఏమి మాట్లాడబోతున్నారు... పవర్‌ స్టార్‌ ప్రకంపనలు ఎవరిని తాకనున్నాయి.. ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా... తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న జనసేనపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...

ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్ :
ఇంతవరకూ ఇతర రాజకీయ పార్టీలకు మద్ధతిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఏళ్ళ తరబడి మూసపద్ధతిలో సాగుతున్న రాజకీయాల ట్రెండ్‌ మార్చి.. జనంతో మమేకం అయ్యేందుకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవర్‌ స్టార్‌ పవన్‌ ... దేశ, రాష్ర్ట రాజకీయాలను నిశితంగా గమనిస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై... ఇక నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజలతో కలిసి పనిచేసేందుకు సమాయత్తమయ్యారు. అందుకోసం కార్యాచరణ రూపొందించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలే జనసేన టార్గెట్‌
2019 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు జనసేనాని. గుంటూరులో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇంతకీ ఆవిర్భావ సభలో ఏం ప్రకటించబోతున్నారు.. ఆ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.. అన్న అంశాలను రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్టీ ఏర్పడినప్పటినుంచీ జనసేన అధినేత పవన్‌ ఎప్పుడూ మీడియా హెడ్స్‌ ను కలవలేదు. ఇప్పటి వరకు వారితో అడపాదడపా తెరవెనుక సంప్రదింపులకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు మీడియా ముఖ్యులతో చిట్‌చాట్‌ పెట్టి... దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే తాను ఏర్పాటుచేసిన పార్టీ, భవిష్యత్ కార్యాచరణపై మనసులోని విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

దివంగత ఎంజీఆర్‌ ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చా-పవన్‌ కళ్యాణ్

తమిళనాట రాజకీయాల్లో తలపండిన నేత దివంగత ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు పవన్‌ కళ్యాణ్.... నేడు తెలుగు రాష్ర్టాల్లో రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోందన్న పవన్... అధికార, ప్రతిపక్షపార్టీల వ్యవహారం పారదర్శకంగా లేదన్నారు. రాజకీయ పార్టీలు మాటలతో మభ్యపెడుతూ... పబ్బం గడుపుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఏమి చేస్తే బాగుంటుందన్న దానిపై మీడియా ప్రతినిధులతో సూచనలు, సలహాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కాగా 2019 ఎన్నికల బరిలో నిలవనున్న జనసేనాని... ఏపార్టీని బలహీన పరుస్తాడో.. ఏ పార్టీకి బలంగా నిలుస్తాడో.. లేక తానే సీఎం అభ్యర్థిగా నిలిచి.. వారసత్వ రాజకీయాలకు చెక్‌ పెడతాడా అన్నది సర్వత్రా చర్చనీయాంశగామారింది. రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్రతో పాటు.. అన్నివిషయాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రకటిస్తానంటూ పవన్‌ కళ్యాణ్‌ కొద్దిరోజులుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో... వెండితెరమీద ఓ వెలుగు వెలిగిన తారలు సినీజీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టి.. రాజకీయాలవైపు అడుగులేస్తున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాల్లో జనసేనాని ఏమేరకు సక్సెస్‌ అవుతాడన్నది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.. 

20:56 - February 22, 2018

మొన్న నాగం జనార్దన్ రెడ్డిగారు ఢిల్లీకి సీక్రెటుగ వొయ్యి ఎవ్వలిని గల్చిండట తెల్చిందా.. మీరంత మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రువా..? ఓదిక్కు రైతులు తన్లాడుతుంటే.. కనీసం వాళ్లగురించి ఆలోచన జేస్తున్నరా..?తెలంగాణ జేఏసీ సర్కారు మీద రివైంజ్ తీర్చుకుంటున్నది.. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరులు యాదికొచ్చిండ్రు.. ఈ భూమ్మీద ఏ జీవైనా సరే.. బత్కి బట్టగట్టాల్నంటే ఆహారం సంపాయించుకోవాలె.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పేదబిడ్డ సావుదాలకొచ్చింది.. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలంల గిరిజనుల భూములు మాత్రం అక్రమంగున్నయని గుంజుకుంటున్నరట..నాయిని నర్సన్నా నీకోసమే వచ్చిందే ఒక స్పెషల్ వార్త.. హైద్రావాద్ రోడ్ల మీద..పోరని బండ్లెకెళ్లే ఒక నాగుంబాము.. ముతి బైటికి వెట్టి సూస్తున్నది.. అది జూశ్న పోరని పరిస్థితి ఏంది..? మంచిగ అడ్విల చేన్ల పొంట చెల్కల పొంట ఆడుకోక.. ఊర్లెకు ఉర్కొచ్చింది నెమలి..గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:17 - February 20, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రత్యేక హోదా అంశం సవాళ్లు - ప్రతిసవాళ్లతో రక్తికడుతోంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకహోదాపై రెండు రోజులపాటు జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ పేరుతో సమాలోచనలు చేశారు. మేధావులు, విపక్షపార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సందర్భంలో... విభజన హామీలు రాబట్టేందుకు రాజీనామాలు చేస్తే సరిపోదని... పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితేనే ప్రయోజనం ఉంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగలిగితే.. తనకున్న పరిచయాలతో మద్దతు ఇప్పిస్తానని స్పష్టం చేశారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధమని
పవన్‌ సవాల్‌ను స్వీకరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరివారంలో అవిశ్వాసం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పవన్‌ ఇతర పార్టీలను ఒప్పించాలని సవాల్‌ విసిరారు.జగన్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు జనసేనాని తెలిపారు. వైసీపీ అవిశ్వాసం పెడితే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని జగన్‌కు సూచించారు. తాను 4న ఢిల్లీకి వస్తానని... అక్కడే సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ఆద్మీ, టీడీపీతోపాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు సంపాదిస్తానన్నారు. అవసరమైతే కర్నాటక, తమిళనాడుకు వెళ్లి వారి మద్దతు కోరుతానని స్పష్టం చేశారు.

ఏపీలో మాటలయుద్ధం
అవిశ్వాస తీర్మానంపై ఏపీలో మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అవిశ్వాసంతో ఉపయోగం ఉండబోదని తేల్చిచెప్పారు. అవిశ్వాసానికి 54 మంది ఎంపీల మద్దతు కావాలన్నారు. అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం ఉండాలని అభిప్రాయపడ్డారు. మూడున్నరేళ్లుగా ఓపికగా ఉన్నామని... రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఎవరు పోరాడుతాని ఆయన ప్రశ్నించారు.అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో 184వ నిబంధన కింద నోటీస్‌ ఇచ్చామని... నోటీస్‌పై చర్చతోపాటు ఓటింగ్‌ కూడా ఉంటుందన్నారు. ఒకవేళ ఆ నోటీస్‌ను స్పీకర్‌ అనుమతించకపోతే.. తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తేల్చి చెప్పారు.మొత్తానికి ఏపీలో అవిశ్వాస రాజకీయం అన్ని పార్టీల్లోనూ సెగలు పుట్టిస్తోంది. మరి మార్చి నాటికి ఎవరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో.... ఏపీ ప్రజల విశ్వసనీయత ఎవరు పొందుతారో వేచి చూడాల్సిందే.

18:39 - February 1, 2018

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సవాల్ ను టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకపోతే కేసీఆర్ కుటుంబం రాజకీయ సన్యాసం చేయాలన్నారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కుటుంబం కమీషన్ల కోసం పనిచేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:04 - January 23, 2018

కరీంనగర్ : రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరీంనగర్ లోని శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని..తెలంగాణ నేలకు చివరిశ్వాసవరకు రుణపడి ఉంటానని తెలిపారు. ఏడు సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మార్చి 14న వరకు పూర్తిస్థాయి కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వందేమాతరానికి ఉన్న శక్తి జై తెలంగాణ నినాదానికి ఉందన్నారు. 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం 
కొన్ని కులాలకే సమాజిక న్యాయం జరిగిందని తెలిపారు. కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు కావాలన్నారు. భారతదేశం సెక్యులర్ రాజ్యంగా ఉందని పేర్కొన్నారు. భాషను, యాసను గౌవరవించే సంప్రదాయం కావాలన్నారు. భారతదేశం ఒకటిగా ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని పిలుపునిచ్చారు. సంస్కృతులను కాపాడే విధంగా జనసేన వ్యవహరిస్తుందన్నారు. దేశం కోసం తన గుండె కొట్టుకుంటుందన్నారు. 
జాతీయతను విస్మరించవద్దు.. 
ప్రాంతీయతను గౌరవించాలని..అయితే ప్రాంతీయత భావనలో పడి జాతీయతను విస్మరించవద్దన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయత జనసేన లక్ష్యమని తెలిపారు. సామాజిక న్యాయం అంటే సీట్లు ఇవ్వడమే కాదు...అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరారు. అందరికీ ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. తనకు ఏ వ్యక్తితతో వ్యక్తిగతంగా విభేదాల్లేవన్నారు. ఏ ఒక్క పార్టీ మీద ధ్వేషం లేదని చెప్పారు. 
తెలంగాణ పసిబిడ్డ 
తెలంగాణ పసిబిడ్డ అన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరాజకీయ నాయకునికి ఉందన్నారు. కేసీఆర్ అంటే ముందునుంచి తనకు ఇష్టమన్నారు. రాజకీయల నుంచి ప్రజల కోసం పని చేసి ఏ వ్యక్తినైనా గౌరవిస్తానని చెప్పారు. 'మన యాస, భాషను గౌరవించాలని' అన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ ఉందన్నారు. తెలంగాణ ఒక్కరోజులో రాలేదని... 25 సం.లు పట్టిందన్నారు. అవినీతి లేని సమాజం రావాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రజా సమస్యలు, విధానపరంగానే తన పోరాటమన్నారు. ఆంధ్ర, తెలంగాణ వేరు కాదని చెప్పారు. 'మీ కోసం నేను ఉన్నాను 'అని పవన్ భరోసా ఇచ్చారు. 

 

 

07:54 - January 23, 2018

ఏపీలో రాజకీయాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత రాజశేఖర్, టీడీపీ నేత చందూసాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఉమామహేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమన్న జగన్...వంటి పలు అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:45 - January 18, 2018
12:48 - January 16, 2018

నిజామాబాద్ : ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి నుంచే పార్టీ నేతలు సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానంలో వేడెక్కుతున్న రాజకీయాలపై 10 టీవీ ప్రత్యేక కథనం.. నిజామాబాద్‌ జిల్లా... తెలంగాణలో రాజకీయ చైతన్యానికి ప్రతీక. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం ఏర్పడింది. ఈ అసెంబ్లీ స్థానం ఎప్పుడూ రాజకీయ విలక్షణతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌లో ఉండగా డీ శ్రీనివాస్‌ ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2014లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీ చేసిన డీఎస్‌తోపాటు, అర్బన్‌ నుంచి బరిలోకి దిగిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓటమి చవిచూశారు. అర్బన్‌ నుంచి గణేశ్‌ గుప్తా, రూరల్‌ నుంచి బాజిరెడ్డిగోవర్దన్‌ విజయం సాధించారు.

డీ శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో రాజకీయ సమీకరణలు మారాయి. ఈ సీటు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గణేశ్‌ గుప్తా, డీఎస్‌ రెండువర్గాలుగా విడిపోయారు. తన పెద్దకుమారుడు సంజయ్‌ని రాజకీయ వారసుడిగా ప్రకటించిన డీఎస్‌... అసెంబ్లీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగం... సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు తలనొప్పిగా మారింది. సామాజికవర్గ ఓటర్లను ఇప్పటి నుంచి ఆకర్షించేందుకు వీలుగా సంజయ్‌... మున్నూరుకాపుల కోసం ఉచిత వివాహాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంజయ్‌ దూకుడుతో గణేశ్‌ గుప్తా గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అంతేకాదు నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కూడా అర్బన్‌ సీటుపైనే కన్నేరు. దీంతో ఈ సీటుకోసం పోటీపడుతున్నవారి సంఖ్య మూడుకు చేరింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌లో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్సీ అకుల లలితతోపాటు పీసీసీ నేతలు రత్నాకర్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ ఎవరికి దక్కినా అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నేతలు ఇప్పటి నుంచే నూరిపోస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని వర్గపోరును తమకు అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీలో కూడా పోటీ ఎక్కువగా నేంది. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతోపాటు 2104 ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన సూర్యనారాయణ, కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన బస్వా లక్ష్మీనారాయణ టికెట్‌ కోసం పోటీ పుడుతున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీల్లో కూడా ఆశావహులు ఎక్కుగా ఉండటంతో నిజామాబాద్‌ అర్బన్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజకీయాలు